4, మే 2023, గురువారం

అహమేలేని ఆదిశంకరులు

 అహమేలేని ఆదిశంకరులు


'ప్రదీపజ్వాలాభి ర్దివసకర నీరాజనవిధి 

స్సుధా సూతే శ్చంద్రోపల జల లవై రర్ఘ్యరచనా, 

స్వకీయై రంభోభి స్సలిలనిధి సౌహిత్యకరణం 

త్వదీయాభి ర్వాగ్భిస్తవ జనని వాచాం స్తుతిరియమ్. 


నూరు శ్లోకాలు కల సౌందర్యలహరిలో చివరిది ఈ శ్లోకం. సౌందర్యాన్ని ఒకరు చూపనక్కరలేదు. అది స్వతహాగా కనపడేవస్తువు. కన్నులకు ఆనందమిచ్చేవి కొన్ని, చెవులకు ఆనందం యిచ్చేవి కొన్ని. శబ్దమాధ్యుర్యం శ్రవ్య సౌందర్యం కలది. 


భగవత్ పాదులు వ్రాసిన సౌందర్యలహరివంటి సుందరమైన కావ్యం అరుదు. 

ప్రపంచంలో అందంగావున్నవని మనం అనుకునేవస్తువులన్నీ అంబికాకటాక్ష లేశమాత్రాన పుట్టినవే. సౌందర్య దేవతయేఅంబిక. ఆమెఅనుగ్రహం చేతనే ఆచార్యులవారి వాక్కు సౌందర్యలహరియై (లహరి అనగా ఏరు) ప్రవహించినది. సుందరములైన పురాతనపు శిల్పములు భగ్నమయితే, పోయిన భాగములను పూరిస్తామని ఏవైనా తెచ్చి అతికిస్తే బాగావుండదు. అల్లాగే బ్రహ్మదత్తమైన వాక్ సౌందర్యం కలవారికృతులలో ఒకమాటకు బదులు మరొకమాట వాడిచూద్దామని చూస్తే అతకదు ఆలోపం లోపంగానేనిలిచిపోతుంది. భగవత్ పాదుల సౌందర్యలహరి అట్టిదే. ఇట్టి కావ్యరత్నమును సృజించిన ఆచార్యులవారికి నేనువ్రాసితిని అన్న అహము లేశమాత్రమూ కనబడదు. సంక్రాంతినాడు సూర్యుని వెలుగులు ప్రసరించే చోటు గోమయంతో శుద్ధిచేసి ముగ్గులుతీర్చి దాని నడుమ సూర్యబింబమును వ్రాసి చెరకు, చెక్కెర, పొంగలి, కొబ్బరికాయ యీ మొదలైన వానిని నివేదనంచేసి సూర్యునకు నమస్కరించి నీరాజనం యిస్తాం. కప్పురపు వెలుతురెక్కడ? సూర్యప్రకాశమెక్కడ? పదినాళ్లు వరుసగా ప్రొద్దు పొడవకపోతే కర్పూరంకూడ వెలుగదు. అంబికా కరుణా కటాక్షాన చెప్పబడిన సౌందర్యలహరి ఆమెకే అర్పించడం సూర్యునకు ఇచ్చే నీరాజనం వంటిది. సూర్యకిరణాలు విశ్వమంతా వ్యాపించి వున్నవి. కాని వానిని ఒక భూత అద్దంలో కేంద్రీకరించి కింద బూరుగదూది నుంచితే దూది మండిపోతుంది. కేంద్రీకరణంవల్ల సూర్యరశ్మికి అంత దాహకశక్తి ఏర్పడుతుంది. అట్లే స్వామి సర్వవ్యాపకుడు. అయినప్పటికీ భక్తులను అనుగ్రహించటంకోసం ఆలయాలలో ప్రతిష్ఠింపబడి ఆర్తత్రాణ పరాయణమూర్తియై ఉండును. 


ఆ పరమాత్మ అనుగ్రహం లేనిదే ఏకార్యమున్నూ జరగదు. మనం అనుక్షణంచేసే ఊర్పు నిట్టూర్పులు సైతం ఆయన కృపచేతనే. మంచికాని, చెడ్డగాని, ఏదైనా ఆ మహాశక్తి మనలో వుంటేనేకాని చేయలేము. ఆశక్తి లేనప్పుడు ఏమీలేదు. చరాచరాల అన్నింటికీ అధిష్ఠాత్రియైన, అన్నిటినీ నడిపే ఆమెకే పరాశక్తి అనిపేరు. 


అన్నిటికీ కారణం ఆమె ఆమె ఆధారశక్తి, అనంత శక్తి, సర్వవ్యాపిక అయినాఅచింత్యశక్తి అయిన ఆమె మహా తపస్సంపన్నులైన ఋషులచేతనూ మహనీయులచేతనూ ఆలయాలలో ప్రతిష్టచేయబడి ఆయా క్షేత్రాలలో తీర్థాలలో విశేషానుగ్రహ సమర్థయై, కేంద్రీకృతమైన రవి రశ్మివలె ప్రకాశిస్తూ వున్నది. 


సూర్యోపమానంవదలి చంద్రోపమానం చేసిచూద్దాం. చంద్రుడు ఉదయింపగానే ఆ చలిమరిలో, వెన్నెలలో చంద్రకాంతశిల అమృతం స్రవిస్తుందట. ఈ సూర్యకాంత చంద్రకాంత శిలల నిజానిజాలు వైజ్ఞానికులకు వదలవలె. ఈనమ్మిక అనుశ్రుతంగా వస్తున్నది. మిణుగురు పురుగులనూ, రాత్రి మిలమిల మెరిసే జ్యోతిర్లతలు అనే లతావిశేషాలనూ పరికించి చూస్తే మనకీ శిలల విషయం ఆశ్చర్యంకాదు. 


చంద్రకాంతశిల చంద్రుని అమృతకిరణముల స్పర్శచే కరిగిపోతుంది అని అనుకుందాం. ఇది వాస్తవమే కావచ్చు. ఒకవేళ చంద్రుడే లేకపోతే? 


సౌందర్య దేవతవు నీవు. వాక్కనే అమృతానికి వారిధియైన వాగ్దేవివినీవు. ఆ సారస్వత సముద్రంలోని జలకణమే నా వాక్కులో వున్నది. నీవు లేకపోతే - నీ అనుగ్రహం లేకపోతే వాక్ సంపత్తి నాకేదీ? అమృతం కురిసేవాడు చంద్రుడు. అతడు అమృతకిరణుడు. తాపహారి. నాకృతి దివాకరునికి ఎత్తిన దివ్వెవలె చంద్రునకు ఇచ్చిన చంద్రకాంత శిలాసలిలార్ఘ్యంవలే ఉన్నది. సముద్రుని దగ్గరకు వెళ్ళి దానిలోని (ఉప్పు) నీరే తీసికొని 'అపోహిష్ఠా' అనీ స్నానము ఆర్ఘ్యము పాద్యము ఆచమనము చేసినట్లవుతుంది అని భగవత్ పాదులు ఈ శ్లోకంలో వ్రాశారు. 


మనం అనుదినమూ ఎన్నోపనులు చేస్తున్నాం. ఈపనులన్నీ ఎవరు చేస్తున్నారు? నేను చేస్తున్నాను అనే అహం భావం కలగడానికి ఏమాత్రమూ ఆస్పదంలేదు? నిరభిమానం కలగాలి. కొందరు నిజంగానే నిరభిమానులై వుంటారు. నేను నిరభిమానిని అన్న అభిప్రాయం తనకు ఉంటే అదిన్నీ ఒక అభిమానమే. అందుచేత అతిజాగ్రత్త అత్యవసరం. 


కొంచెం ఆలోచించి చూద్దాం. మనం దేనిని చూచి అహంభావం పొందాలి? మనకు ఏ పని కావలసివున్నా శక్తి అవసరం. ఆశక్తియే అంబిక. ఆమె నిండు సముద్రంవలె వున్నది. మన శక్తులన్నీ ఆ సముద్రంలోని కణలేశమే. ఆమె కృపవలననే యిన్ని మాటలు మాటాడుతున్నాం యిన్ని పనులు చేస్తున్నాం. ఈనిజం గ్రహిస్తే అహంకారానికి తావేదీ? 


ఆచార్యులవారిది ఒక అపూర్వమైన అవతారం. సత్యదర్శనానికి తహతహ లాడేవారు ఆచార్యులవారిని అనుగమించేది. తత్త్వజ్ఞానం తెలిసికొనగోరేవారు ఆచార్యులవారి గ్రంథాలను చూచేది. వారికి గల గౌరవం అసమానం. వారి గ్రంథాలకు గల ప్రశస్తి అత్యధికం. వారికీర్తి భారతదేశమే కాక విదేశాలకు కూడా ఎప్పుడో పాకిపోయింది. 


సయాం, కంబోడియా దేశాలలో పురావస్తుపరిశోధకులకు కొన్ని ప్రాచీన సంస్కృతి శిలాశాసనాలు దొరికినవి. ఆ శాసనాలలో ఒకటి ఆచార్యులవారి ప్రశంసవున్నది. 


యే నాధీతాని శాస్త్రాణి భగవచ్ఛంకరాహ్వయాత్| 

నిశ్శేష సూరిమూర్ధాళి మాలా లీఢాంఘ్రి పంకజాత్|| 


అన్ని శాస్త్రాలూ ఆలోచనచేసి నిర్థారణచేసిన భగవచ్ఛంకరులు నాకు ఆచార్యులు, నేను వారిసన్నిధిలో అధ్యయనం చేశాను అని కంబోడియాలోని ఒక ఆలయప్రతిష్ఠాపకులు వ్రాసికొన్న శిలాశాసనములో ఉన్నది. ఆచార్యుల వారిని గూర్చి ఎచ్చట ప్రస్తావన వచ్చినా భగవచ్ఛంకరులనే వ్రాయుదురు. 

అట్టి మహనీయులు భగవచ్ఛంకరాచార్యులువారు 'నేను సౌందర్యలహరి చెప్పాను; అది నీ అనుగ్రహమే కాదా? నీవు దయతో ఇచ్చిన వాక్కుతో నిన్ను స్తుతిచేయడం సూర్యునికి దివ్వె యెత్తినివాళించడం. చందమామకు చలువరానీరితో అర్ఘ్యమెత్తడం, మున్నీటికి మున్నీటినీటనే చలువ చేకూర్చడం' అని వ్రాసుకుంటే మనవంటి తెలివికలవారు 'ఉప్పు లేక ముప్పందుం తిన్నాం' అని దురభిమానం పొందవచ్చా? 


మనలో సాహిత్యపరులున్నారు, వాగ్ వైదుష్యం కలవారున్నారు. వీరిని ఇతరులూ, పొరుగువారూ కొనియాడవచ్చు. కాని 'నాకు ఇట్టి యోగ్యత యున్నదా?' అని కొనియాడబడేవాడు ఆత్మపరీక్ష చేసికోవాలి. అంతా అమ్మ పెట్టిన భిక్ష. ఎవ రెవరిట్లాకొనియాడబడుతూవుంటారో వారి వారికి అందరికీ అమ్మబిచ్చమే ఎవరికడనుండి ఆ శక్తి వస్తూందో ఆ శక్తిని వారికే సమర్పణ చేసికోవాలి. అపుడాయమ్మ కనుగ్రహం కలుగుతుంది. 'అహం' లేకుండా మన మంచి చెడుగులన్నీ ఆమెకు అప్పనంచేసి ఆమె అడుగులకు అప్పసమూ తల పోసికొంటుంటే మనకేకాక లోకానికి కూడా క్షేమం కలుగుతుంది.                        


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


--- “జగద్గురు బోధలు” నుండి


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

చార్ ధామ్ యాత్ర

 *🙏చార్ ధామ్ యాత్ర🙏*


*బదరీనాధ్, కేదార్నాధ్, యమునోత్రి, గంగోత్రి, అక్కడ వున్న ప్రముఖ ఆలయాలను చార్ధామ్ గా ప్రసిధ్ధిపొందాయి. చార్ధామ్ యాత్రలో మొదటిది బదరీనాధ్ దర్శనం ముఖ్యమైనది. బద్రీనాధుడు తపస్సు చేసే రూపంలో అనుగ్రహించే, 'బదరికాశ్రమం అనే బదరీనాధ్. ఇది 99వ దివ్య దేశం. అష్టాక్షర మంత్రాన్ని ప్రపంచానికి ఉపదేశించిన మహావిష్ణువు వెలసిన ప్రదేశం. ఈ దేవాలయం అలక్ నందా కుడి ప్రక్క నదీతీరాన నర నారాయణ శిఖరాలకి మధ్యన వున్నది. ఈ ఆలయానికి వెనుక భాగాన ఎత్తైన నీలకంఠ శిఖరం దర్శనీయం. చమోలీ నుండి ఇక్కడికి వెళ్ళడానికి నాలుగున్నర గంటల సమయం పడుతున్నది. మార్గంసక్రమంగా వుండదు. ఆ సన్నటి మార్గాన ఒక బస్సు మాత్రమే ప్రయాణించగలదు. డ్రైవర్ లు తమ వాహనాలను అతి జాగ్రత్తగా నడపవలసి వున్నది. ఏ మాత్రం అజాగ్రత్తగా వున్నా, అతళ పాతాళమే. ఒక ప్రక్కన అతి లోతైన లోయలు, మరొక ప్రక్కన ఎత్తైన కొండ శిఖరాలు. ఆ మార్గంలో ప్రయాణం భయంగానే వుంటుంది. భగవంతుని మీద భారంవేసి భయంకరమైన మార్గం గుండా ప్రయాణిస్తారు. హిమంతో కప్పబడిన ఎత్తైనశిఖరాలు , దట్టమైన అడవులు వెండి అంచుల్లాగ ఎత్తైన శిఖరాల నుండి, జలజల పారే జలపాతాలు, చిన్న చిన్న సెలయేళ్ళు, కొన్ని ప్రదేశాలలో ప్రశాంతంగా ప్రవహించేనదులు, మరి కొన్ని ప్రదేశాలలో ఉధృతంగా ప్రవహించే నదుల మధ్య నుండి ఒంపులుగా సాగే సన్నటి బాట, కొండ చరియలు, పచ్చని రమణీయమైన కన్నులను, మనసులను రంజింపచేస్తాయి. నాలుగు వైపులా హిమాలయశిఖరాలైన నీలకంఠ పర్వతం, ఊర్వశి పర్వతం, నర  నారాయణ పర్వతాలతో ప్రకృతి అత్యంత సుందరంగా దర్శనమిస్తుంది. శ్రీమహావిష్ణువు నరనారాయణులుగా అవతరించి ఈలోక క్షేమంకోసం దీర్ఘతపమాచరించిన సమయంలో, ఆయన తపోభంగానికై దేవేంద్రుడు అప్సరసలను పంపాడు. తక్షణమే మహావిష్ణువు ఆ అప్సర్సల అహంకారం అణచడానికి, దేవేంద్రునికి పాఠం చెప్పడానికి, తన తొడ నుండి మహాసౌందర్యరాశియైన ఊర్వశిని ఆవిర్భవింప చేశాడు. ఊర్వశి అందాన్ని చూసి ఇంద్రుడి అప్సర్సలు సిగ్గుపడి తమ అహంకారాన్ని వదిలారు. దేవేంద్రుడు తప్పు తెలుసు కున్నాడు. ఇందువలన బదరీ నారాయణ ఆలయం 'ఊర్వశిపీఠం" అని పిలువబడుతున్నది. ఆలయానికి దక్షిణాన ఊర్వశికి కూడా ఒక ఆలయము వున్నది. పిదప నరనారాయణులు ఊర్వశిని దేవేంద్రుని నగరానికి పంపి వేశారు. ఊర్వశి దేవేంద్రుని సభలో నర్తకిగా వున్నది. నారదుడు ఈ స్ధలంలోనే, జ్ఞానాన్ని,యోగాన్ని, సంగీతకళలలో అద్భుతమైన ప్రజ్ఞ సంపాదించినందున, దీనికి నారదక్షేత్రం అనే పేరు కూడా వచ్చింది. జనమేజయుడు స్త్రీ వ్యామోహంతో,  సర్వ నాశనమవుతున్నప్పుడు వ్యాస భగవానుడు హితవు పలికి జ్ఞానబోధ చేసిన స్ధలమూ ఇదే. సంస్కృతంలో " బదరీ" అంటే రేగి పళ్ళు అని అర్ధం. ఈస్ధలం రేగి ఫలవనంగా వుంటుంది. ఇక్కడ మహా విష్ణువు తపమాచరిస్తున్నప్పుడు, ఆయనను సూర్యరశ్మి తీక్షణత నుండి కాపాడడానికి,మహాలక్ష్మీ అరవిందవల్లీతాయార్ అనే పేరుతో, తానే రేగువృక్షంగా అవతరించింది. ఇక్కడి శ్రీమహావిష్ణువు సాలగ్రామ విగ్రహం. తొమ్మిదవ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుల వారు నారద గుండం నుండి, తీసుకుని వచ్చి ప్రతిష్టచేశారు. ఆదిశంకరాచార్యులవారు తప్తగుండానికి గరుడశిలకి మధ్యన ప్రతిష్టించారు. కుష్టు వ్యాధితో బాధ పడుతున్న గర్వాల్ మహారాజు, వరదరాజాచార్యులనే తన గురువు ఆదేశాను సారం ఇప్పుడు వున్న మూలస్ధానంలో విగ్రహాన్ని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు. దాని ఫలితంగా ఆ మహారాజు వ్యాధి నుండి విముక్తుడైనాడు. వైకుంఠానికి ప్రవేశ ద్వారము బదరీనాధ్. ఆరు మాసాలు హిమపాతంతో కప్పబడి వుంటుంది. ఆసమయంలో దేవతలు వచ్చి పూజలు చేస్తారని ఐహీకం. ఈ స్ధలానికి 'బదరీ విశాల్' అనే పేరు వున్నది. బదరీనాధుని దర్శించని వారికి  ముక్తి లభించదని ఋగ్వేదంలోని కొన్ని వాక్కులు ఇక్కడ వ్రాసి వున్నవని భక్తుల విశ్వాసం. బదరీనాధుడు, బదరీశ్వరునిగా పిలువబడుతున్నాడు. ఈస్వామి వైష్ణవులకు వైకుంఠవాసునిగాను, శైవులకు పంచముఖ శివునిగాను, శక్తిని ఉపాసించే శాక్తేయులకు కాళిగాను, బౌద్ధులకు శాక్యమునిగాను, జైనులకు తీర్ధంకరునిగాను దర్శనమిస్తున్నట్లు నమ్మకం. ఆలయం తూర్పు ముఖంగా వుంటుంది. గర్భగుడిలో రెండడుగుల ఎత్తున బదరీనాధుడు, ధ్యాన ముద్రలో దర్శనమిస్తున్నాడు. గర్భగుడి సమీపమున 'ధర్మశిలా' అనే హుండి,హోమగుండం వున్నవి. కుడి ప్రక్కన నిలబడిన మూర్తులుగా నర నారాయణులు, ఎడమ ప్రక్కన కుబేరుడు, వినాయకుడు దర్శనమిస్తున్నారు. మహావిష్ణువు ముందర నారదుడు, మహావిష్ణువు విగ్రహానికి పైన సూర్యచంద్రులు వున్నారు. నల్లని సాలగ్రామ విగ్రహంగా వున్న బదరీనాధునికి పాలాభిషేకం, తేనె అభిషేకముజరుగుతాయి. సాయంకాలం శింగార దర్శన సమయానసహస్రనామములు.గీతగోవిందములతోస్తుతిస్తారు.ఆదిశంకరాచార్యులవారు నియమించిన నంబూద్రీ వంశం వారే ఈనాటికి యీఆలయ అర్చకులు. ఆలయంలో, మహాలక్ష్మీకి ఘంటాకర్ణునికి ప్రత్యేక సన్నిధులు వున్నవి. నారద,ఉధ్ధవనరనారాయణు సన్నిధులు వున్నవి. ఆలయం లోపల ఆదిశంకరాచార్యుల వారి చిత్రం, ఆయన తపస్సు చేసిన గుహ, కల్పవృక్షం వున్నాయి. ఆలయ ముఖ ద్వారము వద్ద మహావిష్ణువు యొక్క దశావతారాలు చిత్రీకరించబడిన పది స్ధంభాలు వున్నాయి. గరుత్మంతుని విగ్రహం అందంగా అమర్చబడి వుంటుంది. సమీపాన వినాయకుని విగ్రహం, హనుమంతుని విగ్రహం ప్రతిష్టింపబడి వుంటాయి. గర్భగుడి విమానము బంగారంతో నిర్మించబడినది. సభా మండపము నుండి భక్తులు బద్రీనాధుని దర్శించుకోవాలి. కట్నం చెల్లించిన దర్శనార్ధులకు మాత్రం గర్భగుడి ముందు మండపం నుండి దర్శించుకోవడానికి అనుమతి ఏర్పాట్లున్నాయి. ధర్మదర్శనం చేసుకునేవారు. వెలుపల మండపంలో వరుసలలో నిలబడి దర్శించుకోవాలి. విష్ణు సహస్రనామ పూజలో పాల్గొంటే, ఇరవై నిమిషాలు భగవంతుని మనసారా దర్శించే అవకాశం లభిస్తుంది. వరాహశిల, నారదశిల, న‌సింహశిల, గరుడశిల అనే పంచ శిలలు ఇక్కడే వున్నాయి. ఈ శిలలు తప్తగుండం పైన వున్నాయి. వాటి చుట్టూ ప్రహ్లాదధార, కూర్మధార, ఊర్వశిధార, భృగుధార, ఇంద్రధార అనే ఐదు జలధారలు ఎత్తు నుండి పడుతూంటాయి. పితృ తర్పణాలు వదలడానికి అలక్ నందా నదీ తీరాన బ్రహ్మ కపాలమనే స్ధలం వున్నది. పరమశివుడు బ్రహ్మ ఐదవ తలను ఖండించినప్పుడు ఆతల పరమశివుని చేతిని అంటుకుపోయింది, ఆతల ఇక్కడకు రాగానే క్రింద పడిపోయినది. అందువలన ఈ ప్రాంతానికి బ్రహ్మ కపాలమనే పేరు వచ్చింది. ఈ ప్రదేశంలో పితృ దేవతలకు పిండ ప్రదానం చేస్తే వారికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని చెప్తారు. తప్తగుండంలో పొగలు గ్రక్కే వేడి నీరు వుంటుంది. భగీరధుని కోసం పరమశివుని కపాలము నుండి ఉధ్భవించిన గంగ అవడం వలన ఉష్ణ గుండమైనదని చెప్తారు. ఈ గుండంలోని జలం ఓషధీ గుణాలు వున్నందున ఈ గుండంలో స్నానం చేస్తే వ్యాధులు గుణమౌతాయని భక్తుల ధృఢ విశ్వాసము. నవంబర్ ఆలయం మూసిన పిదప ఆరుమాసముల పాటు ఉత్సవ విగ్రహాలను క్రిందనున్న జోషీ మఠానికి తీసుకు వెళ్ళి పూజలు చేస్తారు. ఆలయం మూయడానికి ముందు స్వామిసన్నిధిలో వెలిగించిన దీపం ఆరు మాసముల తర్వాత మరల ఆలయం తలుపులు తెరిచే దాకా వెలుగుతూ వుండడం అద్భుతమైన, ఆశ్చర్యకరమైన విషయం🙏.*

సుఖం విలువ

 శ్లోకం:☝️

*సుఖం హి దుఃఖాన్యనుభూయ శోభతే*

 *ఘనాంధకారేష్వివ దీపదర్శనం ।*

*సుఖాత్తు యో యాతి నరో దరిద్రతాం*

 *ధృతః శరీరేణ మృతః స జీవతి ।।*


భావం: చిమ్మచీకటి నుండి బయటకు వచ్చిన తర్వాత దీప దర్శనం ఎలా ఆహ్లాదకరంగా ఉంటుందో, అలాగే దుఃఖాన్ని అనుభవించిన తర్వాత సుఖం విలువ తెలుస్తుంది. సుఖంగా జీవించిన తర్వాత పేదవాడిగా మారిన వ్యక్తి, జీవచ్ఛవంలా బతుకుతాడు.

అరటిపండు

అరటిపండు

 అరటిపండుగురించి తెలియని వారు అరటిపండు రుచి తెలియని వారు వుండరు అంటే అతిశయోక్తి కాదు.  నిజానికి శిశుదశ నుండి వృద్ధాప్యం వరకు అనేక పరియాయలు అరటిపండ్లు తిన్నవారే అందరు. బుద్ది వికసించని శిశువులకు ఇస్తే అరటి పండును తినటం తెలియకపోవచ్చు కానీ ఏ మాత్రం వయస్సు వున్న బాలునికి అరటిపండు ఇచ్చినా వెంటనే తోలు తీసి గుజ్జు తినటం పరిపాటి. ఏదైనా విషయాన్నీ సందేహరహితంగా వివరిస్తే అరటి పండు వలచి పెట్టినట్లు చెప్పానుకదా అని అనటం పరిపాటి.  అంటే అరటి పండు వలచినతరువాత పండు తినటం చాలా సులువు అని కదా అర్ధం. 

ఇక విషయానికి వస్తే సాధకుడు నిత్యా నిత్య వివేకం చేయటం అరటిపండు వలచినంత మాత్రంగా జ్ఞ్యానులు పేర్కొంటున్నారు. వివరణలోకి వస్తే అరటిపండు చూడటానికి చాలా ఇంపుగా పండు చూస్తేనే తినబుద్ది అయేటట్లు ఉంటుంది.  నిజానికి దాని తోలు కంటికి ఇంపుగా ఉన్నాకూడా అది మనం తినం దానిని వలచి వేస్తేనే మనం తినే పండు లభిస్తుంది. 

విషయవాసనలు చూడటానికి అరటిపండు తోలులాగా నేత్రానందంగా వున్నా అది కేవలం తీసి పారవేసేది అని యెట్లా తెలుసుకుంటామో అదే విధంగా మనం ఈ జగత్తులోని విషయవాసనాలను తీసి వెర్సి నిత్యం సత్యం అయినా పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవాలి.  అదే బ్రహ్మ జ్ఞ్యాననఁ ప్రతి మానవుడు జీవితంలో సాధించవలసిన ఏకైక జీవన లక్ష్యం. సాధకుడు సదా దానికోసమే, దానివెంట పరుగులిడి తన జన్మను సార్ధకత చేసుకోవాలి. 

 

ఓం తత్సత్


ఓం శాంతి శాంతి శాంతిః


ఇట్లు భార్గవ శర్మ

 



3, మే 2023, బుధవారం

వికలాంగులు

 *🙏🏻🌹అరుణోదయం🌹🙏🏻*

*నాలుగు మంచి మాటలు పలకలేని* *నోరు,చిన్న సహాయానికి కూడా లేవలేనిచేతులు,నలుగురితో కలసి నడవలేని కాళ్ళు,ఎదుటివారి పరిస్థితిని అర్థం చేసుకోలేని మనసు ఉన్నా లేనట్టే.*

*వాళ్ళే అసలైన వికలాంగులు.*

శత్రువులు-మిత్రులు

 శ్లోకం:☝️

*శత్రుశ్చైవ హి మిత్రం చ*

 *న లేఖ్యం న చ మాతృకా ।*

*యో వై సంతాపయతి యం*

 *స శత్రుః ప్రోచ్యతే నృప॥*

  - మహాభారతం సభాపర్వం


అన్వయం: *అయం మమ శత్రుః అయం మమ మిత్రమ్ ఇతి వక్తుం కశ్చిదపి లేఖః అథవా అక్షరం నాస్తి l యః క్లేశం దద్యాత్ సః ఏవ శత్రుః భవతి ।*


భావం: ఓ రాజా! ఇతడు శత్రువు, అతను స్నేహితుడు అని ఎవరి ముఖానా రాసిపెట్టి ఉండదు. ఒకడు శత్రువు లేక మిత్రుడు అని సూచించే సంజ్ఞ, అక్షరం లాంటివీ లేవు. తనను బాధపెట్టేవాడు తనకు శత్రువు అని అంటారు అంతే! ప్రపంచం మెత్తం శత్రువులు-మిత్రులు కింద విడిపోయి ఉండదని భావం.

కేదార్‌నాథ్ ఆలయం

 *కేదార్‌నాథ్ ఆలయం అనేది పరిష్కరించని  రహాస్యం*.

🕉️🕉️🔱🔱🇮🇳🇮🇳

 కేదార్‌నాథ్ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే దాని గురించి చాలా విషయాలు చెప్పబడ్డాయి.  పాండవుల నుండి ఆదిశంకరాచార్యుల వరకు .

 


 *కేదార్‌నాథ్ ఆలయం*

 🔱🔱🔱🔱🔱🔱🔱


 కేదార్‌నాథ్ ఉన్న భూమి 21వ శతాబ్దంలో కూడా చాలా అననుకూలమైనది.

 ఒకవైపు 22,000 అడుగుల ఎత్తులో కేదార్‌నాథ్ కొండ, మరోవైపు 21,600 అడుగుల ఎత్తులో కరచ్‌కుండ్ మరియు మూడో వైపు 22,700 అడుగుల ఎత్తులో భరత్‌కుండ్ ఉన్నాయి.


 ఈ మూడు పర్వతాల గుండా ప్రవహించే ఐదు నదులు మందాకిని, మధుగంగ, చిర్గంగ, సరస్వతి మరియు స్వరందరి.  వీటిలో కొన్ని ఈ పురాణంలో వ్రాయబడ్డాయి.


 ఈ ప్రాంతం "మందాకినీ నది" యొక్క ఏకైక ప్రాంతం.  చలి రోజున విపరీతమైన మంచు కురిసే చోట, వర్షాకాలంలో నీరు అతి వేగంతో ప్రవహించే ప్రదేశంలో కళాఖండాన్ని రూపొందించడం ఎంత లోతుగా ఉండేది.


 నేటికీ, "కేదార్‌నాథ్ ఆలయం" ఉన్న ప్రదేశానికి మీరు డ్రైవ్ చేయలేరు.


 అలాంటి చోట ఎందుకు నిర్మించారు?


 1000 సంవత్సరాల క్రితం ఇంత అననుకూల పరిస్థితుల్లో ఆలయాన్ని ఎలా నిర్మించారు.

 మనమందరం ఒక్కసారైనా ఆలోచించాలి.


 ఈ ఆలయం 10వ శతాబ్దంలో భూమిపై ఉండి ఉంటే, అది తక్కువ "ఐస్ ఏజ్" కాలంలో ఉండేదని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు.


 డెహ్రాడూన్‌లోని "వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియాలజీ," కేదార్‌నాథ్ దేవాలయంలోని రాళ్లపై లిగ్నోమాటిక్ డేటింగ్ పరీక్షను నిర్వహించింది.  "రాళ్ల జీవితం" గుర్తించడానికి ఇది జరుగుతుంది.  14వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం మధ్యకాలం వరకు ఆలయం పూర్తిగా మంచుతో కప్పబడి ఉందని పరీక్షలో తేలింది.  అయితే ఆలయ నిర్మాణానికి ఎలాంటి నష్టం జరగలేదు.


 2013లో కేదార్‌నాథ్‌ను తాకిన విపత్కర వరదను అందరూ తప్పక చూసి ఉంటారు. ఈ కాలంలో సగటు కంటే 375% ఎక్కువ వర్షపాతం నమోదైంది.  తదుపరి వరదలు "5748 మంది" (ప్రభుత్వ గణాంకాలు) మరణించారు మరియు 4200 గ్రామాలు దెబ్బతిన్నాయి.  భారత వైమానిక దళం ద్వారా 1 లక్షా 10 వేల మందికి పైగా ప్రజలు విమానంలో చేరారు.  అంతా తీసుకెళ్లారు.  కానీ ఇంత విపత్కర వరదలో కూడా కేదార్‌నాథ్ ఆలయ నిర్మాణంపై ఏ మాత్రం ప్రభావం పడలేదు.


 "ఆర్కియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా" ప్రకారం, వరదల తర్వాత కూడా ఆలయం మొత్తం నిర్మాణం యొక్క ఆడిట్‌లో 99 శాతం ఆలయం పూర్తిగా సురక్షితంగా ఉంది.  


2013 వరదల సమయంలో నిర్మాణానికి ఎంత నష్టం జరిగిందో మరియు దాని ప్రస్తుత స్థితిని అధ్యయనం చేయడానికి "IIT మద్రాస్" ఆలయంపై "NDT పరీక్ష" నిర్వహించింది.  ఆలయం పూర్తిగా సురక్షితంగా, పటిష్టంగా ఉందని కూడా తెలిపింది.


 రెండు వేర్వేరు సంస్థలు నిర్వహించే "శాస్త్రీయ మరియు శాస్త్రీయ పరీక్ష"లో ఆలయం ఉత్తీర్ణత సాధించకపోతే, నిర్వాలా మీకు ఏది ఉత్తమమని చెబుతుంది?


వరదల తరువాత... 1200 సంవత్సరాల తరువాత, ఆ ప్రాంతంలోనికి  బయటినుండి తరలించబడిన ప్రతిదీ తుడుచుకుపెట్టుకు పోయింది., ఒక్క నిర్మాణం కూడా నిలబడలేదు.  ఈ ఆలయం మాత్రం  అక్కడ నిలబడి ఉంది మరియు ఇది చాలా బలంగా ఉంది.


 ఈ ఆలయాన్ని నిర్మించిన విధానం దీని వెనుక ఉందని నమ్ముతారు.  ఎంపిక చేయబడిన స్థలం.  ఈ వరదలో ఈ దేవాలయం నిలదొక్కుకోగలిగినందుకు ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన రాతి మరియు నిర్మాణ పద్ధతి కారణంగానే నేడు శాస్త్రం చెబుతోంది.


 కేదార్‌నాథ్ ఆలయాన్ని "ఉత్తర-దక్షిణ"గా నిర్మించారు.

 భారతదేశంలోని దాదాపు అన్ని దేవాలయాలు "తూర్పు-పశ్చిమ".  నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆలయం "తూర్పు-పశ్చిమ" గా ఉంటే, అది ఇప్పటికే ధ్వంసమై ఉండేది.  లేదంటే కనీసం 2013లో వచ్చిన వరదలోనైనా నాశనమై ఉండేది.


 కానీ ఈ దిశ కారణంగా కేదార్‌నాథ్ ఆలయం బయటపడింది.  ఇంకో విషయం ఏంటంటే ఇందులో వాడే రాయి చాలా గట్టిగా, మన్నికగా ఉంటుంది.  విశేషమేమిటంటే, ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన రాయి అక్కడ లభ్యం కాదు, అయితే ఆ రాయిని అక్కడికి ఎలా తీసుకెళ్లి ఉంటరో ఊహించుకోండి.  అప్పట్లో ఇంత పెద్ద రాయిని మోసుకువెళ్లేందుకు అలాంటి సాధనాలు కూడా అందుబాటులో లేవు.  ఈ రాయి యొక్క లక్షణం ఏమిటంటే, 400 సంవత్సరాలు మంచు కింద ఉన్నప్పటికీ, దాని "గుణాలలో" ఎటువంటి తేడా లేదు.


 అందువల్ల, ఆలయం ప్రకృతి చక్రంలో తన బలాన్ని నిలుపుకుంది.  గుడిలోని ఈ బలమైన రాళ్లను ఎలాంటి సిమెంట్ ఉపయోగించకుండా "ఆష్లర్" పద్ధతిలో అతికించారు.  అందువల్ల రాతి ఉమ్మడిపై ఉష్ణోగ్రత మార్పుల ప్రభావం లేకుండా ఆలయ బలం అభేద్యంగా ఉంటుంది.


 2013లో వీట ఘలై గుండా గుడి వెనుక భాగంలో ఒక పెద్ద బండ రాయి (భీమా శిల) కూరుకుపోయి నీటి అంచుని విభజించి ఆలయానికి ఇరువైపులా ఉన్న నీరు దానితో పాటు అన్నింటిని మోసుకెళ్లింది కానీ, ఆలయం మరియు ఆలయంలో ఆశ్రయం పొందిన ప్రజలు సురక్షితంగా ఉన్నారు.  .  మరుసటి రోజు భారత వైమానిక దళం వారిని కాపాడి air lift  చేసింది.


 విశ్వాసాన్ని నమ్మాలా వద్దా అనేది ప్రశ్న.  కానీ 1200 సంవత్సరాల పాటు దాని సంస్కృతిని మరియు బలాన్ని కాపాడే ఆలయ నిర్మాణానికి స్థలాన్ని ఎంచుకున్న తర్వాత, దాని దిశ, అదే నిర్మాణ సామగ్రి మరియు ప్రకృతిని కూడా జాగ్రత్తగా పరిశీలించారనడంలో సందేహం లేదు.


 టైటానిక్ మునిగిపోయిన తర్వాత, పాశ్చాత్యులు "NDT పరీక్ష" మరియు "ఉష్ణోగ్రత" ఆటుపోట్లను ఎలా మార్చగలరో గ్రహించారు.

 కానీ మేము ఇది అనుకున్నాము మరియు ఇది 1200 సంవత్సరాల క్రితం జరిగింది.

 కేదార్‌నాథ్ అదే స్పష్టమైన ఉదాహరణ కాదా?


 కొన్ని నెలలు వర్షంలో, కొన్ని నెలలు మంచులో, మరియు కొన్ని సంవత్సరాలు మంచులో కూడా ఉన్ని, గాలి మరియు వర్షం ఇప్పటికీ ఉన్ని, సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తులో ఉన్నాయి.


 6 అడుగుల ఎత్తైన ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించడానికి ఉపయోగించిన అపారమైన సైన్స్ గురించి ఆలోచిస్తే మనం ఆశ్చర్యపోతాము.


 వరదలన్నింటి తర్వాత నేడు అదే వైభవంతో 12 జ్యోతిర్లింగాలలో అత్యున్నతమైన గౌరవాన్ని పొందనున్న కేదార్‌నాథ్‌ శాస్త్రవేత్తల నిర్మాణానికి మరోసారి తలవంచుతున్నాం.


 వైదిక హిందూ మతం మరియు సంస్కృతి ఎంత అభివృద్ధి చెందిందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.  అప్పట్లో మన ఋషులు అంటే శాస్త్రజ్ఞులు వాస్తు, వాతావరణ శాస్త్రం, అంతరిక్ష శాస్త్రం, ఆయుర్వేదం వంటి రంగాలలో గొప్ప పురోగతి సాధించారు..

 ॥  ఓం నమః శివాయ.🙏🏻

🕉️🕉️🔱🔱🇮🇳🇮🇳

2, మే 2023, మంగళవారం

వైశాఖ పురాణం - 12 వ అధ్యాయము

 _*🚩వైశాఖ పురాణం - 12 వ అధ్యాయము🚩*_


🕉🪷🕉️🪷🕉️🪷🕉️🪷🕉️


*కుమార జననము*


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


మన్మధుని దహించి శివుడంతర్ధానము చెందగా గిరిరాజ పుత్రికయగు పార్వతి నిరాశపడి యేమి చేయవలెనో తెలియనిస్థితిలో నుండెను. భయపడిన తన కుమార్తెను జూచిన హిమవంతుడును భయపడి యామెను ఇంటికి జేర్చెను. పార్వతియు పరమశివుని రూపమును , ఔదార్యాదిగుణములను జూచి నాకితడే భర్త కావలయునని తలచెను. తన తలపు తీరుటకై గంగా తీరమున తపమాచరింప నిశ్చయించెను. తల్లితండ్రి ఆత్మీయులు సుకుమారివైన నీకీ తపము వలదని వారించినను ఆమె మానలేదు.


పార్వతి గంగాతీరమును జేరి మహాలింగస్వరూపము నేర్పరచి నిరాహారియై జటాధారిణియై కొన్నివేల సంవత్సరములు పరమశివునికై తపమాచరించెను. శివుడును పార్వతిని పరీక్షింపగోరి బ్రహ్మచారి వేషమున వచ్చెను. ఆమె శివుని భర్తగా పొందుటకై తపము చేయుచున్నట్లు తెలిసికొని శివుని పరిహసించెను. నిందించెను. అయినను ఆమెకు శివునిపై గల దృఢానురాగము నెరిగి ప్రత్యక్షమై వరమును కోరుకొమ్మనెను. పార్వతి శివుని భర్తగా కోరెను. శివుడును ఆమె కోరిన వరము నిచ్చి యంతర్ధానమందెను.


శివుడు సప్తర్షులను తలచెను. శివుడు తలచినంతనే సప్తర్షులు నమస్కరించుచు వచ్చి శివుని యెదుట నిలిచిరి. శివుడు మీరు నాకై కన్యనిమ్మని హిమవంతుని  యడుగుడని చెప్పెను. సప్తర్షులు శివుని యాజ్ఞను శిరసావహించి తమ కాంతులచే దిక్కులను ప్రకాశింపజేయుచు నాకాశమార్గమున హిమవంతుని కడకేగిరి. హిమవంతుడును వారి కెదురువెళ్ళి నమస్కరించి గృహములోనికి దీసికొని వచ్చి పూజించెను. వారిని సుఖాసీనులగావించి మీరు నాయింటికి వచ్చుటచే నేను ధన్యుడనైతిని. మీవంటి తపోధనులు నాయింటికి వచ్చుట నా తపఃఫలము. పుణ్య ప్రయోజనము కల మహాత్ములగు మీకు నా వలన కాదగిన కార్యము నాజ్ఞాపించుడని ప్రార్థించెను. అప్పుడు సప్తర్షులు నీవు మాటలాడిన మాటలు యుక్తములై యున్నవి. మా రాకకు గల కారణమును వినుము. దక్షప్రజాపతి కుమార్తె సతీదేవి యజ్ఞశాలలో శరీర త్యాగము చేసి నీ కుమార్తె పార్వతిగ జన్మించినది. ఆమెకు తగిన వరుడు శివుడు తప్ప వేరెవరును ముల్లోకములయందును లేరు. ఆమె ఆనందమును కోరు నీవామెను పరమశివునకిచ్చి వివాహము చేయవలయును. వేలకొలది పూర్వజన్మల యందు నీవు చేసిన తపమిప్పటికి నీకిట్లు ఫలించినది అని పలికిరి.


హిమవంతుడును సప్తర్షుల మాటలను విని నా కుమార్తె నారచీరలను గట్టి గంగా తీరమున శివుని భర్తగా కోరి తపమాచరించుచున్నది. పరమేశ్వరుని వివాహమాడుట ఆమెకు మాకు ఇష్టమే. నేను నా కుమార్తెను మహాత్ముడగు త్రినేత్రునకిచ్చితిని. మీరు పరమేశ్వరుని వద్దకు బోయి హిమవంతునిచే కుమార్తెయగు పార్వతి నీకు ఈయబడినదని చెప్పుడు. ఈ వివాహమును మీరే నిర్వహింపుడు అని సవినయముగ పరమానందముతో బలికెను. సప్తర్షులును హిమవంతుని మాటలను విని శివుని వద్దకు వెళ్లిరి. శివునకు హిమవంతుని మాటలను చెప్పిరి.


లక్ష్మీదేవి మున్నగు దేవకాంతలు , విష్ణు మున్నగు దేవతలు షణ్మాతలు , మునులు అందరును శివపార్వతుల కల్యాణ మహోత్సవమును జూడవచ్చిరి. శివుడును సర్వదేవతాగణములు , మునులు , షణ్మాతలు పరివేష్టించియుండగా వృషభ వాహనారూఢుడై వేదఘోషతో భేరీ మృదంగప్రభృతి వాద్యధ్వనులతో బంధు పరివారములతో హిమవంతుని పట్టణమును చేరెను.


హిమవంతుడు శుభగ్రహ నిరీక్షితమగు శుభలగ్నమున పార్వతిని శివునకిచ్చి వివాహము గావించెను. వారి వివాహము ముల్లోకములకును మహోత్సవమయ్యెను. వివాహమైన తరువాత శంకరుడు పార్వతితో గలసి లోక ధర్మాను సారముగ సుఖించుచుండెను. పగలు సర్వ సంపత్సంపన్నమగు హిమవంతుని ఇంటను , రాత్రులయందు సరస్తీరముల యందు , పుష్ప ఫల సమృద్ధములగు వనములయందు మనోహరములగు పర్వత సీమలయందును శివపార్వతులు స్వేచ్చావిహారములతో సుఖించుచుండిరి. ఈ విధముగ కొన్ని వేల సంవత్సరములు గడచినవి.


ఇంద్రుని శాసనముననుసరించి ఆ కాలమున సంయోగమున నేర్పడిన గర్భము మరల సంయోగమున స్రవించెడిది. అందుచే శివుని కలయిక వలన పార్వతీదేవికేర్పడిన గర్భము శివపార్వతుల పునస్సమాగమముచే పోయెడిది. ఈ విధముగ గర్భస్రావములు జరుగుచుండెను. పార్వతీ గర్భము నిలుచుటలేదు. శివుని వలన పార్వతికి కలిగిన గర్భము నిలువకపోవుటచే పార్వతీ గర్భమున బుట్టిన రుద్రపుత్రుని వలన తారకాసుర వినాశమున కెదురు చూచుచున్న దేవతలకు ఆశాభంగము నిరాశ కలిగి విచారమధికమయ్యెను.


వారందరు నొకచోట కలిసికొని పరమేశ్వరుడు నిత్యము రతాసక్తుడై యున్నాడు. ఇందువలన గర్భములు నిలుచుట లేదు. కావున శివునకు పార్వతితో మరల కలయిక లేకుండునట్లు చేయవలయును. ఇట్లు చేయుటకు అగ్నియే తగినవాడని నిశ్చయించిరి. అగ్నిహోత్రుని పిలిచి అగ్నిదేవా ! నీవు దేవతలకు ముఖము వంటివాడవు. దేవతలకు బంధువువు. నీవు ఇప్పుడు శివపార్వతులు విహరించుచోటకు పొమ్ము. రతాంతమున శివుని దర్శించి శివపార్వతులకు మరల కలయిక లేకుండునట్లు వ్యవహరింపుము. వారికి పునస్సంగమము లేనిచో పార్వతి గర్భము నిలుచును. రతాంతమున నిన్ను జూచి పార్వతీదేవి సిగ్గుపడి తొలగిపోవును. అందుచే వారికి మరల పునస్సంగమముండదు. శివపార్వతుల రతాంతమున నీవు శివునకెదురు నిలిచి శిష్యుడవై వేదాంత విషయమును ప్రశ్నింపుము. శివుడు నీ సందేహమును తీర్చును. ఈ విధముగనైనచో గర్భవతియగు పార్వతి పుత్రుని ప్రసవించును. తారకాసురుడు రుద్రపుత్రునిచే నిహతుడగును. మన కష్టములు తీరునని దేవతలు అగ్నిని ప్రార్థించిరి. అగ్నియు దేవతల ప్రార్థన నంగీకరించి శివపార్వతులున్నచోటకు బోయెను. శివపార్వతుల సంగమమున శివుని వీర్యము విముక్తము కాకుండగనే అగ్ని శివ పార్వతుల వద్ద ప్రత్యక్షమయ్యెను. వస్త్ర విహీనయై యున్న పార్వతి అగ్ని రాకడను గమనించి సిగ్గుపడి బాధపడుచు చాటునకు బోయెను.


శివుడును పార్వతి తన దగ్గరనుండి దూరముగ వెళ్లుటచే అందుకు కారణమగు అగ్నిపై కోపించి మా సంగమమున కాటంకము చేసితివి. వీర్యపతనమునకు స్థానము కాదగిన పార్వతి ఇచ్చట లేకుండుటకు నీవే కారణము. నా యీ వీర్యమును నీవే భరింపుమని పతనోన్ముఖమైన తన వీర్యమును అగ్నియందుంచెను.


అగ్నియును దుర్భరమగు శివవీర్యమును భరింపలేక బాధపడుచు యెట్లో దేవతల యొద్దక బోయి జరిగిన దానిని వారికి చెప్పెను. దేవతలును అగ్నిమాటలను విని శివ వీర్యము లభించినదని సంతోషమును , ఆ వీర్యమునుండి సంతానమెట్లు కలుగునని విచారమును పొందిరి. అగ్నిలోనున్న శివవీర్యము పిండిరూపమున పెరుగుచుండెను. పురుషుడగు అగ్ని దానిని ప్రసవించుటయెట్లు విచారపడిన అగ్ని దేవతలను చేరి రక్షింపగోరెను. దేవతలు విచారించి అగ్నితో గలసి గంగానది యొద్దకు పోయిరి. ఆమెను బహు విధములుగ స్తుతించిరి. నీవు మా అందరికిని తల్లివి. అన్ని జగములకు అధిపతివి. దేవతల ప్రార్థన నంగీకరించెను. దేవతలు అగ్నికి గర్భమున విడిపించుకొను మంత్రమునుపదేశించిరి. అగ్నియు దేవతలు చెప్పిన మంత్రబలమున తనలోనున్న రుద్రవీర్యమును గంగానదిలో నుంచెను. గంగానదియు కొన్ని మాసముల తరువాత నా రుద్రవీర్యమును భరింపలేకపోయెను. దుర్భరమగు ఆ శివవీర్యమును తన తీరముననున్న రెల్లు పొదలలో విడిచెను. రెల్లు దుబ్బులోపడిన శివ వీర్యము ఆరు విధములయ్యెను.


బ్రహ్మ పంపగా వచ్చిన షట్ కృత్తికా దేవతలు ఆరు విధములుగ నున్న ఆ రుద్ర తేజస్సు నొకటిగా చేసిరి. అప్పుడు శివ తేజస్సు ఆరు ముఖములు కల పురుషాకారమై యుండెను. ఆరు ముఖములు కల ఆ రూపమచటనే ఎవరి రక్షణ లేకున్నను పెరుగు చుండెను.


ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు వృషభము నెక్కి శ్రీశైలమునకు పోవుచు ఆ ప్రాంతమును చేరిరి. అప్పుడు పార్వతీస్తనములనుండి క్షీరధారలు స్రవించినవి. పార్వతియు తన స్తనముల నుండి నిష్కారణముగ క్షీరస్రావము జరిగినందుల కాశ్చర్యపడి విశ్వాత్మకా ! నా స్తనముల నుండి క్షీరధారలిట్లు నిష్కారణముగ స్రవించుటకు కారణమేమని యడిగెను. అప్పుడు శివుడు పార్వతీ వినుము , పూర్వము మనము సంగమములో నుండగా అగ్ని వచ్చెను. అప్పుడు నీవతనిని జూచి చాటునకు పోతివి. నేనును కోపించి పతనోన్ముఖమైన నా తేజమునగ్నియందుంచితిని. అగ్నియు దానిని భరింపలేక దేవతల సహాయమున గంగానదిలో విడిచెను. గంగానదియు నా తేజమును భరింపజాలక రెల్లు పొదలో విడిచెను. ఆరు విభాగములైన ఆ తేజస్సును షట్ కృత్తికలు ఒకటిగా చేసిరి. అప్పుడు ఆరు ముఖములు కల పురుష రూపమయ్యెను. ఆ పురుష రూపమున్న చోటకు మనము వచ్చితిమి. ఇతడు నీ పుత్రుడగుచేతనే నీ స్తనములు క్షీరమును స్రవించుటచే నితడే నీ పుత్రుడు. నా తేజస్సు వలన జన్మించిన వాడు. ఇతడు శ్రీ మహావిష్ణు సమ పరాక్రమశాలి. వీనిని నీవు రక్షించి పాలింపుము. వీని వలన నీకు మిక్కిలి ప్రఖ్యాతి వచ్చునని శివుడు పార్వతితో పలికెను.


పార్వతియు శివుని మాటలను విని యా బాలుని తనయుడి యందుంచుకొని తన స్తన్యమును వానికిచ్చెను. పరమశివుని మాటలచే ఆ బాలుని యందు పుత్ర వాత్సల్యమును చూసిన పార్వతి వానియందు పుత్రస్నేహమునంది యుండెను. ఈ విధముగా నా బాలుని దీసికొని ఆమె కైలాసమునకు వెళ్ళెను. పుత్రుని లాలించుచు నామె మిక్కిలి ఆనందమునందుచుండెను.


రాజా ! పరమాద్భుతమగు కుమార జననమును నీకు వివరించితిని. దీనిని చదివినను , వినినను పుత్ర పౌత్రాభివృద్ధి నందుదురు. సందేహము లేదు. మన్మధుడు తపస్వియగు శివునిపై బాణప్రయోగమును చేసి వాని తపోదీక్షకు భంగము కలిగించి శివుని కోపమునకు దుఃఖమునందినను మరుసటి జన్మయందు వైశాఖవ్రతమును చేసి పూర్వము కంటె గొప్పవాడయ్యెను. కావున *వైశాఖమాస వ్రతము* అన్ని పాపములను పోగొట్టును , మరియు వైధవ్యమును కలిగింపదు. స్త్రీలకు భర్తలేకపోవుటను , పురుషులకు భార్య లేకపోవుటను వైధవ్యమని చెప్పవచ్చును. వైశాఖ వ్రతమును చేసి రతి దహింపబడిన మన్మధుని పొందినది. మన్మధుడును దగ్ధుడైనను వైశాఖ మహిమ వలన భార్యను పొందెను. విశాఖ అను పదము కుమారస్వామిని చెప్పును. వైశాఖ వ్రతమున విశాఖ జనన శ్రవణము పుణ్యప్రదము. శివుని కోపాగ్నికి గురి అయినను మన్మధుడు అనంగుడైనను యే వైశాఖ వ్రత మహిమ వలన సర్వోన్నతడు సర్వోత్తముడు , భార్యా ద్వితీయుడు అయ్యెనో ఆ వైశాఖవ్రతము నాచరింపని వారికి వైశాఖ స్నానము చేయని వారికి , దానము చేయనివారికి వారెన్ని ధర్మముల నాచరించిన వారైనను కష్టపరంపరలనందుదురు. ఏ ధర్మముల నాచరింపని వారైనను వైశాఖ వ్రతము నాచరించినచో వారికి అన్ని ధర్మముల నాచరించినంత పుణ్యలాభము కలుగును.


*వైశాఖ పురాణం పన్నెండవ అధ్యాయం సమాప్తం*

           🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏

కుప్పింట

 కుప్పింట చెట్టుతో వైద్యం  - 


         ఇది వర్షాకాలంలో  ఖాళీ ప్రదేశాలలో  బాగా పెరిగే చెట్టు. దీనిలో రెండు రకాలు ఉంటాయి. ఒక జాతి యొక్క ఆకులు గుండ్రముగా ఉంటాయి. రెండోవది ఆకులు చివర కోణం కలిగి ఉండును. ఇవి రెండూ సమాన గుణాలు కలిగి ఉండును. 


    దీని ఉపయోగాలు మీకు వివరిస్తాను.


  *  దీని ఆకులు 9, మిరియాలు 9, కొంచం హారతికర్పూరం ( ముద్ద కర్పూరం ) కలిపి నూరి శనగ గింజ అంత మాత్రలు కట్టి ఉదయం , సాయంత్రం నీటితో తీసుకుంటూ పథ్యం చేస్తూ పాలు తీసుకుంటూ ఉండిన కామెర్లు హరించును 


  *  దీని ఆకు , వేరు కలిపి కషాయం లా చేసుకుని తాగినా లేక చూర్ణం లోల్లికి తీసుకున్న మొలలు నివారణ అగును. 


  *  ఆకుల పసరు పూసిన చర్మరోగాలు నయం అగును. 


  *  దీని ఆకుల పసరు గేదెవెన్నలో కలిపి ఇచ్చిన మూర్ఛరోగం నివారణ అగును.


  *  దీని వేరుతో దంతధావనం చేసిన దంతరోగాలు నశించును. 


  *  దీని ఆకు పసరు కండ్లలో లేక ముక్కులో పిండిన పిల్లలకు వచ్చు బాలపాపచిన్నెలు నివారణ అగును. 


  *  అదే పసరు చెవిలో పిండిన చెవిపోటు నివారణ అగును.


  *  దీని ఆకుల రసం ఒక స్పూన్ లొపలికి ఇచ్చిన వాంతులు చేయను. లొపల పేరుకున్న శ్లేష్మం బయటకి పంపును. బ్రాంకైటిస్ అనగా వగర్పు గల దగ్గు నివారణ అగును. 


  *  దీని ఆకు నూరి కట్టిన వ్రణాలు మానును . 


  *  తేలు , జెర్రి , కందిరీగ , తేనెటీగ కుట్టిన వెంటనే ఈ ఆకు వేసి కట్టు కట్టిన బాధ నివారణ అగును. 


  *  గోరుచుట్టు లేచినప్పుడు దీని ఆకు , వెల్లుల్లిపాయ , తమలపాకు కలిపి నూరి కట్టిన అది పగిలి మానిపోవును . 


  *  పుప్పిపంటికి  దీని ఆకు నలిపి పుప్పిపంటిలో ఉంచిన బాధ తగ్గిపొవును.


  *  పురుగులు పట్టిన వ్రణములకు మొక్కని నీడలో ఎండబెట్టి చూర్ణం చేసి ఆ చూర్ణం చల్లిన పురుగులు నశించి పుండ్లు మానును . 


  *  దీని చూర్ణం నస్యం వలే లొపలికి పీల్చిన మెదడులో గడ్డకట్టిన రక్తం కరుగును.


 

     మరింత సమాచారం కోసం నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


చర్మవ్యాధుల గురించి

 చర్మవ్యాధుల గురించి సంపూర్ణ వివరణ  - 


 చర్మవ్యాధులు రావడానికి గల కారణాలు  - 


  *  విరుద్ధములగు అన్నపానములు తినటం అనగా పాలతో తయారైన సేమ్యా , కోవా , ఐస్ క్రీం తిని పెరుగన్నం తినటం లేదా చల్లని కూల్ డ్రింక్ ని  వేడిఅన్నం , కూరలు కలిపి తినటం ఇలాంటి ఆహారపు అలవాట్లు పాటించటం . 


 *  మలమూత్రాలను ఆపడం , అదేవిధముగా వాంతి వంటి సహజ వేగాలను బలవంతముగా నిరోధించడం . 


 *  భోజనం చేసిన వెంటనే వ్యాయామం చేయుట , ఎండలో తిరుగుట చేయరాదు . 


 *  ఎండలో తిరిగి వచ్చి చల్లని నీరు తాగరాదు . 


 *  అతిగా శ్రమపడి వచ్చి వెంటనే నీటిని సేవించరాదు . 


 *  అజీర్ణముగా ఉండగా మరలా భుజించరాదు . అనగా ముందు తిన్నది సంపూర్ణముగా అరగక ముందు మరలా భోజనం చేయరాదు . 


 *  కొత్తబియ్యపు అన్నం , పెరుగు మరియు చేపలు కలిపి తినరాదు . 


 *  అధికంగా పులుపు , ఉప్పు తినరాదు . 


 *  మినుములు , ముల్లంగితో చేయబడిన వంటలు , పాలు నువ్వులతో చేసిన వంటలు ఎక్కువుగా తీసుకొనుట 


 *  తినిన ఆహారం జీర్ణం కాకముందే దాంపత్యములో పాల్గొనుట చేయరాదు . 


 *  పగలు నిద్రించరాదు . పగలు నిద్రించుట వలన శరీరం నందు శ్లేష్మము పెరిగి దానివలన రక్తప్రసరణకు అవరోధము కలిగి చర్మమునకు రక్తప్రసరణ సరిగ్గా జరగక చర్మవ్యాధులు సంభవించును . ఎండాకాలం కొంచంసేపు పగలు నిద్రించవచ్చు . 


        పైన చెప్పినవిధముగా విరుద్ధమైన ఆహారం , పనులు చేయుటవలన శరీరంలో చర్మము , రక్తము , మాంసము , లింప్ గ్రంథులు దోషమును పొంది రకరకాల చర్మవ్యాధులు కలుగును. 


  చర్మవ్యాధులు రావడానికి పూర్వము కనిపించు లక్షణములు  - 


 *  స్పర్శజ్ఞానం క్రమేపి తగ్గిపోవుట . 


 *  చెమట ఎక్కువుగా పట్టుట లేదా చర్మవ్యాధి ప్రదేశము నందు అసలు చెమట పట్టకపోవును . 


 *  శరీరవర్ణము మారి నల్లబారిపోవుట . 


 *  దద్దుర్లు . 


 *  పోట్లు . 


 *  అలసట , వడలినట్లు అగుట. 


 *  వ్రణములు లేచి అధికభాధతో కూడి శీఘ్రముగా  

      జనించి త్వరగా మానకుండా ఉండటం. 


 *  తాపము ( చర్మం అంతా మంటలు ) . 


  అసాధ్య చర్మవ్యాధి లక్షణములు  - 


 *  రోగి బలహీనుడుగా ఉండి దప్పిక , మంట ,   అగ్నిమాంద్యములతో కూడి క్రిములు ఏర్పడిన అసాధ్యము . 


 *  చర్మవ్యాధి ఏర్పడి 10 సంవత్సరాలు దాటిన     

      అసాధ్యము . 


  చర్మవ్యాధుల యందు చికిత్సాక్రమము  - 


        శరీరము నందలి వ్యర్ధపదార్ధముల వలన చర్మవ్యాధులు వచ్చును . కాబట్టి వానిని వివిధరకాల పద్ధతుల ద్వారా వాంతి , విరేచనం మొదలగు శోధన పద్ధతులను ఉపయోగించి వ్యర్ధాలను బయటకి పంపుతూ ఔషధాలను ఇయ్యవలెను . 


  చర్మవ్యాధుల యందు పథ్యము  - 


  *  తేలికగా అరిగెడి ఆహారం తీసికొనవలెను . 


  *  త్రిఫలములు - ఉశిరి , కరక్కాయ , తానికాయ 

       విరివిగా వాడవలెను . 

  

  *  త్రిఫలా ఘృతము కూడా వాడవచ్చు . 


  *  పాతధాన్యములు వాడవలెను . 


  *  యవలు , చామలు , కొర్రలు , కందికట్టు , పెసర 

       కట్టు , మేకమాంసం వాడవలెను . 


  *  బీరకాయ , పొట్లకాయ , దోసకాయ , పెరుగు 

      తోటకూర , పొన్నగంటికూర , మెంతికూర , ఆవు 

       నెయ్యి , తెల్ల గలిజేరుకూర , తేనె , నీరుల్లి . 


           పైన చెప్పిన పదార్ధాలు ఆహారంలో తప్పక భాగం చేసుకొనవలెను . 


  చర్మవ్యాధుల యందు అపథ్యము  - 


 *  చింతపండు పులుపు , అతిగా కారం , ఆవాలు , 

      గుమ్మడి , వెల్లుల్లి , పెరుగు , పాలు . 


 *  బెల్లం , కల్లు , సారాయి , నువ్వులు .


 *  మినుములు , చెరుకురసము , పానకము .


 *  చేపలు , నీటిపక్షులు , కోడి మాంసం , పావురం .


 *  అతిగా వ్యాయామం , స్త్రీసంభోగం చేయరాదు .  


          పైన చెప్పినవిధముగా ఆహారపు అలవాట్లు పాటిస్తూ సరైన వైద్యుడి పర్యవేక్షణలో ఔషధాలు సేవించుచున్న చర్మవ్యాధుల నుంచి త్వరగా బయటపడగలరు. ఇక్కడ మనం ముఖ్యముగా గుర్తు ఉంచుకోవాల్సిన విషయము ఏమిటంటే వ్యాధి సంప్రాప్తినిచ్చిన తరువాత ఔషధాలు సేవించుట కంటే వ్యాధి రాకుండా చూసుకోవడమే అత్యంత ప్రధానమైనది. 


   మరింత సమగ్ర సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


    

ఖాళీలు పూరిద్దామా! 'గ' పదాలతో

 *ఖాళీలు పూరిద్దామా!  'గ'   పదాలతో...*

      


1. పెద్ద నిమ్మకాయలను ____కాయలు అంటారు

2. ____గణపతియే నమః.

3. బావిలోని వస్తువులు_____తో తీస్తారు.

4. ___ లేని అమ్మకు గంజే పానకం.

5. ఆమెకు కొంచెం ___ఎక్కువే.

6.____దాటిన సీత పాట్లు మనకు తెలుసు.

7. నువ్వు  ___పెట్టి అరిచినా నేను వినను.

8.హిమవంతుని కుమార్తె ____.

9.______శబ్దం కుండకు నష్టం.

10. _____చెయ్యడం అంటే ఎగతాళి.

11. ___అంటే  గోవు.

12. పంట  నిలువ చేసేది_____ అంటారు.

13. _____కింద పందికొక్కు.

14.______పూసింది కొమ్మ లేకుండా.

15._____లు కొండంతలు చెయ్యకు.

16.______మనే గుండె నృపులకు. ఝల్లుమనే జానకీ దేహము.

17.చిన్న పిల్లలు_____ వండి విందు చేసుకుంటున్నారు.

18.పూజారి ___నామాలు అడుగుతున్నారు.

19.   ____సౌలభ్యం కొరకు పాలు మిరియాలు.

20.మర్రిచెట్టు తొర్రలో ____గాడి గూడు.

21.____కు ఓటమి మొదటి మెట్టు.

22. ____ లేనివిద్య గుడ్డి విద్య.

23.వనభోజనాలు ___పొయ్యి మీద వండుతారు.

24.కృష్ణుని____ధారి అంటారు.

25.వేసవిలో ___లతో పచ్చీస్ ఆడతాము.

26.మొగలిపూవు ఎక్కడున్నా____ పరిమళం వెదజల్లుతుంది.

27.గాడిద కే మెరుక____ వాసన.

28.పిల్లలు____  కజ్జాలు పెట్టుకుంటారు.

29. ____ గజ్జెల కేడిస్తే, వీపు దెబ్బల కేడ్చిందట.

30.పండిత____ లు జరుగుతున్నవి తిరుపతి లో.

 *ప్రారంభించండి*

అరవై లో ఇరవై లా

 అరవై లో ఇరవై లా ఉండాలంటే పాటించాల్సిన పది చిట్కాలు (యాంటీ ఏజింగ్ స్పెషలిస్ట్ ఆగ్రా )


60 దాటారంటే మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే 100 కి   11 మంది మాత్రమే 60 దాట గలుగుతున్నారు. ఏడు మంది మాత్రమే 65 దాటి 70 చేర గలుగు తున్నారు.

 మీరు ఆనందంగా ఉండడానికి పది చిట్కాలు

 1. దప్పిక అనిపించినా లేకున్నా నీరు తాగుతూ ఉండాలి. రోజు కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలి.

 2.  ఆడతారో, తిరుగుతారో, నాట్యం చేస్తారో  మీ ఇష్టం కదులుతూ ఉండండి. లేకపోతే కీళ్ల న్నీ బిగుసుకుపోతాయి .

3 . బ్రతకడానికి తినండి తినటానికి బ్రతకకండి పిండి పదార్థాలు బాగా తగ్గించి ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న పోషకాహారం తినండి. ముఖ్యంగా రాత్రిపూట పిండి పదార్థాలు బాగా తగ్గించాలి.

 4.  వీలైనంత వరకు నడవండి లేదా సైక్లింగ్ చేయండి 100 నుంచి 200 మీటర్ల దూరం వాహనం వాడకండి, నడవండి. అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు ఎలివేటర్ వాడొద్దు రైల్వేస్టేషన్లలో ఎస్క లేటర్లు వాడొద్దు వాహనాలు వాడొద్దు. మెట్లు ఎక్కండి రాంప్ పై నడవండి.

 5. కోపం తగ్గించండి. తక్కువ మాట్లాడండి. మీ నివాస ప్రాంతంలో " కోప నిషేధ స్థలం " బోర్డు పెట్టండి. అది  మీకు కోపం రాకుండా ఉంచుతుంది.  మీ చుట్టూ ఉన్నవారికి కూడా గుర్తు చేస్తూ ఉంటుంది.

 6. ధనం పై  వ్యామోహం వదిలిపెట్టండి జీవనానికి అవసరమైనంత వరకు మాత్రమే సంపాదించాలి డబ్బు వెంట మీరు పరిగెత్తకండి డబ్బు మీ వెంట పరిగెత్తాలి .

7 మీరు కోరుకున్నది  దక్కకపోతే బాధపడకండి. నిన్ను నీవు దూసించుకో వద్దు. దానిని మర్చిపోండి.

 8 డబ్బు, తెలివి, సౌందర్యం, అధికారం, కులం, పదవి వీటి వల్ల అహంకారం పెరుగుతుంది. దీనిని వదిలిపెట్టాలి దీనికోసం పై వాటిపై  నియంత్రణ సాధించాలి‌. వినయంగా ప్రజలతో ప్రేమగా ఉండాలి. ఆనందంగా నవ్వుతూ గడపాలి అప్పుడే నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటావు.

 9. తెల్ల జుట్టు గురించి ఆందోళన వద్దు. కాళ్లు అనుమతించి నంతకాలం యాత్రలు చేయండి ఆనందంగా ఉండండి తెల్లజుట్టు వార్దక్యానికి సంకేతం కాదు. 

10. అందరితో స్నేహంగా కలిసి మెలిసి ఉండండి ఒక్కోక్కప్పుడు చిన్నవారే మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తారు . నేను పెద్దవాన్ని అందరు నాకు నమస్కరించాలి, గౌరవించాలి అని ఆశించకండి‌ నిశ్శబ్దంగా ఉన్న వారిని కూడా ఆప్యాయంగా పలకరించండి.

 ఈ 10 చిట్కాలు పాటించండి. 

గమనించండి మీ జీవితం ఎంత హాయిగా, ఆనందంగా, యవ్వనంగా గడిచిపోతుందో.....     ఆకెళ్ళ రామ కృష్ణ.      పాదగయా క్షేత్రము  పిఠాపురం

వైశాఖ పురాణం - 11 వ అధ్యాయము🚩*

 _*🚩వైశాఖ పురాణం - 11 వ అధ్యాయము🚩*_ 


🕉🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️


*రతి దుఃఖము - దేవతల ఊరడింపు*


🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹


నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖమహాత్మ్యమును వివరించునిట్లనెను. మిధిలాపతియగు శ్రుతకీర్తి శ్రుతదేవుని ముక్కంటి కంటిమంటకు యెర అయిన ఆ మన్మధుని జన్మయెట్టిది ? అతడు చేసిన కర్మ వలన అతడెట్టి దుఃఖముననుభవించెనో వివరింపుమని కోరెను. శ్రుతదేవుడిట్లనెను.


కుమారస్వామి జన్మకథ పవిత్రమైనది. విన్నంతనే చేసిన పాపములన్నియు నశించును. కీర్తిని , పుత్రులను కలిగించును. ధర్మబుద్దిని కలిగించును. సర్వరోగములను హరించును. అట్టి మహత్తరమైన కథను చెప్పుచున్నాను సావధానముగ వినుము.


శివుని కంటిమంటకు మన్మధుడు దహింపబడుటను చూచి మన్మధుని భార్యయగు రతి బూడిగప్రోగు అయిన భర్తను జూచి దుఃఖపీడితయై మూర్చిల్లెను. ముహూర్త కాలమునకు తెప్పరిల్లి బహువిధములుగ దుఃఖించెను. ఆమె దుఃఖము చూచు వారికిని దుఃఖమును కలిగించుచుండెను.


ఆమె తన భర్తతో సహగమనము చేయవలెనని తలచెను. అందులకై తగిన యేర్పాట్లను చేయుటకు తన భర్తకు మిత్రుడగు వసంతుని తలచెను. వీరపత్నియగు ఆమె కోరిక ప్రకారము చితిని యేర్పరచుటకై వసంతుడచటకు వచ్చెను. మిత్రుని దుర్మరణమునకు, మిత్రుని భార్య దురవస్థకు విచారించుచున్న వసంతుడు రతిదేవిని ఊరడించుచునిట్లనెను. అమ్మా నేను నీ పుత్రునివంటివాడను. పుత్రుడనగు నేనుండగ నీవు సహగమనమొనర్ప వలదు. అని వసంతుడు బహువిధములుగ జెప్పినను రతి సహగమనము చేయుటకే నిశ్చయించుకొనెను. వసంతుడు ఆమె నిశ్చయమును మరలింప లేకపోయెను. ఆమె కోరినట్లు చితిని నదీతీరమున యేర్పరచెను ఆమె గంగాస్నానము చేసి సహగమనమున చేయవలసిన పనులను పూర్తిచేసి భర్తను తలచుకొనుచు చితినెక్కబోయెను. అప్పుడు ఆకాశవాణి కల్యాణీ పతిభక్తిమతీ ! అగ్ని ప్రవేశము చేయకుము. శివుని వలనను , శ్రీకృష్ణావతారము నెత్తిన శ్రీమహావిష్ణువు వలనను నీ భర్తకు రెండు జన్మలు కలవు. రెండవ జన్మలో శ్రీకృష్ణుని వలన రుక్మిణీ దేవికి ప్రద్యుమ్నుడుగా జన్మించును. నీవు బ్రహ్మశాపమున శంబరాదురుని యింటనుందువు. అప్పుడు నీ భర్తయగు ప్రద్యుమ్నుడునీతో గలసి శంబరాసురుని యింటనుండగలడు. ఆ విధముగ నీకు భర్తృసమాగమము కలదు. అందువలన అగ్ని ప్రవేశమును మానుమని పలికెను. ఆకాశవాణి మాటలను పాటించి రతి అగ్నిప్రవేశమును మానెను. తరువాత బ్రహస్పతి ఇంద్రుడు మున్నగు దేవతలు ఆచటకు వచ్చిరి. తమ ప్రయోజనమునకై శరీరమును కోల్పోయిన మన్మధుని భార్యయగు రతిదేవిని బహువిధములుగ నూరడించిరి. ఆమెకు అనేక వరములనిచ్చిరి. శివుని కంటి మంటలో దహింపబడి శరీరము లేనివాడై అనంగుడను పేరును మన్మధుడు పొందును. నీకు మాత్రము యధాపూర్వముగ కనిపించునని ఆమెకు వారు వరములనిచ్చి యూరడించి పెక్కు ధర్మములను నుపదేశించి ఇట్లనిరి.


కల్యాణీ ! పూర్వజన్మలోనితడు సుందరుడను మహారాజు. అప్పుడును నీవే ఇతని భార్యవు. అప్పుడు రజోదోషమునందినను ఆ ధర్మములను పాటింపక పోవుటచే నీకిప్పుడీ స్థితి వచ్చినది. కావున వైశాఖమాసమున గంగాస్నానము చేయుచు వైశాఖ వ్రతము నాచరింపుము. పూర్వజన్మలో నీవు చేసిన దోషమునకు ప్రాయశ్చిత్తమగును. ప్రాతఃకాలమున గంగాస్నానము చేసి శ్రీమహావిష్ణువును అర్చింపుము. పూజానంతరము విష్ణు కథా శ్రవణము చేయుము. నీవిట్లు చేసినచో నీ భర్త నీకు లభించును అని రతికి అశూన్యశయన వ్రతము నాచరించు విధమును చెప్పి దేవతలు వెళ్లిరి.


రతిదేవియు అతి కష్టముపై దుఃఖమును మ్రింగి సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖమాసమున వైశాఖవ్రతము నాచరించుచు అశూన్యశయనమను వ్రతమును చేసెను. ఆ వ్రత ప్రభావమున ఆమెకు భర్తయగు మన్మధుడు కంటికి కనిపించెను. ఆమెతో యధాపూర్వముగ సుఖించుచుండెను. మన్మధుడు పూర్వజన్మలో సుందరుడను మహారాజుగనుండెను. అప్పుడతడు వైశాఖవ్రతము చేయలేదు. వైశాఖదానములను చేయలేదు. అందుచే నితడు శ్రీమహావిష్ణువు కుమారుడైనను శివుని కోపాగ్నిచే శరీరమును పోగొట్టుకొనెను. విష్ణుపుత్రునికే వైశాఖవ్రతము నాచరింపకపోవు వలన నిట్టి పరిస్థితి వచ్చినచో మిగిలిన వారికేమి చెప్పవలయును ? కావున ఇహలోక సుఖముల నాశించువారు అందరును తప్పక వైశాఖవ్రతము నాచరింపవలయును సుమా !


*వైశాఖ పురాణం పదకొండవ అధ్యాయం సంపూర్ణం*

            🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🙏🍁🙏🍁🙏🍁🙏🍁🙏

స్థితప్రజ్ఞుడే

 సుభాషితమ్


శ్లోకంII


ఆపూర్యమాణ మచలప్రతిష్ఠం సముద్రమాపః ప్రవిశన్తి యద్వత్ | తద్వత్కామా యం ప్రవిశన్తి సర్వే స శాన్తిమాప్నోతి న కామకామీ ॥


తా|


"సముద్రం నింపబడుతూనే ఉంటుంది.... నిశ్చలంగా ఉంటుంది. జలం దానిలో చేరిననూ దానిని కదిల్చలేవు..... అదే రీతిగా భోగములు లభించినప్పటికీ నిర్వికారంగా ఉండే స్థితప్రజ్ఞుడే కోరికలకు దూరమై సుఖశాంతులను పొందగలడు ".


సేకరణ:- శ్రీ శర్మద గారి వాట్సాప్ పోస్ట్ 

ఆర్య చాణక్య

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 48*


"మహాజనులారా ! రండి. మా గురుదేవుల వారి అత్యద్భుత శక్తి సామర్థ్యాలను గ్రహించండి. వారి రక్షణ పొంది మీకు గల దీర్ఘరోగాలనుండీ భూత ప్రేత పిశాచ బాధల నుండి విముక్తి పొందండి. ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించండి. రండి. కదలిరండి... వేలాదిగా తరలి రండి ... గురుదేవుల వారి దర్శనం చేసుకుని తరించండి..." అంటూ నడివీధి మధ్యన నిలచి బిగ్గరగా ప్రచారం ప్రారంభించాడు ఒక శిష్యుడు. జనం క్రమక్రమంగా అతని చుట్టూ మూగి ప్రశ్నల వర్షం కురిపించసాగారు. 


"మా గురువుగారి పేరు జీవసిద్ధి. వారు అఖండ ప్రజ్ఞావంతులు. దైవాంశ సంభూతులు. ఆయనతో దేవుడు మాట్లాడుతుంటాడు. దుఃఖ పీడితులకు తరుణోపాయాన్ని ఆ దేవుడే మా గురువర్యులకు తెలియజేస్తుంటాడు." అని చెప్పాడతడు ఉద్విగ్న స్వరంతో. 


జనం ఆశ్చర్యపోతూ "మీ గురువుగారితో దేవుడు మాట్లాడుతుంటాడా ? ఆయన అంతటి మహిమాన్వితుడా ? ఆ మాట నమ్మేదెట్లా ?" అనడిగారు. 


"ఇక్కడే ! ఇప్పుడే ! మీ అందరి సమక్షంలో గురుదేవుల మహత్తుని నిరూపిస్తా... అగ్నిగుండం ఏర్పాటు చేయించండి ..." అన్నాడా శిష్యుడు గంభీరంగా. 


ఆ వింత ఏమిటో చూద్దామనుకుని కొందరు అప్పటికప్పుడే అక్కడే అగ్ని గుండాన్ని ఏర్పాటు చేశారు. అగ్ని గుండంలో చండ్ర నిప్పులు కణకణమండుతున్నాయి. 


"రండి... నా అరికాళ్ళను ఎవరైనా పరీక్షించండి" అన్నాడా యువకుడు. 


జనంలో నుంచి ఎవరో వెళ్లి అతని పాదాలను చేతులతో తాకి, పరీక్షించి ...

"అందరిలాగే... మామూలు పాదాలే..." అని ప్రకటించాడు. 


"ఇప్పుడు నేను ఇందరి సమక్షంలో ఆ అగ్నిగుండం మీద నుంచి సురక్షితంగా నడిచి మా గురుదేవుల మహత్యాన్ని నిరూపిస్తాను" అని ప్రకటించి, ఆ శిష్యుడు తలెత్తి ఆకాశం వైపు చూస్తూ... 

"జై గురుదేవా ! ఈ పరీక్ష నాకు కాదు. మీకే... దూకనా ? ఈ అగ్నిగుండంలో దూకనా ?" అని అరిచాడు. 


అతడు ఆకాశంలో ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసుకోవడానికి అందరూ తలెత్తి ఆకాశం వైపు ఉత్కంఠంగా చూశారు. వాళ్ళ కళ్ళకి ఎవ్వరూ కనిపించలేదు. ఆ క్షణంలోని ఆ శిష్యుడు తన అరచేతులకి అంటి ఉన్న 'మండూకవసతో కలిపిన తైలాన్ని' అరికాళ్ళకు చాలా వేగంగా, నేర్పుగా రాసుకున్నాడు. అరక్షణంలో జరిగిన మోసాన్ని ఎవ్వరూ గమనించలేదు. 


"అగ్నిలో దూకడానికి అనుమతించారా గురుదేవా ! సరే ... " అంటూ అతడు తలదించి "గురుదేవుల అనుమతి లభించింది. ఇక చూడండి మహత్తు... జై గురుదేవా.... !" అని అరుస్తూ అతడు నిప్పుల మీద కాళ్ళూ పెట్టాడు. అందరూ గుడ్లప్పగించి చూడసాగారు.


"జై గురుదేవా ! జై జై గురుదేవా !" అని స్మరిస్తూ అతడు నెమ్మదిగా ఒక్కొక్క అడుగే నిప్పుల మీద వేస్తూ, ముఖంలో ఏ మాత్రం భయం, బాధ లేకుండా అగ్నిగుండంమీద ఆ చివరి నుంచి ఈ చివరి వరకూ నడుచుకుంటూ వచ్చి తన కాళ్లు ఒకదాని తర్వాత మరొకటి పైకెత్తి అరికాళ్ళను ప్రదర్శించాడు. అతడి అరికాళ్ళు నిప్పుల్లో కాలిన సూచనలేవీ లేకుండా మామూలుగా, సహజంగా కనిపించాయి. 


అతడు తన పాదాలను మార్చి మార్చి చూపిస్తూ "చూశారా ! చూస్తున్నారా ! నాకీ ' అగ్నిగమన ' సిద్ధిని నేర్పిన వారు మా గురుదేవులు జీవసిద్ధి మహాశయులు. వారి మహత్తు అపారం. వారి హృదయం దయాసముద్రం. ఆర్తులు, రోగార్తులంతా వారిని ఆశ్రయించండి. వారి అనుగ్రహాన్ని పొందండి. జై జీవ సిద్ధి గురుదేవా !" అని అరిచాడు. 


"జై .... జీవసిద్ది గురుదేవులకు జై !" అని అరుస్తూ, ఉత్సాహంతో నినాదాలు చేసుకుంటూ జనం తండోపాతండాలుగా జీవసిద్ధి ఆశ్రమంవైపు పరుగులు తీశారు. 


(ఇంకా ఉంది)...🙏


సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్. 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌹