7, జనవరి 2021, గురువారం

పోతన గారి భాగవతం లోని పద్యాలు

 కంజాక్షునకు గాని కాయంబు కాయమే? 

పవన గుంభిత చర్మభస్త్రి గాక, 

వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే? 

ఢమ ఢమ ధ్వనితోడి ఢక్క గాక, 


హరి పూజనము లేని హస్తంబు హస్తమే? 

తరుశాఖ నిర్మిత దర్వి గాక, 

కమలేశు జూడని కన్నులు కన్నులే? 

తను కుడ్య జాల రంధ్రములు గాక, 


చక్రిచింత లేని జన్మంబు జన్మమే? 

తరళ సలిల బుద్బుదంబు గాక, 

విష్ణుభక్తి లేని విబుధుండు విబుధు( డే? 

పాదయుగముతోడి పశువు గాక.''


తాత్పర్యం :

పద్మాక్షుడైన విష్ణుమూర్తికి సేవ చేయని శరీరం శరీరం కాదు. గాలితో నిండిన తోలు తిత్తి మాత్రమే.

వైకుంఠ వాసుడైన విష్ణుమూర్తిని స్త్రోత్రం చేయని నోరు నోరు కాదు,కేవలం ఢమ ఢమ అని శబ్దం చేసే చర్మపుఢక్క మాత్రమే.


హరిని పూజించని చెయ్యి చెయ్యే కాదు, కేవలం చెట్ల కొమ్మతో చేసిన తెడ్డు మాత్రమే.


ఇందిరాపతిని చూడని కన్నులు కన్నులే కావు,,

శరీరమనే కిటికీ రంధ్రాలు మాత్రమే.

సుదర్శనాయుధుని చింతించని జన్మము జన్మమే కాదు, నీటిపైని కదిలే బుడగ మాత్రమే.

విష్ణుభక్తి లేని పండితుడు పండితుడు కాదు,రెండు పాదాలతో నడిచే పశువు మాత్రమే.


భగవంతుడు మనిషికి కరచరణాది అవయవాలు ప్రసాదించాడు. ఆ కారణంవల్ల మనిషి దేవుని పట్ల కృతజ్ఞతతో ఉండటం ఒక రకమైతే ఆ అవయవాలను విష్ణు సేవకుఅర్పితం కావాలని చెపుతున్నారు.

కామెంట్‌లు లేవు: