🙏మానవల్లి రామకృష్ణ కవి 🙏
రామకృష్ణ కవి 1866లో మద్రాసు లోని నుంగంబాక్కంలో తెలుగు బ్రాహ్మణ పండిత కుటుంబంలో జన్మించారు. ఈయన త్యాగయ్య, గంగాధరశాస్త్రి, నరసింహశాస్త్రి వంటి సంస్కృత పండితుల వంశానికి చెందినవారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి తెలుగు, సంస్కృతం లలో ఎం.ఏ. పట్టా పొందారు. పదహారేళ్ళ వయసులో మృగవతి అనే కవితను వ్రాసి, కవి అనే బిరుదును పొందారు. కొన్నాళ్ళ పాటు మద్రాసులోని ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారములోనూ, ఆ తరువాత వనపర్తి సంస్థానంలో ఆంతరంగిక కార్యదర్శిగానూ పనిచేశారు. తాళపత్రాలను సేకరించడం ప్రారంభించి అభినవ భారతి వంటి అనేక కనుమరుగైన కృతులను వెలుగులోకి తెచ్చారు. 1916 లో నిడదవోలు వెంకటరావు ఇంట్లో బసచేసి, నాట్యశాస్త్రాన్ని, దాని టీకా తాత్పర్యాన్ని నకలు వ్రాశారు. 1916 లో ప్రాచ్యలిఖిత భాండాగారము యొక్క అసిస్టెంట్ క్యూరేటర్ పదవిని పొందారు. 1940 లో శ్రీవేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనా సంస్థలో రీడరుగా నియమించబడి, అక్కడే 1951 దాకా కొనసాగారు.
రామకృష్ణ కవి 1957లో 91 యేళ్ళ వయసులో తిరుపతిలో మరణించారు. అవసానదశలో కఠిన దారిద్ర్యాన్ని అనుభవించి వీధుల వెంట భిక్షాటన చేస్తూ తిరిగారు.
రాయలసీమ ప్రాంతానికి ఉద్యోగ రీత్యా వచ్చి స్థిరపడిన రామకృష్ణ కవి 1933లో టీటీడీ విద్యాశాఖాధికారిగా పనిచేశారు. ఈయన సంస్కృతంలో శూద్రకుని 'వత్సరాజు చరిత్రమ్'ను మానవల్లి 'వత్సరాజు చరిత్ర' అన్న నవలగా వ్రాశారు. రామకృష్ణ కవి తాళపత్ర గ్రంథాల సేకరణకు ఊరూరా తిరిగేవారు. కొందరు యజమానులు ఆ గ్రంథాలను ఇవ్వటానికి ఒప్పుకునేవారు కాదు. అప్పుడు ‘ఊరికే చూసి ఇస్తాన’ని చెప్పి, వాటిని ఏకాగ్రతతో చదివి, బసకు వచ్చిన తర్వాత తాను చదివినదాన్ని అక్షరం పొల్లుపోకుండా రాసేవారట.
కుమార సంభవం
కుమార సంభవం కావ్యాన్ని కనుక్కొని, పరిష్కరించి అజ్ఞాత వాసంనుంచి బయటకు తీసుకువచ్చి, ప్రచురించిన ఖ్యాతి మానవల్లి రామకృష్ణ కవికి చెందుతుంది. అప్పటివరకు వరకూ తెలుగు సాహిత్యంలో నన్నెచోడుడనే కవి ఒకడున్నాడనే సంగతే ఎవరికీ తెలియదు. ఇతర కవులెవ్వరూ నన్నెచోడుని గురించి గానీ, అతని కుమార సంభవ కావ్యం గురించి గానీ, పూర్వ కవి ప్రశంసల్లో గానీ మరెక్కడా గానీ ఒక్క ముక్క కూడా వ్రాయలేదు. తంజావూరులోని సరస్వతీ మహల్ గ్రంథాలయంలో ఒక మూలపడి ఉన్న తాళపత్ర గ్రంథాన్ని కనుగొని, దానిని పరిష్కరించి 1909లో ఈ గ్రంథాన్ని ప్రకటిస్తూ నన్నె చోడుడు నన్నయ కంటే ముందువాడని రామకృష్ణ కవి చేసిన ప్రతిపాదన పండిత లోకాన్ని ఎంతటి ఆశ్చర్యానికి గురి చేసిందంటే, ఈ ప్రతిపాదన మీద చర్చలూ, ఉపచర్చలూ, వాదోపవాదాలూ బాగానే జరిగాయి.
కుమార సంభవం లో పోర్చుగీసు పదాలు, డచ్చి పదాలు ఉన్నాయి పోర్చుగీసు వారు 17 శతాబ్దం వచ్చారు. అని కోర్లపాటివారు సోదాహరణంగా వివరిస్తూ నన్నెచోడుని కుమారసంభవము ప్రాచీన గ్రంథమూ! అనే పుస్తకం వ్రాశారు.కుమార సంభవం మానవల్లి వారే వ్రాశారు అని నాకు అనిపించింది. ఆ పుస్తకం నేను చదివాను
-రామకృష్ణ కవి రాసి నన్నెచోడుని పేరు పెట్టాడని కొర్లపాటి శ్రీరామమూర్తి పుస్తకం వ్రాసినా చాలామంది పరిశోధకులు ఆమోదించలేదు. ఇప్పటికి ఇంకా వివాదాస్పదంగా ఉంది.. కుమారసంభవంపై ఇంకా పరిశోదనలు జరిపి నిజనిర్దారణ చెయ్యాలి. ముఖ్య విషయం ఏమిటంటే మానవల్లి వారు కుమార సంభవం తాళపత్ర ప్రతిని ఎవ్వరికి చూపలేదు .కొంతమంది పండితులు అడిగినా దాటావేశారు ఇది నిజం.
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి