27, నవంబర్ 2023, సోమవారం

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 13*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 *13. ఆనాయ నాయనారు*


మేల్ మళనాడు అనే దేశంలో తిరుమంగళం అనే అందమైన గ్రామం ఉంది.  ఆ గ్రామంలో యాదవ వంశాన్ని ఉద్ధరించడానికా అన్నట్లు

ఆనాయరు అవతరించాడు. పవిత్రమైన విభూతిని ధరించిన అతడు శివునికి

తప్ప వేరొకరికి నమస్కరించడు. ఆనాయరు పశువులను మేపడం వృత్తిగా

కలిగినవాడు. ముల్లైప్రాంతపు పచ్చిక బయళ్లలో వాటిని మేపుతుంటాడు.


 పశువులకు వేర్వేరు కొట్టాలను ఏర్పరచి వాటిలో పశువులను జాగ్రత్తగా ఉంచి కాపాడుతూ వచ్చాడు. సంగీతంలో నిష్ణాతుడైన ఆనాయరు వెదురులో రంధ్రాన్ని ఏర్పరచి

వేణువును తయారుచేసి దానినుండి మధురమైన సంగీతాన్ని వర్షిస్తుండేవాడు.

ఒక పర్యాయం పరమేశ్వరుని పంచాక్షరి మంత్రాన్ని తన వేణువుద్వారా

వాయించడం ప్రారంభించాడు ఆనాయరు. 


శరీరాన్ని మైమరపించే

అద్భుతమైన నాదాన్ని విన్నటువంటి పశువులు మేతమేయడం మానివేసి

ఆనాయరు చుట్టూరా నిలిచాయి. పాలు తాగుతున్న దూడలు పాలు తాగడం

మానివేశాయి. ఆనాయరు సంగీతానికి చరాచర లోకాలు తన్మయత్వంలో

మునిగిపోయాయి.

కపట భక్తికి వశ్యుడు కాని పరమేశ్వరుని చెవులకు ఆనాయరు

వేణునాదం సోకింది.


 వెంటనే ఉమాదేవితో కలసి వృషభవాహనారూఢుడై

అనాయరు ముందు ప్రత్యక్షమయ్యాడు. "భక్తుడా! వేణునాదం ఆలపిస్తున్న

ఈ స్థితిలోనే నీవు మమ్మల్ని చేరుకోగలవు" అని పరమేశ్వరుడు ఆనాయరుని

అనుగ్రహించాడు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

*పదమూడవ చరిత్ర సంపూర్ణం*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

కామెంట్‌లు లేవు: