27, నవంబర్ 2023, సోమవారం

 *దత్తభక్తుడు*


దిగంబరా..దిగంబరా..శ్రీపాదవల్లభ దిగంబరా!!!..." 

"దిగంబరా..దిగంబరా..దత్తావధూత దిగంబరా!!!.." 


శ్రావ్యమైన కంఠంతో..స్వామివారి ప్రధాన మంటపంలో ఓ మూల కూర్చుని ఓ 70 ఏళ్ల పైబడిన పెద్దాయన తనలో తానే పెద్దగా పాడుకుంటున్నారు..ఆయనది తెల్లని మేనిఛాయ..ఆరడుగుల ఆజానుబాహువైన రూపం..నుదుటిన పెద్ద బొట్టు..సంప్రదాయ పంచెకట్టు..ఈ సంఘటన నాలుగు నెలల క్రిందటిది..అప్పటికి సమయం ఉదయం 8 గంటలు..


మా అర్చకస్వామిని  "ఎవరీయన?" అని అడిగాను.."ఆయన పేరు మాధవ శర్మ గారు..వినుకొండ నుంచి వచ్చారు..ఇంతకు ముందు మూడు నాలుగు నెలల క్రితం కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి సమాధి దర్శించుకొని వెళ్లారు..అప్పుడు మీరు ఇక్కడ లేరు..ఇప్పుడు కొన్నాళ్ల పాటు ఇక్కడే ఉండాలని సంకల్పంతో వచ్చారట..మీతో మాట్లాడతానన్నారు.." అన్నారు..వారిని పిలవమని చెప్పాను..


మాధవ శర్మగారు నా దగ్గరకు వచ్చారు.."ఇక్కడ ఈ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి క్షేత్రం లో ఓ నలభై రోజులు ఉండాలని సంకల్పం కలిగిందండీ..దానికి కారణం కూడా వుందండీ...మొదటిసారి ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు నాకు ఒకవిధమైన అనుభూతి కలిగింది..ఆ ప్రక్కరోజు మా వినుకొండ కు తిరిగి వెళ్ళాను..స్వామివారే పదే పదే మనసులో మెదులుతూ ఉన్నారు..ఓ నాలుగురోజుల క్రితం ఒకరోజు రాత్రి ఈ స్వామివారు నాకు స్వప్నం లో దర్శనం ఇచ్చి..ఇక్కడికి వెళ్ళమని ఆదేశం ఇచ్చారు..ఇక ఉండబట్టలేకపోయాను..నేరుగా బయలుదేరి వచ్చేసాను..మీరు అనుమతి ఇస్తే..ఇక్కడ ఓ మండలం రోజులు ఉంటాను..నాకు ప్రత్యేకంగా రూము ఏమీ వద్దు..ఈ మంటపం లోనే ఉంటాను..దత్తావతారాల నామాలు..స్తోత్రాలు కంఠతా వచ్చు..అవే స్మరణ చేసుకుంటూ ఉంటాను.." అన్నారు.."సరే నండీ.. మీ ఇష్టం వచ్చినంత కాలం వుండండి.." అని అన్నాను..


స్వామివారి మందిరం లోనే ఉన్న శ్రీపాద శ్రీవల్లభ స్వామి మందిరం వద్ద ప్రతి శని, ఆది వారాల్లో వచ్చే భక్తులకు హారతి తీర్థము ఇచ్చే అర్చకస్వామి ఎవరూ లేరు..వారం వారం ఎవరో ఒకరిని ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది..ఈ మాధవ శర్మ గారిని అక్కడ ఈ విధులు నిర్వహించడానికి అడిగితే ఎలా వుంటుంది అనే ఆలోచన నాలో కలిగింది..మా అర్చకస్వాములతో..సిబ్బందితో చర్చించాను..ఈ ఆలోచన బాగుంది అని వాళ్ళందరూ ముక్తకంఠంతో చెప్పారు..


మాధవశర్మ గారిని పిలిచి ఈ ఆలోచన గురించి చెప్పాను..వారి కళ్ళలో ఒక్కసారిగా నీళ్లు చిప్పిల్లాయి.."నాకు మహాభాగ్యం దక్కింది అనుకుంటాను అండీ..సంతోషంగా ఉంటాను..స్వామి సన్నిధిలో సేవ చేసుకునే అవకాశం కల్పించారు.." అని నాకు నమస్కరించబోయారు..అంత పెద్దవారు నాకు నమస్కారం చేయడం సమంజసం కాదని వారిని వారించాను..మరో మూడు రోజుల తరువాత..మాధవశర్మ గారు ఒప్పుకుంటే..శాశ్వతంగా వారు ఇక్కడే ఉండిపోతే బాగుండు అని నాకు అనిపించింది..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి నా మనసులోని కోరిక తెలుపుకున్నాను..ఆ తరువాత వారిని అడిగాను..ఒక్క క్షణం కళ్ళుమూసుకుని ఆలోచించి.."ఈ దత్తాత్రేయుడు నన్ను పిలిపించుకున్నాడు..ఇక్కడే ఉండాలని నాకూ ఉంది..మీరే అడిగారు..ఇక్కడే వుండి సేవ చేసుకుంటూ ఉంటాను.." అన్నారు..


అలా మాధవ శర్మ గారు మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం లో ఒక సేవకుడిగా ఒదిగిపోయారు.. ఈలోపల శ్రీ స్వామివారి ఆరాధన సందర్భంగా దత్తదీక్ష స్వీకరించి..ఆ నలభైరోజులూ నిష్ఠగా దీక్ష లో పాల్గొని..స్వామివారి ఆరాధన రోజు దీక్ష విరమణ చేశారు..అందులో ఆశ్చర్యం ఏమీ లేదు..ఎందుకంటే సాక్షాత్తూ సమాధి లో కూర్చున్న స్వామివారే శర్మగారికి స్వప్న దర్శనం ఇచ్చి మరీ తనవద్దకు పిలిపించుకున్నారు..నేనూ మా సిబ్బందీ కేవలం నిమిత్తమాత్రులం..


మరోమాట.. శ్రీ మాధవశర్మ గారు ఒక కంపెనీ లో పెద్ద హోదాలో పనిచేసి రిటైర్ అయ్యారు వారికి ముగ్గురు సంతానం..భార్యా పిల్లలూ అందరూ విదేశాల్లో స్థిరపడ్డారు..వారు మాత్రం దత్తసేవకు అంకితం అయ్యారు..


సర్వం..

శ్రీదత్తకృప!!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం.. వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523 114..సెల్ : 94402 66380 మరియు 99089 73699)

కామెంట్‌లు లేవు: