11, సెప్టెంబర్ 2020, శుక్రవారం

మొగలిచెర్ల అవధూత

మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..
పల్లకీసేవ..పరివర్తన..

"నేను సహజంగా ఇలా మారుమూల పల్లెటూళ్లకు రానండీ..అంత సమయం కూడా నాకు దొరకదు..ఒక్కరోజు నేను మా ఆఫీస్ లో లేకపోయినా..ఎందరో ఇబ్బందిపడతారు..నాకూ అక్కడ ఒక్కక్షణం తీరిక ఉండదు..ఇదిగో ఈవిడ దత్త భక్తురాలు కాబట్టి..ఈ క్షేత్రం గురించి విని చూడాలని పట్టుబట్టింది..అందుకోసం విధిలేక ఆమెతో పాటు వచ్చాను..నేను ఈరోజే తిరిగి వెళ్లిపోవాలని అనుకున్నాను..ఇప్పుడు పల్లకీ సేవ లో పాల్గొని..రేపుదయం హారతులు కూడా చూసి..సమాధి దర్శనం చేసుకొని వెళదామని ఒకటే పోరు పెట్టింది..ఇక తప్పలేదు..మేము ఉండటానికి ఒక ac రూము దొరుకుతుందా?.." అని హైదరాబాద్ నుంచి వచ్చిన లక్ష్మణరావు గారు అడిగారు..ఆయన ముఖంలో అసహనం కొట్టొచ్చినట్టు కనబడుతోంది..

"ఇక్కడ ac రూములు లేవు..ఉన్న రూముల్లో కూడా నేలమీద పడుకోవాలి..చాపలు ఉంటాయి..ఎక్కువమంది భక్తులు మందిరం లోనే స్థలం చూసుకొని పడుకుంటారు.. పైగా ఇప్పుడు ఆ రూములు కూడా ఖాళీ లేవు..మీకు కావాలంటే..మందిరం వెనకాల రేకుల షెడ్ ఉంది..అందులో ఖాళీ ఉంది..అక్కడ ఉండొచ్చు.." అని మా సిబ్బంది ఆయనకు చెప్పారు..

"ఖర్మ!..ఖర్మ!.." అనుకుంటూ తన భార్యను తిట్టుకుంటూ..ఆయన తన జీవితంలో ఇంత బాధ ఎన్నడూ అనుభవించలేదన్నట్లు భావిస్తూ..పోయి తన కార్ లో కూర్చున్నారు..ఆయన భార్య మాత్రం ఇవేవీ పట్టకుండా..శ్రీ స్వామివారి పల్లకీ సేవ కోసం తమ పేర్లు నమోదు చేయించుకొన్నారు..

సాయంత్రం ఏడు గంటలకు పల్లకీసేవ ప్రారంభం అయింది..అయిష్టంగానే లక్ష్మణరావు గారు భార్యతో సహా పల్లకీసేవ లో కూర్చున్నారు..అర్చకస్వాములు సంకల్పం చెప్పి..వీరి గోత్రనామాలను కూడా పలికిన తరువాత..పూజ ప్రారంభం అయింది..పల్లకీ సేవలో కూర్చున్న లక్ష్మణరావు గారి లో ఉన్న అసహనం ఎటుపోయిందో తెలీదు..ఆయన అక్కడ జరుగుతున్న తంతును అత్యంత భక్తిగా చూడసాగారు..అర్చకస్వాములు పలుకుతున్న మంత్రాలను శ్రద్ధగా వినసాగారు..పూజ అనంతరం..పల్లకీని శ్రీ స్వామివారి మందిరం చుట్టూరా మూడు మార్లు ప్రదక్షిణగా త్రిప్పుతారు..ఆ సమయం లో పల్లకీ మోయడానికి ముందుగా పేర్లు నమోదు చేసుకొని, పూజలో కూర్చున్న వారికి ప్రాధాన్యత ఇస్తారు..ఆ క్రమంలో భాగంగా పూజలో కూర్చున్న లక్ష్మణరావు గారిని కూడా రమ్మనమని అర్చకస్వాములు చెప్పారు..మారు మాట్లాడకుండా లక్ష్మణరావు గారు పల్లకీని మోయడానికి సిద్ధపడ్డారు..ఆయన భార్య అవాక్కైపోయి చూస్తున్నది..ఇంతవరకూ తనను తిట్టిపోసిన తన భర్త..ఇప్పుడు ఈరకంగా అందరికంటే ముందుగా తయారైపోవడం ఆవిడకు అర్ధం కాలేదు..అంతా ఆ దత్తుడి దయ అని అనుకున్నది..

మూడు ప్రదక్షిణాలు పూర్తయ్యేదాకా లక్ష్మణరావు పల్లకీని మోసారు.. అంతా అయిపోయి ప్రసాదం తీసుకొని నేరుగా నాదగ్గరకు ఆ దంపతులు వచ్చారు.
"పల్లకీ సేవ లో పాల్గొనడం నేను ఎప్పుడో చేసుకున్న పుణ్యం అండీ..నాకు ఈరోజు ఆ భాగ్యం కలిగింది..నిజానికి నేను చాలా విసుగుతో వున్నాను..మరి క్షణాల్లో నా మనసు మారిపోయింది..ఎలా జరిగిందో నాకూ అర్ధం కాలేదండీ..శ్రీ స్వామివారు నన్ను కరుణించారు అని మాత్రం చెప్పగలను..వీలున్నప్పుడల్లా నేను నా భార్య ఇద్దరం వచ్చి..ఈ పల్లకీసేవ లో పాల్గొంటాము..నాకున్న అపోహలన్నీ పటాపంచలై పోయాయి.." అన్నారు..

లక్ష్మణరావు గారు ఆ ప్రక్కరోజు ఉదయం శ్రీ స్వామివారి సమాధి దర్శనం చేసుకొని..తిరిగి హైదరాబాద్ వెళ్లారు..ఈ సంఘటన జరిగి సుమారు మూడు సంవత్సరాలు అయింది..ఈ మూడేళ్ళలో ఆ దంపతులు కనీసం ఐదారు సార్లు శ్రీ స్వామివారి మందిరానికి వచ్చి..పల్లకీసేవ లో పాల్గొన్నారు..ఆయనలో మార్పు రావడానికి శ్రీ స్వామివారు ఏమి చేసారో..వారిద్దరికే తెలియాలి..

సర్వం..
శ్రీ దత్తకృప!.

(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: