🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
. *⚜️పెరియ పురాణం⚜️*
. *నాయనార్ల చరిత్ర - 01*
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
*1. తిరు నీలకంఠ నాయనారు*
వేద బ్రాహ్మణులకు ఆవాసమైన చిదంబరంలో ఒక కుమ్మర కులంలో తిరునీలకంఠ నాయనారు జన్మించాడు. అతడు పరమేశ్వరునిపై అచంచల భక్తి తత్పరతలు కలిగినవాడు.
ఒక పర్యాయం తిరు నీలకంఠ నాయనారు ఒక వేశ్య ఇంటికి వెళ్లి తిరిగివచ్చాడు.
తిరు నీలకంఠుని భార్య ఇది సహించలేకపోయింది. తన
భార్య అలుకను పోగొట్టడానికై నీలకంఠనాయనారు మృదు మధురంగా
మాట్లాడుతూ ఆమెను కౌగలించుకోవడానికి ప్రయత్నించాడు. “మీరు
మమ్మల్ని తాకినట్లయితే తిరు నీలకంఠేశ్వరుని మీద ఆన” అంటూ ఆమె తన భర్తను వారించింది.
తిరు నీలకంఠ నాయనారు తన భార్యను చూసి
“నీవు మమ్మల్ని అని చెప్పడం వలన ఇక మీదట నిన్నే కాదు ఇతర స్త్రీలను
కూడ మాతృమూర్తులుగా భావించి తాకను కూడ తాకను" అంటూ ప్రతిజ్ఞ
చేసి అప్పటి నుండి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాడు. యౌవనప్రాయాన్ని
దాటి వారు ముసలివారయ్యారు.
వారి భక్తి శ్రద్ధలను లోకానికి
తెలియజేయాలనే ఉద్దేశంతో పరమేశ్వరుడు జంగమ వేషంతో అతని ఇంటికి
వచ్చాడు.
మాయాశివుడు తన చేతిలో ఉన్న భిక్షాపాత్రను నీలకంఠుని చేతికి ఇచ్చి "ఇది చాలా అపూర్వమైంది. దీనిని నీ దగ్గర దాచి ఉంచు. మాకు
అవసరమైనపుడు తీసుకుంటాను” అని చెప్పి వెళ్లిపోయాడు.
తిరు నీలకంఠుడు దానిని తన ఇంటిలో ఒకచోట భద్రంగా దాచాడు. శివుడు
నీలకంఠుని వద్దనున్న భిక్షాపాత్రను అదృశ్యమయ్యేలాగా చేశాడు.
కొంతకాలమైన తరువాత శివయోగి నీలకంఠుని దగ్గరికి వచ్చి "పూర్వం
నేను నీదగ్గర దాచి ఉంచిన భిక్షాపాత్రను నాకు తిరిగి ఇవ్వవలసింద”ని కోరాడు.
నీలకంఠుడు ఇల్లంతా వెతికినా భిక్షాపాత్ర కనిపించలేదు.
శివయోగితో "స్వామీ! మీరిచ్చిన భిక్షాపాత్రకు బదులుగా వేరొక అందమైన
భిక్షాపాత్రను ఇస్తాను" అని చెప్పాడు.
శివయోగి కోపంతో "నీవు నా
భిక్షాపాత్రను దొంగలించావు. నీవు దానిని దొంగలించి ఉండకపోతే నీ
భార్య చేతిని పట్టుకొని ఈ కొలనులో మునిగి శపథం చేయమని
కట్టడిచేశాడు. తిరు నీలకంఠుడు తనకు తన భార్యతోగల శపథాన్ని వివరించి
చెప్పి ఆమెతో కలసి కొలనులో మునగడం సాధ్యం కాదని చెప్పాడు.
శివయోగి ఆ మాటలకు కోపావేశుడై తిల్లెలోని బ్రాహ్మణులతో ఫిర్యాదు
చేశాడు. వాళ్లు తిరు నీలకంఠుని పిలిచి "ఈ యోగి చెప్పిన విధంగా నీవు
నీ భార్యతో కలిసి ఈ కొలనులో మునగడం న్యాయమే” అని తీర్పిచ్చారు.
వారు చెప్పిన ప్రకారం భార్యాభర్తలిరువురూ తమ శపథానికి భంగం
రాకుండా ఒక కర్రను చెరొకవైపు పట్టుకొని కొలనులో మునిగారు.
మునిగి లేచిన భార్యభర్త లిరువురూ తమ ముదిమిని పోగొట్టుకొని యౌవనవంతులై
విరాజిల్లారు. శివగామీ సుందరీ సమేతుడై పరమేశ్వరుడు వారికి దర్శనమిచ్చి
“మీరిరువురూ మా సన్నిధిలో నిత్య యౌవనంతో శాశ్వతంగా ఉండగలరు”
అని దంపతులిరువురినీ ఆశీర్వదించాడు.
*ఒకటవ చరిత్ర సంపూర్ణం*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి