హస్తినాపురంలో కొన్ని మాసాలపాటు ఉండి, పిమ్మట కృష్ణ పరమాత్మ తన నగరానికి బయలుదేరాడు.
***
కనకసౌధములపైఁ గౌరవకాంతలు-
గుసుమవర్షంబులు గోరి కురియ,
మౌక్తికదామ సమంచితధవళాత-
పత్త్రంబు విజయుండు పట్టుచుండ,
నుద్ధవసాత్యకు లుత్సాహవంతులై-
రత్నభూషితచామరములు వీవ,
గగనాంతరాళంబు గప్పి కాహళభేరి-
పటహశంఖాదిశబ్దములు మొరయ,
***
సకలవిప్రజనులు సగుణనిర్గుణరూప
భద్రభాషణములు పలుకుచుండ,
భువనమోహనుండు పుండరీకాక్షుండు
పుణ్యరాశి హస్తిపురము వెడలె.
***
భువనమోహనుడు, పుండరీకాక్షుడు అయిన శ్రీకృష్ణుడు ఘనీభవించిన పురజనుల పురాకృత పుణ్యంలా హస్తినాపుర వీథుల వెంట సాగిపోతున్నాడు. అంతఃపుర కాంతలు బంగారు మేడలపై నిలబడి నందనందనునిపై పుష్ప వర్షాలు కురిపించారు. విజయుడు వెనుక నిలబడి ముత్యాలసరాలతో విరాజిల్లే శ్వేతచ్ఛత్రాన్ని పట్టాడు. ఉద్ధవుడు, సాత్యకి ఉత్సాహంతో అటునిటు నడుస్తు రత్నఖచితాలైన పిడులు పట్టుకొని వింజామరలు వీస్తున్నారు. బాకాలు, నగారాలు, తప్పెటలు, శంఖాలు ఆకాశం దద్దరిల్లేలా మ్రోగుతున్నాయి. వేదవేత్తలైన బ్రాహ్మణులు సగుణ నిర్గుణ స్వరూప నిరూపకంగా స్వస్తివచనాలు పలుకుతున్నారు.
🏵️పోతన పద్యం🏵️
🏵️పరమ పవిత్రం🏵️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి