నిర్వ్యాపారో౾పి నిష్కారణమజ। భజసే యత్క్రియామీక్షణాఖ్యాం
తేనైవోదేతి లీనా ప్రకృతిరసతి కల్పా౾పి కల్పాదికాలే।
తస్యాస్సంశుద్ధమంశం కమపి తమతిరోధాయకం సత్త్వరూపం
సత్త్వం ధృత్వా దధాసి స్వమహిమ విభవాకుంఠ వైకుంఠ రూపం||
భావము - వైకుంఠవాసా! నీవు జన్మరహితుడవు, క్రియారహితుడవు. అయినను 'ఈక్షణము' అను సంకల్పముతో సృష్టిక్రియను స్వీకరించితివి. కల్పాదికాలమున స్ధిరరూపములేక నీ యందే ఐక్యమై యున్న ప్రకృతిని ఆవిర్భవింపచేసి నీవు శుద్ధసత్వ రూపమును ధరించితివి.
వ్యాఖ్య. ఈక్షణ యస్య సః - నిర్మలమైన ఆశ్రితులయందు దృష్టి కలవాడు స్వామి అని అర్థం.
కళ్ళు చూడాల్సిన వస్తువుని చూడకుండా ప్రవర్థిస్తున్నాయి అంటే ఉన్న కళ్ళు వ్యర్థం అన్న మాట. 'శ్రీశుక మహర్షి అంటారు పరిక్షిత్తు తో. జగత్ కారణమైన శ్రీహరిని దర్శించ చేతకాని కళ్ళు, నెమలి కళ్ళకు ఎంత ప్రయోజనమో వాడి కళ్ళకూ అంతే ప్రయోజనం. శ్రీహరి కీర్థన వినడానికి పనికిరాని చెవులు, ఎలక గొయ్యలు లేవా, వాడి చెవులకూ అంతే ప్రయోజనం. హరినామ సంకీర్తనకు పనికిరాని నాల్క ఎంత, కప్పలకు లేవా బెక బెకలాడే నాల్కలు, వాడి నాల్కకు అంతే ప్రయోజనం. వాడిని చూడ నేర్చిన కన్ను కన్ను అంటారు శ్రీశుక మహర్షి. 'కృష్ణం లోకయం లోచన ద్వయ' అంతటా నిండి ఉన్న కృష్ణుడిని చూడచేతకాకపోతే నీవుండి ఏం ప్రయోజనమే నేత్రమా! అని అంటారు కులశేఖరాళ్వార్.
వాస్తవాన్ని చూడగలిగే నేత్రాలు మనకు కావాలి, అవి బయటి నేత్రాలు కావచ్చు, లోని నేత్రాలు కావచ్చు. మనస్సుని అంతఃచక్షువు అని అంటారు. దృతరాష్ట్రుడికి అంతఃచక్షువు ప్రసాదించి తన విశ్వరూపాన్ని చూపాడు శ్రీకృష్ణ పరమాత్మ. బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులకి లభించని భాగ్యం తనకి లభించింది అని తరించాడు. పరమాత్మని చూసిన కళ్ళతో లోకాన్ని చూడలేను అని చెప్పాడు. చూసినంతసేపు తరించాడు, తరువాత యుద్దాన్ని ఆపే ప్రయత్నం చెయ్యలేదు. బయటి నేత్రాలు ఎట్లాగూ లేవు, పరమాత్మ ఇచ్చిన లోని నేత్రాలని కూడా వాడుకోలేక పోయాడు. అందుకే రామానుజాచార్య స్వామి దృతరాష్ట్రుడిని సర్వాత్మనా అంధుడు అని చెబుతాడు.
'అంత కాలేచ మామేవ స్మరాన్ ముక్తా కలేబరం ప్రయాతి సమప్స్థానం యాతి' శరీరంలోనుండి ప్రాణం పోతుంటే చివరి క్షణంలోనైనా నన్ను తలచుకో అని స్వామి భగవద్గీతలో చెప్పాడు. ప్రాణ ప్రయాణ స్థితిలో కూడా భగవంతుడు చూస్తాడు మనల్ని.
భీష్ముడు అట్లాంటిది పొందాడు. అంపశయ్యపై పడి ఉన్న భీష్ముడి వద్దకి శ్రీకృష్ణుడు పాండవులతో వచ్చే సరికి, 'హే భగవన్! నేనెంత అదృష్టవంతుడి నయ్యా. చివరి క్షణంలో నిన్ను తలచుకోవాలి అని శాస్త్రం చెబుతుంది. దేహ బాదలతో ఎంతమంది తలచు కోగలరు. కానీ నాపాలిట నిజం అయ్యింది. స్వామీ నేను చెప్పేవరకు కదలకు' అంటూ శ్రీకృష్ణుడిని ఆదేశించగలిగాడు భీష్ముడు. పరమాత్మ భక్తులపట్ల అలా లొంగి ప్రవర్తిస్తాడు.
శ్రీకృష్ణుడు చూస్తుండగానే ఇంద్రియాలను లోనికి తీసుకున్నాడు, మనస్సును ఆత్మపరం చేసాడు, ఆత్మని పరమాత్మ వైపు ఇలా దేహాన్ని వదిలాడు. తన భక్తుల విషయంలో స్వామి అట్లా చూసుకుంటాడు. 'నామే భక్త పణాస్యతి' నా భక్తులు నాకు కనిపించకపోవుట అనేది ఎప్పుడూ లేదు అని అంటాడు స్వామి, ఎందుకంటే ఆయన 'పుష్కరాక్షః', 'పుండరీకాక్షః', 'పద్మ నిభేక్షణః'. ఇవన్నీ ఆయన నామాలు.
ఈశ్లోకంలో ఉపాసనా పరుడైన భట్టతిరి శ్రీక్రృష్ణుడిని ప్రక్రృతిని స్రృజించి పాలించే వాడిగా తెలుసుకుని "హే భగవన్!(మమ్ములను) ఎప్పటికీ చూస్తూ ఉండు. మా క్లేషాలు తొలగించు. నీలాంటి అందమైన నేత్ర సౌందర్యం నాకూ ఇవ్వు. నీలా చూడవల్సిన దాన్ని చూసేట్టు చేయి" అని కోరుతున్నాడు.
స్వస్తి.
🙏🙏🙏
సేకరణ
**ధర్మము-సంస్కృతి*
🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి