11, సెప్టెంబర్ 2020, శుక్రవారం

భాగవత మహాత్య్మం

*ఓం నమో భగవతే వాసుదేవాయ*

సందేహం;- భాగవత మహా పురాణం విన్నా పరీక్షిత్తుకు మృత్యువు తప్పలేదు. ఇక భాగవత మహాత్య్మం ఏముంది?

సమాధానం;- అసలు పరీక్షిత్తు భాగవతం దేని కోసం విన్నాడు? ముని కుమారుడు ఇచ్చిన మృత్యుశాపం తప్పించుకొని బతికిపోవడానికి కాదు. భాగవత శ్రవణం వల్ల తాను తరించి, మోక్షం పొందడానికి.

ఆసలు మృత్యువంటే అర్థం ఏమిటో భారతంలో సనత్ సుజాతుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. మృత్యువంటే ప్రమాదం అని అర్థం. ప్రమాదం అంటే "అనవధానత". ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలో ఆ విషయంలో జాగ్రత్త పడకపోవడాన్నే ప్రమాదం అంటారు.

మన జాగ్రత్తంతా ప్రాపంచిక విషయాల మీదే తప్ప, ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత మనం ఏమవుతాం? ఈ ఆలోచన, ముందు చూపు మనకి ఉండదు. మనం ఈ ఆలోచన చేసి, జాగ్రత్త పడతామనే మనకు భగవంతుడు దుర్లభమైన మానవజన్మ ఇచ్చాడు.

దుఃఖమిశ్రితం కాని శాశ్వతం కాని శాశ్వత ఆనందం కోసం మనం ప్రయత్నం చేసుకోవాలి. మానవజన్మ సార్థకం చేసుకోవాలి. ఈ జన్మ దాటిపోతే, మళ్ళీ వచ్చే జన్మ మానవజన్మే వస్తుందని ఎవరు చెప్పగలరు? ఈ జన్మలో మనం మనసా, వాచా, కర్మణా చేసే పాపాల వల్ల, పరపీడనం వల్ల వచ్చే జన్మలో ఏ పక్షిగానో, చెట్టుగానో, పుట్టగానో పుడతాం. క్రూర జంతువులుగానైనా పుట్టవచ్చు. మన ప్రవర్తనను బట్టే, వచ్చే జన్మ వస్తుంది.

అందువల్ల ఈ శరీరంలో ఉండగానే, సుకృతాలు ఆర్జించి, తర్వాత శాశ్వత ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేసుకోవాలి. ఇదే పరీక్షిన్మహారాజు ఆలోచన. అందుకే ఆయన భాగవత శ్రవణం.

*శుభంభూయాత్*

కామెంట్‌లు లేవు: