24, సెప్టెంబర్ 2021, శుక్రవారం

సంస్కృత మహాభాగవతం

 *23.09.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఏడవ అధ్యాయము*


*అవధూతోపాఖ్యానము - పృథివి మొదలుకొని కపోతముల వరకు గల ఎనిమదిమంది గురువుల కథలు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*7.57 (ఏబది ఏడవ శ్లోకము)*


*కపోతీ ప్రథమం గర్భం గృహ్ణతీ కాల ఆగతే|*


*అండాని సుషువే నీడే స్వపత్యుః సన్నిధౌ సతీ॥12482॥*


*7.58 (ఏబది ఎనిమిదవ శ్లోకము)*


*తేషు కాలే వ్యజాయంత రచితావయవా హరేః|*


*శక్తిభిర్దుర్విభావ్యాభిః కోమలాంగతనూరుహాః॥12483॥*


కాలక్రమమున ఆడుపావురము గర్భమును దాల్చెను. పిదప అదీ తన పతి సన్నిధియందే తన గూటిలో గ్రుడ్లు పెట్టెను. అచింత్యమైన కాలశక్తి ప్రభావమున కొంతకాలమునకు ఆ అండములనుండి పిల్లలు బయటికి వచ్చెను. వాటి అంగములు, రెక్కలు మిగుల కోమలములై మనోహరముగా ఉండెను.


*7.59 (ఏబది తొమ్మిదవ శ్లోకము)*


*ప్రజాః పుపుషతుః ప్రీతౌ దంపతీ పుత్రవత్సలౌ|*


*శృణ్వంతౌ కూజితం తాసాం నిర్వృతౌ కలభాషితైః॥12484॥*


*7.60 (అరువదియవ శ్లోకము)*


*తాసాం పతత్రైః సుస్పర్శైః కూజితైర్ముగ్ధచేష్టితైః|*


*ప్రత్యుద్గమైరదీనానాం పితరౌ ముదమాపతుః॥12485॥*


ఆ పావురములజంట మిక్కిలి పుత్రవాత్సల్యముతో (మమకారముతో) తమ పిల్లలను పెంచి పోషించుచుండెను. వాటి లాలన, పాలన అపూర్వరీతిలో నుండెను. అవి తమ పిల్లలయొక్క వచ్చియురాని తీయని కలకలారావములను వినుచు మురిసిపోవుచుండెను. ఆ పక్షులు తమ పిల్లల బుల్లిబుల్లి రెక్కలయొక్క సుఖస్పర్శలకు పొంగిపోవుచుండెను. వాటి ముద్దుముద్దు పలుకులను వినుచు, పిల్లలచేష్టలను చూచుచు అవి పరవశించి పోవుచుండెను. కోమలములైన చిన్ని చిన్ని ఱెక్కలతో అవి ఎగురుచుండగా జూచినప్పుడు వాటి ఆనందమునకు మేరలేకుండెను.


*7.61 (అరువది ఒకటవ శ్లోకము)*


*స్నేహానుబద్ధహృదయావన్యోన్యం విష్ణుమాయయా|*


*విమోహితౌ దీనధియౌ శిశూన్ పుపుషతుః ప్రజాః॥12486॥*


విష్ణుమాయా ప్రభావమున ఆ రెండు పావురములయొక్క హృదయములలో పెనవైచుకొనియున్న ప్రేమాతిశయములు, వ్యామోహములు నిరుపమానములు. అవి తమ పసికందుల పోషణలో మునిగి, ఆ పారవశ్యమున ఈ లోకమునే మరచిపోవుచుండెను.


*7.62 (అరువది రెండవ శ్లోకము)*


*ఏకదా జగ్మతుస్తాసామన్నార్థం తౌ కుటుంబినౌ|*


*పరితః కాననే తస్మిన్నర్థినౌ చేరతుశ్చిరమ్॥12487॥*


ఒకానొకప్పుడు ఆ పెద్దపక్షులు తమ చిన్నారులకు ఆహారమును దీసికొనివచ్చుటకై అడవికి వెళ్ళెను. కుటుంబభారము పెఱుగుటవలన ఆహారపదార్థములను ఎక్కువగా సమకూర్చుకొనవలసియుండెను. అందువలన అవి ఆ వనమునందు నలువైపుల ఎక్కువకాలము తిరుగసాగెను.


*7.63 (అరువది మూడవ శ్లోకము)*


*దృష్ట్వా తాన్ లుబ్ధకః కశ్చిద్యదృచ్ఛాతో వనేచరః|*


*జగృహే జాలమాతత్య చరతః స్వాలయాంతికే॥12488॥*


ఆ సమయమున ఒక కిరాతకుడు వనమునందు తిరుగుచు అనుకొనకుండా ఆ పక్షులగూటి సమీపమునకు చేరెను. అప్పుడు ఆ గూటికి సమీపమున పక్షిపిల్లలు తిరుగాడుచుండగా చూచి, ఆ బోయవాడు వలపన్ని వాటిని బంధించెను.


*7.64 (అరువది నాలుగవ శ్లోకము)*


*కపోతశ్చ కపోతీ చ ప్రజాపోషే సదోత్సుకౌ|*


*గతౌ పోషణమాదాయ స్వనీడముపజగ్మతుః॥12489॥*


*7.65 (అరువది ఐదవ శ్లోకము)*


*కపోతీ స్వాత్మజాన్ వీక్ష్య బాలకాన్ జాలసంవృతాన్|*


*తానభ్యధావత్క్రోశంతీ క్రోశతో భృశదుఃఖితా॥12490॥*


నిరంతరము పిల్లలపోషణలో ఆరాటముతోనున్న కపోతము, కపోతియు ఎట్టకేలకు ఆహారమును తీసికొని తమ గూటికి చేరెను. అంతట ఆడుపావురము వలలో చిక్కుకొనియున్న తమ పిల్లలను చూచి, మిగుల దుఃఖిత అయ్యెను. వలలోపడి, గోడుగోడున విలపించుచున్న తమ పిల్లల దురవస్థను గాంచి, తట్టుకొనలేక అది పరితపించుచు వాటికడకు చేరెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: