20, మార్చి 2025, గురువారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము చతుర్థాశ్వాసము*


*322 వ రోజు*

*చతుర్ధాశ్వాసం*


అప్పటి వరకూ సంజయుని మాటలు వింటున్న ధృతరాష్ట్రుడు సంజయునితో " సంజయా! ధర్మరాజు అనుమతి తీసుకుని వెళుతున్న సాత్యకి ద్రోణుని ఎలా దాటగలిగాడు. మన సైన్యం ఎవరూ సాత్యకిని అడ్డుకొన లేదా ! సాత్యకి అర్జునుడిని కలిసాడా ! వివరంగా చెప్పు " అని అడిగాడు. సంజయుడు చెప్పసాగాడు " ధర్మరాజు ఆజ్ఞా బద్ధుడైన సాత్యకి అడ్డువచ్చిన కౌరవ సేనలను చంపుతూ ముందుకు దూసుకు వెళుతున్నాడు. తనను అడ్డుకున్న ఏడుగురిని యమపురికి పంపాడు సాత్యకి. అది చూసి ద్రోణుడు సాత్యకిని అడ్డుకుని అతిక్రూర శరములతో కొట్టాడు. సాత్యకి రధమును, సారధిని కొట్టాడు. అందుకు సాత్యకి కోపించి ద్రోణునిపై బాణములు గుప్పించాడు. ద్రోణుడు వాటిని త్రుంచి తిరిగి సాత్యకిపై బాణములు గుప్పించి " సాత్యకీ ! నా పరాక్రమముకు తట్టుకోలేక నీ గురువు అర్జునుడు నాతో యుద్ధము చేయకుండా పారి పోయాడు. ఇప్పుడు నువ్వు వచ్చావు నా బాణముల రుచి చూద్దువుగాని " అన్నాడు. సాత్యకి ద్రోణునికి నమస్కరించి " ఆచార్యా! నేను అంతటి వాడిని కాను. ధర్మరాజు ఆజ్ఞ మేరకు అర్జునుడికి సాయం వెడుతున్నాను. దయ ఉంచి నన్ను విడువుము . నా వంటి పిన్నలను మన్నించుట మీ వంటి పెద్దల ధర్మము కదా ! " అన్నాడు. అయినా ద్రోణుడు సాత్యకికి దారి విడువ లేదు. సాత్యకి తనకు అడ్డుగా ఉన్న అంగ, బాహ్లిక, దాక్షిణాత్య సేన మధ్య నుండి ఆవలకు వెళ్ళాడు. ఇంతలో కృతవర్మ సాత్యకిని అడ్డుకుని ఆరు బాణములతో సాత్యకిని కొట్టాడు. నాలుగు బాణములతో సాత్యకి రథాశ్వములను కొట్టాడు. సాత్యకిని కృతవర్మ అడ్డుకొనడం చూసిన ద్రోణుడు ధర్మరాజు వైపు వెళ్ళాడు. సాత్యకి కృతవర్మను పదహారు శరములతో కొట్టాడు. అతడి సారథి చంపి, అతడి విల్లు విరిచాడు. కృతవర్మ తన రథమును తానే తోలుకుంటూ యుద్ధం చేస్తూ కృతవర్మ సాత్యకిని వదిలి భీముని వైపు పోయాడు. సాత్యకి కాంభోజుని సేనలో ప్రవేశించి అక్కడి వీరులను తనుమాడుతున్నాడు. ఇంతలో ద్రోణుడు కృతవర్మకు మరొక రథమును ఏర్పాటు చేసాడు.


కృతవర్మ పరాక్రమం*


కృతవర్మ ధర్మరాజును అతడికి సాయంగా ఉన్న వీరులను ఎదుర్కొన్నాడు. భీమసేనుడు వారికి సాయంగా వచ్చాడు. భీముడు, ధృష్టద్యుమ్నుడు మూడేసి బాణములతోను ధర్మరాజు, ద్రుపదుడు అయిదేసి బాణమలతోను విరాటరాజు పదిహేను బాణములతోను సహదేవుడు ఇరవై ఐదు బాణములతోను, శిఖండి ఇరవై బాణములతోను, ఉపపాడవులు డెబ్బై అయిదు బాణములతోను, నకులుడు నూరు బాణములతోను కృతవర్మను చుట్టుముట్టి కొట్టారు. కృతవర్మ జంకక ఒక్కొక్కరిని ఐదేసి బాణములతో కొట్టి భీమునిపై ఏడు బాణములు వేసి, భీముని విల్లు పతాకము తుంచి డెబ్బై బాణములతో భీముని గుండెలకు గురిపెట్టి కొట్టాడు. ఆ దెబ్బకు భీముడు మూర్చిల్లాడు. ఇంతలో పాండవ వీరులు ఒక్కుమ్మడిగా కృతవర్మను చుట్టుముట్టారు. ఇంతలో భీముడు తేరుకుని కృతవర్మ మీద ఉజ్వలమైన శక్తిని ప్రయోగించాడు. కృతవర్మ దానిని మూడు ముక్కలుగా కొట్టాడు. కృతవర్మ దానిని మూడు ముక్కలు చేసాడు. భీముడు కృతవర్మను నెత్తురు కారేలా కొట్టాడు. కృతవర్మ భీమునిపై మూడు బాణములు వేసాడు. పాండవ సైన్యం కృతవర్మను చుట్టుముట్టి తీవ్రమైన బాణములతో కొట్టారు. కృతవర్మ కూడా జంకక శిఖండి విల్లు తుంచి భీముని వంటి రథికులపై శరములు గుప్పించి శిఖండి పైన బాణములు గుప్పించాడు. ఆ దెబ్బకు శిఖండి రథముపై పడ్డాడు. సారథి శిఖండిని పక్కకు తీసుకు వెళ్ళాడు. శిఖండి పడిపోవడం చూసి మత్స్య, కేకయ, చేధి రాజులు ఒక్కుమ్మడిగా తమసైన్యములతో కృతవర్మను ఎదుర్కొన్నారు. కృతవర్మ వారందరిని మర్మభేది బాణములు ప్రయోగించి బాధించాడు. కృతవర్మ ధాటికి పాండవ సైన్యాలు పారి పోవడం చూసిన సాత్యకి అర్జునుడి వద్దకు పోవడం కంటే ధర్మజుని రక్షణే ముఖ్యం అని తలచి ద్రోణుని పక్క నుండి ధర్మజుని వద్దకు వచ్చి కృతవర్మను ఎదుర్కొన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: