16, సెప్టెంబర్ 2020, బుధవారం

ఘృత సూప సమన్వితం'

ఒకసారి భోజరాజుకీ కాళిదాసుకీ మాట పట్టింపు వచ్చింది.'విద్వాన్ సర్వత్ర పూజ్యతే'అంటూ ఆస్థానం వదిలి
వెళ్ళిపోయాడు.కాళిదాసు వెళ్ళిపోయాక గానీ భోజరాజు  కు ఆయన విలువ తెలిసి రాలేదు.ఏమీ తోచడం లేదు
మంచి కవిత్వం వినిపించే వాళ్ళు లేరు.ఆయన కాళిదాసు జాడ కనుక్కున్న వాళ్లకు లక్ష దీనారాలు బహుమతి ప్రకటించాడు.
ఇదిలా వుండగా పోరుగూరి నుండి యిద్దరు పేద బ్రాహ్మణులు భోజరాజు దగ్గర ఏదైనా బహుమతి దొరుకుతు౦దే మోననీ ఆశతో ధారానగరానికి వచ్చి ఊరిబయట వున్న దేవాలయం లో కూర్చున్నారు.ఏదైనా మంచి శ్లోకం వ్రాసుకొని పోదామని ప్రయత్నిస్తున్నారు.ఎంత సేపు ఆలోచించినా వాళ్లకు తోచడం
లేదు.వాళ్లకు ఆకలి వేసింది.అప్పుడు ఒక పాదం స్ఫురించింది.
'భోజనం దేహి రాజేంద్రా ఘృత సూప సమన్వితం' రాజా!మాకు మంచి నెయ్యి వేసిన పప్పు తో కూడిన భోజనం కావాలి. రెండో పాదం ఎంత ఆలోచించినా కుదరడం లేదు.ఆ మండపం లోనే ఒక మూల కాళిదాసు మారువేషం లో కూర్చుని వున్నాడు.అయన దగ్గరికి వెళ్లి స్వామీ మీరు చూడబోతే పండితుల్లా కనిపిస్తున్నారు.మేము పేద వాళ్లము.భోజరాజు గారి దగ్గర ఏదైనా బహుమానం దొరుకుతుందేమో నని ఆశ
.తో వచ్చాము.మాకు శ్లోకం లో ఒక్క పాదమే వచ్చింది.రెండో పాదం చెప్పి పుణ్యం కట్టుకోండి అని బ్రతిమలాడారు. కాళిదాసు రెండో పాదం యిలా వ్రాశాడు.
'మాహిషం చ శర శ్చంద్ర చంద్రికా ధవళం దధి'
మంచి బర్రె పాల నును తోడు పెట్టి తయారు చేసిన శరత్కాలపు వెన్నెల వలె తెల్లగా వుండే గడ్డ పెరుగుకూడా కావాలి.
వాళ్ళిద్దరూ కాళిదాసుకు కృతజ్ఞతలు చెప్పి రాజాస్థానానికి వెళ్ళారు.అక్కడ తమ శ్లోకం విని పించారు.
భోజనం దేహి రాజేంద్రా ఘృత సూప సమన్వితం
మాహిషం చ శరశ్చంద్ర చంద్రికా ధవళం దధి
భావము:-రాజా!-అన్నము లోకి  మాకు పప్పు నెయ్యితో కూడిన భోజనము , మంచి బఱ్ఱె పాలతో తోడు పెట్టినశరత్కాలపు వెన్నెలవలె తెల్లగావుండే  గడ్డ పెరుగు కావాలి
రాజు అదివిని మొదటి పాదం లో ఏమీ విశేషం లేదు.రెండో పాదానికి అక్షర లక్షలు యిస్తాను.కానీ అది మీరు వ్రాసిన దిగా అని పించడం లేదు.అది ఎవరు వ్రాశారో నిజం చెప్పండి.అని గద్దించి అడిగారు.వాళ్ళు భయపడి పోయి అసలు సంగతి చెప్పి వేశారు.రాజుగారిని క్షమాపణ అడిగారు.అప్పుడు భోజుడు అది వ్రాసినది కాళిదాసే నని గ్రహించాడు.అంత మంచి ఉపమానం కాళిదాసు తప్ప వేరెవరూ రాయలేరు అని ఆయన విశ్వాసం.ఆ వ్రాసిన వారిని మీరు చూపించండి ఆయన ఎక్కడ వున్నారు?అని అడిగారు రాజు గారు.అప్పుడు వాళ్ళు ఊరిబయట దేవాలయం లోని మండపం లో కూర్చుని వున్నారని చెప్పారు.అప్పుడు భోజ రాజు స్వయంగా వెళ్లి కాళిదాసుకు క్షమాపణ చెప్పి పిలుచుకొని వచ్చి.తాను అన్న మాట ప్రకారం కాళిదాసు జాడ తెలిపిన వారిద్దరికీ లక్ష దీనారాలు బహుమతి గా యిచ్చి పంపించి వేశారు.
ఆ బ్రాహ్మణు లిద్దరూ సంతోషంగా వెళ్ళిపోయారు.
--------------------***------------------------

కామెంట్‌లు లేవు: