8, అక్టోబర్ 2024, మంగళవారం

కంబరామాయణం 96

 కంబరామాయణం 96

( విరాధ శాపవిమోచనం )

...

ఒక దివ్యపురుషుడు విరాధుడి కళేబరం నుంచి బయటకు వచ్చి ఆకాశాన నిలుచున్నాడు . అతడు కుబేరుడి శాపం కారణంగా రాక్షసరూపం ధరించిన గంధర్వుడు ! 

...

తనకు శాపవిమోచనం కలిగించినవాడు సాక్షాత్తూ వైకుంఠ వాసుడని ఎరిగిన విరాధుడు  రామచంద్రుని వేనోళ్ళ స్తుతించాడు !

...

శ్రీరఘురామా సీతారామా !

జయరఘురామా జానకిరామా!

 నను కరుణతో బ్రోచిన కమనీయ నామా రామా ! 

నీ దివ్యపాదారవిందాలు వామనావతారంలో లోకాలను ఆక్రమించి అద్భుతం చేశాయి ! మొన్నటికి మొన్న అహల్యాదేవికి నీ పాదమే శాపవిమోచనం కలిగించింది ! నేడు నీపాద స్పర్శతో నా జన్మతరించింది స్వామీ ! కమలాక్షా నీ కరుణార్ధ్రదృక్కులు నా పై సదా ప్రసరింపచేయుమయ్యా !

...

నీవే తల్లివి! నీవే తండ్రివి !నీవె తోడునీడ !

లోపలనీవే బయటనీవే విశ్వమంతటా నీవే !

..

తల్లి తెలియని దూడలేదు తన దూడను గుర్తుపట్టలేని తల్లిలేదు ! అదేమి చిత్రమో నీ సంతానమై ఉండి కూడా లోకులు నిన్నెరుగలేరు !

అని స్తుతిస్తున్న విరాధుడిని చూసి నీవెవరు ? నీకు రాక్షస రూపమెందువలన వచ్చింది అని అడిగాడు రామయ్య !

...

స్వామి పాదాలమీద వాలి చెప్పటం మొదలుపెట్టాడు విరాధుడు !

...

తండ్రీ ! నా పేరు తుంబురుడు ,నేనొక గంధర్వుడను మా రాజు కుబేరుడు !

రంభ నాట్యము, గానము చూసి మోహించి ఆమె ప్రేమలో పడి ఆమెతో రమిస్తూ ఇంద్రియాలన్ని వశము తప్పగా లోకాలన్నింటిని మరచి పోయాను .

...

కుబేరుడది చూసి నన్ను రాక్షసుడిని కమ్మని శపించాడు ! ఆయన కాళ్ళావేళ్ళాపడి శాపవిమోచన మార్గము కొరకు ప్రార్ధించగా ," రామచంద్రుడి పాద స్పర్శతో నీకు శాప విమోచనం కలుగుతుందని సెలవిచ్చాడు " అప్పటినుండి క్రూరత్వానికి మారు పేరయి ఈ అరణ్యములో అందరినీ బాధిస్తూ బ్రతుకుతున్నాను ! 

...

స్వామీ ! మీతో యుద్ధము చేసినందుకు ఈ దాసుడిని మన్నించి సెలవిప్పించండి అని కోరగా రాముడు విరాధునికి అనుమతినిచ్చాడు .

...

విరాధుడి నిష్క్రమణ తరువాత రామచంద్రుడు దండకారణ్యంలోనికి ప్రవేశించాడు !

...

వూటుకూరు జానకిరామారావు

కామెంట్‌లు లేవు: