🌸 *మిత్రులు, కవిపుంగవులు అందరికీ* 🌸
🪷 *సంక్రాంతిపండుగ శుభాకాంక్షలు* 🪷
సీ॥
ముంగిళ్ళ దిద్దిన రంగవల్లులలోన
గొబ్బిదేవతలెల్ల కూడియుండ
సన్నాయి మేళముల్ సరిగంగిరెద్దులు
హరిదాసు కీర్తన లందగించ
చెఱకుదండమ్ములు చేబంతిక్రీడలు
మంగళతోరణమాల లలర
పొంగారు పొంగళ్ళు పోతుపేరంటాలు
క్రొత్తయల్లుళ్ళదౌ కోలహలము
గీ॥ నింగినంటు గాలిపటల భంగిమలును
బావమరదళ్ళ సరదాల భాషణములు
నింత యంతయు గాదయ నెంతొ కలదు
మకరసంక్రాంతి సందడి మరులు గొలుపు
సీ॥
క్రొత్తబెల్లముతోడ క్రొత్తబియ్యముజేర
సంక్రాంతి యయ్యెనో చందమలర
ధనువు వీడిన రవి తా మకరము జేర
సంక్రాంతి ప్రబలెనో సౌరులలర
రైతుకష్టములెల్ల ప్రభవించ ధాన్యమై
సంక్రాంతి ప్రసరించె శాలలలర
బొమ్మలకొలువుల ముగుదపేరంటాళ్ళ
సంక్రాంతి యరుదెంచె సరసతలర
గీ॥ రంగులలముకొన్న వృషభరాజులెల్ల
పూజలందగ సంక్రాంతి మోహరించ
దివ్యసంక్రాంతిపర్వమ్ము తేజరిల్ల
శుభదకామన లందరి కభయ మగుత!
*~శ్రీశర్మద*
*8333844664*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి