8, అక్టోబర్ 2024, మంగళవారం

కంబరామాయణం 102

 కంబరామాయణం 102

( జటాయువు )

...


మధురమనోహర రూపాన్ని తనివితీరా చూస్తూ "రామా" ! అంటూ తన్మయత్వంతో పిలిచారు అగస్త్యమహర్షి ! 

..

నాయనా ! ఇక్కడికి దగ్గరలోనే ఒక చిన్నపర్వతమున్నది ! సెలయేళ్ళు,మట్టిదిబ్బలు ,ఫలవృక్షాలతోపులతో మనోహరంగా ఉంటుందా ప్రదేశము ! 

..

 సీతమ్మ స్నేహం చేయటానికి అక్కడ రాయంచలు,రాచిలుకలు ఎన్నో ఉన్నాయి ! అక్కడ నివాసమేర్పరచుకొంటే బాగుంటుంది అని సూచించారు మహర్షి !

..

 ఆ ప్రాంతం పేరు పంచవటి

...

రాముడు మహర్షి వద్ద సెలవు తీసుకొని పంచవటి వైపు పయనం సాగించాడు !

...

సమున్నత పర్వతపంక్తులు ,వేగంగా పారే గొప్పనదులు దట్టమైన అరణ్యాలు దాటి నడుస్తున్నారు .

...

 ఒక కొండ మీద లేతబంగారు రంగులో ప్రకాశిస్తూ దివ్యకాంతులు ఆకాశంలోకి వెదజల్లుతున్న మరొక కొండ వారికి కనిపించింది ! 

..

అదేమిటో చూడాలనే కుతూహలంతో దగ్గరికి సమీపించారు వారు !

...

ఆ కొండ మరెవరో కాదు ! ఆకాశమంత విశాలమైన రెక్కలతో దివ్యప్రభలు వెదజల్లుతున్న ఒక గరుడపక్షి ! ఆ పక్షిపేరు జటాయువు ! సృష్టిలోని ఏ ప్రాణి చూడలేనంత దవ్వు తన చూపు ప్రసరించగల శక్తి ఆయన స్వంతం !

...

ఆ జటాయువు మెడలో  నవగ్రహాలను తలపించే నవరత్నాల మాల ధరించి ఉన్నాడు ! సూర్యుడే తన కిరీటమన్నట్లుగా ఠీవిగా కొండమీద ఆయన నిలుచున్నాడు ! ఆయన బరువు మోయలేక కొద్దిగా క్రుంగిపోయింది ఆ కొండ !

...

సూర్యభగవానుడి రధసారధి అరుణుడి( అనూరుడు ) కుమారుడు ఆయన ! 

ఇప్పటివాడా ఆయన ! ఎప్పటివాడో తెలియనంత పాతకాలము వాడు !

...

ఎవరై ఉంటారు ? తన నాశము కోరి మనలను సమీపించినవాడు కాకపోతే తప్పకుండా గరుడుడే అయి ఉంటాడు అని అనుకున్నారు రామలక్ష్మణులు !

...

సీతారామలక్ష్మణులను చాలాదూరం నుండి గమనిస్తున్నాడు జటాయువు !

..

 ఒకరు కాటుకకొండ మరియొకరు బంగరుకొండ ! వీరి కాలధూళికి కూడా సరితూగడా మన్మథుడు !


కాటుకకొండకు బంగరుమెరుపుతీగ చుట్టినట్లు అపురూపలావణ్యవతి అయిన స్త్రీ !

...

ఎవరు వీరు ?

...

వీరిని చూడగనే నా ప్రాణస్నేహితుడు దశరథుడు గుర్తుకు వస్తున్నాడే !!! అని తలపోశాడు జటాయువు !

....

వూటుకూరు జానకిరామారావు

కామెంట్‌లు లేవు: