7, జనవరి 2021, గురువారం

మొగలిచెర్ల

 *లక్షణమైన జీవనం..*


"నాచిన్నప్పుడు..నాకు పదేళ్ల వయసుంటుందేమో..సరిగ్గా గుర్తులేదు..నన్ను తీసుకొని మా అమ్మా మా నాయనా మాలకొండకు పోతూ దారిలో ఇక్కడ ఆగారు.అప్పటికి ఈ స్వామి బతికే వున్నాడు..మా నాయన రెండు చేతుల తో దణ్ణం పెట్టాడు..అమ్మ కూడా దణ్ణం పెట్టింది..స్వామీ చెయ్యెత్తి ఆశీర్వదించారు..నాకు బాగా గుర్తు.."కొండయ్యా..అమ్మాయి పేరేంది?.." అని మా నాయనను అడిగాడు.."లక్షమ్మ స్వామీ.." అని మా నాయన బదులిచ్చాడు..మంచిది అన్నాడు..ఆ తరువాత ఏం మాట్లాడింది గుర్తు లేదు..కొంచెం సేపు ఇక్కడే పందిరి కింద కూర్చున్నాము..కొండకు పోయి తిరిగివచ్చేటప్పుడు కూడా మా అమ్మానాయనా స్వామికోసం ఆగారు కానీ..స్వామి కనబడలేదు..మా ఊరుకు వెళ్లిపోయాము.." అంటూ ఆ పెద్దావిడ మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చినప్పుడల్లా గుర్తుచేసుకొని చెప్పుకుంటూ ఉంటుంది..ఆమె మాట్లాడే విధానం లో పల్లెటూరి యాస ఉంటుంది..కానీ అత్యంత భక్తి ప్రపత్తులు అందులో దాగి ఉంటాయి..


"స్వామివారిని చూశావు కదా..నీ గురించి ఆయనేమీ చెప్పలేదా..?" అని నేను అడిగాను.."ఏమో నయ్యా..నాకు గుర్తులేదు..కాకుంటే..మా నాయన నా పేరు చెప్పిన తరువాత..నా తలకాయ మీద చెయ్యిపెట్టాడు..అదొక్కటే గుర్తు..నాకూ ఆశీర్వాదం ఇచ్చాడేమో.." "ఆతరువాత రెండు మూడేళ్లకు అనుకుంటా.."మొగిలిచెర్ల స్వామివారు సమాధి అయ్యాడట.."అని మా వాళ్లే చెప్పుకుంటుంటే విన్నాను..అట్లా జరిగిపోయింది ఆరోజుల్లో.." అని పెద్దగా నిట్టూర్చి చెప్పేది..


"అదృష్టవంతురాలివి తల్లీ..స్వామివారి చేతి స్పర్శను పొందావు..మహానుభావుడు నిన్ను నేరుగా ఆశీర్వదించారు..అంతకంటే నీకేం కావాలి..నీ జీవితం ఎలా సాగింది?" అని ఆవిడను ఒకసారి అడిగాను..


"నాకే లోటూ లేదయ్యా..అప్పట్లో మా ఇళ్లల్లో మేనరికాలో..లేకపోతే దగ్గర బంధువుల్లోనో పిల్లను ఇచ్చేవాళ్ళు..నాకు మాత్రం బైట సంబంధం వచ్చింది..ఆరోజుల్లోనే మా అత్తగారు వాళ్ళు మద్రాసు లో బియ్యం వ్యాపారం చేసేవాళ్ళు..నా భర్త కూడా అదే వ్యాపారం చేసాడు..లక్షణంగా సంపాదించుకున్నాము..ముగ్గురు బిడ్డలు పుట్టారు..ఇద్దరు అమ్మాయిలు, ఒక కొడుకు..వాళ్లకూ పెళ్లిళ్లు అయ్యాయి..కొడుకు బాగానే చదువుకున్నాడు కానీ..ఈ వ్యాపారమే బాగుందని ఇందులోనే ఉండిపోయాడు..ఇప్పుడు మద్రాసులో మాకు మొత్తం ఐదు చోట్ల దుకాణాలు ఉన్నాయి..మేము తెలుగు వాళ్ళము అని చెప్పినా నమ్మరు..నాకు పెళ్ళైన తరువాత నేను మా అత్తగారింట్లో ఈ స్వామి గురించి చెప్పాను..మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు..మా అబ్బాయికి వాడి పదహారో ఏట పెద్ద జబ్బు చేసింది..డాక్టర్లు మందులు వాడారు..తగ్గినట్లే తగ్గి, మళ్లీ జబ్బు తిరగబెట్టింది..నేను పట్టుబట్టి మా పెనిమిటి చేత ఈ స్వామికి ముడుపు కట్టించాను..పిల్లవాడికి జబ్బు తగ్గితే..రెండు కట్టలు బియ్యం తీసుకొచ్చి మొగిలిచెర్ల గుడి దగ్గర ఇస్తాను అని మొక్కుకున్నాను..సరిగ్గా వారం రోజుల్లో వాడికి నయం అయింది..వాడు పూర్తిగా కొలుకున్నాక నా భర్తా నేను ఇక్కడికి వచ్చి స్వామి సమాధి కి నమస్కారం చేసుకొని మొక్కు చెల్లించుకున్నాము..ఆరోజు నుంచే మా ఆయన కూడా స్వామి నే నమ్ముకున్నాడు..ప్రతి ఏడూ మేము ఇక్కడికి వచ్చి..మా వంతుగా రెండుకట్టలు బియ్యం ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకున్నాము..మా అబ్బాయికి పెళ్లి చేసి ఆ పసుపు బట్టలతోనే వాళ్ళిద్దరినీ ఇక్కడకు తీసుకొచ్చి స్వామి కి దణ్ణం పెట్టించాము.." అని చెపుతూ ఒక్కక్షణం ఆగింది..చీరకొంగుతో కళ్ళు తుడుచుకుంటూ.."పోయిన ఏడాది ఆయన కాలం చేసాడు..అదొక్కటే వెలితి నాకు..ముత్తైదువుగా పోయుంటే బాగుండేది..కొడుకూ కోడలు నన్ను బాగా చూసుకుంటారు.." అన్నది..


నిండైన జీవితం లక్షమ్మది..ఏ లోటూ లేకుండా జీవితాన్ని వెళ్లదీసింది..తాను బ్రతికున్నంత కాలమూ..ప్రతి సంవత్సరం స్వామివారి దర్శనానికి వచ్చేది..పోయిన సంవత్సరం దత్తదీక్ష ల కాలం లోనే ఆమె మరణించినట్లు మాకు వార్త తెలిసింది..


స్వామివారి వరద హస్త స్పర్శ పొందిన ధన్యజీవి లక్షమ్మ..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: