*తిరుమల సర్వస్వం- 182*
*సప్తగిరులు -1*
*ఏడు పడగలే ఏడుకొండలు*
ఎన్నో యుగాల నుండి, వైకుంఠం లోని క్షీరాబ్ధిలో శయ్యగా, తల్పంగా, ఛత్రంగా, మరెన్నో రకాలుగా శ్రీమహావిష్ణువుకు సేవలందిస్తున్న ఆదిశేషుడు, శ్రీవేంకటేశ్వరుని రూపంలో వెలసిన విష్ణుమూర్తిని భూలోకంలో కూడా సేవించదలచి, తన ఏడుపడగలను ఏడుకొండలుగా అవతరింపజేసి, వాటిపై శ్రీనివాసుణ్ణి కొలువుంచుకొన్నాడని పురాణాల్లో చెప్పబడింది.
వందలకొద్దీ మైళ్ళ పొడవున్న శేషాచల పర్వతశ్రేణులలో..... *తిరుమల ప్రాంతాన్ని ఆదిశేషువు శిరస్సు లేదా పడగలు గాను; అహోబిలం, మహానంది, త్రిపురాంతకం ప్రాంతాన్ని ఆదిశేషువు యొక్క నడుము భాగంగానూ : శ్రీశైలశిఖరాలను ఆదిశేషువు యొక్క తోకగాను భక్తులు భావిస్తుంటారు.*
శేషాచలసానువులన్నీ శ్రీవారికి నెలవులే! ఆ పర్వత ప్రాంతాలన్నింటినీ తరచూ పర్యటిస్తూనే ఉంటారు. పద్మావతీపరిణయ సందర్భంలో, పెండ్లిభోజనాల పంక్తులు శేషాచలశ్రేణుల్లో తిరుమలనుండి, అహోబిలం మీదుగా శ్రీశైలం వరకు విస్తరించి యున్నట్లు మనం ఇంతకుముందే తెలుసుకున్నాం.
*కట్టెదుర వైకుంఠము కాణాచయినకొండ*
*తట్టెలాయ మహిమలే తిరుమల కొండ ||*
*వేదములే శిలలై వెలసిన కొండ*
*యేదెస పుణ్యరాసులే యేరులైనదికొండ*
*గాదిలి బ్రహ్మది లోకముల కొనలకొండ*
*శ్రీ దేవుడుండేటి శేషాద్రి యీకొండ*
అన్న కీర్తనలో అన్నమాచార్యుడు సప్తగిరుల పౌరాణిక ప్రాశస్త్యాన్ని, మహత్యాన్ని కళ్ళకు కట్టినట్లు ఇలా వర్ణించాడు -
*కళ్ళెదుటే కానవచ్చే కలియుగవైకుంఠం లాంటి తిరుమలకొండ మహా మహిమాన్వితమైనది. బ్రహ్మాది లోకాలతో సమమైన ఈ కొండపై చతుర్వేదములు బండశిలలు గాను, సమస్తదేవతల యొక్క పుణ్యరాశులు సెలయేళ్ళు గాను అవతరించి ఉన్నాయి. ఈ శేషాద్రిపర్వతంపై దేవదేవుడు వెలసియున్నాడు. పూర్వపు యుగాలలో సైతం అంజనాద్రిగా పిలువబడే ఈ పొడవాటి కొండపై సర్వదేవతలు, గంధర్వులు మృగజాతుల, వృక్షాల రూపంలో అవతరించి యున్నారు. కోరిన వరాల నొసగే ఈ కొండ స్వర్ణకాంతులీనుతూ, సర్వసంపదలకు ఆలవాలమైన గుహలతో నిండి ఉండి, 'వెంకటాద్రి' నామంతో అలరారుతున్నది.*
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం లోనూ, శ్రీనివాస గద్యంలోనూ సప్తగిరుల ప్రస్తావన కానవస్తుంది.
ఈ కొండలు....
*శేషశైలము,*
*గరుడాచలము,*
*వెంకటాచలము,*
*నారాయణాచలము,*
*వృషభాచలము,*
*వృషాచలము,*
*అంజనాచలము.*
- అనే లోక ప్రసిద్ధమైన నామాలతో ఒప్పారుతున్నాయి.
'అచలము' అనగా 'చలించనిది' లేదా 'పర్వతము' అని అర్థం. పర్వతానికి 'అద్రి' అనే మరో పేరు కూడా ఉండటం వల్ల, వీటిని 'శేషాద్రి', 'గరుడాద్రి' మొదలగు పేర్లతో కూడా పిలుస్తారు. పూర్వ యుగాలన్నింటి లోనూ కొద్దిపాటి మార్పులతో, సప్తగిరులన్నీ ఇవే పేర్లతో పిలువబడుతుండేవి.
సప్తగిరులలో ప్రతి పర్వతానికి యుగయుగాల ప్రశస్తి, అయా యుగాలలో వినతికెక్కిన పుణ్యపురుషులతో విడదీయరాని అనుబంధం ఉన్నాయి. వివిధ పురాణాల్లో విస్తృతంగా వర్ణించబడ్డ ఆయా గిరిరాజాల వైశిష్ట్యాన్ని ఒక్కొటొక్కటిగా పరికిద్దాం.
*వృషభాద్రి లేదా వృషభాచలం*
ఒకానొకప్పుడు, వెయ్యి వృషభాల శారీరక దృఢత్వం కలిగిన 'వృషభుడు' అనే దైత్యుడు ఈ కొండపై నివసించేవాడు. శ్రీమహావిష్ణువుకు పరమభక్తుడైన ఆ అసురుడు తన ఇష్టదైవాన్ని కటాక్షింప జేసుకోవడం కోసం ఘోరమైన తపస్సునాచరించాడు. ప్రతిదినము తుంబుర తీర్థంలో స్నానమాడి, నిరాహారుడై, ఐదువేల సంవత్సరాలు తపమాచరించడం వల్ల విష్ణువు కృపతో ఆ రాక్షసుడు మరింత శక్తివంతుడయ్యాడు. ఆ రాక్షసుడు శ్రీహరిని అర్చించే విధానం విలక్షణంగా, అద్వితీయంగా ఉండేది.
ప్రతి దినము తన శిరస్సును తన ఖడ్గచాలనంతో తానే స్వయంగా తెగనరకుకొని, ఆ శిరస్సును భగవంతునికి భక్తితో సమర్పించేవాడు. తదనంతరం తన తపఃశక్తితో, శ్రీహరి కటాక్షంతో; విగతజీవి అయిన తన మొండానికి తలను తిరిగి జత చేసేవాడు. అతని అచంచల భక్తికి, ప్రాణాధారమైన శిరస్సును సైతం తృణప్రాయంగా అర్పించ గలిగిన అతని చొరవకు ముగ్ధుడైన శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై భక్తవాత్సల్యంతో, కావలసిన వరాన్ని కోరుకోమన్నాడు.
ఇహలోక సంపదలు, జన్మరాహిత్యము, కైవల్యము ఇవేమీ కోరకుండా; తన సహజసిద్ధమైన దౌత్యప్రవృత్తితో, అహంభావంతో శ్రీమహావిష్ణువును తనతో ద్వంద్వయుద్ధం చేయవలసిందిగా వరం కోరాడు. తాను ఇచ్చిన వరానికి కట్టుబడిన శ్రీమహావిష్ణువు, రాక్షసుని కోర్కె తీర్చే నిమిత్తం అతనితో ఇరవయ్యేడేళ్ల పాటు సలిపిన యుద్ధంలో ఆ అసురుడు పరాజితుడవుతాడు. శ్రీహరి చేతిలో మరణం పొందటం కూడా తన సుకృతంగా భావించిన వృషభాసురుడు, తన చిట్టచివరి కోరికగా తాను 5000 సంవత్సరాలు తపమాచరించి, శ్రీమహావిష్ణువును ప్రత్యక్షం చేసుకొని, శ్రీహరితో యుద్ధం చేసిన సంగతి సమస్త లోకాలకు, భావితరాల వారికి తెలిసేటట్లుగా, వారిరువురు యుద్ధం చేసిన ఆ పర్వతరాజానికి తన పేరు వచ్చేటట్లుగా అనుగ్రహించమని శ్రీహరిని వేడుకున్నాడు. భక్తసులభుడైన శ్రీమహావిష్ణువు దైత్యభక్తుని కోరిక నెరవేర్చడంతో; అప్పటినుండి ఈ పర్వతం వృషభాద్రిగా పేరుగాంచింది.
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి