27, నవంబర్ 2023, సోమవారం

 )()( ఆలోచనాలోచనాలు )()( సంస్కృత సూక్తి సుధ )()( అక్షర రూపం దాల్చిన సిరాచుక్క; లక్ష మెదళ్ళకు కదలిక )()(                                      1* భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాద్భయం, మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరా భయం, శాస్త్రే వాద భయం, గుణే ఖిల భయం, కాయే కృతాన్తాద్భయం, సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం, వైరాగ్యమేవాభయమ్!!         ఈ లోకంలో భోగాలు అనుభవిస్తున్నప్పుడు రోగం వచ్చి మీద పడుతుందేమోనని భయం. మంచికులంలో పుట్టామా? కులగౌరవం దెబ్బతింటుందేమోనని భయం. ధనం సంపాదిస్తే ప్రభుత్వం గాని, దొంగలు గాని అపహరిస్తారేమోనని భయం. మానం ఉన్నవాడికి అది పోయి దైన్యం ఏర్పడుతుందేమోనని భయం. బలవంతుడికి తన శత్రువు తనపై గెలుస్తాడేమోనని భయం. మంచి రూపం వుంటే , ముసలితనం ఏర్పడి అందచందాలు పోతాయేమోననే భయం. శాస్త్రాలు చదివి పాండిత్యం ఉంటే వాదనలో ఓడిపోతానేమోననే భయం. మేలైన గుణాలు ఉంటే అవి తొలగిపోయి దుర్జనులు నిందిస్తారనే భయం. దేహం ఉన్నది అంటే దానికి యమధర్మరాజు ఎప్పుడు తీసుకెళతాడోననే భయం. ఇట్లా లోకంలో అన్ని వస్తువులకు భయం అంటూ వుంది. భయంలేని ఏకైక వస్తువు "" వైరాగ్యం"" మాత్రమే సుమా! (భర్తృహరి సుభాషితం)          2* పండితేచైవ, మూర్ఖేచ, బలవత్యపి దుర్బలే, ధనికో దరిద్రేచైవ, మృత్యోస్సర్వత్ర తుల్యతః!!                           ధనవంతుడేకాని, దరిద్రుడేకాని-- బలవంతుడేకానీ, బలహీనుడేకానీ -- ధనవంతుడేకానీ, దరిద్రుడేకానీ, అందరినీ సమానంగా చూచేది ఒక్క మృత్యువు మాత్రమే! దానికి ఎక్కువ,తక్కువలు-- తారతమ్యాలు లేవు.              3* మాతరం, పితరం, పుత్రం, భ్రాతరం వా సుహృత్తమమ్!                    లోభావిష్టో నరో హన్తి, స్వామినంవా సహోదరమ్!!                        అధికమైన ఆశ ఎవడినైతే పీడిస్తూవుంటుందో అట్లాంటివాడు తల్లినిగాని, తండ్రిని గాని, కొడుకునుగాని, స్నేహితునిగాని, తోడబుట్టినవానిని గాని, యజమానిని గాని, ప్రభువును గాని చంపుటకు వెనుదీయడు. కనుక అత్యాశ మిక్కిలి చెడ్డది.         4* య ఏవం వేత్తి హన్తారం.  యశ్చైనం మన్యతే హతం! ఉభౌ తవ్ న విజానీతో వాయం హన్తి నహన్యతే!!( భగవద్గీత)      ఆత్మ చంపేది కాదు; చంపబడేది కాదు. దానికి చావుపుట్టుకలు లేవు. కొంతకాలం ఉండిపొయ్యేదికాదు. ఎప్పుడూ ఒకే రీతిగా , స్థిరంగా ఉండే ఈ ఆత్మ అనాది అయినది.                 5* వాసాంసి జీర్ణాని యథావిహాయ, నవాని గృహ్ణాతి నరోపరాణి, తథా శరీరాణి విహాయ జీర్ణా, న్యన్యాని సంయాతి నవాని దేహీ!!                                  వస్త్రములు చిరిగిపోయినప్పుడు మనిషి చిరిగిన వస్త్రములు విడచి నూతన వస్త్రములు ధరిస్తాడు. అట్లాగే ఆత్మకూడా శిధిలమైన శరీరాన్ని విడచి నూతన శరీరాన్ని పొందుతూ వుంటుంది. ( ఈ ఆత్మ స్వరూపాన్ని గురించి తెలుసుకొన్నవాడు జ్ఞాని అవుతున్నాడు) --(భగవద్గీత)                        6* ఘృతస్య పాత్రమాధారోవా, పాత్రస్య ఘృత మాధారోవా!               తర్క శాస్త్ర చదువుకొనే ఒకానొక మూర్ఖ శిఖామణి గిన్నెకు నెయ్యి ఆధారమా? నెయ్యికి గిన్నె ఆధారమో తెలుసుకోదలచి ,గిన్నెలోని నెయ్యిని ఒలకబోసుకున్నాడట. తెలివి తార్కిక వాదం మిక్కిలి ప్రమాదకరం.             7* వృశ్చిక భయా పలాయ మానః, ఆశీవిషముఖై నిపతితం---                          ఒకడికి తేలు కనబడింది. అది కుడుతుందేమోననే భయంతో పరుగెత్తి ఒక పాము నోటిలో పడ్డాడు. దురదృష్టవంతుల పరిస్థితి ఇట్లాగే వుంటుంది.                8* క్షాన్తి శ్చేత్కవచేస కిం కింమరిభిః.                           క్రోధోస్తి చేదేహినాం, జ్ఞాతిశ్చేదనలేన.                    కింయది సుహృద్ది వ్యోషధైః కింఫలమ్,                            కింసర్పైర్యది దుర్జనాః, కిముధనైర్విద్యా.                   సపద్యాయది, వ్రీడాచే త్కిము భూషణైః,                 సుకవితా యద్యస్తి రాజ్యేన కిమ్!!                                   విద్య గొప్పది. దానిని మించిన ఐశ్వర్యం లేదు. ఓర్పు అనేది ఉంటే వేరే కవచం అక్కరలేదు. కోపం ఉంటే వేరే శత్రువు అక్కరలేదు. మంచి స్నేహితుడంటూ వుంటే వేరే దివ్యౌషధాలు అవసరం లేదు. దుర్జనులు ఉంటే వేరే పాములతో పని లేదు. దోషరహితమైన విద్య ఉంటే వేరే ధనం అక్కరలేదు. లజ్జ ఉంటే వేరే భూషణములు అవసరం లేదు. పాండిత్యం లేదా మంచి కవిత్వం ఉంటే  వేరే రాజ్యం అక్కర లేదు. ( భర్తృహరి సుభాషితం)        చివరగా ఒక చమత్కార శ్లోకం.                                    అశ్వం నైవ, గజం నైవ, వ్యాఘ్రం నైవచ, నైవచ !               అజాపుత్రం బలిం దద్యాత్ , దైవో దుర్బల ఘాతకః!!                             ఎవరైనా గుర్రాన్నిగాని, ఏనుగునుగానీ, పెద్ద పులిని గానీ దేవతకు బలిని ఇవ్వరు. పాపం! అమాయకమైన , దుర్బలమైన "మేక పిల్ల" ను మాత్రమే బలి ఇస్తారు. దైవం కూడా దుర్బలులనే శిక్షిస్తాడని భావం.                  తేది 26--11--2023, ఆదివారం, శుభోదయం.

కామెంట్‌లు లేవు: