20, మార్చి 2025, గురువారం

గరుడ పురాణం_*21వ భాగం*

 *గరుడ పురాణం_*21వ భాగం*



*పంచవక్త్ర పూజనం - శివార్చన విధి:-*_


_ఋషులారా! ఇపుడు పంచముఖ శివుని పూజా విధానాన్ని విన్నవిస్తాను. ఇది సాధకునికి భుక్తినీ ముక్తినీ ప్రసాదిస్తుంది. ముందుగా ఈ క్రింది మంత్రంతో పరమాత్మను ఆవాహనం చేయాలి._


_*'ఓం భూర్విష్ణవే ఆది భూతాయ సర్వాధారయ మూర్తయే స్వాహా'*_


_తరువాత సద్యోజాత విశేషణధారియైన పరమాత్మ కళను ఈ క్రింది మంత్రంతో ఆవాహనం చేయాలి._


_*'ఓం హాం సద్యోజాతాయ నమః'*_


_ఈ సద్యోజాత శక్తిలో ఎనిమిది కళలుంటాయి. అవి సిద్ధి, బుద్ధి, ధృతి, లక్ష్మి, మేధ, కాంతి స్వధ, స్థితి. వీటన్నిటినీ, ఓంకార ప్రతిసర్గతో షష్ఠీ విభక్తితో 'నమః' ను చేర్చి పూజించాలి._

_(ఉదా॥ సిద్ధిని 'ఓం సిద్ద్యై నమః' అనే మంత్రంతో పూజించాలి.)_


_*తరువాత సాధకుడు "ఓం హీం వామదేవాయ నమః" (కొన్నిచోట్ల హ్రీంకి బదులు హీం వుంది)*_


_అంటూ వామదేవుని పూజించాలి. ఈ శివ స్వరూపానికి పదమూడు కళలు. అవి రజ, రక్ష, రతి, పాల్య, కాంతి తృష్ణ, మతి, క్రియ, కామ, బుద్ధి, రాత్రి, త్రాసని, మోహిని అనేవి._


_అలాగే అఘోర స్వామికీ ఒక మంత్రమూ ఎనిమిది కళలూ వుంటాయి. (ఎందుచేతనో గాని మంత్రమూ బీజాక్షరమూ చెప్పబడలేదు) ఆ కళలు ఇవి మనోన్మనీ, అఘోర, మోహ, క్షుధ, నిద్ర, మృత్యు, మాయ, భయంకర._


_*ఈ కళలను కూడ ఓం, నమః ఆదులను చేర్చి పూజించాక శివుని నాలుగవ వక్త్ర రూపమైన తత్పురుషుని "ఓం హైం తత్పురుషాయ నమః" అనే మంత్రంతో ఆరాధించాలి. ఈ స్వామి కళలు అయిదు. అవి నివృత్తి, ప్రతిష్ఠ, విద్య, శాంతి, సంపూర్ణ. ఈ కళలను కూడా పూజించాక సాధకుడు పంచముఖేశుని ఈశాన దేవరూపాన్ని "ఓం హౌం ఈశానాయ నమః " అనే మంత్రంతో పూజించాలి. ఈ స్వామి కళలు ఆరు. అవి నిశ్చల, నిరంజన, శశిని, అంగన, మరీచి, జ్వాలిని. అన్ని కళలనూ 'ఓం, షష్ఠి, నమః' లను చేర్చి పూజించాలి. అప్పుడే పూజ పూర్ణమౌతుంది.*_


_ఋషులారా! ఇపుడు శివార్చన విధిని వినిపిస్తాను. పన్నెండం గుళాల మేర శివమూర్తిని, బిందు ద్వారా నిర్మించాలి. అది శాంత, సర్వగత, నిరాకార చింతన చేయడానికి దోహదం చేసేలా వుండాలి. శివుని ముఖం వైపు అయిదు బిందువులుండాలి. మూర్తికి దిగువ భాగంలో ప్రతి ఆరవబిందువూ విసర్గ వుండాలి. అది అస్త్ర (హస్తన్యాస)ము. దానితో బాటు 'హౌం' అనే బీజాక్షరాన్ని కూడా వ్రాయాలి. ఇది మహామంత్ర బీజం. సంపూర్ణార్థ ప్రదాయకం. తరువాత సాధకుడు శివమూర్తి ఊర్ధ్వ భాగం నుండి చరణ పర్యంతమూ చేతులతో స్పృశిస్తూ మహాముద్రను చూపిస్తూ తదుపరి సంపూర్ణాంగ కరన్యాసం చేయాలి._


_*అపుడు అస్త్రమంత్రం "ఓం ఫట్" నుచ్చరిస్తూ కుడి పిడికిలితో స్పర్శ, శోధనలను గావించాలి. తరువాత చిటికెన వేలితో మొదలెట్టి మహామంత్ర బీజంతో చూపుడు వేలి దాకా న్యాసం చేయాలి.*_


_ఇక బాహ్యపూజ, మానసిక పూజలు రెండూ ఒకేసారి చేయబడతాయి. హృదయమును కమలంగా అందులోని మధ్యభాగాన్ని కర్ణికగా భావించుకొని ఆ కర్ణికలో ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యాలను అర్చించాలి. ఆవాహన, స్థాపన, పాద్య, ఆచమన, అర్ఘ్య, స్నానము లను అర్పించి అన్య వివిధ మానస ఉపచారాలను గావించాలి. తరువాత అగ్నిలో ఆహుతుల నివ్వాలి. అదెలాగంటే సాధకుడు పూజాస్థలంలోనే అగ్నిని రగిల్చి వుంచడానికి ముందే 'ఓం ఫట్' అనే అస్త్ర మంత్రంతో ఒక కుండాన్ని నిర్మించాలి. ఆపై 'ఓం హూం' అనే కవచ మంత్రంతో ఆ కుండంపై అభ్యుక్షణ చేయాలి. అనగా నీళ్ళు చిలకరించాలి. అప్పుడు మానసిక రూపంతో దానిలో శక్తిని విన్యాసం చేయాలి. తరువాత సాధకుడు ముందు తన హృదయంలో, ఆపై ఈ శక్తి కుండంలో జ్ఞానరూపియైన తేజాన్నీ అగ్నినీ విన్యాసం చేయాలి. (అంటే వుంచాలి) ఈ అగ్నిలో నిష్కకృతి సంస్కారాన్ని తప్ప మిగతా అన్ని సంస్కారాలనూ చేసుకోవాలి. అన్నిటి తరువాత సమస్త అంగిక దేవులతో సహా మానసిక రూపంతో శివునికి ఆహుతులివ్వాలి._


_*తరువాత కమలాంకిత గర్భయైన ఆ మండలంలో నీలకంఠుని పూజించాలి. దాని అగ్ని కోణంలో అర్ధచంద్రాకారయుక్తమైన ఒక మంగళమయ అగ్ని కుండాన్ని నిర్మించాలి. అప్పుడు అగ్నిదేవుని అస్త్రయుక్తంగా హృదయాదులలో న్యాసం చేయాలి. తరువాత మండలంలో నున్న కమల కర్ణికపై సదాశివునికీ దిశలలో అస్త్రాలకీ పూజచేయాలి. అంతట పంచతత్త్వాలలో నుండు పృథ్వీ, జల తత్త్వ శక్తులకు విడివిడిగా వంద వంద ఆహుతులను అయిదేసిమార్లు అర్పించి ప్రసన్నతాపూర్వకంగా త్రిశూలధారియైన శివుని ధ్యానించాలి.*_


_అనంతరం ప్రాయశ్చిత్తశుద్ధికై ఎనిమిదిమార్లు ఆహుతులివ్వాలి. ఈ ఆహుతులను అస్త్రబీజమైన 'హుంఫట్' అనే మంత్రంతో అర్పించడం శ్రేష్ఠం. ఈ ప్రకారంగా సంస్కారాన్ని శుద్ధిని సాధించిన సాధకుడు సాక్షాత్తు శివస్వరూపుడే కాగలడు._


_*శివుని యొక్క విశేషపూజలో సాధకుడు మొదట:*_


_ఓం హాం ఆత్మ తత్త్వాయ స్వాహా_


_ఓం హీం విద్యాతత్త్వాయ స్వాహా_


_ఓం హూం శివతత్త్వాయ స్వాహా_


_*అని ఉచ్చరిస్తూ ఆచమనం చేయాలి. తరువాత మానసిక రూపంతో కర్ణేంద్రియాలను స్పర్శించాలి. భస్మధారణ చేసి తర్పణాది క్రియలను ఈ మంత్రాలతో చేయాలి.*_


_'ఓం హం ప్రపితా మహేభ్యః స్వధా,_


_'ఓం హాం మాతా మహేభ్యః స్వధా'_


_'ఓం హాం నమః సర్వ మాతృభ్యః స్వధా'_


_*ఇలాగే తన పితరులందరికీ తర్పణాలిచ్చుకొని సాధకుడు ప్రాణాయామం చేసి ఆచమన, మార్జనలనాచరించి ఈ క్రింది శివగాయత్రి మంత్రాన్ని జపించాలి.*_


_'ఓం హాం తన్మహేశాయ విద్మహే, వాగ్విశుద్ధాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్ I'_


_*పిమ్మట ఈ క్రింది మంత్రాలను జపించాలి.*_


_ఓం హాం హీం హూం హైం హౌం హః శివ సూర్యాయ నమః |_

_ఓం హం ఖఖోల్కాయ సూర్యమూర్తయే నమః |_

_ఓం హ్రాం హ్రీం సః సూర్యాయ నమః ।_


_*ఈ మంత్రాలను సూర్యోపస్థానం చేసి, సూర్య మంత్రాలతోనే సూర్యరూపుడైన మహేశ్వరుని పూజించడంలో భాగంగా జపించాలి.*_


_తరువాత దండీ, పింగళాది భూత నాయకులను " ఓం దండినే నమః, ఓం పింగలాయ నమః " మున్నగు మంత్రాల ద్వారానూ, అనంతరం ఆగ్నేయాది కోణాలలో "ఓం విమలాయై నమః, ఓం ఈశానాయై నమః " అంటూ శక్తి స్వరూపాలను వారి వారి మంత్రాల ద్వారానూ స్థాపించి, స్మరించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉపాసకులకు సకల సుఖాలూ ప్రాప్తిస్తాయి._

కామెంట్‌లు లేవు: