24, సెప్టెంబర్ 2021, శుక్రవారం

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*415వ నామ మంత్రము* 24.9.2021


*ఓం మనో వాచామగోచరాయై నమః*


మనోవాక్కులకు గోచరించని అనంత గుణములు గలిగిన జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మనోవాచామగోచరా* యను ఎనిమిదక్షరముల(అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం మనో వాచామగోచరాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఆ తల్లి భక్తిజ్ఞానసంపదలను ప్రసాదించి, నిరంతరము భగవద్ధ్యానముతో జీవనము కొనసాగించువారిగను, శాంతిసౌఖ్యములతో జీవించువారిగను అనుగ్రహించును.


జగన్మాత పరమాత్మస్వరూపిణి. ఆ తల్లి ఇట్లు ఉంటుందని మనస్సుచే ఊహించుటగాని, వాక్కుతో చెప్పుటగాని సాధ్యముగాదు. 'వాక్కులు పరమాత్మను బోధింపలేక వెనుదిరిగిపోయినవి , అలాగే పరమాత్మను తెలియలేక మనస్సు వెనుకకు తిరిగిపోయినది' అని వేదములు చెప్పినవి. 'మనోవాక్కులకు అతీతమైనది, జ్ఞానులకు మాత్రమే గోచరమైనది అగు పరమాత్మస్వరూపిణి అయిన పరమేశ్వరికి నమస్కరిస్తున్నాను' అని ప్రహ్లాదుడు అనినట్లు విష్ణుపురాణంలో చెప్పబడినది. సృష్టిలో తొలుత పుట్టినవారికి తరువాత పుట్టినవాటి గురుంచి తెలుస్తుంది. పరమాత్మ సృష్టికి మూలస్థితినుండి ఉన్నది గనుక ఆ తల్లికి అంతయు తెలియును. కాని ఆ తల్లి గురుంచి తెలియాలంటే బ్రహ్మజ్ఞాన సంపద అవసరము. ఆత్మ అన్నిటికి పూర్వమైనది. వాక్కు, మనస్సు మాత్రము తరువాత వచ్చినవి. గనుక ఆత్మగురుంచి మనోవాక్కులకు తెలియదు. అదే విధముగా పరమాత్మస్వరూపిణియైన అమ్మవారు మనోవాక్కులకు గోచరముకానిది గనుక *మనోవాచామగోచరా* యని అనబడినది. పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరీ యనునవి వాక్కుయొక్క నాలుగు రూపములు. అందులో పరమేశ్వరి పరాస్వరూపిణి. నాలుగరూపమైన వైఖరికి పరాస్వరూపము తెలియదు. అవ్యక్తము ఇది సృష్టికి పూర్వము. మహతత్త్వము, అహంకారము, పంచతన్మాత్రలు, పంచభూతములు, ఇంద్రియములు క్రమముగా ఏర్పడినవి. అన్నిటికి పూర్వమైన అవ్యక్తముగూర్చి ఇంద్రియములకు తెలియుట అసంభవము. కాని బ్రహ్మజ్ఞానులకు పూర్వాపరములన్నియు తెలియును. సృష్టికి పూర్వమైన అవ్యక్తస్వరూపిణియైన పరమాత్మ అన్నిటికి తరువాత ఏర్పడిన మనోవాక్కులకు తెలియదు. గనుక అమ్మవారు *మనోవాచామగోచరా* యని అనబడినది. అమ్మవారిని తెలియాలంటే కఠోరమైన యోగసాధన అవసరము. ఆ యోగసాధనలో ఉన్మనాస్థితికి చేరితేనేగాని ఆ పరమేశ్వరి తెలియదు. గనుకనే ఆ తల్లి *మనోవాచామగోచరా* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం మనో వాచామగోచరాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: