🌹తటిల్లతా సమరుచిః🌹
అమ్మ మెరుపు తీగ వలె ప్రకాశిస్తుందని చెప్పుకున్నాం కదా.
తటిల్లత అంటే శంపాలత, మెరుపుతీగ. రుచి అంటే కిరణము, కాంతి.
అమ్మ ఆ సహస్రార స్థానంలో ఒక తటిల్లతా కాంతితో మెరిసిపోతూ దర్శనం ఇస్తూ ఉంటుంది.
మెరుపు ఒక్క క్షణమాత్రం మెరిసి మాయమైపోతుంది. ఆ మెరుపులంత సౌందర్యం అమ్మది.
క్షణం పాటు కనిపిస్తుంది కనుకే, అంత మహోత్కృష్టమైన కాంతితో మెరిసిపోతున్నా,
ఆ మెరుపులని మనం చూడగలుగుతున్నాము. మెరుపు ఎంత అందంగా వున్నా,
ఎంత ప్రకాశంగా వున్నా, ఎంత మోహింపచేసేలా వున్నా, అది క్షణకాలం ఉంటేనే చూడగలం.
ఒక్కోసారి మెరుపు దగ్గరగా వచ్చినప్పుడు, మనం వున్న ప్రాంతమంతా కూడా అద్భుతమయిన
విద్యుత్ కాంతితో వెలిగిపోయి, దానిని చూసాక, కళ్ళు చెదరి, కొంత సేపు మరి ఏమీ కనపడవు.
అటువంటి మిరుమిట్లు గొలిపే కాంతితో వెలిగిపోయే
అమ్మను చూడటానికి ఈ చర్మ చక్షువులు చాలవు.
అది కన్నులు తెరచి చేసే దర్శనం కాదు. కనులు మూసి మనోనేత్రంతో చేయవలసిన దర్శనం.
చుట్టూ అజ్ఞానమనే నల్లని మేఘాలు, మధ్యలో తళుక్కుమని మెరిసి మాయమైపోయే జ్ఞానరేఖ.
అదే అమ్మ దర్శనం. జీవితం తరించటానికి ఆ క్షణ మాత్ర దర్శనం చాలు.
ఉపాసకులు, ఋషులు, ఇలా అమ్మ అనుగ్రహానికి పాత్రులైన ఏ కొద్దిమందో,
అమ్మ అనుమతితో, తమ అంతః చక్షువులతో ఆ దర్శనం చేయగలరు.
మెరుపు మెరిసే ముందు గట్టిగా ఉరుమే ఉరుములాగా, అమ్మ వాహనమైన సింహం
గట్టిగా గర్జించి భక్తులను ఆ దర్శనానికి సమాయత్తం చేస్తుంది.
ఆ గర్జన వల్ల కొందరికి కళ్ళు తెరుచుకుంటే, కొందరిని ఆ గర్జనే భయపెట్టి కళ్ళు
మూసుకునేలా చేస్తుంది. ఆ గర్జన మన జగజ్జనని వాహనం చేసినదే అని తెలుసుకుని
వెనువెంటనే తళుక్కుమనే వెలుగులతో మెరిసిపోతున్న అమ్మను క్షణకాలమైనా మనసుల
దర్శించగలితే, అంతకన్నా కావలసిందేమిటి. అమ్మ తటిల్లతా కాంతులను చూడలేము కనుక,
ఆ తల్లి కాలివేలి గోటి కాంతులను మనసులో భావిస్తే, ఆ తల్లి కరుణించి దారి చూపుతుంది.
సహస్రారం చేరి, తన దర్శనం కోసం ఆరాటపడే భక్తులకు,
తన అపురూపమైన తటిల్లతా రూపంతో కటాక్షిస్తున్న ఆ తటిల్లతాసమరుచి కి వందనం. 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి