20, మార్చి 2025, గురువారం

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

       *తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*శంకరులు ఈ శ్లోకంలో శివ భక్తిచే లభ్యమయ్యే ఫలమును కోరుతున్నారు. భక్తిలత తనకు అభీష్టఫలములను ఈయవలెనని కోరుతున్నారు.*


*శ్లోకం : 49*


*ఆనన్దామృతపూరితా హరపదాంభోజాలవాలోద్యతా*


*స్థైర్యోపఘ్నముపేత్య భక్తి లతికా శాఖోపశాఖాన్వితా ।*


*ఉచ్ఛైర్మానస కాయమానపటలీమాక్రంయ నిష్కల్మషా*


*నిత్యాభీష్ట ఫలప్రదా భవతు మే సత్కర్మ సంవర్ధితా ।।*


*తాత్పర్యము :~*


*పరమేశ్వర సేవానురక్తి నీటిపోతగానూ, పరమశివుని చరణకమలము పాదుగానూ, చిత్త స్థైర్యము ప్రాకుడు కొయ్యగానూ అమరగా, బయలుదేరి కొమ్మలతో రెమ్మలతో కూడినదై , క్రమముగా ఉన్నతములైన మనస్సులు అనే పందిళ్ళ మీదికి ప్రాకి , చీడ మొదలైన దోషాలచే శిథిలము కాకుండా ఉన్న, ఈ భక్తిలతామ తల్లి, పురాకృత పుణ్యకర్మలనే దోహద క్రియలచే వృద్ధి చెంది నామనస్సునకు ఇష్టమైన శాశ్వతఫలములను ఫలించు గాక.*


*వివరణ:~*


*ఈ శ్లోకంలో శంకరులు తమభక్తిని తీగతో పోల్చారు, ఈశ్వరుని పాదపద్మములను మొక్క చుట్టూ నీరు నింపడానికి త్రవ్వే పాదు తో పోల్చారు. శంకరులు తమ భక్తి అనే లత పెరిగి అభీష్ట ఫలాలను ప్రసాదించేది కావాలని కోరుకున్నారు. ఆ భక్తి లతకు ఈశ్వరునిపై గల ప్రీతి లేక ప్రేమ అనేది నీరు. ఈ భక్తి లత ఈశ్వరుని పాదపద్మం అనే పాదులో పుట్టింది. భక్తి లోని స్థిరత్వమే , ఈ భక్తిలతకు నిలువుగా పైకి ప్రాకడానికి పాతే వెదురు కఱ్ఱ. ఈ భక్తి లత మనస్సనే పందిరిపైకి ప్రాకి కొమ్మ,రమ్మలతో విస్తరిస్తోంది. భక్తిలత చీడ పీడ వంటి దోషాలతో చెడిపోకుండా, పురాకృత పుణ్య కర్మములు అనే దోహద క్రియలతో వృద్ధి పొంది శాశ్వతమైన అభీష్టఫలమును అంటే శాశ్వతమైన మోక్షఫలాన్ని ఇస్తుంది.*


*ఈశ్వరుని పాదపద్మములను ఆధారంగా చేసుకొని ఏర్పడిన భక్తి పూర్వ పుణ్య విశేషం చేత స్థిరపడి హృదయంలో వ్యాపిస్తుంది.* *శ్రవణము, కీర్తనము, స్మరణము, అర్చన, మొదలయిన భక్తి మార్గాల ద్వారా అది మరింత వృద్ధి చెందుతుంది. భగవంతుని సేవను తప్ప మరేదీ కోరక పోవడంతో ఆ భక్తి నిష్కల్మషముగా ఉండి శాశ్వత అభీష్ట ఫలములను అనగా పునరావృత్తి రహిత నిష్కళంక ముక్తిని ప్రసాదిస్తుంది. నిత్యమూ అభీష్టమైన ఫలములను ప్రసాదిస్తుంది అని కూడా చెప్పవచ్చు.*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️. 

కామెంట్‌లు లేవు: