19, మార్చి 2025, బుధవారం

శ్రీమద్ భాగవతం*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(78వ రోజు)*

   *(క్రితం భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

          *కృష్ణావతారం* 

 *కంసుడు*, *శ్రీకృష్ణ జననం*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*కొన్నాళ్ళకి నారదమహర్షి, కంసుణ్ణి సందర్శించాడు. ఆ మాటా ఈ మాటా చెబుతూ వసుదేవాది యాదవులూ, దేవకీ మొదలయిన యదు వనితలంతా దేవతలని చెప్పాడు.*


*దేవకి గర్భాన శ్రీమహావిష్ణువు జన్మించనున్నాడని చెప్పి, అతడే కంససంహారానికి పూనుకుంటాడని తెలియజేశాడు.*


*తట్టుకోలేకపోయాడు కంసుడు. గతజన్మలో తాను కాలనేమి అని తెలుసుకున్నాడతను. రాక్షసుణ్ణని కూడా తెలుసుకున్నాడు. రాక్షసులకూ, దేవతలకూ ఉన్న బద్ధవైరాన్ని తలచుకున్నాడు. తప్పదు, వసుదేవాది యాదవులందరినీ తుదముట్టించాలనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం, దేవకీ వసుదేవుల్ని బంధించాడతను. సంకెళ్ళు వేసి, చెరసాలలో ఉంచాడు. చంపకుండా వదలివేసిన దేవకి తొలి సంతానం కీర్తిమంతుణ్ణి అప్పుడు నిర్దాక్షిణ్యంగా సంహరించాడు.*


*లంబుడు, ప్రలంబుడు, చాణూరుడు, ముష్టికుడు, తృణావర్తుడు, అఘాసురుడు, అరిష్టుడు, ద్వివిదుడు, కేశి, ధేనుకాసురుడు, పూతనలాంటి రాక్షసులను చేరదీసి తనని తాను కాపాడుకునేందుకు ప్రయత్నించసాగాడు కంసుడు.*


*కారాగారంలో జన్మించిన దేవకీ వసుదేవుల బిడ్డలు ఒకొక్కరినీ పొట్టన పెట్టుకుంటూ రాసాగాడు. అంతటా కట్టుదిట్టం చేసుకున్నాడు. చెరసాలలో భటుల్ని కాపలా పెట్టాడు. దేవకికి బిడ్డ పుట్టీపుట్టగానే ఆ వార్తను తనకి చేర్చాలి. వార్త చేరిన మరుక్షణం కంసుడు అక్కడకి వచ్చేవాడు. తన ఖడ్గానికి ఆ బిడ్డను బలి చేసేవాడు.*


*పుత్రశోకంతో దేవకీ వసుదేవులు కుమిలిపోసాగారు. నీవే దిక్కు అంటూ శ్రీమహావిష్ణువుని ధ్యానించసాగారు.*


*కంసుని హింసలు భరించలేక యాదవులు చాలా మంది మధురానగరం విడచిపెట్టేశారు. కురు, పాంచాల, కేకయ, సాల్వ, విదర్భ, నిషధ, విదేహ, కోసలదేశాలకు తరలిపోయారు.*


*ఏడవసారి గర్భం ధరించింది దేవకి. భగవంతుని ఆజ్ఞానుసారం ఆదిశేషుడు భువిలో అవతరించాల్సి ఉంది. ఆ కారణంగానే అతడు, దేవకి గర్భంలో ప్రవేశించాడు.*


*యోగమాయను పిలిచాడప్పుడు విష్ణుమూర్తి. ఇలా చెప్పాడామెకు.‘‘నువ్వు తక్షణం వ్రేపల్లెకు వెళ్ళు. అక్కడ వసుదేవుని భార్య రోహిణి ఉన్నది. ఆమె గర్భంలో దేవకి గర్భాన ఉన్న తేజస్సును చేర్చు. త్వరలో నేను దేవకి గర్భాన జన్మిస్తాను. నేను జన్మించకముందే నువ్వు, నందుని భార్య యశోదగర్భాన జన్మించు.’’*


*వసుదేవుని భార్య రోహిణి, ఇంకొందరు కంసుడికి భయపడి, వ్రేపల్లెలో తలదాచుకున్నారు.*


*యోగమాయ వ్రేపల్లెకు చేరుకుంది. దేవకీ గర్భాన ఉన్న ఆదిశేషుని తేజస్సును ఆకర్షించి, దానిని రోహిణి గర్భంలో ప్రవేశపెట్టింది. ఆ విధంగా రోహిణికి జన్మించినవాడే బలరాముడు. కృష్ణుడికి అగ్రజుడయ్యాడతను. దేవకి గర్భం నుండి సంకర్షించి, రోహిణికి చేర్చడంతో అతనికి ‘సంకర్షణుడు’ అని పేరు వచ్చింది. లోకరమణీయుడు కావడంతో ‘రాముడు’ అని, మహాబలాఢ్యుడు కావడంతో ‘బలుడు’ అని అతన్ని వ్యవహరిస్తూ వచ్చారు.*


*గర్భంలోని తేజస్సు పోవడంతో తనకి గర్భస్రావం అయిందని తలచింది దేవకి. అందుకు చాలా దుఃఖించిందామె. కొంతకాలానికి అష్టమగర్భం ధరించింది. శ్రీమహావిష్ణువు ఆమె గర్భంలో ప్రవేశించాడు. ఫలితంగా దేవకి అమిత తేజస్సుతో ప్రకాశించసాగింది. దివ్యతేజస్సుతో వెలిగిపోతున్న దేవకిని చూసి అంతా ఆశ్చర్యపోసాగారు.*


*ఆ వెలుగు చూసి కంసుడు భయపడ్డాడు. దేవకి గర్భంలో విష్ణుమూర్తి ప్రవేశించిన కారణంగానే ఆమె అంతటి వెలుగులీనుతున్నదని గ్రహించాడతను. పుట్టగానే ఆ బిడ్డను సంహరించాలనుకున్నాడు. కారాగారం దగ్గర కాపలాను మరింత కట్టుదిట్టం చేశాడు. దేవకి ప్రసవించిన మరుక్షణం తనకి ఆ సంగతి తెలియజేయాల్సిందిగా ఆజ్ఞాపించాడు. మహావిష్ణువు మాయలు అంతు చిక్కవని, వేయికళ్ళతో జాగ్రత వహించమని పదే పదే చెప్పాడు.*


*దేవకిగర్భాన మహావిష్ణువు జన్మించనున్నాడని బ్రహ్మాది దేవతలు తెలుసుకున్నారు. ఇంద్రాదులు, నారదుడు సహా వారంతా అదృశ్యంగా భూలోకానికి తరలివచ్చారు. దేవకి గర్భంలో ఉన్న విష్ణుమూర్తిని స్తుతించారు. అనేక విధాల కీర్తించారతన్ని. భూలోకంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణ జరుగుతుందని సంతోషించి నిష్క్రమించారు.*


*దేవకికి నవమాసాలూ నిండాయి. శ్రావణమాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథినాడు అర్ధరాత్రి రోహిణీనక్షత్రయుక్త వృషభలగ్నంలో కృష్ణుడు జన్మించాడు.*


*గ్రహ నక్షత్ర తారకలన్నీ సౌమ్యులై వెలిగిన మహాద్భుత క్షణం అది. సకలలోకాలకూ మంగళప్రదమయిన సమయం అది. కృష్ణుడు అవతరించగానే దేవదుందుభులు మ్రోగాయి. పూలవాన కురిసింది. గంధర్వులు గానం చేశారు. విద్యాధరాంగనలు, అప్సరసలు నాట్యం చేశారు. పరిమళభరితంగా గాలి వీచింది. సకలప్రాణి కోటీ సంతోషించింది. ఎందుకు ఆ సంతోషం అన్నది అంతుచిక్కలేదెవరికీ.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

కామెంట్‌లు లేవు: