25, జనవరి 2026, ఆదివారం

సత్సంగం

 *సత్సంగం* 🚩


*సుశీలో మాతృపుణ్యేన, పితృపుణ్యేన బుద్ధిమాన్,* 

*ధార్మికో పూర్వపుణ్యేన, స్వీయపుణ్యేన భాగ్యవాన్* 


*అందరికీ వారి పిల్లలు చక్కగా, నలుగురు మెచ్చుకునేలా ఉండాలనే కోరిక ఉంటుంది. అది సహజం కూడాను.  కానీపిల్లలు బాగుండాలంటే, తల్లితండ్రులు కూడా ఎలా ఉండాలో చెప్తోంది ఈ శ్లోకం.*


*భావం: ఇది ఒక సుభాషితం, అంటే చక్కని సూక్తి. "తల్లి చేసుకున్న పుణ్యం వలన పిల్లలు మంచి శీలవంతులవుతారు. తండ్రి చేసిన పుణ్యం వలన చక్కటి బుద్ధిమంతులవుతారు. గతంలోనూ, గతజన్మల్లోనూ చేసుకున్న పుణ్యం ఫలితంగా ధర్మాత్ములవుతారు. తాను స్వయంగా చేసుకున్న పుణ్యవిశేష ఫలితంగా భాగ్యవంతులవుతారు."*


*పిల్లలు అంటే భావితరానికి వారసులు. వారు సౌశీల్యంతో ఉంటే, భావి సమాజంలో సంస్కృతీ, సంప్రదాయాలు బావుంటాయి. సమాజంలో  గౌరవాదరాలు పొందుతారు.*


*తల్లి పెంపకంలో సౌశీల్యమూ, సహనమూ గురించి తెలుసుకుంటే, తండ్రి పెంపకంలో బుద్ధీ, వివేకం నేర్చుకుంటారు పిల్లలు. ఆ తరువాత తన వివేకం, విచక్షణలతో ధర్మాధర్మ విశ్లేషణ చేసి ధర్మకార్యాలు చేయగలుగుతారు.*


*'ఉత్తమం స్వార్జితం విత్తం' అని ధర్మశాస్త్రం చెప్తోంది కదా, ఆ విధంగా ధర్మార్జన చేసి భాగ్యవంతులవుతారు.*


*కనుక పిల్లలు సౌశీల్యంతో, బుద్ధిమంతులై, ధర్మపరులై, భాగ్యవంతులు కావాలంటే, ముందు తల్లితండ్రులు పుణ్యకార్యాలు చెయ్యాలి, ధార్మిక వర్తన అలవరచుకోవాలి.*


*ఇటువంటి సూక్తులు విని ఆచరిస్తే, వ్యష్టి, సమష్టి జీవితాలు బాగుంటాయి. వ్యష్టి అంటే వ్యక్తిగత, సమష్టి అంటే సామాజిక.*


*కనుక మనం నలుగురూ మెచ్చుకునే మార్గంలో నడుద్దాం, మన పిల్లలనూ అదే మార్గంలో నడిపిద్దాం. భావితరాలకు చక్కని సమాజాన్ని సిద్ధం చేద్దాం.*


*జై భారత్*🚩

కామెంట్‌లు లేవు: