11, సెప్టెంబర్ 2020, శుక్రవారం

రామాయణమ్..58


..
రామా ! మా మిధిలలో ఉన్నప్పుడు ఒక భిక్షుకి నాకు వనవాసమున్నట్లుగా ఎరుక చెప్పినది. ఒక బ్రాహ్మణుడు కూడా అదే విషయము నాకు చెప్పినాడు ! అంతే కాకుండా నాకు కూడా అడవులలో సంచరించాలనే కోరిక ఉన్నది.
.
నీతో చెట్టాపట్టాలేసుకుని చెట్టూచేమా, ఏరులు ,సరస్సులలో విహారం చేయాలని ఉంది ,విరగబూసిన కమలాలతో నిండిన సరస్సులలో మనోహరంగా తిరుగాడే హంసలను ,కారండవపక్షులను నీ చేతిలో చేయివేసి కూర్చుని ఆనందంగా వీక్షించాలని ఉన్నది . ..
.
మనోహరమైన ప్రకృతిలో నీతో కలిసి లక్షసంవత్సరాలయినా ఆనందంగా జీవించగలనురామా ! .
.
అని ఎంతో ఉత్సాహంగా పలుకుతున్న సీతమాటలకు రాముడు అడ్డువచ్చాడు ! సీతా! అరణ్యమంటే ఆషామాషీ కాదు !
.
భయంకరమైన సింహగర్జనలతో వనమంతా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది,మత్తెక్కి క్రీడించే క్రూరమృగాలు మనుషులను చూడగనే మీదిమీదికి దూకుతుంటాయి,నదులన్నీ మొసళ్ళు,బురదతో నిండి దాటటానికి శక్యం కాకుండా ఉంటాయి.
.
దారులన్నీ డొంకలతోటి ,ముళ్ళతోటి నిండిఉంటాయి అడవికోళ్ళ అరుపులు వినపడుతుంటాయి
.
 నీరుదొరకదు.పగలంతా శ్రమపడి రాత్రివేళ ఆకులుపరచుకొని ఆ పక్కలపైపడుకోవాల్సిఉంటుంది.కందమూలాలు తవ్వుకొని తినాల్సి ఉంటుంది ,
.
కావున ఓ సుకుమారీ ! ఎండకన్నెరుగనిదానవు నీవు ,ఏడుమల్లెలెత్తుగా పెరిగినదానవు ఇన్ని కష్టాలు భరించలేవు
.
వనవాసము దుఃఖము తో కూడినటువంటుది నీవు రావలదు అని స్పష్టంగా చెప్పేశాడు రాముడు!.
.
అప్పుడు కన్నుల నీరు నింపుకొని ప్రేమగా భర్తను చూస్తూ ,రామా నిజమే ! వనవాసంలో ఇన్ని దోషాలు ఉన్నమాట నిజమే ! కానీ నీ సాంగత్యంలో అవన్నీ నాకు గుణాలే ! .
.
క్రూరమృగాలు నిన్నుచూస్తేనే పారిపోతాయి ! .
.
నీతో ఒక్కక్షణవియోగమైనా నాకు మరణహేతువు! రామా నీవు నా ప్రక్కన ఉంటే ఈ ప్రపంచంలో ఏదీ నాకు అవసరం లేదు ! .
.
ఇంతగా ప్రాధేయపడినా రాముని మనసు కరుగలేదు ! ఇక లాభంలేదనుకుంది సీతమ్మ! .
.
ప్రేమచేత ప్రార్ధిస్తే వినటంలేదీయన అని అనుకొన్నది.
.
ఎర్రబడ్డకళ్ళతో కించిదహంకారంతో నిందించడం మొదలుపెట్టింది
.
రామా! నీవు పురుష శరీరంలో ఉన్న ఒక ఆడుదానివి ! అసలు నిన్ను ఆ మిధిలాధీశుడు ఏం చూసి అల్లుడుగా చేసుకొన్నాడో అర్ధం కావటంలేదు నాకు! .
.
నువ్వుతప్ప నాకిక్కడ ఎవ్వరూ గతిలేరు నీవులేక నేను ఒంటరిదానను ,నన్నిక్కడే వదిలివెళ్ళాలని ఎందుకనుకుంటున్నావు ! నీ భయానికి గల కారణమేమిటి ? .
.
సావిత్రి సత్యవంతుడిని అనుసరించినట్లు నీ నీడలా నిన్ను అనుసరిస్తూనే ఉంటాను !.
.
NB.
.( సినిమా ప్రభావంలో ఉన్న మనకు సీత ఇట్లా మాట్లాడిందా అనే అనుమానం కలుగుతుంది .అక్షరాలా ఇంతే మాట్లాడింది.సీత అంటే తల వంచుకొని కష్టాలు మౌనంగా భరించేది కాదు ఒక ధీరోదాత్తురాలైన స్త్రీ .తనకు ధర్మబద్ధంగాఏది ఇష్టమో ఆ పనే చేసింది. Hight of a woman's imagination in this country is Sitha and Savithry అని స్వామీ వివేకానందుడంటారు).
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

కామెంట్‌లు లేవు: