*తిరుమల సర్వస్వం 183-*
*సప్తగిరులు -2*
2 భవిష్యోత్తరపురాణాన్ని అనుసరించి జనకవంశపు రాజపురోహితుడైన శతానందుడు, జనకమహారాజుకు, అతని పరివారానికి వేంకటాచల మహత్యం వివరిస్తూ, వృషభాద్రి వృత్తాంతాన్ని పై విధంగా విశదీకరించారు.
*అంజనాచలం లేదా అంజనాద్రి*
వాయుదేవుని అంశతో హనుమంతుణ్ణి పుత్రునిగా పొందిన అంజనాదేవి తపస్సు గావించిన ఈ పర్వతం అంజనాద్రిగా పేరుగాంచింది.
పూర్వజన్మ యందు అంజనాదేవి దేవలోకవాసి అయిన *'పుంజికస్థల'* అనబడే ఒక గంధర్వకన్య.
ఒకానొకప్పుడు తన చెలికత్తెలతో బాటుగా భూలోక విహారానికి వచ్చిన సందర్భంలో ఆమె, తాను గంధర్వకన్య ననే మిడిసిపాటుతో, తపస్సులో నిమగ్నమై ఉన్న ఒక మునిపుంగవుణ్ణి చూసి ఎగతాళి చేసింది. వానరచేష్టలతో తన తపస్సుకు భంగం కలిగించడంతో కృద్ధుడైన ఆ మునీశ్వరుడు గంధర్వకన్యను వానరరూపం ఎత్తమని శపించాడు. మహా తపస్సంపన్నుడైన ఆ జడధారి శాపవచనాల వల్ల ఆమె వానరంగా జన్మించి, *'కేసరి'* అనే పేరు గల వానరవీరుణ్ణి వివాహమాడింది. శ్రీమహావిష్ణువును ఎంతో భక్తితో ఆరాధించే ఆ దంపతులకు చాలా కాలం సంతానభాగ్యం కలుగకపోవడంతో; వారు సమీపంలోనున్న మతంగముని ఆశ్రమానికి వెళ్లి, వారిని సేవించుకుని, తమకు పుత్రసంతానం కలిగే మార్గం చెప్పవలసిందిగా వేడుకుంటారు.
మునివర్యుల ఆదేశాన్నఇ అనుసరించి, అంజనాదేవి- కేసరి దంపతులు శేషాచలానికేతెంచి, స్వామిపుష్కరిణిలో స్నానమాడి, ఆదివరాహుణ్ణి దర్శించుకుని, ఉత్తర దిక్కున ఉన్న 'ఆకాశగంగ' అనే తీర్థానికి చేరుకుంటారు.
[ఈ తీర్థప్రాశస్త్యాన్ని ఇంతకు ముందే తెలుసుకున్నాం.]
అంజనాదేవి ప్రతిదినము ఆ పవిత్రతీర్థంలో స్నానమాడి, ఆ ప్రదేశంలోనే పన్నెండు సంవత్సరాల పాటు, నిరాహారియై కఠోర సాధన చేస్తుంది.
భగవదేచ్ఛను అననుసరించి వాయుదేవుడు ప్రతి సంవత్సరం ఆకాశగంగా తీర్థంలో అంజలి ఘటిస్తున్న అంజనాదేవి దోసిలిలో ఒక దివ్యఫలం రాలేటట్లుగా చేశాడు. అంజనాదేవి దానిని మాత్రమే ఆహారంగా స్వీకరించేది. పన్నెండవ సంవత్సరం పూర్తవగానే వాయుదేవుడు తన వీర్యంతో నింపిన ఫలాన్ని అంజనాదేవి దోసిలిలో పడేట్లు చేశాడు. యథాప్రకారం ఆ ఫలాన్ని భుజించిన అంజనాదేవి, వెంటనే గర్భం దాల్చింది. వాయుదేవుని అంశతో, అంజనాదేవి సకలసద్గుణసంపన్నుడు, పరాక్రమవంతుడు, మహాబలశాలియైన హనుమంతుణ్ణి పుత్రుడిగా పొందింది.
అంజనాదేవి పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసి, హనుమను పుత్రునిగా పొందిన ప్రదేశం 'అంజనాద్రి' లేదా 'అంజనాచలం' గా పేరు గాంచింది.
ఇప్పుడు *'జాబాలితీర్థం'* గా పిలువబడుతున్న ప్రదేశం లోనే మతంగముని ఆశ్రమం ఉండేదని, అంజనాదేవి అక్కడే తపమాచరించిదని భక్తుల నమ్మకం.
*శేషాద్రి లేదా శేషాచలం*
ఈ శిఖరానికి శేషాద్రి లేదా శేషాచలం అనే నామధేయం రావడానికి వెనుక చాలా ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి.
ఒకప్పుడు వైకుంఠవాసి అయిన శ్రీమహావిష్ణువు మందిరానికి ద్వారపాలకులుగా ఉండే జయ విజయులు శాపవశాత్తూ భూలోకంలో రాక్షసులుగా జన్మించినప్పుడు, ఆపద్ధర్మంగా ఆదిశేషుడు వైకుంఠద్వారానికి కాపలా కాస్తున్నాడు. శ్రీమహావిష్ణువుకు పర్యంకముగా, తల్పముగా ఛత్రముగా ఇంకా అనేక రకాలుగా యుగయుగాల నుండి సేవలందించడం వల్ల శ్రీమహావిష్ణువుకు శ్రీమహాలక్ష్మి తర్వాత అత్యంత సన్నిహితంగా మెలగటం వల్ల; ప్రస్తుతం ద్వారపాలకునిగా అదనపు బాధ్యత చేపట్టడం వల్ల అతనిలో కొద్దిగా అహంకారపు ఛాయలు పొడచూపాయి. దానిని గమనించిన శ్రీమహావిష్ణువు ఆదిశేషునికి తగిన గుణపాఠం నేర్పి, సరి అయిన బాటలో పెట్టాలని తగిన అవకాశం కోసం వేచి చూస్తున్నాడు.
ఇదిలా ఉండగా ఒకనాడు అష్టదిక్పాలకులలో ఒకడు, శ్రీమహావిష్ణువుకు పరమభక్తుడు, వినయ విధేయతలతో అణిగిమణిగి ఉండే వాయుదేవుడు విష్ణుమూర్తి దర్శనార్థం వైకుంఠానికి ఏతెంచి, ద్వారపాలకునిగా ఉన్న ఆదిశేషువుతో శ్రీహరి దర్శనానికై అనుమతి కోరాడు. వాస్తవానికి దేవతల తారతమ్యంలో వాయుదేవుడు ఆదిశేషువు కంటే పై కక్ష్యలోని వాడు. కానీ, ఆదిశేషువు తరతమ బేధాలను గుర్తించకుండా వాయుదేవునికి అహంకారపూరితంగా, నిర్లక్ష్యంతో సమాధానమిచ్చాడు. అత్యవసర విషయమై శ్రీమన్నారాయణునితో సత్వరమే సమావేశమవ్వాలని తెలియపరచినప్పటికీ ఆదిశేషుడు ఏకపక్షంగా వ్యవహరించి, వాయుదేవుణ్ణి అడ్డుకుని, పరుషపదజాలాన్ని ఉపయోగించాడు. దాంతో స్వతహాగా నిగర్వి, శాంతస్వభావుడు అయినట్టి వాయుదేవుడు కూడా కోపోద్రిక్తుడై ఆదిశేషువును తూలనాడాడు. శ్రీమహావిష్ణువుకు అతి సమీపంలో తాను ఉంటానని, వారికి తాను అత్యంత ప్రీతిపాత్రుడనని ఆదిశేషుడు వాదించగా; విసుగు చెందిన వాయుదేవుడు ఇంటి యజమానికి సమీపంలోనున్నంత మాత్రాన కాపలాగా ఉంచుకున్న శునకం గొప్పదెలా అవుతుందని పరుషంగా ప్రశ్నించాడు.
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి