24, సెప్టెంబర్ 2021, శుక్రవారం

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*999వ నామ మంత్రము* 24.9.2021


*ఓం శివశక్యైక్యరూపిణ్యై నమః* 


శివశక్తుల సామరస్యమే స్వరూపముగా విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శివశక్యైక్యరూపిణీ* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం శివశక్యైక్యరూపిణ్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగదాంబికను అత్యంతభక్తి ప్రపత్తులతో ఆరాధించు భక్తులకు ఇష్టకామ్యార్థసిద్ధియు, కైవల్యదాయకమైన ధ్యాననిమగ్నతను ఆ జగన్మాత అనుగ్రహించును.


శ్రీచక్రరాజమును శంకరభగవత్పాదులవారు ఈ విధంగా వర్ణించారు.


*చతుర్భిః శ్రీకంఠైః - శివయువతిభిః పంచభిరపి|*


*ప్రభిన్నాభిః శంభో ర్నవభిరపి మూలప్రకృతిభిః |*


*చతుశ్చత్వారింశ - ద్వసుదల-కలాశ్చ్త్రివలయ*


 *త్రిరేఖభిః సార్ధం - తవ శరణకోణాః పరిణతాః || 11 ||*


శ్రీచక్రం వర్ణన - నవ చక్రాకృతమై, నలుబది నాలుగు అంచులు కలిగి శివశక్త్యుభయ (శివశక్యైక్య) రూపముగా వెలయుచున్నది.



అమ్మా! .శ్రీచక్రంలో శివకోణములు నాలుగు అధోముఖముగాను ( వీటి కోణములు క్రిందకు ఉండును.) శక్తికోణములు ఐదు ఊర్ధ్వముఖముగాను ( వీటి కోణములు పైకి) ఉండి శివశక్తుల సామరస్యమును (శివశక్యైక్యమును) తెలియజేయుచున్నది. శ్రీచక్రమునందు మూలప్రకృతులు తొమ్మిది ,అష్టదళములు ఎనిమిది, షోడశదళములు పదునారు , త్రివలయములు మూడు,, భూపురత్రయములు మూడు . ఈ తీరున శ్రీచక్రంలో మొత్తం నలుబది నాలుగు కోణములు ఉండును. అటువంటి శ్రీచక్రము నీకు నిలయముగా నీ స్థానమై ఉన్నది తల్లీ. శ్రీచక్రము నందు సృష్టికి  మూల కారణమైన మూల ప్రకృతులను పేరుగల తొమ్మిది త్రికోణములు గలవు. శ్రీచక్రమునందు నలుబది నాలుగు కోణములు, ఇరువది ఎనిమిది మర్మ స్థానములు, ఇరువది నాలుగు సంధులు గలవు.   తొమ్మిది త్రికోణములు గలవు గనుక నవయోన్యాత్మక మందురు. ఈ నవ యోనులు నవ ధాతువులై సృష్టి మూలకము లగుచున్నవి. త్వక్కు, రుధిరము, మాంసము, మేధస్సు, ఆస్థి అనునవి ఐదు శక్తి మూలకములు,  ధాతువులు.  మజ్జ,  శుక్రము,ప్రాణము, జీవుడు అను నాలుగు ధాతువులు శివ మూలకములు. మన దేహము నవ ధాతుమయము, నవ యోని సముద్భవము. దశమ యోని బైన్ధవ స్థానము. ఇట్లు పిండాండము, బ్రహ్మాండము వీని వలన జనించినది. పంచ మహా భూతములు, పంచ తన్మాత్రలు,

పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు,మనస్తత్వము, మాయ, శుద్దవిద్య, మహేశ్వరుడు,సదాశివుడు, అను పంచ వింశతి తత్వములు శ్రీచక్రమునందంత ర్భూతములై యున్నవి. శివశక్త్యాత్మకమైన శ్రీచక్రము చరాచర జగత్తునకు సృష్టికి మూలమై యున్నది. షట్చక్ర భేదనముచే శ్రీచక్రోపాసన చేసే శ్రీదేవీ భక్తులకు అణిమాది అష్ట సిద్దులు అతి సునాయాసముగా సిద్ధించును. సిద్ధించే ముందు పరీక్షలు చాలా తీవ్రముగా వుండును. మానసిక, శారీరిక పరీక్షలు వుండును. ఎన్నో రకముల భ్రమలు గల్పించబడును. కంటి ముందు మెరుపు తీగలు మెరియును. చెవులు హోరెత్తును. తల పగలి పోవునట్లుగా వుండును. భరించలేని మాడు పోటు, తల గిర్రున తిరుగును. ఒకే సమయములో శీతోష్ణస్థితులు గలుగును. వున్నది లేనట్టుగా లేనిది వున్నట్టుగా అగుపించును. రకరకాల మాయలు గనిపించును. మనస్సు తీవ్ర భయాందోళనలకు లోనగును. శరీరము తీవ్ర కంపనములకు లోను అగును. శరీరము చెమట పట్టును. వెన్నులోని నాడులు తీవ్రముగా స్పందించును. తరువాత శరీరము నెమ్మదిగా తేలిక అగును. నాగ బంధములో కదలిక గల్గును. మూలాధారములో శక్తి చలనము, ఉత్కీలనము, ఆ తరువాత షట్చక్ర భేదనము.


ఆజ్ఞాచక్రములో త్రికోణ దర్శనము, త్రికోణాంతర దీపికా దర్శనము కలుగును.


 ఆ తరువాత ఆనందమే బ్రహ్మానందం. ఇక మిగతా విషయములు చెప్పకూడదు.


 అతి రహస్యములు. స్వయముగా ఎవరికి వారు అనుభవించి తెలుసుకోవాలి. మొదట సారి మాత్రమే ఈ సాదృశ్యములు అగుపించును. ఆ తరువాత నీ మానసిక, శారీరిక స్థితిగతులను బట్టి, నీకు తెలియకుండానే కుండలినీశక్తి సహస్రారము వరకు గమనము చేయుచూ వుండును. రహస్యమైన విషయమేమంటే సాధకుడు అఖండ బ్రహ్మచర్య నిష్ఠలో, పంచదశీ మంత్ర పునఃశ్చరణ దీక్షలో  వుండవలెను. అప్పుడే ఇది సాధించగలడు. లేనిచో ఇది కుదరదు. గురు ముఖతః దీక్ష తీసుకొన్నవారిలో మాత్రమే ఈ సిద్ధి కలుగును. ఇతరులు ఈ సాధన చేయకూడదు. చాలా తీవ్ర పరిమాణాలు వుంటాయి.


ఎవరికి వారు తమ్ము తాము ఉద్దరించుకోవడానికి మాత్రమే ఈ సాధన చేయవలెను. అన్యధా తగు మూల్యము చెల్లించుకోక తప్పదు. శ్రీవిద్య మోక్ష సాధనకు మాత్రమే అని గుర్తెరుగవలెను.


సాధకుడు అమ్మ పెట్టే పరీక్షలకు నిలబడాలి. సాధన తీవ్రముగా వుండాలి. మధ్యలో చలించగూడదు. ఏకోన్ముఖులై వుండాలి. ఎవరికి ఏయే బలహీనతలు గలవో, అవే పరీక్షలకు తావుగా నిలబడును. మెట్టు మెట్టుకూ చిత్ర విచిత్రమైన పరీక్షలు కల్గును.


'తిలలనుండి తైలము అభివ్యక్తమయినట్లుగనే శివతత్త్వముతో ఏకత్వమును పొందిన పరాశక్తి శివేచ్ఛచేతనే శివతత్త్వమునుండి విడివడి సృష్ట్యాదియందు అభివ్యక్తమగుచున్నది' అని వాయు సంహితయందు గలదు. బ్రహ్మముతో (పరమాత్మతో) అభేదము పొందిన శక్తి (పరమేశ్వరి) బ్రహ్మమేగాని, ఆ శక్తి అన్యముగాదు. ఇదియే శివశక్త్యైక్యము అనబడును. కాని అజ్ఞానులు శక్తివేరు, శివుడు వేరు అని చెప్పుచున్నారు. దీనినే ద్వైతభావన అందురు. శివశక్త్యైక్యము అద్వైతభావన. జ్ఞానుల భావన. వాయువు, దాని చలించే తత్త్వము, అగ్ని, దాని ఉష్ణగుణము రెండును విడదీయరానివి. వాయువు చలనము వేగవంతమయితే, అగ్నియొక్క ఉష్ణగుణము మరింత ఉధృతమగును. ఈ రెండుగుణములు అవినాభావ సంబంధమైనవి. శ్రీచక్ర నిర్మాణము శివచక్రముల మరియు శక్తిచక్రముల కలియికతో ఏర్పడగా, శివశక్త్యైక్యము ప్రకటితమగుచున్నది గనుక శ్రీచక్రనిలయ అయిన పరమేశ్వరి *శివశక్త్యైక్య రూపిణీ* యని అనబడుచున్నది. ఆపైన 'బిందుస్థానము, త్రికోణము కలసినవి, అష్టదళపద్మము, అష్టారము కలసియున్నవి అని చెప్పుచూ, అంత్యమున శివచక్రములు శక్తిచక్రములు అవినాభావబంధయుతముగా నున్నవి' అని బ్రహ్మాండ పురాణమున చెప్పబడినది. ఈ శివశక్త్యైక్యతను తెలిసినవాడే, శ్రీచక్రమననేమియో తెలిసినవాడు అని వక్కాణించవచ్చును. శివశక్త్యైక్యము అనగా అర్ధనారీశ్వరతత్త్వము గనుకనే జగన్మాత *శివశక్త్యైక్యరూపిణీ* యని అనబడినది. శివశక్తులు ఒకటే గనుకనే జగత్కారణము అనగా సృష్టికి మూలకారణము. అమ్మవారు హంస మంత్రస్వరూపురాలు. హంస మంత్రము శివశక్తుల ఏకత్వము తెలియజేయుచున్నది. *హ* (హం) కారము, *స* కారము *(హంస)* అయితే ఇందు *హ* కారము బీజము. అనగా *స* కారము శక్తి అయితే *హ* కారము శివుడు. ఇదియే *హంస* మంత్ర రహస్యము మరియు *శివశక్త్యైక్య* భావన. పృథివియందు ధూమావతీ శక్తి, ఉదకమందు హ్లాదశక్తి, అగ్నియందు భాస్వతీ శక్తి, వాయువునందు స్పందశక్తి, ఆకాశమునందు వైభవశక్తి వ్యాపించియున్నవి. ఈ పంచశక్తులు పంచమహా భూతములందు వ్యాపించి పాంచభౌతిమైన జగత్తు పంచశివశక్తియుతమై ఉన్నది. ఈ జగత్తు పాంచభౌతికము. ఈ పంచభూత శక్తులతో పరమేశ్వరి *శివశక్త్యైక్యరూపిణీ* యని అనబడినది. ఈ శరీరము పాంచభౌతికము. అనగా శివశక్త్యైక్యసామరస్యమయిన దేహము మన శరీరము. 


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం శివశక్త్యైక్య రూపిణ్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: