*24.09.2021 ప్రాతః కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*ఏకాదశస్కంధము - ఏడవ అధ్యాయము*
*అవధూతోపాఖ్యానము - పృథివి మొదలుకొని కపోతముల వరకు గల ఎనిమదిమంది గురువుల కథలు*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*7.66 (అరువది ఆరవ శ్లోకము)*
*సాఽసకృత్స్నేహగుణితా దీనచిత్తాఽజమాయయా |*
*స్వయం చాబధ్యత శిచా బద్ధాన్ పశ్యంత్యపస్మృతిః॥12491॥*
భగవంతుని మాయా ప్రభావమున తన పిల్లలపై అంతులేని మమకారముగల ఆడుపావురముయొక్క చిత్తము తన పిల్లల దురవస్థ కారణముగా మిగుల దైన్యస్థితికి లోనయ్యెను. వలలో బంధింపబడియున్న పిల్లలకు ఏవిధముగను తోడ్పడజాలక దిక్కుతోచనిదై, తానును స్వయముగా ఆ వలలో చిక్కుకొనెను.
*7.67 (అరువది ఏడవ శ్లోకము)*
*కపోతశ్చాత్మజాన్ బద్ధానాత్మనోఽప్యధికాన్ ప్రియాన్|*
*భార్యాం చాత్మసమాం దీనో విలలాపాతిదుఃఖితః12492॥*
అంతట మగపావురము తన ప్రాణములకంటె మిన్నగా చూచుకొనుచున్న తన పిల్లలను, ప్రాణతుల్యమైన తన భార్యయును వలలో చిక్కుపడి యుండుట చూచి, భరింపలేక మిగుల దుఃఖముతో విలపింపసాగెను. అప్పటి దాని పరిస్థితి ఎంతయో జాలిగొలుపునదిగా ఉండెను.
*7.68 (అరువది ఎనిమిదవ శ్లోకము)*
*అహో మే పశ్యతాపాయమల్పపుణ్యస్య దుర్మతేః|*
*అతృప్తస్యాకృతార్థస్య గృహస్త్రైవర్గికో హతః॥12493॥*
అప్పుడు ఆ కపోతము ఇట్లు తలపోయసాగెను. 'నా దౌర్భాగ్యమును చూడుడు. నేను మిగుల దురదృష్టవంతుడను. నేను చేయవలసిన పనులు ఏమియు పూర్తికాలేదు. పిల్లలను పెంచి పెద్దచేయదలచుకొనిన నా కోరికలు ఏమాత్రమూ ఈడేరలేదు. అంతేగాదు, ధర్మార్థకామములకు మూలమైన గృహస్థాశ్రమము పూర్తిగా దెబ్బతినినది. వేయేల? నా ఆశలన్నియును అడుగంటినవి'
*7.69 (అరువది తొమ్మిదవ శ్లోకము)*
*అనురూపానుకూలా చ యస్య మే పతిదేవతా|*
*శూన్యే గృహే మాం సంత్యజ్య పుత్రైః స్వర్యాతి సాధుభిః॥12494॥*
'నన్ను దైవముగా భావించెడి నా భార్య నాకు అన్నివిధములుగా తగినట్టిది. అట్టి అనుకూలవతియైన భార్య దొరకుట నా అదృష్టము. ఆమెలేని ఈ గూడు నాకు శూన్యము. నన్ను ఒంటరి వానిని జేసి, అన్నెంపున్నెం ఎఱుగని ఈ పిల్లలతో తాను స్వర్గమునకు వెళ్ళుచున్నది'
*7.70 (డెబ్బదియవ శ్లోకము)*
*సోఽహం శూన్యే గృహే దీనో మృతదారో మృతప్రజః|*
*జిజీవిషే కిమర్థం వా విధురో దుఃఖజీవితః॥12495॥*
'భార్యను, పిల్లలను పోగొట్టుకొని, బోసిపోయిన ఈ గూటిలో దిక్కులేని వాడనై నేను బ్రతికి లాభమేమి? భార్యావియోగమునకు గుఱియైన నా జీవితము మిగుల దుఃఖమయము, వ్యర్థము".
*7.71 (డెబ్బది ఒకటవ శ్లోకము)*
*తాంస్తథైవావృతాన్ శిగ్భిర్మృత్యుగ్రస్తాన్ విచేష్టతః|*
*స్వయం చ కృపణః శిక్షు పశ్యన్నప్యబుధోఽపతత్॥12496॥*
ఇట్లు చింతించిన పిమ్మట ఆ కపోతము వలలో చిక్కుకొని చేష్టలుడిగి మృత్యుముఖమున ఉన్న తమ పిల్లలను జూచి, దైన్యమునకు లోనై అజ్ఞానముతో తానును ఆ వలలో ప్రవేశించెను.
*7.72 (డెబ్బది రెండవ శ్లోకము)*
*తం లబ్ధ్వా లుబ్ధకః క్రూరః కపోతం గృహమేధినమ్|*
*కపోతకాన్ కపోతీం చ సిద్ధార్థః ప్రయయౌ గృహమ్॥12497॥*
అంతట క్రూరాత్ముడైన కిరాతుడు ఇంటికి యజమానియైన ఆ కపోతమును, కపోతిని, వాటి పిల్లలను తీసికొని, తాను వచ్చినపని పూర్తియైనట్లు తలంచి, మిగుల సంతసముతో తన ఇంటికి చేరెను.
*7.73 (డెబ్బది మూడవ శ్లోకము)*
*ఏవం కుటుంబ్యశాంతాత్మా ద్వంద్వారామః పతత్రివత్|*
*పుష్ణన్ కుటుంబం కృపణః సానుబంధోఽవసీదతి॥12498॥*
విషయసుఖలోలుడైన కుటుంబి చంచలమనస్కుడై తన కుటుంబపోషణకై ద్వంద్వములలో తలమున్కలగు దీనుడై కడకు కపోతమువలె సకుటంబముగా నశించును.
*7.74 (డెబ్బది నాలుగవ శ్లోకము)*
*యః ప్రాప్య మానుషం లోకం ముక్తిద్వారమపావృతమ్|*
*గృహేషు ఖగవత్సక్తస్తమారూఢచ్యుతం విదుః ॥12499॥*
ముక్తిసాధనమైన మానవ జన్మను పొందియు, పావురములజంటవలె సాంసారిక వ్యామోహములో చిక్కుకొనినవాడు శ్రేయో మార్గమునుండి పతనమగుట తథ్యమని భావింపవలెను. అట్టి వానిని పండితులు *ఆరూఢచ్యుతుడు* అని యందురు. శ్రేయోమార్గములను కోరుకొనువాడు సాంసారిక వ్యామోహములో చిక్కుకొనరాదని ఈ కపోతవృత్తాంతము లోకమునకు పరోక్షముగా హితవు పలుకుచున్నది.
*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ఏకాదశస్కంధే సప్తమోఽధ్యాయః (7)*
ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి *అవధూతోపాఖ్యానము - పృథివి మొదలుకొని కపోతముల వరకు గల ఎనిమదిమంది గురువుల కథలు* అను ఏడవ అధ్యాయము (7)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి