8, అక్టోబర్ 2024, మంగళవారం

కంబరామాయణం 103

 కంబరామాయణం 103

( జటాయువు పరిచయం)


వీరులారా !ఎవరు మీరు ? అని అడిగాడు జటాయువు ! అందుకు ప్రతిగా " మేము దశరథచక్రవర్తి కుమారులము, పేర్లు రామ ,లక్ష్మణులు ! ఈమె నా భార్య సీత" అని బదులిచ్చాడు రామచంద్రుడు !

...

దశరథుని కుమారులని తెలియగానే పట్టరాని సంతోషంతో రయ్యిమని క్రిందకు దూకాడు జటాయువు ! తన రెండురెక్కలతో వారిని చుట్టేసి ఆలింగనం చేసుకున్నాడు !

...

తన ఛత్రఛాయలో లోకాలను చల్లగా పాలించే నా మిత్రుడు దశరథుడు క్షేమమే కదా ! అని ప్రశ్నించాడు జటాయువు !

...

తమ తండ్రి స్వర్గస్తుడయినాడని తెలిపాడు రామచంద్రుడు !

...

ఆ వార్త వినటంతోటే పిడుగుపాటుకు దెబ్బతిని నేలకూలినట్లుగా ఒక్కసారిగా పడిపోయాడు జటాయువు ,కనుల వెంట ధారాపాతంగా కన్నీరు కారుస్తూ పెద్దపెట్టున విలపించసాగాడు !

...

రామలక్ష్మణులు వెనువెంటనే ఆయనను లేవదీసి కనులనీరు తుడిచి దగ్గరకు తీసుకున్నారు !

...

ఓ రాజా ! ఓ చక్రవర్తీ ! అధర్మపరులకు అసత్యవాదులకు సింహస్వప్నమా ! నేడు నీవే స్వప్నమయి పోయినావా ! నాడు శంబరాసురునితో పోరుసలిపినప్పుడు ఒకరికొకరము బాసటగా నిలిచి రణములో నిలబడినామే ! నీ మరణవార్త తెలిసిన తదుపరికూడా నా కంఠములో ప్రాణమింకా నిలచియున్నదే ! ఏమి జన్మనాది ! అంటూ దుఃఖించసాగాడు జటాయువు !

...

కొద్దిసేపటి తరువాత నెమ్మదించి రామలక్ష్మణులవైపు చూసి నాయనలారా నాపేరు జటాయువు సూర్యభగవానుడి రధసారధి అరుణుడి పుత్రుడను ! నేను పుట్టి యుగాల గడచినవి ! నీ తండ్రికి నేను ప్రాణస్నేహితుడను ! నాకొక అన్నగలడు అతని పేరు సంపాతి ! నేను గరుడజాతి పక్షులకు రాజును అని తనను తాను పరిచయం చేసుకున్నాడు .

...

జటాయువులో తమ తండ్రిని చూసుకొని ఆనందించారు రామలక్ష్మణులు !

...

వారిరువురినీ కౌగలించుకొని ! నాయనలారా నా పుత్రులవంటివారు మీరు ! నా అంతిమసంస్కారములు మీరే జరిపించవలె ! అది నా కోరిక అని పలికిన జటాయువును చూసి ,తండ్రీ ! మా నాయనగారి మరణము నుండి కలిగిన దుఃఖము మా హృదయమునుండి ఆరిపోలేదు ! నీవు కూడా మమ్ములను విడిచి వెళ్ళినట్లయితే మాకిక దిక్కెవ్వరు ? అని కడుప్రేమతో పలికాడు రాముడు .


అంత జటాయువు రాముని జూచి ,నాయనా ! రాజ్యము నేలకుండా నీవు తాపసివేషములో అడవిలో సంచరించుటకు గల కారణమేమి అని ప్రశ్నించాడు 

...

వూటుకూరు జానకిరామారావు

కామెంట్‌లు లేవు: