20, మార్చి 2025, గురువారం

*శ్రీమద్ భాగవతం

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(80వ రోజు)*

   *(క్రితం భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

            *కృష్ణావతారం* 

   *వ్రేపల్లె వాసుడు శ్రీకృష్ణుడు*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*‘‘కంసా! నన్ను వధించడం నీ తరం కాదు. నిన్ను వధించేవాడు మాత్రం పుట్టి పెరుగుతున్నాడు. అతని చేతుల్లో నీకు చావు తప్పదు.’’*


*కత్తి ఝళిపిస్తూ క్రూరంగా చూశాడు కంసుడు. అదృశ్యమయింది విష్ణుమాయ.*


*విష్ణుమాయ మాటలకు, ఆనాడు ఆకాశవాణి చెప్పిన మాటలకు పొంతన లేకపోవడంతో అంతా అబద్ధం అనుకున్నాడు కంసుడు. అన్యాయంగా దేవకీవసుదేవుల్ని హింసించాననుకున్నాడు. తప్పు చేశాననుకుని, వారిని బంధవిముక్తుల్ని చేశాడు.*


*‘‘బావా! ఆకాశవాణి మాటలు నమ్మి, మీకు చేయరాని అపకారం చేశాను. మిమ్మల్ని బంధించి, మీ బిడ్డల్ని హతమార్చాను. తప్పు చేశాను. నన్ను క్షమించండి.’’ వేడుకున్నాడు కంసుడు.*


*‘‘రాచమర్యాదలు పొందుతూ హాయిగా ఉండండి. వెళ్ళండి.’’ అని అభయాన్నిచ్చాడు కంసుడు. అక్కణ్ణుంచి నిష్క్రమించాడు.*


*యశోదానందులు:~*


*గోకులంలో నందగోపుడు ప్రముఖుడు. అతని నివాసం వ్రేపల్లె. యశోద అతని భార్య పేరు. ఈ దంపతులకు చాలా కాలంగా పిల్లలు లేరు. వయసు మీరుతున్న వేళ యశోద ఆడపిల్లను కన్నది. అయితే తాను ఆడపిల్లను కన్నట్టుగా ఆమెకు తెలియదు. విష్ణుమాయలో ఉందామె. ఆ పిల్లను వసుదేవుడు తీసుకునిపోయి, ఆ పిల్ల స్థానంలో మగబిడ్డను ఉంచిన సంగతి కూడా తెలియదామెకు. ఈ సంగతి యశోదానందులకే కాదు, వ్రేపల్లెలో ఎవరికీ తెలియదు. ఫలితంగా దేవకీ వసుదేవుల బిడ్డే తమ బిడ్డ అనుకుని, యశోదానందులూ, వ్రేపల్లెవాసులూ పొంగిపోయారు.*


*అలా కృష్ణుడు యశోదా తనయుడిగా, నందనందనుడిగా దినదినప్రవర్థమానం కాసాగాడు. కంసునికి దూరంగా గోకులంలో తమ బిడ్డ పెరుగుతున్నాడు, అదే పదివేలు అనుకున్నారు దేవకీ వసుదేవులు.*


*లేకలేక కలిగిన పుత్రుడు శ్రీకృష్ణుడు. దివ్యతేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. ఆ ప్రకాశాన్ని గుర్తెరిగి, సాక్షాత్తూ భగవంతుడే తనకి జన్మించాడని ఆనందించాడు నందుడు. విష్ణుభక్తుడతను. భక్తితో పుత్రోత్సాహం చేశాడు.* 


*పూర్వజన్మలో నందుడు ఒక వసువు. అతని పేరు ద్రోణుడు. యశోద పూర్వజన్మలో కూడా అతని భార్యే! అప్పటి ఆమె పేరు ధర. వారు విష్ణుభక్తులూ, పుణ్యాత్ములూ అయిన కారణంగానే శ్రీకృష్ణుడు వారి బిడ్డ అయినాడు*


*‘‘గొప్పబిడ్డను కన్నావు తల్లీ! నీ బిడ్డ చూడముచ్చట అనిపిస్తున్నాడు. కనడం ఆలస్యమయినా బంగారంలాంటి బిడ్డని కన్నావు.’’ అన్నారు గోపకాంతలు. యశోదను అనేక విధాల అభినందించారు. కృష్ణుణ్ణి పన్నీట జలకమాడించి, జోలపాడారు. అష్టమినాడు జన్మించాడు కృష్ణుడు. గోకులంలో ఆనాడు గొప్ప పండుగ చేసుకున్నారు. అదే ‘గోకులాష్టమి’గా ప్రఖ్యాతి చెందింది.*


*బాలకృష్ణుడు ఉట్లను చేజిక్కించుకునేవాడు. అందిన వెన్నను ఆబగా తినేవాడు. పాలు తాగేవాడు. అదే తర్వాతి రోజుల్లో ‘ఉట్లపండుగ’ అయింది. రోహిణీనక్షత్రాన జన్మించిన కృష్ణుడు మేనమామ కంసుణ్ణి వధించాడు. అందుకే కాబోలు, ఈనాడు ఎవరయినా రోహిణీ నక్షత్రాన జన్మిస్తే ‘మేనమామ’ గండం అంటున్నారు.*


*కంసుడు:దురాలోచనలు:~*


*దేవకి అష్టమగర్భంలో మగపిల్లవాడు జన్మిస్తాడు. ఆ బుడతడి చేతిలోనే తను హతమవుతానని భావించిన కంసునికి దేవకి అష్టమగర్భంలో ఆడపిల్ల జన్మించడం, ఆమె నిన్ను హతమార్చేవాడు పుట్టాడు, పెరుగుతున్నాడని చెప్పడం నమ్మలేనిజాలనిపించాయి. ఆ నిజాలను ఆలోచిస్తూ నిద్రకు దూరమయ్యాడు కంసుడు. ఆహారం కూడా రుచించడం లేదతనికి. ఏం చెయ్యాలి? తనని హతమార్చేవాడు పుట్టాడన్నది విష్ణుమాయ. ఎక్కడ పుట్టాడు? ఎక్కడ పెరుగుతున్నాడు? వాణ్ణి తెలుసుకోవడం ఎలా? పరిపరివిధాల ఆలోచించి, ఆపై సలహాలకూ, సూచనలకూ మంత్రివర్గసమావేశాన్ని ఏర్పరిచాడు కంసుడు. మంత్రివర్గం, పరిజనులూ అతనికంటే క్రూరులు. వారంతా మరింతగా కంసుణ్ణి రెచ్చగొట్టారు. విష్ణుమూర్తిపట్ల అతనికి ఉన్న ద్వేషాన్ని పెంచి పెద్దదాన్ని చేశారు. కంస మహారాజుని చంపేవాడు యాదవకులంలోనే జన్మిస్తాడని తెలిసింది కనుక, యాదవ కులాన్నంతటినీ జల్లెడ పడితే సరి, దొరికిపోతాడన్నారు. గొల్లపల్లెలన్నీ గాలిద్దాం అన్నారు. పసిబాలుర ఉసురుతీద్దామన్నారు. ప్రతి ఊరిలోని పసిపిల్లలందరినీ చంపేద్దాం. చంపేస్తే ప్రమాదం ఇంకేముంటుంది? అన్నారు.*


*ప్రధానంగా వసుదేవుని భార్యలూ, నందగోపుడూ నివసించే గోకులాన్ని ఓ కంట కనిపెట్టుకుని ఉందామన్నారు. వారి మాటలు బాగున్నాయనిపించింది కంసునికి.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

కామెంట్‌లు లేవు: