11, సెప్టెంబర్ 2020, శుక్రవారం

సేవను మించిన భాగ్యం లేదు




ఫల్‌ కారణ్‌ సేవా కరే కరే న మన్‌ సే కామ్‌

 కహే కబీర్‌ సేవక్‌ నహి కహై చౌగుణా దామ్‌

‘‘ఫలితాన్ని ఆశించి స్వార్థ బుద్ధితో చేసే సేవ.. సేవ కాదు. సొంత లాభం కోసం చేసే సేవకులు తమ సేవకు ఎన్నో రెట్ల అధికమైన ఫలితాన్ని ఆశిస్తారు’’ అంటాడు మహాత్మా కబీరు. సేవ అనేది పరుల మేలు కోసం చేయాలి కానీ, తను ఎంతో కొంత లాభపడాలని చేసే సేవ, సేవే కాదనేది ఈ పద్యం ద్వారా కబీరు మనకు అందించే సందేశం. అహంకారాన్ని తగ్గించుకోవడానికి, మనసును సుఖశాంతులతో నింపుకోవడానికి సేవను మించిన సాధన ఏదీ లేదు. అందుకే.. మాధవ సేవ కంటే మానవ సేవ గొప్పదని పెద్దలు అన్నారు. ‘‘దేహం కదిలే దేవాలయం. అది ఆత్మ నివాసం. రాళ్లు, సున్నంతో కట్టిన దేవాలయాల్లో ప్రవేశించి చేసే ప్రార్థనలు, పూజలకు బదులు మనం ఇతరులకు ఎన్నో విధాలైన సేవ చేయవచ్చు.

భగవంతుని ముందు సాష్టాంగ నమస్కారాలు చేయడం కంటే.. చేతనైనంతలో సజీవమైన జీవుణ్ని పోషించడానికి కృషి చేయాలి. కష్టంలో ఉన్న వారికి సేవ చేయడమే దేహాన్ని రక్షించడం’’ అని ప్రేమావతారుడైన సత్యసాయి చెప్పారు. జపతపాలు, పూజా పునస్కారాలతో భగవంతుని కృపకు పాత్రులం కావాలని కోరుకోవడం కంటే.. ఆర్తులైనవారికి చేయూతనిచ్చి తోడ్పడడమే మానవత్వంలో దైవత్వాన్ని చూడడం అని ఆయన మాటల్లోని అంతరార్థం. మన వేదాలు, శాస్ర్తాలు, పురాణేతిహాసాలు ఈ మాటల్నే బలపరుస్తాయి. మానవ జన్మలో కొన్నైనా మనిషి మంచి పనులు చేయగలగాలి. మంచి పనులంటే ఇతరులకు మేలు చేసేవి. తనకున్న దానిలోనే ఎంతో కొంత ఆపన్నులకు దానమివ్వడం, కష్టాల్లో ఉన్నవారికి తోడ్పడం వంటివన్నీ సేవయే! తాను స్వయంగా ఆకలితో ఉన్నా.. ఆకలి అంటూ వచ్చినవారికి అన్నం పెట్టి క్షుద్బాధ తీర్చిన రంతిదేవుడి వంటివారు సేవాభావానికి నిలువెత్తు ఉదాహరణలు. అలా ప్రాణికోటి ఎడ దయ కలిగి ఉండేవాడు భగవంతుని చేరగలడు.

సేవ.. మరోకోణంలో దానం అవుతుంది. అలాంటి దాన గుణానికి నిలువెత్తు రూపం కర్ణుడు. ఆ కుంతీపుత్రుడి దానశీలత ఎంత వర్ణించినా తక్కువే. ఒకసారి కర్ణుడు తన ఇంటి ఆవరణలో తలంటుకునే ప్రయత్నంలో ఉన్నాడు. కర్ణుడి చేతిలో ఉన్న నూనె పాత్ర.. వజ్రవైఢూర్యాలతో పొదగబడి ఉంది. అప్పుడే అక్కడికి వచ్చిన కృష్ణుడు.. ఆ నూనె పాత్రను తనకు దానమివ్వాలని అడుగుతాడు. కర్ణుడు మరో ఆలోచన లేకుండా తన ఎడమ చేతితో నూనెపాత్రను కృష్ణుడికి ఇవ్వబోతాడు. దానికి కృష్ణుడు.. ‘వామహస్తంతో దానం ఇవ్వకూడదని తెలియదా కర్ణా’ అని ప్రశ్నించగా.. నా కుడిచేతికి నూనె ఉంది. చేయు కడుక్కుని దానమిచ్చేలోపు ప్రాణాలుంటాయో లేదో ఎవరికి తెలుసు? పైగా దానమివ్వాలన్న నా ఆలోచన మారిపోవచ్చు కూడా’ అన్నాడు కర్ణుడు. ఇలాంటి మహానుభావులు ఎందరో మన పురాణేతిహాసాల్లో ఉన్నారు. వారందరినీ అనుసరించి సేవాభావంతో మెలగాలి. చేసే కర్మలన్నీ ఈశ్వరార్పణ బుద్ధితో, నిస్వార్థంగా చేయాలి. అప్పుడే ముక్తి.

కామెంట్‌లు లేవు: