7, జనవరి 2021, గురువారం

శ్రీమద్రామాయణావతరణము

 🌹శ్రీమద్రామాయణావతరణము 🌹 


ఆశ్రమము జేరి వాల్మీకి  యాగమోక్త

నిష్ఠ పూరిత కార్యముల్  నిర్వ హించి

క్రౌoచ పక్షుల విషయమే కదల మదిని

ధ్యాన మందున గూర్చునె  తన్మయమున.   23 


సృష్టికర్త యజుడు శ్రీవాణినాథుండు 

          సత్యలోక ము నుండి స్వయము గాను 

తపసి వాల్మీకిని  దర్శించ దలచియు 

         రాయంచ పై వచ్చె రాగమునను 

వచ్చిన నలువను వాల్మీకి గాంచియు

         ముకుళిత హస్తాల ముందు కొచ్చె

ఆర్ఘ్యంబు నిచ్చియు నంజలి ఘటియించి 

          వేధను పూజించె వినయ ముగను

అంత బ్రహ్మ దేవు డర్హాస నంబున

కూర్మి తోడ నచట కూరు చుండె

యజుని యాజ్ఞ తోడ నచటనే వాల్మీకి

వేరు చోట నుండె వినయ ముగను           24 


పులుగులు రెండు శాఖ పయి

         పొందుచు సౌఖ్యము హాయి నుండగన్

యలుగును క్రూరత న్నొదలి

         నందలి పెంటిని గొట్ట నేలపై

గిలగిల లాడుచున్ పడియె ,

         కీడొన రించిన లుబ్ధకుండు యీ

యిల పయి నుండగన్ తగిన

         హేతువు నుండదు చింత సేయగన్

        

క్రౌంచమును బట్టు తలపున క్రౌర్యమునను

కామకేళిలొ మునిగిన ఖగము నొకటి

కోల తోడను నేలకు  కూల గొట్టె

నెంత పనిజేసె దుర్మార్గు డెఱిగి యెఱిగి !    25 


మౌని వాల్మీయి యారీతి మనము నందు

యలుగు పాటున పడినట్టి పులుగు గతిని

బాధ లోనుండి  వచ్చిన పలుకు రీతి

మననమొనరించు చుండెను మఱియుమఱియు 26 



బ్రహ్మ దేవు డంత పరికించి మౌనిని

యమిత కరుణ తోడ నభయ మిచ్చె 

కలవరమున నుండ గమనించి యతనితో 

పరమ కరుణ తోడ పలికె నిట్లు                   27 


గోపాలుని మధుసూదనరావు 🙏

కామెంట్‌లు లేవు: