🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
. *🌹సౌందర్యలహరి🌹*
. *శ్లోకం - 89*
🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷
*నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శశిభి*
*స్తరూణాం దివ్యానాం హసత ఇవ తే చండి చరణౌ |ఫలాని స్వస్థేభ్యః కిసలయ కరాగ్రేణ దదతాం*
*దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశ మహ్నాయ దదతౌ ‖*
సౌందర్యలహరి 2, 3 శ్లోకాలలో అమ్మవారి పాద రజ ధూళి మహిమనూ, 87, 88 శ్లోకాల్లో ఆమె పాదవైభవాన్నీ వర్ణించిన శంకరులు ఈ శ్లోకములో కూడా ఆమె పాద నఖముల కీర్తిని వర్ణిస్తున్నారు.
నఖై:శశిభిః = అమ్మా, నీ పాదముల గోళ్లు చంద్రవంకల వలె వున్నాయి. వాటిని చూసిన
నాక స్త్రీణాం కరకమల సంకోచ = శచీదేవి నేతృత్వంలో అమ్మవారి పాదాలను అర్చించటానికి వచ్చిన దేవతా స్త్రీల కరకమలములు సిగ్గుతో ముడుచుకుపోయినవట. కమలములు రాత్రివేళ ముడుచుకుపోతాయి కదా! అంతేకాక
తరూణాం దివ్యానాం హసత ఇవ తే చండి చరణౌ = అమ్మవారి పాదాలు దేవతా వృక్షములైన కల్పవృక్షములను తలచుకొని నవ్వుతున్నాయట. ఎందుకని? కల్పవృక్షములు దేవతల అధీనంలో ఉండేవి, అన్ని కామ్యములను తీర్చేవి. వాటి పూలు తీసుకొని దేవతలు అమ్మవారి పాదార్చనకు వచ్చారంటే ఆమె పాదములు అన్నిటికన్నా మిన్న అయినవనీ, వాటిముందు కల్పవృక్షములు కూడా తీసికట్టు అని అమ్మవారి పాదముల నఖములు నవ్వుతున్నాయట.
ఫలాని స్వస్థేభ్యః కిసలయ కరాగ్రేణ దదతాం = స్వస్థులంటే బాధలు లేని వారు, అనగా దేవతలకు మాత్రమే కల్పవృక్షములు ఫలాన్ని ఇస్తాయి. కానీ, అమ్మవారి పాదాలు
దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశ మహ్నాయ దదతౌ = లోకము లోని దరిద్రులకు కూడా స్వర్గానికి వెళ్లలేనివారికి కూడా సమస్త సంపదలను మాత్రమే కాక కల్పవృక్షము,కామధేనువు ఇవ్వలేని మోక్ష సంపదను కూడా ఇస్తాయి అమ్మవారి పాదాలు.
ఈ శ్లోకం రెండవపాదంలో అమ్మవారిని చండి అని సంబోధించారు శంకరులు. చండి అనగా ప్రతిబంధకములను తొలగించునది. ఈ ప్రతిబంధకములనే శత్రువులు, అసురులు అని చెప్పుకుంటున్నాము.
ఎవరు వీరు? ముముక్షువునకు మోక్షసాధనలో అడుగడుగునా అడ్డు తగిలే ఇంద్రియ వాసనలు, సంసార తాపత్రయములు, కామ క్రోధాది అరిషడ్వర్గములు, రజస్తమో గుణములు మున్నగునవి. అమ్మవారు ఒక్కొక్క రూపంలో, ఒక్కొక్క ప్రత్యేకమైన స్వభావం కల అసురులను అణచివేయటానికి అవతరిస్తారు. పైన చెప్పిన గుణములు ప్రధానముగా కల శుమ్భ నిశుమ్భులను, మహిషాసురుడిని, విషంగ విశుక్రులను, భండాసురుడినీ సంహరించటానికి చండీ రూపంలో వస్తారు. ఇదే మార్కండేయ పురాణములోని ప్రసిద్ధమైన దేవీ మాహాత్మ్యము, చండీ, దుర్గా సప్తశతి (700 శ్లోకములు కలిగినది.అత్యంత నిష్ఠతో నిబద్ధతతో పారాయణ చేయవలసిన స్తోత్రము). ఇక్కడ ఈ సంబోధన ఎందుకంటే, విషయవాంఛలు, లౌకికమైన ధన కనక వస్తు వాహనాది వాంఛలు లేని స్వచ్ఛమైన మనస్సు కలిగిన భక్తులకు అమ్మవారు మోక్ష సంపదను ప్రసాదిస్తారు. చండీదేవిగా అమ్మవారిని ఆరాధిస్తే ఆయా ప్రతిబంధకాలను తొలగించి తన భక్తుడిని,పరతత్త్వాన్ని గ్రహించి,అనుసరించే శక్తిని ప్రసాదిస్తారు.
శ్రీ లలితా సహస్ర నామములలోని 44,45 నామములైన *నఖదీధితిసంఛన్ననమజ్జనతమోగుణా* *పదద్వయప్రభాజాలపరాకృతసరోరుహా* సౌందర్యలహరిలో పైన చెప్పబడిన శ్లోకములోని భావమును తెలుపుచున్నవి.
🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి