18, జూన్ 2023, ఆదివారం

శ్రీ కర్కటేశ్వరస్వామి ఆలయం

 🕉 మన గుడి : 



⚜ కడప జిల్లా : గుండాలకొన


⚜ శ్రీ కర్కటేశ్వరస్వామి ఆలయం


💠అడవుల అందాలు చెప్పలేనివి. ఎందుకంటే చుట్టూరా విస్తరించిన పచ్చిక బయళ్లు, ప్రకృతి సోయగాలు వీటి సొంతం.వీటిని చూస్తేనే తెలీని ఆనందం ప్రతీ అణువులోనూ ప్రసరిస్తుంది. 


💠 మన దగ్గర ఉన్న అడవుల విషయానికొస్తే శేషాచలం అడవులు, నల్లమల్ల అడవులు. శ్రీశైల మల్లికార్జునుడు నల్లమల్ల అడవులలో,

 శ్రీ వెంకటేశ్వరుడు శేషాచలం అడవులలోనే కొలువై ఉన్నారు. 


💠 అందమైన జలపాతాలకు నెలవైన కడప జిల్లాలో ప్రకృతి అందాలకు కొదవే లేదు. 

ఎత్తైన కొండలు, లోతైన జలపాతాలు..ఇక అడవుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.వీటితో పాటు దర్శనీయ రమణీయ స్థలాలు చాలా ఉన్నాయి.

దక్షిణ భారతదేశంలోనే పేరెన్నికగన్న దేవుని కడప ఆలయం కొలువైంది కడపలోనే. 

అంతే కాదు, జిల్లాలోనే ఎత్తైన జలపాతం కూడా ఇక్కడే ఉంది. అదే పాలకొండ జలపాతం. అలాగే లంకమల జలపాతం. తౌలాంతపూరం జలపాతం, గుండాలకోన జలపాతం.


💠 ఆంధ్రప్రదేశ్, కడప జిల్లాలోని చిట్వేలి మండలంలోని ప్రసిద్ధ శైవక్షేత్రమైన గుండాలకోనలో గుండాలఈశ్వరుడు ఎండ్రకాయ రూపంలో ప్రత్యక్షంగా దర్శనం ఇస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం..


💠 విశ్వామిత్రుడు ప్రతిష్ఠించిన గుండాలేశ్వరస్వామి ఆలయ ప్రాంతమే గుండాలకోనగా ప్రసిద్ధి చెందింది. 

ఈ గుండంలో మునిగితే సర్వపాపాలు తొలగిపోతాయని, దెయ్యాలు వదులుతాయని, సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ గుండం పక్కనే గుహ వుంది.

ఈ గుహలో గుండాల ఈశ్వరుడు ఎండ్రకాయ రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారు. 

గుహ ద్వారంలో భక్తులు పూజలు, ఫలాలు ఉంచుతారు. వాటిని ఎండ్రకాయ లోనికి తీసుకుపోతే తమ కోర్కెలు నెరవేరినట్లుగా భక్తులు భావిస్తారు. 


💠 ఈ కర్కాటకం ఒకొక్క సందర్భంలో ఒక్కొక్క సైజులో కూడా కనిపిస్తూ కోరిన వారి కోర్కెలు తీరుస్తాడు. ఇక్కడి గుండంలో మునిగి దేవున్ని దర్శించుకుంటే పాపాలు పోతాయని పూర్వీకులు నమ్మకం. ఒక్కసారి గుండాలలో స్నానమాచరిస్తే అప్పటి వరకు ఉన్న బడలిక మటుమాయమవుతుందని వైద్యులు సైతం అంటున్నారు.


💠 పార్వతీపరమేశ్వరుల నిలయమైన 'గుండాలకోన’ అత్యంత పవిత్రమైన స్థలంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రదేశంలో కర్కాటకం రూపంలో సజీవంగా దర్శనమిచ్చే స్వామిని దర్శించుకోవడానికి కార్తీక మాసంలోని సోమవారాల్లో అధిక సంఖ్యలో వెళుతుంటారు. ప్రత్యేకించి 3వ సోమవారం ఎక్కువ మంది వెళుతుంటారు.


💠 గుండాల కోనలో ఆ పరమేశ్వరుడు కర్కాటక రూపంలో ఎన్నో సంవత్సరాల నుండి ఉండటం ఒక పెద్ద విశేషం. తుంగా రాఘవయ్య మరియు మరికొందరు భక్తులు కలసి ఈ ప్రదేశంలో రాత్రుళ్ళు నిద్రచేయగా తెల్లవారు జామున స్వామివారి పుటు దగ్గర నుంచి మంగళ వాయిద్యాలు వినిపించాయని అంటారు.


⚜ స్థల పురాణం ⚜


💠  శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాముల వారి మనుమరాలైన శ్రీ ఈశ్వరమ్మను వివాహం చేసుకోగోరి నిరాకరణకు గురైన రంగరాజు (నగరిపాడు రంగనాయకుల స్వామి) కొంతకాలం ఈ గుండాలకోనలోనే తపస్సు చేశారు. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఎండ్రకాయరూపంలో భక్తులకు దర్శనమిస్తానని చెప్పాడని చెబుతారు. అయితే స్వామిని దర్శించుకోవాలంటే ఎన్నో ప్రయాసాలకోర్చి భక్తులు 9కిలోమీటర్లు అడవి బాటలో వెళ్ళాలి.

 కాని దట్టమైన అడవుల్లో దారి తప్పి క్రూరజంతువులకు బలైన సంఘనటలు కొన్ని జరిగాయి చెబుతారు. అందుకే అటవీ అధికారుల అనుమతి, సహాయంతో ప్రయాణం సాగించటం మంచిదంటారు అధికారులు.

  

💠 ఆంధ్రప్రదేశ్, కడప జిల్లాలోని చిట్వేలి మండలంలోని చిట్వేలి మండలం వెంకటరాజు పల్లి,పెద్దూరు, అనుంపల్లె గ్రామాల నుంచి దాదాపు 9 కిమీ దూరంలో రిజర్వుఫారెస్టులో కొండ కోనల నడుమ దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఈ గుండాలకోన ఉన్నది. 


💠 వెంకటగిరి కొండలమీదుగా 6గుండాలను దాటుకుని 7వ గుండంలోనికి సుమారు 30 అడుగుల ఎత్తునుంచి ఉధృతంగా నీరు ప్రవహిస్తున్నది.


💠 గుండాలకోన సెలయేరు పైభాగాన ఆకారాన్ని బట్టి 7 గుండాలు ఉన్నాయి. 

చదును గుండం,

బూడిద గుండం, 

సమారాధన గుండం, 

పసుపుగుండం, 

గిన్నెగుండం, 

అక్కదేవతల గుండం, 

స్నాన గుండం... ఇలా 7గుండాలు కనిపిస్తాయి. సాధారణ గుండాల కంటే ఎక్కువ లోతుగా ఉండటం వీటి ప్రత్యేకత.


💠 చదునుగుండంగా చెప్పే చోట నుండి నీరు గిన్నె ఆకారంలో ఉన్న బండలపై పడుతుంది. దీనినే గిన్నె గుండంగా పిలుస్తున్నారు. 

ఇక్కడే స్నాన గుండం కూడా ఉంది.

గిన్నె గుండంలోని నీరు ఇక్కడికి చేరుతుంది. 

ఈ నీరు మరో గుండంలోకి పడగానే పసుపు రంగులోకి మారుతుంది. అందువల్లనే దీనికి పసుపు గుండం అని పిలుస్తారు. 

ఆ తర్వాత ఈ నీరు మరో గుండంలో పడగానే బూడిదరంగుగా మారడంతో దాన్ని బూడిదగుండం అంటున్నారు. 

ఈ నీరు సమారాధన గుండంలోకి వెళుతుంది. ఇక్కడే భక్తులు స్నానమాచరిస్తారు.


💠 శతాబ్దాలుగా మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయక్కడ. భక్తుల రద్దీ పెరిగాక ఆర్టీసీ అధికారులు ఆ ఒక్క రోజు మాత్రం రైల్వేకోడూరు నుంచి వై.కోట మీదుగా గుండాలకోనకు బస్సులు నడుపుతున్నారు. ఇక్కడి నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో కూడా యేటా మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.

ఆవు గొప్పదనం

 *ఆవు గొప్పదనం తెలియజేసిన చ్యవన ముని*


చంద్ర వంశానికి చెందిన  పురూరవ చక్రవర్తికి, ఊర్వశికి ఆయువు అనే కుమారుడు పుట్టాడు. ఈ ఆయువుకు  నహుషుడు అనే కొడుకు పుట్టాడు. నహుషుడు తన రాజ్యాన్ని ఎంతో బాధ్యతగా పాలించేవాడు. ఒకరోజు గంగా యమునా నదుల సంగమ ప్రాంతంలో కొంతమంది చేపలు పట్టేవాళ్ళు చేపలు పడుతుండగా వారికి చేపలతో పాటు ఓ ఋషి కూడా వలలో పడ్డాడు. ఆ ఋషి 12 సంవత్సరాల నుండి నీళ్లలో సమాధి స్థితిలో ఉంటూ తపస్సు చేసుకుంటున్నాడు. అలాంటి ఋషి తపస్సుకు భంగం కలిగించామని ఆ చేపలు పట్టేవాళ్ళు బాధపడ్డారు. అలా నీటిలో తపస్సు చేసుకుంటున్న ఋషి పేరు చ్యవనుడు. 


చేపలు పట్టేవాళ్ళంతా చ్యవణుడితో క్షమించమని కోరారు. అయితే చ్యవనుడు మాత్రం వాళ్ళతో "నేను చేపలతో కలిసి ఇన్నాళ్లు బ్రతికాను ఇప్పుడు వాటితో పాటు మీకు దొరికాను. మీరు నన్ను కూడా చేపలతో పాటు అమ్మేసి డబ్బు కూడబెట్టుకోండి" అన్నాడు.


ఋషి ఆజ్ఞను అమలుపరచడం ఎలాగో తెలియక జాలరులు ఆ సమస్యను నహుషుని దృష్టికి తీసుకొని వచ్చారు. నహుషుడు విషయం తెలిసిన వెంటనే మంత్రి పురోహితులు అందరితో కలిసి  చ్యవనమహర్షి వద్దకు వచ్చి సాష్టాంగ నమస్కారాలు చేసాడు. మత్స్యకారులు పొరపాటు చేశారు క్షమించండి అని క్షమాపణ అడిగాడు.  అయితే చ్యవనుడు నహుషునితో జాలరులకు చెప్పినమాటే చెప్పాడు. 'చేపలతో పాటు నన్ను కూడా తగిన వెలకు అమ్మండి' అని అన్నాడు.  


చ్యవనుడు అలా  చెప్పిన తరువాత నహుషుడు చేపలు పట్టేవాళ్లకు వేయి మాడలు ఇవ్వబోయాడు.  అయితే చ్యవనుడు 'రాజా! నా వెల వేయి మాడలా? సరియైన వెల ఇవ్వవయ్యా!' అన్నాడు.


చక్రవర్తి లక్షమాడలన్నాడు. చ్యవనమహర్షి సంతృప్తి చెందలేదు. కోటి మాడలన్నాడు. ఋషికి అంగీకారం కాకపోవడంతో సగం రాజ్యమివ్వడానికి సిద్ధపడ్డాడు నహుషుడు. అదీ సరియైన వెల కాదన్నాడు ముని. మొత్తం రాజ్యాన్ని మునికోసం సమర్పించడానికి సిద్ధపడ్డాడు నహుషుడు. అప్పటికీ చ్యవనమహర్షి ఒప్పుకోకపోవడంతో నహుషుడికి ఏం చేయాలో తోచలేదు. 


చివరకు చ్యవన మహర్షి నహుషునితో  'రాజా! వెళ్ళి నీ మంత్రులతో సంప్రదించి తగిన వెలనునిర్ణయించు' అని ఆదేశించాడు.


సకలసంపదలు కలిగిన రాజ్యం కూడా చ్యవనుడికి సరితూగకపోవడంతో  ఏం చేయాలా అని బాధపడుతున్న నహుషుని వద్దకు గవిజాతుడనే ముని వచ్చి పరిష్కారం చెప్పాడు. 'బ్రాహ్మణుని, గోవును - ఆ బ్రహ్మ దేవుడు సమాన విలువ కలిగినవిగా సృష్టించాడు. బ్రాహ్మణుడు అఖిల మంత్రాలకు అధిష్టానమైతే గోపు హవిస్సుకు మూలం. కనుక చ్యవనునికి సాటి రాగలది గోవు తప్ప మరేదీలేదు. కాబట్టి  అతనికి ఆవు నిమ్మను ఇవ్వమని మార్గం చెప్పాడు గవిజాతముని.


నహుషుడు చ్యవనమహర్షి దగ్గరకు వెళ్లి, 'మహాత్మా! తమకు వెల కట్టగల శక్తి మాకెక్కడిది? నన్ను కనికరించి మీకు తగిన మూల్యంగా ఈ ఆవును అంగీకరించండి'. అని ప్రార్ధించాడు. చ్యవనమహర్షి నహుషుని భక్తిశ్రద్ధలకు, వినయ విధేయతలకు ఎంతో సంతోషించాడు. 'రాజా! అవు అగ్నిమయం, అమృత స్వరూపం, స్వర్గానికి సోపానం. దేవతలకైనా పూజనీయమైనది. హోమ విధాన సంపద్వాహినియైన గోవు నాకు తగిన వెల' అని అంగీకరించాడు.  


ఆవు గొప్పదనానికి ఇదొక గొప్ప ఉదాహరణ.

నాన్న

 నాన్న  🙏

🌷🌷


మళ్ళీ ఎప్పుడో ఎక్కడో ఏదో ఒక జన్మలో

నేను నువ్వుగా ,  నువ్వు నేనుగా ఎదురవుతాం


 నీలా బడికెందుకెళ్ళలేదంటూ చెవి మెలెయ్యను

పదమూడోఎక్కం  ఇంకా ఎందుకు రాలేదంటూ  అస్సలు కన్నెర్రజెయ్యను 


ఎండలో  ఆడకు , వానలో తడవకు అంటూ

అస్తమానం నీ వెనుకేపడను


ఇంకెప్పడూ నన్నొదిలి వెళ్ళొద్దంటూ

నీకాళ్ళని చుట్టేసుకుంటాను 

నా కన్నీళ్ళతో నీ కాళ్ళను కడిగేసుకుంటాను .


నువ్వు లేని రేపులు నాకొద్దు  

నువ్వున్న నిన్నల్లోకి వచ్చెయ్ నాన్నా !


నీ ఙ్ఞాపకాలు కంటి నుండి రాలుతున్నై 

నా తలను నిమిరే  నీ చేతి వేళ్ళకోసం ఎక్కడని వెతకను


నువ్వున్న  ప్రపంచమేదో చెప్పెయ్ నాన్నా !

 నువ్వు లేని కాలాన్ని  గాలికొదిలేస్తా


నీలా చూసుకునే నాన్ననై నీదగ్గరే ఉండిపోతా .

నన్ను నీలో చూసుకుంటూ నువ్వు నేనై మిగిలిపోతా  .

.

బాదరాయణసంబంధము

 *బాదరాయణ సంబంధము*


వెనకటికి ఒక పెద్దాయన తన ఊరునుండి పనిమీద మరొక ఊరు వెడుతూ ఉండగా.... మధ్యదారిలో సాయంసంధ్యా సమయము అయినది. సకాలసంధ్యావందనం అప్పట్లో కచ్చితంగా చేసేవారు కదా! త్వరగా ప్రయాణం చెయ్యగా ఒక ఊరు వచ్చింది. అక్కడ ఒక బ్రాహ్మణోత్తముని ఇల్లు చూచుకొని బండి దిగి ఆ ఇంటి తలుపు కొద్దిగా తెరచి లోపలకు తొంగిచూచి అయ్యా.! లోపల ఎవరు ఉన్నారు? అని గట్టిగా కేక పెట్టాడు ఆ బాటసారి బ్రాహ్మణుడు. ఆ కేకకు ఆ ఇంటి యజమాని బయటకు రాగా.... ఏమాత్రమూ మొగమాటం చూపించకుండా చాలా స్వతంత్రంగా యజమానితో కులాసా కబుర్లు మాట్లాడి... కాసేపు ఇక్కడ ఉండి సంధ్యావందనం చేసుకుంటాననగా...ఆ యజమాని సంధ్యావందనానికేమి భాగ్యం? రాత్రిభోజనం కూడా మాతోనే చేసి ఈ రాత్రికి ఇక్కడే విశ్రమించి రేపు ఉదయం మీ ప్రయాణం సాగించవచ్చు. అని సెలవీయటం జరిగింది. దానికి ఈ బాటసారి బ్రాహ్మణుడు అంగికరించి సంధ్యావందనం తరువాత భోజనాలు కూడా వారు పూర్తిచేశారు. 


ఈ బాటసారి బ్రాహ్మణుడు చాలా చాలా స్వతంత్రంగా వ్యవహరించటం, మాట్లాడటం చూచి ఆ ఇంటి యజమాని పరిచయం లేని ఈ బ్రాహ్మణుడు ఇంత స్వతంత్రంగా ఉన్నాడు. ఇతడు ఎవరో కూడా తెలియలేదు. నేను ఇంతకు ముందు చూడని చుట్టమేమో అనుకొంటూ...  పలుకరించి చూద్దాం. బంధుత్వముంటే బయటపడుతుంది.అని అనుకొని... ఆ బాటసారి బ్రాహ్మణుడితో.... అయ్యా! తమరిని గతంలో ఎప్పుడూ చూచినట్లు లేదు. మీకూ మాకూ బంధుత్వము కూడా ఉన్నట్లు నాకు గుర్తుకు రావటం లేదు. ఇంతవరకూ మనం మాట్లాడుకున్నాము. మీరేమో అపరిచితులు వలె వ్యవహరించటంమూ లేదు. ఇంతకూ మనమధ్య నాకు తెలియని బంధుత్వమేమైనా ఉన్నదా? ఉంటే సెలవియ్యండి. అన్నాడు. 


దానికి ఆ బాటసారి బ్రాహ్మణుడు... అయ్యో! మనకు బంధుత్వము లేకపోవటమేమండీ? 

*అస్మాకం బదరీచక్రం యుష్మాకం బదరీ తరుః ౹*

*బాదరాయణ సంబంధం యూయం యూయం వయం వయం ॥*

నా బండి చక్రాలలో ఒకటి బదరీనృక్షపు కలపతో చేయబడినది. మీ ఇంటి ముందరేమో ఏకంగా బదరీవృక్షమే ఉన్నది. కనుక మనిద్దరిదీ ఈ బదరీ సంబంధమైన బంధుత్వము. కనుక ఇది బాదరాయణసంబంధము. అన్నాడు. దానితో ఆ ఇంటి యజమాని తెల్లముఖం వేశాడు. 


అప్పటి నుండి ఈ *బాదరాయణసంబంధము* ప్రచారంలోకి వచ్చింది.

ఫాదర్స్ డే

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*పితృ దినోత్సవం ఎలా వచ్చిందో తెలుసా?*

             🌷🌷🌷

**జూన్ 3వ ఆదివారం అంతర్జాతీయ పితృ దినోత్సవం*(fathers day)


💝అంతర్జాతీయ పితృ దినోత్సవమును ప్రతీ సంవత్సరం జూన్ నెలలో మూడో ఆదివారం నాడు ప్రపంచవ్యాప్తంగా 52 దేశాలు తండ్రుల గౌరవార్థం పాటిస్తున్నాయి. తల్లుల పట్ల గౌరవాన్ని చూపే మాతృవందన దినోత్సవం ఉండగా బాధ్యతకు మారుపేరుగా నిలిచే నాన్నలకూ ఒకరోజును కేటాయించాలని అమెరికాకు చెందిన సోనోరా స్మార్ట్ డాడ్  ప్రచారం మొదలు పెట్టింది. ఆమె ఆలోచనలకు అనుగుణంగా  1910లో ఫాదర్స్ డే జరుపుకున్నారు. ఆ తర్వాత ఆదరణ పెరుగుతూ రాగా ప్రపంచ దేశాలు 1972 నుంచి ప్రతి సంవత్సరం జూన్ లో వచ్చే మూడో ఆదివారాన్ని పితృ వందన దినోత్సవముగా ప్రకటించి జరుపుతున్నాయి.


*💖18-06-2023 ఆదివారం అలా పితృ దినోత్సవమైంది.*


💓వేదం ‘పితృదేవోభవ’ అంటూ తండ్రిని దైవంగా చూడాలని చెబితే, శాస్త్రాలు ఆయనకి విష్ణు స్థానమిచ్చాయి. జగత్తును పాలించి పోషించేది విష్ణుమూర్తి. అందువల్ల కుటుంబాన్ని పోషించే తండ్రిని విష్ణు సమానుడిగా చెప్పాయి.


💖’నమో పిత్రే జన్మధాత్రే సర్వదేవమయాయచ। సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే।।

దుర్లభం మానుషమిదం యేనలబ్ధం మయావపుః। సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమోనమః’ ఇలా సాగుతుంది “బృహద్ధర్మ పురాణంలో” “పితృస్తుతి”.


❤️కనీ, పెంచీ కడుపు చూసేది అమ్మైతే నడిపించి భవిష్యత్తుని చూసేవాడు నాన్న. అమ్మ కనిపించే వాస్తవమైతే, నాన్న ఓ నమ్మకం. లాలించేది అమ్మ ఒడి, నాన్న భుజం లోకాన్ని చూపే బడి. అమ్మ జోల పాట ఎలాగో.. నాన్న నీతి పాఠం కూడా అలాగ. తమకన్నామిన్నగా బిడ్డ తయారు కావాలని కలలు కనేది కన్నవారే.


💞నాన్న మనకోసం జీవితాన్ని త్యాగంచేసే త్యాగమూర్తి. మనం ఓడినప్పుడు నేనున్నా అంటూ ఓదార్చే ఎమోషన్ నాన్న. మనం గెలిచినప్పుడు పదిమందితో చెప్పుకునేవాడే నాన్న. మన నుంచి కృతజ్ఞతలు ఆశించని అమాయక చక్రవర్తి నాన్న. ప్రపంచంలో అమ్మకు ఎంత గొప్ప స్థానం ఉందో నాన్నకు కూడా అంతే గొప్ప స్థానం ఉంది. అటువంటి నాన్నకు ప్రతీఒక్కరు రుణపడి ఉండాలి.


💕టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో సోషల్ మీడియాలో పొస్టులు పెట్టి చేతులు దులుపుకోవడం, వాట్సాప్ లో స్టేటస్ పెట్టి ప్రపంచాన్ని జయించినట్టు ఫీలయ్యే సమాజంలో మనం బ్రతుకుతున్నాం. అయితే నాన్నకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి శుభాకాంక్షలు చెప్పడం కాకుండా మన పక్కనే ఉండే నాన్నతో కాసేపు మాట్లాడితే నాన్న ఎంతో సంతోషంగా ఫీలవుతారు.


💓మహిళలు పురుషులకు సరి సమానంగా ఉద్యోగాలకు వెళ్తున్న తరుణంలో కుటుంబ బాధ్యతలతోబాటు పిల్లల పెంపకం, ఇంటి పనుల్ని కూడా పురుషులీనాడు సమానంగా పంచుకుంటున్నారు. పిల్లల ఆలనాపాలనా చూసుకోవడంలో తండ్రులే ప్రస్తుతం ముందు ఉంటున్నారు. ‘ఫాదర్స్ డే’ జరుపుకోవాలనే సంప్రదాయం మనదేశానికి కొత్తదే. పాశ్చాత్య దేశాల నుంచి భారత్‌కు వచ్చిన ఈ పండుగ మన భారతీయుల్లో ఉన్న సహజ సెంటిమెంట్ రీత్యా విశేష ఆదరణను పొందింది.


💖చదువులూ, ఉద్యోగాలూ, వివాహాల్లో పిల్లల మనోభావాలకు అనుగుణంగా నడుచుకునే తండ్రి మనస్సును నొప్పించక ప్రవర్తించాల్సిన బాధ్యత పిల్లలపై ఉందనేది గుర్తించాలి. నేటి నవ నాగరికత ముసుగులో పిల్లలు అమ్మానాన్నల్ని నిర్లక్ష్యం చేస్తున్న ఉదంతాలు పెరిగిపోతున్నాయి. ప్రేమలు, పెళ్లిళ్ల విషయాల్లో అమ్మానాన్నల మనోభావాలను పిల్లలు తప్పక గౌరవించాలి.


💖సక్రమమైన ఆలోచనల్లేక ప్రేమలూ పెళ్లిళ్ల విషయంలో సొంతనిర్ణయాలు తీసుకోక తల్లిదండ్రుల అభిప్రాయాలను గుర్తించాలి. కంటికిరెప్పలా భావించి పెంచి పోషించిన అమ్మానాన్నలను ప్రేమ కోసమో, పెళ్లి కోసమో విస్మరించడం ఆత్మహత్యా సదృశ్యం.


💖తలవెంట్రుకలంత మంది బంధు మిత్రులున్నప్పటికీ అమ్మానాన్నలు మాత్రమే నిజమైన శ్రేయోభిలాషులని పిల్లలందరూ గుర్తించి వారి మాటలకు గౌరవమిచ్చి తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి.


💖ఉద్యోగాల నెపంతో ఇతర ప్రాంతాలకో, విదేశాలకో వెళ్లిపోయి అమ్మానాన్నలను విస్మరించడమంటే పిల్లలు తమ బాధ్యతల నుంచి మనస్పూర్తిగా తప్పుకున్నట్లే. అమ్మానాన్నలపై నిర్లక్ష్యంవహిస్తే…భవిష్యత్‌లో తమకూ ఇంతకంటే దుర్భరమైన పరిస్థితే తప్పదన్న కఠోర వాస్తవాన్ని గుర్తించాలి. “ఫాదర్స్ డే” అంటూ ఏడాదికోసారి హడావుడి చేయడం, గొప్ప కోసం బహుమతులు కొనివ్వడం వల్ల కృత్రిమత్వం కనబడ్డమే తప్ప నిజంగా ఒరిగేదేమీ ఉండదు.


💖ఈ ప్రపంచంలో తమకంటూ ఓ గుర్తింపునిచ్చిన  తండ్రిని గౌరవించేందుకు ప్రత్యేకించిన ఈ పండుగ సందర్భంగా అందరికీ పితృదినోత్సవ శుభాకాంక్షలు.🙏

పితృసమానులు

 జనితా చోపనేతా చ యశ్చ విద్యా౦ ప్రయచ్ఛతి|

అన్నదాతా భయత్రాతా పంచైతే పితరః స్మృతాః||


కన్న తండ్రి, ఉపనయనము చేసినవాడు, విద్యనెర్పినవాడు, అన్నము పెట్టినవాడు, భయపడినప్పుడు కాపాడెడివాడు ఈ ఐదుగురూ తండ్రులని చెప్పబడు చున్నారు....

--------------------

అన్నదాతా భయత్రాతా విద్యాదాతాతథైవచ|

జనితాచోఽపనేతాచ పఞ్చైతే పితరస్స్మృతాః||

[చాణక్య నీతి] 

ఆకలిగొన్నవానికి అన్నంపెట్టినవాడు, ఆపదలోఉన్నవాని భయంపోగొట్టిన వాడు, అజ్ఞానాంధకారంలో ఉన్నవానికి జ్ఞాన దానము(విద్యాదానం)చేసినవాడు, నీపుట్టుకకు కారణమైన వాడు, ఆచార్యత్వం వహించి ఉపనయనాది సంస్కారాలు చేసినవాడు, ఈ ఐదుగురూ పితృసమానులు.....

బలిష్టులు అగుట కొరకు

 శరీరం కృశించిన వారు బలిష్టులు అగుట కొరకు - 


         ఏదైనా వ్యాధి మూలాన కాని లేక ఎల్లప్పుడూ బలహీనంగా ఉండేవారు ఈ యోగముని ఉపయోగించడం వలన మంచి బలవంతులుగా తయారు అవ్వొచ్చు. 


               గొధుమలు , సీమ బాదం పప్పు, నల్లతుమ్మ బంక, పటికబెల్లం సమాన బాగాలుగా చేసి నిలువ చేసుకొని ఉంచుకోవాలి . రోజు రెండు పూటలా పూటకు ఒక లడ్డు తిని అనుపానంగా ఒక గ్లాస్ ఆవుపాలు తాగుతూ ఉంటే సన్నగా అస్థిపంజరంలా క్రుశించిపోయిన వారు తిరిగి బలిష్టులు అగుదురు. 


      మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథాలను చదవగలరు.


     గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   

యోగవాసిష్ఠ రత్నాకరము*

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


ముముక్షు ప్రకరణము

రెండవ అధ్యాయము 

పురుషప్రయత్న వివరణము


2-5


సాధూపదిష్టమార్గేణ యన్మనోఙ్గవిచేష్టితమ్‌ 

తత్పౌరుషం తత్సఫలమన్యదున్మత్త చేష్టితమ్‌. 


మహాత్ములగు సాధువు లుపదేశించు మార్గము ననుసరించుచు గావించు మనోవాక్కాయ ఇంద్రియాదుల చేష్టయే పురుషప్రయత్న మనఁబడును. అట్టి ప్రయత్నమే సఫలమగును. తద్వ్యతిరిక్తమైనది ఉన్మత్తుని(పిచ్చివాని) చేష్టయే యగును. 


2-6


యో యమర్థం ప్రార్థయతే తదర్థం చేహతే క్రమాత్‌ 

అవశ్యం స తమవాప్నోతి న చేదర్ధాన్నివర్తతే.


ఎవ రే పదార్థమును గోరుదురో, వారు దానికొరకై శాస్త్రోక్త క్రమమున చేష్టలు సలుపుచు, మధ్య ప్రయత్నమును విరమింపకున్నచో క్రమముగ నద్దానిని తప్పక పొందుదురు. 


2-7


ప్రాక్తనం చైహికం చేతి ద్వివిధం విద్ధి పౌరుషమ్‌ 

ప్రాక్తనోఽ ద్యతనేనాశు పురుషార్థేన జీయతే.


ఓ రామచంద్రా! పూర్వజన్మకృతము, ఇహజన్మకృతము అని పురుషప్రయత్నమును రెండు విధములుగ నెఱుఁగుము. అందు పూర్వజన్మకృత పురుషప్రయత్నము ఈ జన్మయందు గావింపబడిన పురుషప్రయత్నముచే శీఘ్రముగ జయింపబడుచున్నది.


2-8


యత్నవద్భిర్ధృఢాభ్యాసైః ప్రజ్ఞోత్సాహ సమన్వితైః మేరవోఽ పి నిగీర్యన్తే కైవ ప్రాక్పౌరుషే కథా.


ప్రయత్నవంతులును, దృఢభ్యాసానిరతులును, ఉత్సాహవంతులును నగు వారు మేరువునుగూడ జీర్ణమొనరించుకొనగలరు. ఇక వారికి అదృష్ట మొక లెక్కలోనిదా?


2-9


శాస్త్రనియత్రిత పౌరుష పరమా పురుషస్య పురుషతా యా స్యాత్‌ 

అభిమతఫలభరసిద్ధ్యై భవతి హీ సైవాన్యథా త్వనర్థాయ. 


శాస్త్రానుశాసితములగు కర్మల నాచరించుటయే, శుభఫలప్రదమగు పురుష ప్రయత్నము; తదితరములు అనర్థదాయకములు; వ్యర్థములు అయియున్ననవి.


2-10


యథా సంయతతే యేన తథా తేనానుభూయతే స్వకర్మైవేతి చాస్తేఽ న్యా వ్యతిరిక్తా న దైవదృక్‌. 


ఎవడెట్లు ప్రయత్నించునో, ఆతడు దానిఫలము నట్లే యనుభవించును, పూర్వజన్మలందలి స్వకర్మయే (ఫలావస్థయందిపుడు) 'దైవ' మని, “ప్రారబ్ధ'మని చెప్పబడుచున్నది. అట్లు తన కర్మకంటె వేఱుగా 'దైవము' గాని, 'ప్రారబ్ధము' గాని యేమియు లేదు.

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


ముముక్షు ప్రకరణము

రెండవ అధ్యాయము 

పురుషప్రయత్న వివరణము

 

2-11

ఉచ్ఛాస్త్రం శాస్త్రితం చేతి ద్వివిధం పౌరుషం స్మృతమ్‌ తత్రోచ్ఛాస్త్రమనర్థాయ పరమార్థాయ శాస్త్రితమ్‌.


పురుష ప్రయత్నము శాస్త్ర విరుద్ధమని శాస్త్రానుకూలమని రెండు విధములుగ చెప్పబడినది. అందు శాస్త్రవిరుద్ధ మైనది అనర్థము కొఱకును, శాస్త్రానుకూలమైనది పరమార్థము (మోక్షము) కొఱకునై యున్నది. 


2-12

ద్వౌ హుడావివ యుద్ధ్యేతే పురుషార్థౌ సమాసమౌ ప్రాక్తనశ్చైహికశ్చైవ శామ్యత్యత్రాల్పవీర్యవాన్‌.


పూర్వజన్మ యొక్కయు, ఈ జన్మయొక్కయు సమాన, అసమాన పురుష ప్రయత్నములు రెండు పొట్టేళ్ళవలె పరస్పరము యుద్ధము చేసికొనును. అందు అల్పబలము కలది ఓడిపోయి క్షయించును. 


2-13

అతః పురుషయత్నేన యతితవ్యం యథా తథా 

పుంసా తన్త్రేణ సద్యోగాద్యేనాశ్వద్యతనో జయేత్‌. 


కాబట్టి మనుజుడు శాస్త్రోక్తనియమ సత్సాంగత్యాది పురుష ప్రయత్నముచే, పూర్వజన్మ పురుష ప్రయత్నము జయింపబడులాగున యత్నింపవలయును.


2-14

పరం పౌరుషమాశ్రిత్య దన్తైర్దన్తాన్విచూర్ణయవ్‌ శుభేనాశుభముద్యుక్తం ప్రాక్తనం పౌరుషం జయేత్‌.


ప్రబల పురుషప్రయత్నము నాశ్రయించి పండ్లచే పండ్లను కొఱికి (ఏవిధముగనైనను) విఘ్నమొనర్ప నుద్యుక్తమగు పూర్వపు అశుభ పురుషప్రయత్నమును, ఇప్పటి శుభప్రయత్నములచే జయింపవలయును. 


2-15

తావత్తావత్ర్పయత్నేన యతితవ్యం సుపౌరుషమ్‌ ప్రాక్తనం పౌరుషం యావదశుభం శామ్యతి స్వయమ్‌. 


పూర్వపు అశుభయత్నము స్వయముగ శమించిపోనంతవరకు ఉత్తమ పురుషప్రయత్నము ద్వారా మనుజుడు యత్నించుచునే యుండవలెను. 


2-16

దోషః శామ్యత్యసందేహం ప్రాక్తనోఽ ద్యతనైర్గుణైః 

దృష్టాన్తోఽ త్ర హ్యస్తనస్య దోషస్యాద్యగుణైః క్షయః.


ఈ జన్మయందలి శుభపురుషప్రయత్నముచే పూర్వజన్మపు అశుభపురుషప్రయత్నము  నిస్సందేహముగ శమించిపోవును. గత దినమందలి అజీర్ణాది దోషములు నేటి ఔషధాది గుణములచే క్షయించుటయే ఇచట దృష్టాంతము.

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


ముముక్షు ప్రకరణము

రెండవ అధ్యాయము 

పురుషప్రయత్న వివరణము

 

2-23

ప్రత్యక్షమావముత్సృజ్య యోఽ నుమానము పైత్యసౌ స్వభుజాభ్యామిమౌ సర్పావితి ప్రేక్ష్య పలాయతే. 


ప్రత్యక్ష శ్రుతి ప్రమాణమును, ప్రత్యక్షమగు ఇహజన్మ పురుష ప్రయత్నమును వీడి అనుమానసిద్ధమగు పూర్వజన్మపు “అదృష్టము” నెవడు ఆశ్రయించునో అట్టివాడు తన భుజములనే సర్పములని తలంచి పరుగిడువాడే యగును. (పిచ్చివాడని భావము). 


2-24

దైవం సంప్రేరయతి మామితి దగ్ధధియాం ముఖమ్‌ 

అదృష్టశ్రేష్ఠ దృష్టీనాం దృష్ట్వా లక్ష్మీర్నివర్తతే. 


పురుష ప్రయత్నము చేతనే తమయొక్క లక్ష్యమును బొందినట్టి (విశ్వామిత్రాది) శ్రేష్ఠపురుషులయొక్క దృష్టిని తెలిసికొననివారును, “అదృష్టము” నన్ను ప్రేరేపించుచున్నది, అని తలంచువారునగు బుద్ధిహీనుల ముఖమును జూచి లక్ష్మి (సంపద) పారిపోవుచున్నది. 


2-25

తస్మాత్పురుషయత్నేన వివేకం పూర్వమాశ్రయేత్‌ 

ఆత్మజ్ఞానమహార్థాని శాస్త్రాణి ప్రవిచారయేత్‌. 


కాబట్టి పురుషప్రయత్నముచే మొదటనే వివేకమును (సాధన చతుష్టయ సంపత్తి మున్నగువానిని) ఆశ్రయించవలెను. మఱియు ఆత్మజ్ఞాన (ప్రతిపాదకములును, గంభీరార్థ యుక్తములుగు శాస్త్రములను బాగుగ విచారింపవలయును.


2-26

చిత్తే చిన్తయతామర్థ యథాశాస్త్రం నిజేహితైః 

అసంసాధయతామేవ మూఢానాం ధిగ్దురీప్సితమ్‌. 


శాస్త్ర ప్రకారము శ్రవణ మననాది చేష్టలచే పరమార్థభూతమగు ఆత్మతత్త్వమును చింతింపనివారును, కావుననే అట్టి ఆత్మతత్త్వమును సాధింపనివారునగు మూఢులయొక్క మహా నరకాది ప్రదమగు దుష్టభోగేచ్ఛకు ధిక్కారమగుగాక! 


2-27

దైన్యదారిద్ర్యదుఃఖార్తా అప్యన్యే పురుషోత్తమాః పౌరుషేణైవ యత్నేన యాతా దేవేంద్రతుల్యతామ్‌. 


ఉత్తమ పురుషులు కొందఱు దైన్య దారిద్ర్యాది దుఃఖములచే పీడితులై యున్నను, తమయొక్క పురుషప్రయత్నము చేతనే దేవేంద్రునితో సమానులైరి.


2-28

ఆబాల్యాదలమభ్యస్తైః శాస్త్రసత్సఙ్గమాదిభిః 

గుణైః పురుషయత్నేవ స్వార్థః సంప్రాప్యతే యతః.


బాల్యకాలము నుండియు బాగుగ అభ్యసింపబడిన శాస్త్ర సత్సాంగత్యాది గుణములచేతను పురుషప్రయత్నముచేతను ఆత్మప్రాప్తి రూపఫలము సిద్ధించును.

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


ముముక్షు ప్రకరణము

రెండవ అధ్యాయము 

పురుషప్రయత్న వివరణము

 

2-17

అసద్దైవమధః కృత్వా నిత్యముద్రిక్తయా ధియా 

సంసారోత్తరణం భూత్యై యతేతాఽ ధాతుమాత్మని. 


అసత్యమగు అదృష్టమును క్రిందకు త్రోచివైచి నిరంతరము అధికోత్సాహముతో గూడిన బుద్ధితో సంసారసాగరమును దాటు నిమిత్తము శమ దమ శ్రవణ మననాది సంపత్తి కొరకై పురుష ప్రయత్నము గావింపవలెను. 


2-18

న గన్తమమద్యోగైః సామ్యం పురుషగర్దభైః 

ఉద్యోగస్తు యథా శాస్త్రం లోకద్వితయసిద్ధయే. 


గర్దభ (గాడిద) సమానులగు ప్రయత్నరహితులైన మనుజులవలె ఎన్నటికిని ఉండరాదు. ఇహలోక పరలోక (మోక్ష) సిద్ధి కొరకై శాస్త్రానుసారము ప్రయత్నము సలుపుచుండవలెను. 


2-19

సంసార కుహరాదస్మాన్నిర్గన్తవ్యం స్వయం బలాత్‌ పౌరుషం యత్నమాశ్రిత్య హరిణేవారిపంజరాత్.


ఉత్తమ పురుషప్రయత్న మాశ్రయించి, ఈ సంసారమను గోతినుండి శత్రు (మనుష్యనిర్మిత) పంజరమునుండి సింహమువలె స్వయముగ బలపూర్వకముగ బయల్వెడలవలెను.


2-20

ప్రత్యహం ప్రత్యవేక్షేత దేహం నశ్వరమాత్మనః సంత్యజేత్పశుభిస్తుల్యం శ్రయేత్సత్పురుషోచితమ్‌.


ప్రతిదినము 'ఈ శరీరము నశ్వరమైనది' అను విషయమును చింతన చేయవలెను. కావుననే పశువులవలె విషయభోగములందాసక్తి గలిగియుండుటను త్యజించవలెను. మఱియు సత్పురుషోచితములగు సాధుజన సాంగత్య

సచ్ఛాస్త్రాదుల నాశ్రయించవలెను.


2-21


కించిత్కాన్తాన్నపానాదికలిలం కోమలం గృహే 

వ్రణే కీట ఇవాస్వాద్య వయః కార్యం న భస్మసాత్.

వ్రణమందు కీటకమువలె, ఇంటియందు అల్పములగు స్త్రీ, అన్నపానాది కోమల పదార్థములను ఆస్వాదించుచు ఆయువును నాశమొనర్పరాదు. 


2-22


శుభేన పౌరుషేణాశు శుభమాసాద్యతే ఫలమ్‌ అశుభేనాశుభం నిత్యం దైవం నామ న కించన. 

శుభపురుష ప్రయత్నముచే శుభఫలమున్ను, అశుభప్రయత్నముచే అశుభఫలమున్ను శీఘ్రముగ సదా లభించుచున్నది. అంతేగాని అదృష్టము అనునది మధ్య  ఒకింతైనను లేదు.

[18/06, 11:15 am] K Sudhakar Adv Br: *యోగవాసిష్ఠ రత్నాకరము* 


ముముక్షు ప్రకరణము

రెండవ అధ్యాయము 

పురుషప్రయత్న వివరణము

 

2-29

ఆలస్యం యది న భవేజ్జగత్యనర్థః 

కో న స్యాదృహుధనికో బహ్యశ్రుతో వా ఆలస్యాదియమవనిః ససాగరాన్తా  

సంపూర్ణా నరపశుభిశ్చ నిర్ధనైశ్చ


ఈ ప్రపంచమున అనర్థహేతువైనట్టి 'సోమరితనము' అనునది లేనిచో ఎవరు మహాధనికుడు, మహావిద్వాంసుడు కాకయుండును? సోమరితనమునలననే ఈ సముద్రపర్యంతమగు పృథివి ఆత్మజ్ఞానరహితులగు నరపశువులచేతను, ధనహీనులగు మనుజుల చేతను పూర్ణమై యున్నది.


2-30

బాల్యే గతేఽ విరతకల్పితకేలిలోలే 

దోర్దండ మండితవయః ప్రభృతి ప్రయత్నాత్ సత్సంగమైః పదపదార్థ విశుద్ధ బుద్ధిః 

కుర్యాన్నరః స్వగుణదోషవిచారణాని.  


కల్పిత క్రీడలతో నిరంతరము చంచలమై తనరు బాల్యము గడచినతోడనే, గురుశుశ్రూషాది సహితముగ నిత్యానిత్య వస్తువివేకాది సుగుణముల నలవరచు కొని, యౌవనమునుండియే సత్సంగ మొనర్చుచు స్వకీయ గుణదోషములను పరీక్షించుకొనుచుండవలెను. 


2-31

తస్మాత్ర్పాక్పౌరుషాద్దైవం నాన్యత్తత్ర్పోజ్ఝ్యదూరతః సాధుసంగమసచ్చా స్త్రైర్జీవ ముత్తారయేద్బలాత్‌. 


పూర్వజన్మయందలి పురుషప్రయత్నముకంటె వేఱుగ అదృష్టము అనునది లేదు. అద్దానిని దూరముగ తొలగించివైచి సాధుజన సాంగత్య, సచ్ఛాస్త్రాదులచే జీవుని సంసారసాగరము నుండి బలవంతముగ తరింపజేయవలెను.


2-32

ప్రాక్స్వకర్మేతరాకారం దైవం నామ న విద్యతే 

బాలః ప్రబలపుంసేవ తజ్ఞేతుమిహ శక్యతే.


పూర్వపు స్వకర్మలు కాక అదృష్ట మనునది వేరొకటి లేదు. బలశాలియగు పురుషుఁడు బాలుని లోబర్చుకొనఁ గలిగినట్లు అనాయాసముగా అదృష్టమును జయించవచ్చును. 


2-33

హ్యస్తనోదుష్ట ఆచార ఆచారేణాద్య చారుణా 

యథాశు శుభతామేతి ప్రాక్తనం కర్మ తత్తథా.  


నిన్నటి దుష్ట ఆచరణము నేటి ఉత్తమ ఆచరణద్వారా ఎట్లు శీఘ్రముగ శుభత్వమును బొందుచున్నదో, పూర్వకర్మయున్ను ఇప్పటికర్మచే శుద్ధత్వమును బొందుచున్నది. 


2-34

తజ్జయాయ యతన్తే యే న లోభలవలంపటాః

తే దీనాః ప్రాకృతా మూఢాః స్థితా దైవపరాయణాః. 


ఆ పూర్వజన్మకృతకర్మను జయించుటకొఱకు యత్నింపనివారును, 'అదృష్ట' పరాయణులు నగు విషయసుఖలేశ లంపటులైన మనుజులు దీనులును, పామరులును, మూఢులు నగుదురు.

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


ముముక్షు ప్రకరణము

రెండవ అధ్యాయము 

పురుషప్రయత్న వివరణము

 

2-35

పౌరుషేణ కృతం కర్మ దైవాద్యదభినశ్యతి 

తత్ర నాశయితుర్‌జ్ఞేయం పౌరుషం బలవత్తరమ్‌. 


ఇప్పటి పురుష ప్రయత్నము విఫలమైనచో పూర్వజన్మమందలి పురుష ప్రయత్నము ప్రబలముగ నున్నదని గ్రహింపవలెను. 


2-36

తస్మాత్పౌరుషమాశ్రిత్య సచ్ఛా స్త్రై స్సత్సమాగమైః 

ప్రజ్ఞామమలతాం నీత్వా సంసారజలధిం తరేత్‌.


కాబట్టి పురుష ప్రయత్నము నాశ్రయించి, సచ్ఛాస్త్ర, సత్సాంగత్యాదుల ద్వారా బుద్ధిని నిర్మల మొనర్చి సంసార సాగరమును దాటి వేయవలెను. 


2-37

యస్తూదార చమత్కారః సదాచార విహారవాన్‌

స నిర్యాతి జగన్మోహాన్మృగేన్ద్రః సంసారజలధిం తరేత్


ప్రయత్న మొనర్చుటయందు కుశలుడును సజ్జనులగు జ్ఞానులైన మహాత్ముల యొక్క సదాచారములందు విహరించువాడునగు మనుజుడు పంజరము (బోను) నుండి సింహమువలె ఈ జగత్తు యొక్క మాయామోహము నుండి బయటకు వెలువడును.


2-38

కశ్చిన్మాం ప్రేరయత్యేవమిత్యనర్థకుకల్పనే 

యః స్థితో దృష్టముత్సృజ్య త్యాజ్యోఽ సౌ దూరతోఽ ధనుః.


పురుష ప్రయత్నమును విడచి, “ ఎవరో నన్ను ప్రేరేపించుచున్నారు” అని అనర్థకల్పనలందు ఊగులాడు అధముడగు వ్యక్తిని దూరముగ పరిత్యజించుటయే మేలు. 


2-39

వ్యవహార సహస్రాణి యాన్యుపాయాన్తి యాన్తి చ 

యథా శాస్త్రం విహర్తవ్యం తేషు త్యక్త్వా సుఖాసుఖే. 


ఏ అనేక వ్యవహారములు మనుజునియొద్దకు వచ్చుచు పోవుచు నున్నవో, వానియందు ప్రియ, అప్రియముల యెడల రాగ, ద్వేషములు లేనివాడై, సుఖదుఃఖ భావనను వీడి, సమబుద్ధి గల్గి శాస్త్రానుసారము ప్రవర్తింపవలెను. 


2-40

యథాశాస్త్రమనుచ్ఛిన్నాం మర్యాదాం స్వామనుజ్ఝతః 

ఉపతిష్ఠన్తి సర్వాణి రత్నాన్యంబునిధావివ.


శాస్త్రానుసారమగు అఖండితమైన తన మర్యాదను (ప్రయత్నమును) త్యజింపనివానికి, సమస్త అభీష్టములును సముద్రమునందు రత్నమువలె సంప్రాప్తించుచున్నవి.

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


ముముక్షు ప్రకరణము

రెండవ అధ్యాయము 

పురుషప్రయత్న వివరణము

 

2-48

ప్రాప్య వ్యాధివినిర్ముక్తం దేహమల్పాధి వేదనమ్‌ తథాత్మని సమాదధ్యాద్యథా భూయో న జాయతే.  


రోగరహిత మైనట్టియు, స్వల్పమానసిక దుఃఖముతో గూడినట్టియు దేహమును బొంది జీవుడు మరల జన్మింపకుండులాగున ఆత్మజ్ఞానము కొఱకును, చిత్తసమాధానము కొఱకును యత్నింపవలెను.


2-49

దైన్యదారిద్ర్యదుఃఖార్తా అపి సాధో నరోత్తమాః 

పౌరుషేణైవ యత్నేవ యతా దేవేంద్రతుల్యతామ్‌.


సాధూ! రామచంద్రా! దైన్యదారిద్ర్య దుఃఖములచే పీడింపబడియు, ప్రయత్నశీలురగు మనుజు లనేకులు పురుష ప్రయత్న బలముచే ఇంద్రసములైరి. 


2-50

భావాభావ సహస్రేషు దశాసు వివిధాసు చ స్వపౌరుషవశాదేవ నివృత్తా భూతజాతయః. 


జీవులు, వేలకువేలుగ సంభవించు ఆపదలను, సంపదలను, ఇతరములగు దశలను తమ పురుషప్రయత్న బలమువలనే అవలీలగ దాటివైచిరి.


2-51

శాస్త్రతోగురుతశ్చైవ స్వతశ్చేతి త్రిసిద్ధయః 

సర్వత్ర పురుషార్థస్య న దైవస్య కదాచన.


శాస్త్రవిచారణ, గురూపదేశము, స్వప్రయత్నము అను ఈ మూడింటి సాయమువలననే పురుషార్థము సర్వత్ర సిద్ధించుచున్నది. దీనికి అదృష్టముతో సంబంధము లేదు. 


2-52

అశుభేషు సమావిష్టం శుభేష్వేవావతారయేత్‌ ప్రయత్నాచ్చిత్తమిత్యేష స్సర్వశాస్త్రర్థసంగ్రహః. 


అశుభకార్యములందు ప్రవేశించిన చిత్తమును ప్రయత్నముచే శుభకార్యములందే లగ్న మొనర్పజేయవలెను. ఇదియే సర్వశాస్త్రముల యొక్క సిద్ధాంత సంగ్రహము. 


2-53

యత్ శ్రేయో యదతుచ్ఛం చ యదపాయ వివర్జితమ్‌ 

తత్తదాచర యత్నేన పుత్రేతి గురవః స్థితాః. 


“ఓ పుత్రులారా! (శిష్యులారా!) ఏది శ్రేయోదాయక మైనదో, ఏది పరమార్థ సత్య మైనదో, ఏది నాశరహిత మైనదో, దానినే ప్రయత్నముచే నాచరింపుడు!” (అట్టి నిత్య, సత్య, శుద్ధ ఆత్మ కొరకే ప్రయత్నించుడు!) అని మహాత్ములగు గురుజనులు హెచ్చరిక చేయుచున్నారు.

[ *యోగవాసిష్ఠ రత్నాకరము* 


ముముక్షు ప్రకరణము

రెండవ అధ్యాయము 

పురుషప్రయత్న వివరణము

 

2-41

క్రియయా స్పన్దధర్మిణ్యా స్వార్థసాధకతా స్వయమ్‌ 

సాధుసంగమ సచ్ఛాస్త్రతీక్ష్ణ యోన్నీయతే ధియా. 


గురుశుశ్రూషా, శ్రవణాది క్రియలచేతను; సాధు సాంగత్య, సచ్ఛాస్త్రాదుల చేతను తీక్ష్ణ మొనర్పబడిన బుద్ధిచే స్వయముగ ఆత్మ ఉద్ధరింపబడుచున్నది. ఇదియే అద్దాని 'స్వార్థసాధకత్వము'. 


2-42

అనన్తం సమతానన్దం పరమార్థం విదుర్బుధాః 

స యేభ్యః ప్రాప్యతే నిత్యం తే సేవ్యాః శాస్త్రసాధవః. 


ఆత్మజ్ఞానముచే అజ్ఞానకృత వైషమ్యము నివృత్తి కాగా, ఏ అనంతమై, సమమై పరిపూర్ణమైనట్టి ఆనందము ప్రాప్తించుచున్నదో దానినే విజ్ఞులు పరమార్థమని చెప్పుదురు.అయ్యది యెవరి వలన పొందబడుచున్నదో,అట్టి శాస్త్రములను,సాధువులను నిరంతరము సేవించవలెను.


2-43

నిత్యం స్వపౌరుషాదేవ లోక ద్వయహితం భవేత్‌ 

హ్యస్తనీ దుష్క్రియాభ్యేతి శోభాం సత్క్రియయా యథా


2-44

అద్యైవం ప్రాక్తనీ తస్మాద్యత్నాద్యః కార్యవాన్‌ భవేత్ 

కరామలకవద్ధృష్టం పౌరుషాదేవ తత్ఫలం 

మూఢః ప్రత్యక్షముత్సృజ్య దైవమోహే నిమజ్జతి. 


నిజపురుష ప్రయత్నబలముననే ఇహపరలోకముల రెండిటియందు మంచి చేకూరును. పూర్వపు దుష్కర్మలు ఇప్పటి ప్రాయశ్చిత్తాది సత్కార్యములచే శుభములుగ మారి, శోభను గూర్చుకొనును. కాబట్టి మనుజుడు కార్యశీలుడు కావలెను; పురుష ప్రయత్న బలముచే ఫలము, అరచేతియందలి ఉసిరి కాయవలె లభించును. మూఢుడే ప్రత్యక్షమును బరిత్యజించి అదృష్టరూప మోహమున నిమగ్ను డగును.


2-45

బుద్ధైవ పౌరుషఫలం పురుషత్వమేత 

దాత్మప్రయత్నపరతైవ సదైవ కార్యా 

నేయా తతః సఫలతాం పరమామథాసౌ 

సచ్ఛాస్త్రసాధుజనపండితసేవనేన.


పురుష ప్రయత్నముచే ఆత్మజ్ఞానమను ఫలమును బొందుటయే ఈ పురుషజన్మ యొక్క ఫలము; లేనిచో ఈ పురుషజన్మ నిరర్థకము - అని యెఱింగి సదా ఆత్మజ్ఞానమును గూర్చిన ప్రయత్నమందే తత్పరుడై యుండి అట్టి ప్రయత్నమును సచ్ఛాస్త్ర, సాధుజన పండిత సేవనము ద్వారా ఆత్మజ్ఞానఫలలాభముచే పూర్ణముగా సఫల మొర్పవలెను. 


2-46

దైవపౌరుషవిచారచారుభి

శ్చేదమాచరిత మాత్మపౌరుషమ్‌ 

నిత్యమేవ జయతీతి భావితైః 

కార్య ఆర్యజనసేవయోద్యమః.


అదృష్ట పురుష ప్రయత్నముల రెండిటి బలముల నిట్లు విచారించి, పురుష ప్రయత్నము నాశ్రయించియే ఆర్యులు ఫలము నొందుచున్నారు. కనుక ఆర్యజన సేవితమగు ప్రయత్నరూప శ్రవణమననాదుల నాశ్రయించి జ్ఞానమును బడయనగును. 


2-47

జన్మ ప్రబన్ధమయమామయమేష జీవో 

బుద్ధ్యైహికం సహజపౌరుషమేవ సిద్ద్యై 

శాన్తిం నయత్వవితథేన వరౌషధేన 

మృష్టేన తుష్టపరపండిత సేవనేన.


జీవు డీ జన్మయందు గావింపబడిన శాస్త్రబోధితమగు పురుష ప్రయత్నమే మోక్షసిద్ధికి సాధనమని యెఱింగి; నిత్యసంతుష్టులును, సర్వోత్కృష్టులు నగు 

బ్రహ్మవేత్తలయొక్క సేవనమను అమోఘ, మధుర, ఉత్తమ ఔషధముచే జన్మపరంపరాయమగు సంసారరోగమును శమింపజేసుకొనునుగాక!

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


ముముక్షు ప్రకరణము

రెండవ అధ్యాయము 

పురుషప్రయత్న వివరణము

 

2-66

అశుభేషు సమావిష్టం శుభేష్వేవావతారయ 

స్వం మనః పురుషార్థేన బలేన బలినాం వర.


బలవంతులలో శ్రేష్ఠుఁడవగు ఓ రామచంద్రా! అశుభ కార్యములందు ప్రవేశించి నీ మనస్సును అటునుండి త్రిప్పి పురుష ప్రయత్న బలముచే శుభకార్యములందే ప్రవేశపెట్టుము.


2-67

అశుభాచ్చాలితం యాతి శుభం తస్మాదపీతరత్‌ జన్తోశ్చిత్తంతు శిశువత్తస్మాత్త చ్ఛాలయేద్బలాత్‌.


మనుజుని చిత్తము బాలుని చందమున అశుభమార్గము నుండి నివారింపబడినచో, శుభమార్గమున రెండింతలు వేగముగ జనును. అట్లే శుభమార్గము నుండి నివారింపబడిన, అశుభమార్గమున రెండింతలు వేగముగ జనును. కాబట్టి ఆ చిత్తమును బలాత్కారముగ అశుభమార్గమునుండి నివారించి శుభమార్గముననే ప్రవేశపెట్టవలెను. 


2-68

సమతా సాంత్వనేనాశు నద్రాగితి శనైః శనైః 

పౌరుషేణైవ యత్నేన పాలయేచ్చిత్త బాలకమ్‌. 


ఈ ప్రకారముగ చిత్తమను బాలకుని శీఘ్రముగ రాగద్వేషాది వైషమ్యు త్యాగముచే స్వాభావిక సమత్వమందు నియోగించి పురుష ప్రయత్నముచే మెల్లమెల్లగ దానిని ఓదార్చుచు ఆత్మస్వరూపమున లగ్న మొనర్పవలెనేగాని హఠముగా నిరోధింపరాదు.


2-69

ఇదానీమపి తే యాతి ఘనతాం వాసనానఘ అభ్యాసవశత స్తస్మాచ్ఛుభాభ్యాస ముపాహర. 


పాపరహితుడవగు రామచంద్రా! ఈ జన్మయందును అభ్యాసవశమున నీయొక్క వాసనలు గట్టిపడును. కాబట్టి శుభవాసనలనే మరల మరల అభ్యసింపుము. 


2-70

శుభవాసనయా యుక్తస్తదత్ర భవ భూతయే 

పరం పౌరుషమాశ్రిత్య విజిత్యేంద్రియపంచకమ్‌.


  కావున, నీవు మోక్షమను ఐశ్వర్యముకొరకై గొప్ప పురుష ప్రయత్నము నాశ్రయించి పంచేంద్రియములను జయించి యిట శుభవాసనలతోనే కూడి యుండుము.


2-71

అవ్యుత్పన్నమనా యావద్భవానజ్ఞాత తత్పదః 

గురుశాస్త్రప్రమాణైస్తు నిర్ణీతం తావదాచర.


ఎంతవఱకు నీకు బోధ కలుగకుండునో, ఎంతవఱకు నీవు ఆత్మపదము నెఱుఁగకుందువో, అంతవఱకు గురు, శాస్త్ర ప్రమాణముల (యుక్తి, అనుభవాదులచే) నిర్ణయింపబడినదానినే ఆచరింపుము. (శుభవాసనలనే అభ్యసింపుమని భావము.)

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


ముముక్షు ప్రకరణము

రెండవ అధ్యాయము 

పురుషప్రయత్న వివరణము

 

2-60

విశ్వామిత్రేణ మునినా దైవముత్సృజ్య దూరతః పౌరుషేణైవ సంప్రాప్తం బ్రాహ్మణ్యం రామ నాన్యథా. 


(ఇటనున్న ఈ) విశ్వామిత్ర మునీంద్రుడు ఆదృష్టమును దూరముగ తొలగించివైచి తన పురుషప్రయత్నముచేతనే బ్రాహ్మణత్వమును బొందెనుగాని మఱియొక విధముగ కాదు. 


2-61

ద్వివిధో వాసనావ్యూహః: శుభశ్చైవాశుభశ్చ తే 

ప్రాక్తనో విద్యతే రామ ద్వయోరేకతరోఽథవా.


ఓ రామచంద్రా! వాసనాసమూహము శుభమని, అశుభమని రెండు విధములు. పూర్వజన్మపువాసనా

సమూహము ఈ రెండిటిలో ఏదియో యొకటై యుండును. 


2-62

వాననౌఘేన శుద్ధేన తత్ర చేదద్యనీయసే 

తత్క్రమేణ శుభేనైవ పదం ప్రాప్స్యపి శాశ్వతమ్‌.


అందు పూర్వపు శుద్ధవాసనా సమూహముచే నీవిపుడు ప్రేరితుడనగుచో, క్రమముగ ఇప్పటి శుభప్రయత్నముచేతనే నీవు శాశ్వతపదమగు మోక్షమును పొందగలవు.


2-63

అథచేదశుభో భావస్త్వాం యోజయతి సంకటే 

ప్రాక్తనస్తదసౌ యత్నాద్‌ జేతవ్యో భవతా బలాత్‌. 


ఒకవేళ పూర్వజన్మపు అశుభవాసన నిన్నిపుడు సంకటము వైపునకు ఈడ్చుచో, అద్దానిని నీవిపుడు ఇప్పటి అధిక శుభ పురుష ప్రయత్నముచే బలపూర్వకముగ జయించవలెను. 


2-64

ప్రాజ్ఞశ్చేతనమాత్రస్త్వం న దేహస్త్వం జడాత్మకః 

అన్యేన చేతసా తత్తే చేత్యత్వంక్వేవ విద్యతే.


ఓ రామచంద్రా! నీవు ప్రజ్ఞారూపుఁడవు, చైతన్యమాత్రుఁడవే కాని జడమగు దేహము కావు. నీవు స్వప్రకాశుఁడవు. అట్టి చిన్మాత్ర రూపుఁడవగు నీవు మఱియొక చైతన్యముచే ప్రకాశింపబడుటలేదు. 


2-65

శూభాశుభాభ్యాం మార్గాభ్యాం వహన్తీ వాసనాసరిత్‌ 

పౌరుషేణ ప్రయత్నేన యోజనీయా శుభే పథి.


వానన యనునది శుభ, అశుభ మార్గముల రెండిటియందును ప్రవహించుచున్నది. అద్దానిని పురుషప్రయత్నముచే శుభమార్గము నందే త్రిప్పవలెను.

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


ముముక్షు ప్రకరణము

రెండవ అధ్యాయము 

పురుషప్రయత్న వివరణము

 

2-54

భోక్తా తృప్యతి నాభోక్తా గన్తా గచ్ఛతి నాగతిః 

వక్తా వక్తి న చావక్తా పౌరుషం సఫలం నృణామ్‌.


భుజించినవానికే తృప్తి కలుగుచున్నది. భుజింపనివానికి తృప్తి ఎట్లు చేకూరగలదు? నడచుచున్నవాడే అరుగ గలడు; నడువనివాడెట్లు చనగలడు? వక్తయే చెప్పగలడు; మౌని కాదు గదా? కావున పురుషప్రయత్నమే జనులకు సిద్ధిదాయకమని స్పష్టమగుచున్నది. 


2-55

పౌరుషేణ దురన్తేభ్యః సంకటేభ్యః సుబుద్ధయః 

సముత్తరన్త్యయత్నేన న తు మోఘతయానయా. 


బుద్ధిమంతులగువారు పురుషప్రయత్నము నాశ్రయించియే అనాయాసముగా గొప్ప సంకటములనుండి విడివడుచున్నారు. అదృష్టమును నమ్మి ఊరక కూర్చుండిన వారిపట్ల నియ్యది సంభవ మగునది కాదు. 


2-56

క్రీయయా స్పందధర్మిణ్యా స్వార్థసాధకతా స్వయమ్‌ సాధుసంగమసచ్ఛాస్త్రతీక్ష్ణ యోన్నీయతే ధియా.


సత్సాంగత్యము, సచ్ఛాస్త్ర విచారణల వలన బుద్ధి తీక్షణము కాగ అట్టి బుద్ధితో గూడిన ప్రయత్నముచే మనుజునకు తానిచ్ఛగించినది లభించును.


2-57

అనంత సమతానందం పరమార్థం స్వకం విదుః 

స యేభ్యః ప్రాప్యతే యత్నాత్‌ సేవ్యాస్తే శాస్త్ర సాధవః.


అనంతమైన సమరూప మైనట్టి అఖండానంద ప్రాప్తియే పరమ పురుషార్థమని పెద్దలందురు. ఇట్టి పరమార్థము వేనివలన లభించునో అట్టి శాస్ర్తములను, సత్పురుషులను తప్పక సేవించవలెను. 


2-58

అబాల్యాదలమభ్యస్తైః శాస్త్ర సత్సంగమాదిభిః

గుణైః పురుషయత్నేన స్వార్థః సంప్రాప్యతే యతః


బాల్యకాలము నుండి సత్సాంగత్య సచ్ఛాస్త్రముల నభ్యసించినచో వీని వలననే అనగా పురుష ప్రయత్నము వలననే, హితకరమగు మోక్షము సంపాదింపబడును. 


2-59

హ్యస్తనీ దుష్క్రియాభ్యేతి శోభాం సత్క్రియయా యథా 

అద్యైవం ప్రాక్తనీ తస్మాద్యత్నాత్‌ సత్కార్యవాన్భనేత్‌.


నిన్న చేసిన చెడ్డపని నేటి సత్కార్యమువలన మంచిగ మారునట్లు పూర్వపు కర్మగూడ ఇప్పటి సత్ర్పయత్నముచే శుభప్రదము కాగలదు. కాబట్టి ప్రయత్నపూర్వకముగ సత్కార్యముల నాచరింపవలెను.

 *యోగవాసిష్ఠ రత్నాకరము*


ముముక్షు ప్రకరణము

రెండవ అధ్యాయము 

పురుషప్రయత్న వివరణము


2-72

అవాన్తరనిపాతీని స్వారూఢాని మనోరథమ్‌ పౌరుషేణేంద్రియాణ్యాశు సంయమ్య సమతాం నయ. 


ఇంద్రియములన్నియు విషయాభిలాషయందు మిగుల ఆరూఢములై, ఐహిక సుఖములందు విశేషముగ వ్రాలుచున్నవి. వానిని పురుషప్రయత్నముచే శీఘ్రముగ సంయమ మొనర్చి మనస్సును సమత్వ మొందింపుము. 


2-73

అపునర్గ్రహణాయాన్తస్త్యక్త్వా సంసారవాసనామ్‌ సంపూర్ణౌ శమ సంతోషావాదాయోదారయా ధియా.


మరల ఎన్నటికిని తిరిగి గ్రహించకుండులాగున సంసార వాసనలు త్యజించివైచి, ఉదారబుద్ధిచే శమ సంతోషములను పూర్ణముగ గ్రహింపుము. 


శ్రీ వాల్మీకీచే రచింపబడిన మోక్షోపాయమగు యోగవాసిష్ఠరత్నాకరంలో ముముక్షు ప్రకరణమున పురుషప్రయత్న వివరణమనే రెండవ అధ్యాయము సమాప్తము.

** 


ముముక్షు ప్రకరణము

*మూడవ అధ్యాయము*

మోక్షసాధనము


శ్రీ వసిష్ఠ ఉవాచ :- 


3-1

నిర్వాణం నామ పరమం సుఖం యేన పునర్జనః 

న జాయతే న మ్రియతే తజ్జ్ఞానాదేవ లభ్యతే.


శ్రీ వసిష్ఠుడు :- ఓ శ్రీరామచంద్రా! దేనిచే జీవుడు మరల ఈ సంసారమున జన్మింపడో, మరణింపడో, అట్టి పరమసుఖమే నిర్వాణము. అయ్యది కేవలము జ్ఞానముచేతనే లభించును. 


3-2

సంసారోత్తరణే జన్తోరూపాయో జ్ఞానమేవ హి 

తపో దానం తథా తీర్థమనుపాయాః ప్రకీర్తితాః.


జీవుడు సంసారమును తరించుటకు జ్ఞానమే ప్రధానమగు ఉపాయము; తపో, దాన, తీర్థాది ఉపాయములు పరంపరాసాధనములే యగునని చెప్పబడినది. 


3-3

రాజవిద్యా రాజగుహ్య మధ్యాత్మజ్ఞానముత్తమమ్‌ జ్ఞాత్వా రాఘవ రాజానః పరాం నిర్దుఃఖతాం గతాః.


మొట్టమొదట రాజుల కుపదేశింపబడుటచే, లేక విద్యలలో శ్రేష్ఠమైన దగుటచే రాజవిద్యయని పిలువబడిన ఈ ఉత్తమ మైనట్టియు, మహారహస్య మైనట్టియు, అధ్యాత్మజ్ఞానమును పూర్వము రాజు లెఱిఁగి పూర్ణముగ దుఃఖరాహిత్యము నొందిరి.


(రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్ | 
ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయమ్।। భగవద్గీత 9-2


ఈ రాజ విద్య అన్ని రహస్యాలలో అత్యంత లోతైనది. అది విన్నవారిని శుద్ధి చేస్తుంది. ఇది నేరుగా గ్రహించదగినది, ధర్మానికి అనుగుణంగా, ఆచరణలో సులభం మరియు ప్రభావంలో శాశ్వతమైనది అని భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పారు.)

సంధ్యావందనం_ఆవశ్యకత

 #సంధ్యావందనం_ఆవశ్యకత


పూర్వం ఒకసారి బ్రాహ్మణ వటువు శృంగేరి జగద్గురువుల దర్శనానికి వచ్చినప్పుడు జగద్గురువులు మంత్రాక్షతలు ప్రసాదిస్తూ అలంకార ప్రాయంగా కనిపిస్తున్న యజ్ఞోపవీతం చూసి సంధ్యావందనం చేస్తున్నావా లేదా అని ఆయనను ప్రశ్నవేస్తే, యజ్ఞోపవీతం ధరించియున్నామే కానీ, సంధ్యావందనం చేయలేకపోతున్నామని ఆ వటువులు జవాబిస్తే జగద్గురువులు ప్రాయశ్చిత్తం చేయించి పునఃసంధ్యావందనం ఆచరించే విధంగా వారిని ఆశీర్వదించి పంపేవారు.


ఇప్పటి పరిస్థితి ఎలా ఉన్నదంటే తమ దర్శనానానికి వచ్చే ఉపనయనం అయిన వటువులు సంధ్యావందనం చేయడం మాట అటుంచి కనీసం యజ్ఞోపవీతం లేకుండా వస్తున్నారు. యజ్ఞోపవీతం ఏమైంది అని ప్రశ్నిస్తే చొక్కా తీసేటప్పుడు బయటకు వచ్చేసిందనో, లేక జీర్ణమయిందనో బదులిస్తున్నారు. ఆరునెలలనుండో, సంవత్సరంనుండో ఇలా యజ్ఞోపవీతం ఒంటిపై లేకుండా తిరుగుతున్న వాళ్ళ పరిస్థితిని చూసి ఆశ్చర్యం వేసింది. ఇప్పటికే ఒకసారి ఉపనయనం అయ్యి ఒంటిమీద యజ్ఞోపవీతం లేకుండా తిరుగుతున్న వటువునకు మరల యజ్ఞోపవీతం వేయించి పంపించే పరిస్థితి వచ్చింది.


ఈ విధంగా శాస్త్ర ధిక్కారం చేసి ధర్మభ్రష్టులై తిరుగుతున్నవారు తప్పకుండా దానికి తగిన ప్రతిఫలము అనుభవించి తీరవలసిందే. దాని ఫలితాలు అనుభవించే సమయములో చింతించవలసి వస్తే ఏ ప్రయోజనమూ ఉండదు. వెనువెంటనే ఆ దుష్ఫలితం కనిపించకపోయినా ఎప్పటికైనా తప్పదు. కాబట్టి జగద్గురువులు ఆదేశాన్ని శిరసావహించి ఉపవీతులందరూ సంధ్యావందనాదులు చేస్తు విధ్యుక్తధర్మాన్ని ఆచరించవలసిన ఆవశ్యకత మనపై ఎంతైనా ఉంది.


--- జగద్గురు శ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామివారు.

నిత్యాన్వేషణ

 నిత్యాన్వేషణ:



శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు అంటే ఎవరు? నిజమైన పాత్రేనా లేక కల్పితమా? వారి గురించి తెలుపగలరు.


శ్రీకాకుళం'పేరుతో రెండు ఊర్లు ఉన్నాయి,ఉత్తరాంధ్ర లో,కృష్ణాజిల్లాలో.ఆంధ్ర' అని ఒక జాతికి కలుపుతూ మహా విష్ణువు' గుడి ఉండుట ఒక ప్రత్యేకమైన విషయమే.ఎందుకనగా మరాఠీ విష్ణు, కన్నడ విష్ణు తమిళ విష్ణు లేదా కళింగ విష్ణు అనే జాతిపేర్లతో విష్ణుమూర్తి గుడులు ఎక్కడా లేవు.

మధ్య భారతంలో క్రీ.శ6 నుండి 14శతాబ్దం వరకు కాలచూరులన రాజవంశం పరిపాలించింది. 6శతాబ్దం ముందు వీరు ఎక్కడ ఉండేవారో తెలియదు.కల్ చురి' అంటే కల్లి' అంటే మీసాలు, చురి 'అనగా కత్తి'అని చరిత్రకారులు వివరణ.బహుశా 'చురకత్తి లాంటి మీసాలు'కలిగిన రాజులు అయిఉండవచ్చు.వీరికే 'కాలాభ్ర' 'హైహయ' ముదిరాజ్' అని కూడా అంటారు.తమిళ రాజ్యాలను బహుశా 3,4 శతాబ్దాలలో అల్లకల్లోలం చేసిన కాలాభ్ర' రాజవంశం వీరే. ఈ హైహయ' వంశస్థులకు. అనగా రాజులకు 'కొక్కుల' లేదా 'కొక్కోల' లేదా 'కోకుల' కొక్కొలని' అని 'బిరుదు' లేదా 'వంశనామం' ఉన్నది.కల్ చూరి' రాజ్యస్థాపకుడు 'కొక్కుల'లేదా 'కొక్కోల'గా భావిస్తారు. 6శతాబ్ది నుండి 14 వరకు వీరి పాలన గుజరాత్,మాళవ,మధ్య ప్రదేశ్,కర్ణాటక,ఆంధ్ర మొదలగు ప్రాంతాలలో సాగింది.వీరు కార్తవీర్యార్జుని వంశస్థులుగా, పరుశు రాముని చేతిలో మరణం తప్పించుకొనుటకు మీసాలు,గడ్డాలు పెంచుకుని మారువేషాలలో తిరిగారని,అందువల్లనే 'కల్ చురి' అని పిలిచేవారని ఒక వదంతి ప్రాచుర్యంలో ఉన్నది.

వీరి ఇష్టదైవం శివుడు,మహామాయ.మహిష్మాతి వారి జన్మస్థానం.బహుశా 'శ్రీకాకుళం' పేరు 'కొక్కుల,కొక్కోల, కోకల్ల,కోకోల,కోకోలు అని పిలవబడే 'హైహయ' వంశరాజుల పేరు మీదగా వచ్చి ఉండవచ్చునని అనిపిస్తుంది.వీరు బహుశా శాతవాహనులకు పూర్వం ఆంధ్ర ప్రాంతం 'శ్రీకాకుళం'రాజధానిగా పరిపాలించి ఉండవచ్చు. క్రీస్తు పూర్వం 2 -3 మధ్యఆంధ్ర శాతవాహనులు వారినిజయించి 'మీసాల దైవాన్ని (బహుశా ఉజ్జయిని శంకరునిలా మీసాలు గల) తమ జాతి పేరున 'ఆంధ్ర మహావిష్ణు' గా మార్చి ఉండవచ్చు.వైశాఖ పూర్ణిమ' ఉత్సవాలు వైష్ణవ మతంలో 'వల్లభ సాంప్రదాయం'స్థాపించిన వల్లభా చార్యుని జన్మోత్సవాలయి ఉండవచ్చు.ఇక్కడ గల ప్రాచీనరాజీవలోచన మందిరంలో కూడా వైశాఖ ఉత్సవాలు చాలా గొప్పగా జరుగుతాయి.శ్రీ వల్లభా చార్యులు ఆంధ్రులు.జన్మస్థానం 'చంపారణ్' ఛత్తీస్ గడ్.గుజరాతీలలో అత్యధికులు వల్లభాచార్యుల అనునూయిలు.

సుభాషితమ్

 .       

                  _*సుభాషితమ్*_


*విత్తేన రక్ష్యతే ధర్మో* 

*విద్యా యోగేన రక్ష్యతే।*

*మృదునా రక్ష్యతే భూపః*

*సత్స్త్రియా రక్ష్యతే గృహమ్‌॥*


తా𝕝𝕝 

ధనముతో ధర్మము రక్షింపబడును. యమనియమాది యోగము ద్వారా విద్య రక్షింపబడును. కోమలత్వముతో, మధురతతో రాజు రక్షింపబడును. సాధ్వియైన స్త్రీచేత గృహము రక్షింపబడును.

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 94*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.         ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 94*


చంద్రగుప్తుని పట్టాభిషేక విశేషాలు తెల్సుకుని అజ్ఞాతంలో వున్న రాక్షసమాత్యుడు ఆగ్రహావేశాలతో రగిలిపోయాడు. 


"ఆహా ! ఏమా చాణక్యుని దుస్తంత్రము ...? తాను శ్రీకృష్ణ పరమాత్మునితో సమానుడా...? తాను ధర్మప్రతిష్టాపనార్థమే కుతంత్రాలు పన్ని ఇంతటి మారణ హోమాన్ని జరిపించాడా ? చంద్రగుప్తుని రాజ్యాధికార అర్హతను పదుగురిలో ఒప్పించడానికి ఎంత నాటకమాడాడు ? నందులను శిక్షించడం ధర్మసమ్మతమైతే.... మరి చంద్రగుప్తునికి సహాయంగా వచ్చిన పర్వతక, వైరోజనులు ఏం నేరం చేశారు ? విషకన్యని ప్రయోగించి అన్ననీ, విజయయాత్ర పేరుతో తమ్ముడిని దారుణంగా హతమార్చడం ధర్మ సమ్మతమా....?" అంటూ ఆవేశకావేశంతో ఉడికిపోయాడు రాక్షసుడు. 


"ధర్మమట ధర్మం .... చాణక్యా... నువ్వు చేసిందంతా ధర్మమైతే ... నీ ధర్మాన్ని నీకే తిప్పి కొడతాను... సహాయంగా వచ్చిన వారిని సంహరించడం నీ ధర్మమైతే.... అదే ధర్మమైతే... నేనూ నీ మార్గాన్నే అనుసరించి నీ వ్రేలితో నీ కంటినే పొడుపిస్తాను. ఆనాడు నాకు ప్రాణదానం చేసిన చంద్రుని ప్రాణాలు తీసి... నీ ధర్మపన్నాలు నీకే అప్పచెబుతాను. అంతవరకూ నేను ఈ పాటలీపుత్రంలో అడుగుపెట్టను" అని ప్రతిజ్ఞ చేశాడు రాక్షసామాత్యుడు. 


పాటలీపుత్రంలో ప్రముఖ వాణిజ్యవేత్త అయిన చందనదాసు శ్రేష్టి అమత్య రాక్షసునికి ప్రాణమిత్రుడు. రాక్షసుడు తన భార్యను, కుమారుడిని చందనదాసు రక్షణలో ఉంచి "మిత్రమా ! విధిలేని పరిస్థితుల్లో రాజ్యం విడిచి వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చేంతవరకూ నావారి సంరక్షణభారం నీదే" అని చెప్పాడు. 


చందనదాసు అతని చేతిలో చెయ్యి వేసి "నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకూ మీ వాళ్లకు ఏ హాని రానివ్వను. క్షేమంగా వెళ్లి విజయులై తిరిగి రండి అమాత్యా..." అంటూ ప్రమాణం చేశాడు. 


రాక్షసామాత్యుడు ఆనందాశ్రవులు విడుస్తూ చందనదాసుని ఆలింగనం చేసుకుని, భార్య పుత్రుల వద్ద వీడ్కోలు తీసుకుని ఆ రాత్రికి రాత్రే పాటలీపుత్రం విడిచి వెళ్లిపోయాడు. 


ఆ మన్నటి ఉదయమే రాక్షసుని పలాయన వార్త విని సాలోచనగా భృకుటి ముడిచాడు చాణక్యుడు. 

(ఇంకా ఉంది)...


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻


👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

పెళ్లి భోజనాలు

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

పెళ్లి భోజనాలు - ఆ రోజుల్లో - ఈ రోజుల్లో ———-

***************

            ఈ రోజుల్లో పేరుకు పెళ్లే కానీ వేదిక మీద ఏమి జరుగుతుందో మనకు కనిపించదు చాలా పెళ్లిళ్లలో!!!

వారికి నలువైపులా ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు చుట్టు - ముట్టి ఉంటారు. మంగళ వాయిద్యాలను బట్టి తాళికట్టే శుభవేళ అయిందని అర్ధం చేసుకోవడమే . 

             ఆ తరువాత వీలయితే స్టేజ్ ఎక్కి  వధూవరుల మీద నాలుగు అక్షింతలు చల్లడం... తదుపరి పెళ్లిపెద్దలు చెప్పినా, చెప్పకపోయినా  భోజనశాలలోకి దూరడం, బరువైన పింగాణీ ప్లేటును పట్టుకుని యాచకుల్లా వరుసలో నిలబడటం, కావలసిన పదార్ధాలు వడ్డించు  కోవడం, నిలబడి చెమటలు కక్కుకుంటూ తినడం, ఎక్కడో దూరాన ఉన్న మంచినీళ్ళకోసం పరుగెత్తడం సర్వసాధారణం. అతిధులు ఎవరు వస్తున్నారో, ఎవరు తింటున్నారో ఎవ్వరూ గమనించరు. తోసుకుంటూ వెళ్లడం, ఒక్కోసారి బట్టల మీద ఆహార పదార్ధాలు ఒలకడం కూడా చాలా మందికి అనుభవమే.  

            చాలా పెళ్ళిళ్ళలో మనల్ని పెళ్ళికి పిలిచిన కుటుంబం వారు అక్కడ ఒక్కరు కూడా ఉండరు, అందరూ ఫోటో షూట్ లలో బిజీ బిజీ.. అతిధుల్లో ఎనభై, తొంభై శాతం మంది మనకు పరిచయం ఉండరు. కొంత మంది విలువైన పదార్ధాలను ఎంత తిన్నారో అంతకు రెట్టింపు పారేస్తారు.  ఎవరు ప్లేటును చెత్తబుట్టలో వేస్తున్నప్పుడైనా చూడండి... దానిలో దాదాపుగా మరో మనిషికి సరిపోయే పదార్ధాలు ఉంటాయి. 

మా చిన్నతనంలో.......

           అనగా సుమారు  ముప్ఫయి అయిదు, నలుభై ఏళ్ళక్రితం ఇలా ఉండేది కాదు. పెళ్లిళ్లకు వెళ్తే భోజనాలు  నేలమీదనే.  కూర్చోడానికి  చాపలు ఏర్పాటు చేసేవారు.  అందరూ వరుసలో చిరుచాపల మీద కూర్చున్న తర్వాత   అరిటాకులు లేదా మోతుకు ఆకులతో, మద్ది ఆకులతో కుట్టిన విస్తర్లు  వేసేవారు.  

ఆ తరువాత.... 

           ముందుగా పచ్చడి, పప్పు, కూరలు, లడ్డూ లేదా బాదుషా, అరటికాయ బజ్జీలు, కమ్మనిపొడి, వడియాలు, అప్పడాలు, ఊరమిరపకాయలు వడ్డించేవారు.  ఆ తరువాత పులుసు, సగ్గుబియ్యంపాయసాన్ని అభికరించే వారు. అభికరించడం అంటే గరిటెతో పులుసు, పాయసాన్ని విస్తరిలో ఒక చుక్క పడేట్లుగా అంటించే  వారు. అనగా ఆ విందులో ఆ రెండు పదార్ధాలు కూడా ఉన్నాయని అర్ధం.  ఆ తరువాత నెయ్యి కొమ్ము  చెంబులతో పోసేవారు.  (వేసేవారు కాదు) అప్పుడు 

          అక్కడున్న ఒక పెద్దాయన ఔపోసనపట్టి ఓమంత్రం చెప్పి "ఇక కానివ్వండి"  అనగానే అందరూ భోజనాలకు ఉపక్రమించేవారు.  ముద్ద నోటిలో పెట్టుకునే ముందు చాలా మంది కళ్ళకు అద్దుకునే వారు. 

          ఇక వడ్డించే వారు (యువతీయువకులు)  యమా హుషారుగా పోటీలు పడి పదార్ధాలను మళ్ళీ మళ్ళీ తెస్తూ "ఇంకొంచెం వేసుకో మామా... ఈ కూర కాస్తెసుకో బాబాయి.. బావా... ఈ గుత్తి వంకాయ వేసుకుంటే ఇక ఇక్కడినుంచి కదలవు"  అని చిన్నా పెద్దా తేడా లేకుండా సరదాగా ఆటలు పట్టిస్తూ  వడ్డనలు చేసేవారు. 

          వీరు వడ్డనలు చేస్తుంటే పెళ్లి పెద్ద అతిధుల మధ్య తిరుగుతూ ఎలా ఉన్నాయి వంటలు ?  అని ప్రశ్నిస్తూ  కుశలప్రశ్నలు వేస్తూ "వడియాలు కాసిని తెండ్రా... అదిగో పెదనాన్నకు రెండు అప్పడాలు వేయి.. తాతకు నెయ్యి ఇంకొంచెం పొయ్యారా"  అంటూ ఆప్యాయతను వడ్డించేవాడు కుటుంబ పెద్ద. అక్కడ మనతో భోజనం చేసేవారంతా మన బంధువర్గంలోని వారే అయ్యుంటారు.  

           90 శాతం మంది భోజనాలు ముగించాక....ఇంకా ఎవరైనా భోజనం చేస్తూ కనిపిస్తే...అతిధులు కొందరు పాండవోద్యోగ విజయాలు, కురుక్షేత్రం, చింతామణి  నాటకాలలోని పద్యాలను రాగయుక్తంగా, శ్రావ్యంగా ఆలపించేవారు.  

          ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం, పద్దతి. అయిదు, ఆరు పద్యాలు అయ్యాక అంతలో ఒకాయన "భోజనకాలే హరి నామస్మరణ .......... గోవిందా గోవిందా"  అనేవాడు, అప్పుడు మాత్రమే  అందరూ లేచేవారు.   

          మనం కూర్చున్న వరుసలో ఇంకా ఎవరైనా పెరుగు  అన్నంలోనే ఉంటే వారు పూర్తిగా భుజించాకే లేచేవారు. ఇదే బంతి భోజనం.. భోజనాలు చేసిన తరువాత వారు తిన్న విస్తళ్ళన్నీ  కడిగారా అన్నట్లుగా శుభ్రంగా ఉండేవి.  ఒక్క మెతుకు కూడా కనిపించేది కాదు.  

          చేతులు కడుక్కోగానే అక్కడే ఏర్పాటు చేసిన నులక మంచాల మీద కూర్చుని పళ్ళాలలో సిద్ధంగా ఉంచిన తమలపాకులు, వక్కపొడి, సున్నం ఎవరికి కావలసిన మోతాదులో వారు తీసుకుని మళ్ళీ పెళ్లి  పనులలో మునిగిపోయేవారు.  

          ఇక భోజనం చెయ్యడం అనే మహత్తర కళ అతి కొద్దిమందికే తెలుసు. కొందరు తింటుంటే అతి  చూడ ముచ్చటగా ఉంటుంది. సున్నితంగా మునివేళ్లతో కలిపి తింటారు.  కొందరు చపాతీ పిండిని పిసికినట్లు పిసుకుతారు.


           కొంత మంది తిన్న తరువాత విస్తరి ఎలా ఉంటుందంటే  అది కొత్త విస్తరి అంటే నమ్మాలి, ఒక్క మెతుకు కనిపించదు. పదార్ధాల తాలూకు అవశేషం కూడా కనిపించదు. మరి  కొందరు తిన్న తరువాత విస్తరి చూస్తే ఆ అన్నాన్ని మనుషులు తిన్నారా లేక ఎలుకలు తిన్నాయా అన్నట్లు చిందరవందరగా, విస్తరిని ఎత్తేసేవారికి కూడా అసహ్యం కలుగుతుంది.  కొందరు భోజనం చేస్తున్నప్పుడు గ్లాసులు గ్లాసులు నీళ్లు తాగుతుంటారు.  కొంతమంది పెరుగన్నం తిన్నదాకా గ్లాస్ ముట్టుకోరు. నిజానికి భోజనం చేసే మధ్యలో మంచినీరు తాగకూడదు. కొందరు వడ్డించిన పదార్ధాలన్నీ  భుజిస్తారు. కొందరు అన్నీ వేయించు  కుంటారు కానీ  సగం  కూడా తినకుండా వ్యర్ధంగా వదిలేస్తారు.  

            భోజనం చేసే పద్ధతిని బట్టి కూడా వ్యక్తుల మనస్తత్వాన్ని అంచనా వెయ్యవచ్చు.  కావలసిన పదార్ధాలను మాత్రమే వడ్డించుకుని, శుభ్రంగా తినేవారు జీవితంలో పొదుపరులు అనీ, అవసరం లేని వాటిని కూడా వడ్డించుకుని మొత్తం అవతల పారేసే వారు అతిపెద్ద దుబారా మనుషులుగా అంచనా వెయ్యవచ్చు అంటారు పెద్దలు.  

            భోజనం చేయడము ఒక పెద్ద శాస్త్రం. ఎప్పుడైతే బఫె సిస్టం వచ్చిందో... అప్పటినుంచి పెళ్ళిభోజనం అనే మాటకు విలువ లేకుండా పోయింది.  అలనాటి మధుర దృశ్యాలు మాయమై పోయాయి.  

             ఒకప్పటి పెళ్ళిభోజనం అంటే షడ్రసోపేతమైన విందు. పదార్ధాలు నాలుగైదే ఉన్నా అది కడుపుకు మహాపసందు. కడుపారా తిని త్రేన్చుతాము.  ఇప్పటి పెళ్ళిభోజనం అంటే మొక్కుబడి. వంద రకాల పదార్ధాలు కనిపిస్తుంటాయి.  నాలుగు రకాలు కూడా తినలేము.   

     మనల్ని తినమని అడిగేవారే ఉండరు. భోజనం చేశారా అని అడిగే దిక్కు ఉండదు.


సేకరణ:- శ్రీ గిరిధర్ గారి వాట్సాప్ పోస్ట్

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం

 🕉 మన గుడి : 







⚜ కడప జిల్లా : వెయ్యినూతుల కోన


⚜ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం


💠 వెయ్యి నూతులు (బావులు) ఉన్న ప్రదేశం కావడంతో వెయ్యినూతుల కోన అనే పేరు వచ్చింది. క్రమంగా నూతుల కాస్తా నూతల అయింది.

వైఎస్‌ఆర్‌ జిల్లా పెండ్లిమర్రి మండలం చిన్నదాసరిపల్లె గ్రామంలో వెయ్యినూతలకోన క్షేత్రం ఉంది. 


💠 హిరణ్యకశిపుడిని ఆసాధరాణమైన రీతిలో సంహరించి అహోబిల క్షేత్రం నుంచి మొట్టమొదటిగా విచ్చేసింది ఇక్కడికే. 

 శ్రీ మహాలక్ష్మీ రూపమైన చెంచులక్ష్మీతో విహరించింది ఈ మనోహర క్షేత్రంలోనే. అంతేకాదు హిరణ్యకశిపుని వధ సందర్భంగా తాను ప్రదర్శించిన 32 ఛాయల్లో రెండింటిని శాశ్వతంగా నిలిపింది ఈ మహిమాన్విత క్షేత్రంలోనే. 

అందువల్ల ఇది మన రాష్ట్రంలోనే గాక యావద్భారతంలోని నరసింహ క్షేత్రాల్లోనే అగ్రశ్రేణి క్షేత్రంగా అలరారుతోంది. 


💠 వివాహాలు కుదిర్చే స్వామిగా, అపర ధన్వంతరిగా పూజలు అందుకుంటున్నాడు వెయ్యినూతుల కోనలో కొలువైన లక్ష్మీనరసింహస్వామి. 

శాంత రూపంలో దర్శనమిచ్చే ఈ స్వామిని పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరతాయనేది భక్తుల నమ్మకం. 

వివాహ దోషాలనూ తొలిగించే ఈ స్వామి ఆలయం చుట్టుపక్కల కాకులూ గద్దలూ తిరగవనీ చెబుతారు.


⚜ స్థలపురాణం ⚜


💠 నుయ్యి అంటే బావి. 

ఈ ప్రాంతంలో సుమారు వెయ్యి బావులు ఉండటం వల్లే ఆలయానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు.

 వాల్మీకి మహర్షి ఈ స్వామిని దర్శించుకుని ఆలయానికి సమీపంలోని ఓ పర్వతం పైన ఆశ్రమాన్ని నిర్మించుకుని తపస్సు చేశాడనీ, రామాయణంలో కొంత భాగాన్ని ఇక్కడే రాశాడనీ చెబుతారు. 


💠 హిరణ్యకశిపుడిని సంహరించిన స్వామి తరువాత ఉగ్రరూపంలో అడవుల్లో సంచరిస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నాడట. అప్పటికే ఇక్కడ తపస్సు చేసుకుంటున్న కొందరు మహర్షులు స్వామిని పూజించి ప్రసన్న రూపం దాల్చమని కోరారట. అయినా ఫలితం లేకపోవడంతో అంతా కలిసి ఇక్కడున్న వెయ్యినూతుల నుంచి నీటిని తెచ్చి స్వామికి అభిషేకం చేశారట. 

ఆ తరవాత స్వామి ఇక్కడ కొలువు దీరమంటూ వేడుకున్నారట.


💠 ఈ ఆలయం దగ్గరికి చేరుకోగానే

శాంతించడంతో మహర్షుల కోరికను మన్నించిన స్వామి ఇక్కడ స్వయంభువుగా వెలిశాడని కథనం. ఈ క్షేత్రంలో కాకులూ, గద్దలూ సంచరించకపోవడం వెనకా మరో ఆసక్తికరమైన కథనం ఉంది. 


💠 రాముడు సీతాసమేతంగా ఈ క్షేత్రానికి వచ్చి సేద తీరుతున్న సమయంలో కాకాసురుడు అనే రాక్షసుడు వచ్చి తన ముక్కుతో సీతాదేవిని పొడిచి నిద్రాభంగం కలిగించాడట.

దాంతో రాముడు ఆగ్రహించి కాకాసురుడిపైన బ్రహ్మాస్త్రం సంధించాడట. దాన్నుంచి తప్పించుకునేందుకు దేవతలందరి దగ్గరకు వెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో ఆ అసురుడు చివరకు రాముడినే శరణు కోరాడట. అప్పుడు రాముడు ఈ క్షేత్రం చుట్టూ గిరిగీసి.. లోపలికి ప్రవేశించవద్దంటూ ఆజ్ఞాపించాడట. అప్పటినుంచీ ఇక్కడ కాకులు తిరగవని అంటారు.


💠 గర్భాలయంలో స్వామి శంఖచక్రాలూ, అభయముద్రతో లక్ష్మీసమేతంగా దర్శనమిచ్చినా ఈ ఆలయానికి కొద్ది దూరంలో లక్ష్మీదేవికి ప్రత్యేక ఆలయం కూడా ఉంటుంది. స్వామిపైన అలిగిన లక్ష్మీదేవి ఆలయానికి కొద్దిగా దూరం జరిగి శిలగా మారడంతో అక్కడే ఆమెకు ఆలయాన్ని నిర్మించారని చెబుతారు.


💠ఈ ఆలయంలో అర్ధరాత్రి మహర్షులూ, దేవతలూ స్వామిని దర్శించుకుంటారనీ.. అందుకే ఆ సమయంలో గంటలు వాటంతట అవే మోగుతాయనీ చెబుతుంటారు స్థానికులు. 

ఈ కోనలో నేటికీ మహసిద్ధులు ప్రతి నిత్యం ఏకాంత సమయంలో అదృశ్యరూపంలో స్నానంచేసి తపమాచరించి స్వామిని దర్శిస్తారని ఇక్కడ చెపుతుంటారు. 

ఇందుకు నిద్శనంగా లక్ష్మీదేవి స్వామి వారి పాదాల చెంత అర్చక ద్రవ్యాలు కనిపిస్తాయి. 


💠 40 రోజులు స్వామిని పూజించి ఈ ప్రాంగణంలో నిద్రిస్తే కోరిన కోర్కెలు నెరవేరతాయనేది భక్తుల విశ్వాసం. 

అదే విధంగా కుజదోషం ఉన్నవారు ఇక్కడున్న అమ్మవారికి కుంకుమపూజలు చేస్తే త్వరగా వివాహం జరుగుతుందట. 


💠 ఇక్కడి స్వామికి రోజువారీ చేసే పూజలతోపాటు వైశాఖ మాసంలో వచ్చే నృసింహ జయంతి సందర్భంగా బ్రహ్మోత్సవాలను జరిపిస్తారు. 


💠 తాళ్ళపాక అన్నమాచార్యులు స్వామి వారిమీద 10 కీర్తలను రచించారు. 

ఈ దేవాలయానికి ఏక్కడాలేని మరో.ప్రత్యేకత కూడా వుంది. 

సాధారణంగా ఏ గుడిలోనైనా విగ్రహలు ఉత్తరం లేదా తూర్పు ముఖం వుంటారు.

 కానీ మహలక్ష్మీ ఆలయంలో విగ్రహం మాత్రం పడమర ముఖంగా వుంటుంది. 

దీని కారణంగా ఎక్కువ సంఖ్యలో మహలక్ష్మి అమ్మవారిని మహిళలు దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 


💠 ఈ పుణ్య క్షేత్రంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు రాత్రికి గరుడ సేవ, మరుసటి రోజు కల్యాణం జరపడం అనవాయితీ.

 

💠 ఈ ఆలయం కడప నుంచి 25 కిమీ దూరం.

ఓ హిందూ మేలుకో-1

ఓ హిందూ మేలుకో-1

ఈ రోజుల్లో మన సమాజంలో రోజు రోజుకు మన సాంప్రదాయాలమీద, మన ఆచారాల మీద ఆదరణ తక్కువ అవుతున్నది.  దానికి దారుణం ఏదయినా కావచ్చు.  ముఖ్యంగా ప్రతి హిందువు తన ధర్మం ఏమిటి తన కర్తవ్యం ఏమిటి తన్ను తాను ఎలా ఉద్దరించుకోవాలి అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచించి తన దైనందిక జీవితాన్ని కొనసాగిస్తే ప్రతిహిందువు ఒక చక్కని వ్యక్తిత్వం వున్న ఆదర్శమూర్తిగా నిలుస్తాడు మన హిందూ ధర్మాన్ని కలకాలం నిలపటానికి తోడ్పడుతాడు.  

ప్రతి హిందువు తానూ ఏకులానికి చెందినవాడైన కానీ తాను ముందుగా హిందువునని కాబాట్టి తన ధర్మాన్ని నిలపెట్టాలని అనుకోవాలి.  పూర్వం ఎప్పుడో మనం చూడని సమాజం ఇప్పుడు లేదు.  ఇప్పుడు అందరు చక్కగా చదువుకుంటున్నారు అనేక విషయాలను తెలుసుకొని విద్యావంతులుగా రాణిస్తున్నారు. ఒక్క విషయం గుర్తుంచుకోండి "విద్య దదాతు వినయం " అని ఆర్యోక్తి అంటే విద్యవలన వినయము కలగాలి వినయం అంటే దేని పట్ల  వినయం అంటే అది శాస్త్రం పట్ల శాస్త్రం అంటే మనకు జ్ఞనాన్ని ప్రసాదించేది శాస్త్రం. 

హిందువులు విగ్రహారాధకులు అని కొందరు ఏదారి మతస్తులు అభిప్రాయపడుతుంట్టారు.  నిజా నిజాలు తెలియని అమాయక హిందువులు అది నిజమని అనుకుంటారు.  మిత్రమా ప్రపంచంలో ఏ మతం కూడా హిందూ ధర్మాన్ని మించినది లేదు. అందుకే అనేక తప్పుడు ప్రచారాలను చేసి ఇతరులు హిందువులను చులకన చేసే ప్రయత్నాలను చేస్తున్నారు అందులో భాగమే ఈ తప్పుడు ప్రచారం ఒకటి. 

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు బాల్యంనుండే చక్కగా నీతి శతకాలను నేర్పాలి, మన మాతృ భాషయిన తెలుగు పట్ల చక్కని అవగాహన కల్పించాలి. శ్రీకృష్ణ భగవానులు ఉపదేశించిన శ్రీమత్ భగవత్గీతను ప్రతి వారు పఠించి , అందులోని విషయాలను పాటించి తమ జీవితాలను ఆదర్శవంతంగా చేసుకోవాలి. 

హిందూ ధర్మంలో శవాల బొమ్మలు, సమాధులను పుజెంచమని ఎక్కడా చెప్పదు.  పొరపాటునకూడా అటువంటి తప్పుడు పనులు చేయకూడదు. 

అవతారపురుషులు మనకు శ్రీ రాముడు, శ్రీ కృష్ణ భగవానులే ప్రధానంగా గోచరిస్తారు. ఒక అవతార పురుషుడు మరల ఇంకొక అవతారపురుషుడుగా ఎప్పుడు మరల మరల జన్మలు తీసుకోరు.  ఈ విషయం ప్రతి హిందువు తెలుసుకోవాలి. మన ధర్మాన్ని ఆచరించే వారిని, మన దేముళ్ళను ఆరాధించే వారిని మాత్రమే మనం గురువులుగా భావించాలి.  ఎట్టి పరిస్థితిలోను తత్ బిన్నంగా నడవకూడదు. 

మన ఆచారాలను పాటిద్దాము, మన ధర్మాన్ని కాపాడుదాము. 

జై హిందూ జై జై హిందూ 

ఆచంద్ర తారార్కం మన ధర్మం వెలసిల్లేలా మనమంతా కృషి చేద్దాం.  

మార్పు నానుండే మొదలు అని ప్రతివారం ఉద్యమిద్దాం. 

జై  శ్రీరామ్,జై శ్రీ కృష్ణ 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

ఇట్లు 

మీ 

భార్గవ శర్మ