#ఆముక్త మాల్య#
విష్ణుచిత్తుడు "వాదించడానికి రాజ సభకు వెళ్ళు" అనిన స్వామితో ఇలా అంటున్నాడు.
సీ. "స్వామీ ! మహాదేవ ! శరణాగతుడ నేను
పెనుభార మీరీతి బెట్ట దగునె !
అపఠితశాస్త్రుండ నత్యంతమూఢుండ
గ్రంధజాత్యంధుండ కడుజడుండ
నారామభూమిని ననయంబు ద్రవ్వుచు
పట్టియు గుద్దలిన్ బాటు పడగ
పటు ఘర్షణంబున పాణి ద్వయంబున
కాయలు గాచిన కర్షకుడను
భక్తితో నీ గీము బరిశుభ్ర మొనరించు
భావమ్ము నందుండు సేవకుడను
తే. అట్టి నను వాదమున కీవు పట్టుబట్టి
ప్రభువు సభకును దెలిసియు పంపితేని
గల్గు నపజయ, మపకీర్తి కాదె నీది,
పంపుటకు ముందె యోచించు పరమపురుష!
సీ. పరమాత్మ ! నిరతంబు భవదాలయమ్మునన్
పరిమార్జనము సేయు పనిని కాని
స్నానమ్మునకు దివ్య సలిలమున్ దెచ్చెడి
భవ్యమౌదివ్యమౌ పనిని కాని
శృంగార పల్లకిన్ జేబూని మోసెడు
వాహనసేవయన్ పనిని కాని
తులసిదండలు గట్టి తోమాలగా నీకు
భక్తితో నర్పించు పనిని కాని
ప్రభువు లర్పించెడు పలువిధ ధ్వజముల
పట్టియల్ మోసెడు పనిని కాని
ఛత్ర చామరములు సద్భక్తి తోడను
పరవశమ్మున బట్టు పనిని గాని
ముందు దీపమ్ముల మోదమ్ము తో నెత్తి
నిను గాంచు భాగ్యమౌ పనిని కాని
తే. సల్ప నర్హుండ నేను, నో సర్వవినుత !
వాదమది యేల యీశ్వరా ! వదలు నన్ను
నన్యు లెవ్వరు కనరారె యవనియందు
నీదు లీలలు ప్రకటించ నీరజాక్ష !"
సరళపద్యానుసరణము :
గోపాలుని మధుసూదన రావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి