24, సెప్టెంబర్ 2021, శుక్రవారం

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*దిశానిర్దేశం!.*


"ఇక్కడ కొన్నాళ్లపాటు ఉండాలని వచ్చానండీ..నేను చేసే సాధన కొరకు ఈ ప్రదేశం సరైనదని అనిపిస్తున్నది..పైగా ఇక్కడ శ్రీ దత్తాత్రేయస్వామి వారు తన తపోసాధన చేసారు.. ఆ ప్రభావం ఈ క్షేత్రం లో ఉన్నది.." అన్నాడా పాతికేళ్ల వయసున్న యువకుడు..


అతనిని అంతకు ముందెన్నడూ చూడలేదు..ఒక కాషాయ వస్త్రాన్ని పంచె లాగా కట్టుకొని వున్నాడు..అదే రంగు చొక్కా ఉన్నది కానీ..దానిని ధరించకుండా భుజం మీద వేసుకొని వున్నాడు..నేను అతని గురించి వివరాలు ఆడిగేలోపలే..


"నేను ఇక్కడికి వచ్చి మూడురోజులవుతున్నది..ఉదయాన్నే శ్రీ స్వామివారి ప్రభాత హారతి సమయం లో మందిరం లోకి వచ్చి దర్శనం చేసుకొని..శివాలయం వద్ద చెట్ల క్రింద ధ్యానం చేసుకుంటున్నాను..నిన్నటి నుంచీ మనసులో బలంగా అనిపిస్తున్నది..ఇక్కడే కొన్నాళ్ల పాటు వుండి సాధన కొనసాగించాలని..మీరు అనుమతి ఇస్తే..కొనసాగిస్తాను.." అన్నాడు..


"ముందుగా మీ వివరాలు తెలుపండి..మీకు సౌకర్యం గా వుంటే..మీ సాధనను ఇక్కడ కొనసాగించండి..మధ్యాహ్నం పూట అన్నదానం జరుగుతుంది. అక్కడకు వెళ్లి ఆహారం తీసుకోవచ్చు..కానీ..ఒక్కమాట..మీ సాధన కు మేము ఎటువంటి ఇబ్బందీ కలిగించము..మీరు కూడా మందిర వ్యవస్థలో తలదూర్చ వద్దు.." అని చెప్పాను..


అతనిది కందుకూరు..పేరు.. నాగరాజు..కులరీత్యా యాదవులు..తల్లిదండ్రులు వున్నారు..సుమారు ఐదారేళ్ళ నుంచీ ఇతను ధ్యానం అనీ..సాధన..తపస్సు అనీ తిరుగుతున్నాడు..ఇంకా ఒక స్పష్టమైన లక్ష్యం ఏర్పడలేదు అని చెప్పాడు..ఆ గురి కుదిరేదాకా ఇక్కడ ఉండాలని అతని భావన..


ఒక వారం రోజులపాటు అతనిని దగ్గరగా గమనించాను..రోజులో ఎక్కువ సేపు ధ్యానం చేసుకుంటూ ఉంటున్నాడు..ఏదో ఒక సమయంలో భోజనం చేస్తున్నాడు..కానీ మరో రెండు రోజులు గడిచేసరికి..మెల్లిగా అతని చుట్టూ మనుషులు మూగడం ప్రారంభం అయింది..ప్రశ్నలు అడగడం..అతని చేత తమ జాతకాలు చూపించుకోవడం మొదలైంది..అతనూ తన సాధన ధ్యానం వదిలేసి..ఈ ప్రాపంచిక వ్యవహారాలలో కూరుకు పోతున్నాడు..


శ్రీ స్వామివారు జీవించి ఉన్న రోజులలో సాధకుల గురించి ఒక మాట చెప్పేవారు.."సాధన.. ధ్యానం..చేస్తూఉన్నప్పుడు.. కొంత కాలానికి ఆ సాధకుడి కి కొన్ని చిత్కళ లు స్వాధీనం అవుతాయి..వాటి మాయలో పడిపోయి..ఆ శక్తులను లౌకిక వ్యవహారాలకు ఉపోయోగిస్తే..తాత్కాలిక భోగాలు సమకూరుతాయి..ఆ భోగాలకు అలవాటు పడితే..ఇక ఆ సాధకుడి లక్ష్యం దెబ్బతిని..అతనొక సాధారణ మాంత్రికుడిగా మిగిలిపోతాడు.. దైవాన్ని చేరుకోలేడు.. ఇది ప్రకృతి కల్పించే మాయ పొర..ఆ వలలో పడకుండా వుండే వాడే నిజమైన అవధూత..నిజమైన సాధకుడు.." అని..ఆ మాటలు గుర్తుకొచ్చాయి..


నాలుగు రోజులు గడిచిన తరువాత..నా దగ్గరకు వచ్చాడు.."నిన్న రాత్రి ఒక సంఘటన జరిగింది.."అన్నాడు..అతని ముఖం లో ఏదో తెలియని బాధ కనబడుతున్నది..కళ్ళమ్మట ధారాపాతంగా కన్నీళ్లు కారిపోతున్నాయి..


"ఏమైంది?" అన్నాను..


"శ్రీ స్వామివారు స్వప్నం లో కనబడి..నన్ను గట్టిగా హెచ్చరించారు..నేను నడుస్తున్న దారి గమ్యం లేనిదనీ..దారి తప్పి తిరుగుతున్నాననీ..చెప్పారు..లేచి చూసాను..ఎవ్వరూ కనబడలేదు..కానీ ఆలోచిస్తే..ఈ మధ్య నేను చేసిన కొన్ని పనులు..నా సాధన కు ఉపయోగపడేవి కాదనిపించింది..నేనూ తప్పు చేశాను..కొందరి బాధలు పోగొడుతున్నాను అని భ్రమించాను..కానీ నేను అధోగతికి పోతున్నానని గ్రహించలేదు.." అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.."మా గురువు గారి దగ్గరకు వెళుతున్నాను..ఆయన హిమాలయాల్లో వుంటారు..ఆయన పాదాలు పట్టుకోమని స్వామివారు గట్టిగా ఆదేశించారు..వెళ్ళొస్తాను..మీకు చెప్పి వెళదామని వచ్చాను.."అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు..పశ్చాత్తాపం అతనిని దహించివేస్తున్నది..


ఆ తరువాత అతను మందిరం వద్ద నుంచి వెళ్ళిపోయాడు..కొన్నాళ్లపాటు తన గురువుగారి వద్ద వున్నాడు..ప్రస్తుతం ఆశ్రమ నిర్మించుకునే సన్నాహాల్లో వున్నాడు..మొత్తానికి శ్రీ స్వామివారు తనకు సరైన మార్గాన్ని చూపారని వినమ్రంగా చెప్పుకుంటాడు..


ఆ రకంగా నాగరాజు అనబడే ఒక సాధకుడికి స్వామివారు దిశానిర్దేశం చేసారు..అతని జీవితానికో గమ్యాన్ని నిర్దేశించారు..


సర్వం..

దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699)

కామెంట్‌లు లేవు: