13, జనవరి 2026, మంగళవారం

భోగి పండుగ రోజు

 భోగి పండుగ రోజు చిన్నారుల తలల మీద రేగు పండ్లను మాత్రమే పోస్తారు..... మిగతా ఏ పండ్లనూ పోయరు ..... ఎందుకో మీకు తెలుసా...........? 

అయితే ఒక్కసారి దీనిని చదవండి.


బోగి పండ్లు అంటే రేగుపండ్లు. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండుగ. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపండ్లతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. సూర్య భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో బోగిపండ్లు పోస్తారు.


అంతేగాక మన శాస్త్రాలలో ఏమున్నదంటే...........


రేగు పళ్ళని సంస్కృతంలో బదరీ ఫలాలంటారు. పూర్వం నర నారాయణులు బదరీ వనంలో తపస్సు చేశారు. అక్కడ తపస్సు చేసుకుంటూ వాళ్ళు రోజూ చుట్టుపక్కలవున్న చెట్లనుంచి ఒక్క రేగు పండుని ఆహారంగా తీసుకునే వాళ్లు. 


సాక్షాత్తూ నారాయణుడు అక్కడ తిరుగుతూ, రేగు పళ్ళని తింటూ, ఆ ప్రదేశాల్నీ, వృక్షాలనీ, వనాన్నీ స్పృశించి ఆశీర్వదించారు. ఆ ప్రదేశమే బదరీ క్షేత్రం.


బదరీ ఫలాలు నారాయణుడిచే స్పృశించబడి సాక్షాత్తూ ఆ దేవ దేవుని ఆశీస్సులు పొందాయి కనుక ఆ పళ్ళను ఎవరు వాడినా సిరిసంపదలు, భోగ భాగ్యాలతో తులతూగుతారంటారు. అందుకే భోగినాడు పెద్దవారు పిల్లలకి భోగి పళ్ళుపోసి ఆశీర్వదిస్తారు. 


వారి ఆశీర్వచనాలతోబాటు ఆ నారాయణుడి ఆశీస్సులు కూడా వారికి అందుతాయనే నమ్మకంతో పురాణ కాలం నుండి దీనిని ఆచరిస్తూ వస్తున్నారు.

కామెంట్‌లు లేవు: