శివానందలహరీ
05
స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గాన ఫణితౌ
పురాణే మంత్రేవా స్తుతినటన హాస్యే ష్వచతురహ
కథం రాజ్ఞామ్ ప్రీతిర్భవతి మయి కో2హం పశుపతే
పశుం మాం సర్వజ్ఞ ప్రధితకృపయా పాలయ విభో
సీ. స్మృతి,పురాణములందు, స్తుతి,నాట్యములయందు
శకున , వైద్య , నటన శాస్త్ర మందు
సంగీత ,సాహిత్య, సారస్వతము లందు
చతుర , హాస్య , విదూష వితతు లందు
నేర్పున్న విబుధుండ నే గాను పరమేశ !
భావింప నన్నింట పశువు నేను
అటువంటి నా మీద నవనీపతుల కెట్లు
ప్రేమతో జీరంగ ప్రీతి గలుగు ?
తే. పశువు నగునన్ను పాలించ పరుడు లేడు
పశుపతీ ! నీవు పాలించి భవము నందు
కరుణ తోడను రక్షించి కావు మెపుడు
భక్త మందార ! శంకరా ! పాహి పాహి ! 05 *
06
ఘటోవా మృత్పిండోవా2ష్యణురపి చ ధూమోగ్నిరచల
పటోవా తంతు ర్వా పరిహరతి కిం ఘోరశమనమ్
వృథా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా
పదాంభోజం శంభో ర్భజ పరమసౌఖ్యం వ్రజ సుధీ
సీ. "మట్టి సాధనమౌను మఱి కుండలనుచేయ
నా మట్టి యేర్పడు నణువు వలన
ధూమంబు కొండపై తోచుచుండెను గాన
నచ్చోట తప్పక యనలముండు
ధరణిలో వస్త్రముల్ దారంబు వలననే
నిర్మితం బగుచుండె నిక్కమిద్ది "
యనుచు వ్యర్థంబుగా ననయంబు వాదించి
తర్కించు కొనినచో దక్కు నేది ?
యీ శుష్క వాదన లీతర్క వచనముల్
శమను నాపగలేవు క్షణము గూడ
తే. భవ్యమైనట్టి పరమేశు పాదయుగళి
భక్తి చిత్తాన బట్టంగ భవమునందు
సర్వ పాపంబులన్నియు సమసిపోవు
గరళకంఠ కృపోన్నతిన్ గల్గు ముక్తి. 06
✍️గోపాలుని మధుసూదన రావు శర్మ 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి