19, మార్చి 2025, బుధవారం

ప్రియ బాంధవా మేలుకో 12*

 *ప్రియ బాంధవా మేలుకో 12*




దేశాభివృద్ధికి ఆయా రంగాల అధినేతలు శ్రమిస్తూ దేశాన్ని అంతర్జాతీయంగా ప్రముఖ స్థానానికి చేర్చడమే గాకుండా ప్రజలకు పలు సౌకర్యాలు కల్పిస్తూ  దైనందిన జీవితంలో వెసులుబాట్లు కల్పిస్తున్నారు. అలాగే దేశంలో  అనైతికతను, అకృత్యాలను నివారించుటకు, నిర్మూలించుటకు తగిన/కఠినమైన అధికార వ్యవస్థ ఉన్నప్పుడు, *సామాజిక ఇబ్బందుల దిద్దుబాటులో  ప్రజల ప్రమేయమేమిటి* అని సభ్యులు అభిప్రాయపడవచ్చును. 


దేశంలోని అధికారిక వర్గం గురించి ఒకసారి సమీక్షించుదాము. భారత ప్రభుత్వ అత్యున్నత స్థానంలో *రాష్ట్రపతి*, భారత రక్షణ వ్యవస్థలో అతి ప్రధానమైనది

 *భారత  సైనిక దళం*, 

ఈ  దళం *రాష్ట్రపతి* ఆధీనంలో ఉంటుంది. భారత సర్వ సైన్యాధ్యక్షుడు *రాష్ట్రపతి*. ఆ తదుపరి పార్లమెంట్ సభ, వరుసగా *ప్రధాన మంత్రి*, కేంద్ర మంత్రి  మండలి, అనుబంధ మంత్రి వర్గము, కేంద్ర కార్యదర్శుల కార్యాలయము *(సెంట్రల్ సెక్రటేరియట్)*, అనుబంధ అధికార సిబ్బంది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అందులో *రాష్ట్ర గవర్నర్*, శాసన సభ, *ముఖ్య మంత్రి* మంత్రి మండలి, రాష్ట్ర కార్యదర్శుల కార్యాలయము *( State Secretariat)*, అనుబంధ అధికార యంత్రాంగము. *స్థానిక పరిపాలనా సంస్థలలో* నగర పంచాయతీ కార్యాలయము, పురపాలక సంస్థ, జిల్లా పరిషత్తు ఇత్యాది పాలనా సంస్థలు తత్సంబంధ  అధికార సిబ్బంది.


దేశ మరియు సామాజిక భద్రతా, సుఖ మరియు శాంతియుత జీవనానికి హానికారక అంశాల మరియు కృత్యాల నిరోధక శాఖలు లేదా విభాగాల గురించి *మాత్రమే* పరిశీలిద్దాము.


1) *పోలీసు శాఖ* శాంతి భద్రతల సంరక్షణ, నేరాల, విధ్వంసాల కట్టడి, పౌరుల మరియు వారి ఆస్తుల రక్షణ, పకడ్బందీగా చట్టం అమలు,  ప్రజా భద్రత నేరాల నిరోధము, విధులలో భాగంగా దివా రాత్రముల పెట్రోలింగ్, అనుమానితులను ప్రశ్నించడం, సాక్షాలను సేకరించడం. అవసరమైనప్పుడు  సామాజిక రక్షణకు ఆయుధాలను ఉపయోగించడం. *విధ్వంసాలు ఆగినాయా. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలగడం లేదా*.  అన్ని రకాల ఇబ్బందులకు ప్రజలు దూరంగా ఉన్నారు అని ఘంటాపథంగా  చెప్పగలమా!!.

 *ప్రస్తుతము గూడా సామాజిక నేరాలకు, ఘోరాలకు కొదవలేదు* అనునది ప్రజా వాక్యం. *పోలీసు విభాగం పని చేయుట లేదా అంటే.. ఇంగిత జ్ఞానమున్న వారెవరైనా లేదు అని చెప్పరు...చెప్పలేరు.* పోలీసు విభాగము తమ విధులు నిర్వహించుచునే ఉన్నది. పోలీసు శాఖ మరింత ప్రతిభావంతంగా, క్రియాశీలంగా వృత్తి ధర్మాలు నిర్వహించాలంటే ప్రజల సహకారం కావాలి.

 నైతికంగా ప్రజా చైతన్యం వెల్లి విరిసిన  మరియు జన సమైక్యత బలపడిన చోట, *ప్రభుత్వ విభాగాలలో కూడా అనైతికులు, స్వార్థపరులు లేనినాడు, దుర్మార్గులు, దుష్టులు భయపడతారు.*


ధన్యవాదములు

*(సశేషం)*

కామెంట్‌లు లేవు: