16, నవంబర్ 2023, గురువారం

అష్టైశ్వర్యాల గురించిన వివరణ

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*అష్టైశ్వర్యాల గురించిన వివరణ...*


*(ఇరవై తొమ్మిదవ రోజు)*


"నీ వద్ద ఉన్న అష్టైశ్వర్యాల గురించి నీకు తెలుసా?.." అని స్వామివారు అడిగిన ప్రశ్నకు ప్రభావతి గారు కొద్దిగా అయోమయానికి గురయ్యారు..తనకు తెలీదన్నట్లుగా తలూపారు..


శ్రీ స్వామివారు మందహాసం చేస్తూ.."అమ్మా!..ఉన్నత వంశంలో..మంచి తల్లిదండ్రులకు జన్మించటం అన్నది దైవం ఇచ్చిన ఐశ్వర్యం కాదా?..

"ఆ తల్లిదండ్రుల ద్వారా చిన్న వయసులోనే మంత్రోపదేశం పొందటం మహా ఐశ్వర్యం కాదా?.."

"ఉపదేశం పొందిన మంత్రాన్ని విడవకుండా జపించే భాగ్యం ఎంతమందికి కలుగుతుంది..అంతకంటే ఐశ్వర్యం మరోటి ఉందా?.."

"నిన్ను అర్ధం చేసుకుని, నీ మనసు తెలుసుకొని, పరిపూర్ణ ప్రేమను పంచి ఇచ్చే భర్త దొరకడం నీకు లభించిన మహాదైశ్వర్యం కాదా?.."

ఉన్నంతలో చదువు, సంధ్య, రూపు, గుణము కలిగిన బిడ్డలు నీకు ఆ దైవం ఇచ్చిన సంపద కాదా?.."

"నిత్యమూ అతిధి అభ్యాగతులతో కళ కళ లాడే గృహము..అతిధికి అన్నం పెట్టాలనే సదాలోచన మహా ఐశ్వర్యం కాదా?.."

దైవం పాదాల చెంత వుండి.. నిరంతరమూ ఆ సేవ చేసుకునే అవకాశం కలిగివుండటం ఐశ్వర్యమే కదా?.."

అమోఘమైన రచనా శక్తి, పాండిత్యం..నీకు భగవంతుడు అయాచితంగా ప్రసాదించాడు..అదెంతటి భాగ్యమో నీకు తెలీదా?.."

"ఎంత ధనం వెచ్చిస్తే..పైవాటిని నువ్వు కొనగలవు?..చెప్పు తల్లీ!.."


"అమ్మా..కొందరికి అలవిమాలిన ధనం ఉంటుంది..కానీ శరీరం లో వ్యాధులుంటాయి..ఏదీ తినడానికి కుదరదు..మందులతోనే జీవనం కొనసాగించాలి..కొందరికి మానసిక బాధలుంటాయి..భార్యా భర్తల్లో ఒకరికొకరికి అవగాహన లేక..అనుమానాలతో సంసారం చేయలేక చేస్తూ ఉంటారు..ఒకరినిఒకరు మోసగిచ్చుకుంటూ.. ఐహిక సుఖాలకోసం ఎక్కడికో పరుగులెత్తుతూ వుంటారు..కొందరికి సంతానం ఉండదు..అందుకు బాధ..సంతానం వున్నా అవయవ లోపం తో వుంటారు..అది మరో నరకం..ఇలా రకరకాల వ్యక్తులు ధనం వుండికూడా..క్షోభ అనుభవిస్తుంటారు..ధనం ఒక్కటే ఐశ్వర్యం కాదమ్మా..దైవాన్ని ధనం ఇమ్మని అడగడమంత పిచ్చిపని మరోటి లేదు.."


"సరే తల్లీ..నీకు ధనం కావాలా?..ఎంత కావాలో చెప్పు ఇస్తాను..అయితే అందుకు ప్రతిఫలంగా నువ్వు..నీ భర్తను త్యాగం చేస్తావా?..నీ బిడ్డలను వదలుకుంటావా?..నీకు దైవం ఇచ్చిన ఈ వాతావరణాన్ని త్యజిస్తావా?..నీకబ్బిన పాండిత్యాన్ని వదిలేస్తావా?..ఏది త్యాగం చేయగలవో చెప్పు!.." అన్నారు..


శ్రీ స్వామివారి ముఖతా వస్తున్న మాటలు ఒక్కొక్కటీ సూటిగా ప్రభావతి గారినే కాదు..మిగిలిన ఇద్దరికీ తాకాయి..ప్రభావతి గారికి తానెంత ప్రలోభములో పడి ఉన్నదీ గ్రహించేసారు.. ఒక్కక్షణం లోనే ఆవిడ ఒక నిశ్చయానికి వచ్చేసారు..నిజమే..ధనం అవసరమే..కానీ..ధనమే సర్వస్వం.. ధనమే ఐశ్వర్యం కాదు..అది శ్రీ స్వామివారు మనసుకు నాటుకునేలా బోధించారు..


"నాయనా..నాకు దైవం ప్రసాదించిన ఆమోఘ సంపదలలో ఏ ఒక్కటీ వదులుకోను!..ఆర్ధిక బాధలున్నా భరిస్తాను!..సహిస్తాను!..ఇక కలతపడను వాటి గురించి.." అన్నారు మనస్ఫూర్తిగా..


శ్రీ స్వామివారు సంతోషంగా నవ్వారు..శ్రీధరరావు గారు కూడా శ్రీ స్వామివారి వివరణకు సంతృప్తిగా తలాడించారు..


"అమ్మా!..నేను నిన్ను అష్టాక్షరీ మంత్రం రోజూ 108 సార్లు జపించమని చెప్పాను..రోజూ చేస్తున్నావా?..అని శ్రీ స్వామివారు అడిగారు..


"చేస్తున్నాను నాయనా!.." అన్నారు ప్రభావతి గారు.


"అష్టాక్షరీ తిరుమంత్రం నీకు మాలకొండవద్ద ఉపదేశించాను..ఇక ఆ అష్టాక్షరి గురించిన పూర్తి వివరణ నీకు తెలుపుతానమ్మా..శ్రద్ధగా వ్రాసుకో..ఆ కాగితం జాగ్రత్తగా ఉంచుకో!..హృదయస్తం చేయి తల్లీ..అత్యంత గోప్యంగా ఉంచు..అహంకారంతో ఎవరికి పడితే వాళ్లకు చూపకు.." అన్నారు..


మంత్రార్ధము..ఛందస్సు..ఋషి..ఋషిపరంపర.. సర్వం వివరంగా చెప్పారు..ప్రభావతిగారు శ్రద్ధగా వ్రాసుకున్నారు..


ఆ తరువాత..తన బసకు వెళ్లిపోయారు..


శ్రీ స్వామివారి ప్రవర్తన..మాటలు..ఉపదేశం..రేపటి భాగంలో..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx



సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్.. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: