కంబరామాయణం 99
( మునుల వేదన )
...
భారమైనహృదయాలతో శరభంగ మహర్షి ఆశ్రమం నుండి బయలు దేరారు మువ్వురూ !
...
సుందర పర్వతసీమలు ,మనోహర ఉద్యానవనాలు, కఠినశిలలు, ఉత్తుంగతరంగాలతో ఉధృతంగా ప్రవహించే నదీనదాలు, ఆకసం నుండి దూకుతున్నవా అన్నట్లున్న జలపాతాలు... ఎన్నింటినో దాటుకుంటూ వారి నడక సాగుతున్నది .
...
మునివాటికలకు చేరుకునే సమయానికి సూర్యుడు పడమటివైపు క్రుంగుతున్నాడు .
...
కార్చిచ్చులో కాలుతున్న అరణ్యంలో కారుమేఘాలు వర్షించినప్పుడు తిరిగి ఊపిరిపోసుకొన్న చెట్లవలే సీతారామలక్ష్మణులను చూడగానే ఆయాప్రాంతాలలో నివసిస్తున్న మునుల ప్రాణాలు లేచివచ్చాయి !
..
క్రూరరాక్షసులు వారిని పెట్టే బాధలు చెప్పనలవిగాకుండా ఉన్నాయి .
..
అడవిలో తప్పిపోయి విలవిలలాడే లేగదూడ తిరిగి తన తల్లిఆవును చేరినప్పుడు పొందే మనశ్శాంతి కనపడుతున్నది మునుల ముఖాలలో !
...
అడవిని విడిచిపెట్టలేరు, రాక్షసులను ఎదిరించనూలేరు ! వారి తపఃశక్తిని వృధాచేసుకొని రాక్షసులకు శాపమూ ఇవ్వలేరు ! ఇన్నాళ్ళకు వారి కష్టాలు కడతేరే మార్గం కనపడింది వారికి రాముని రూపంలో !
...
రామదర్శనమాత్రముచేత వారి హృదయాలు ప్రేమతో పొంగిపొర్లిపోయి రామయ్యమీద ఆశీస్సుల జడివానలు కురిపించారు !
..
సీతారామలక్ష్మణులు బసచేయడానికి వీలుగా ఒక కుటీరాన్ని సిద్ధం చేసి వారికి అవసరమైన కందమూలఫలాలు అందించి అప్పటికి రాత్రి అయినది కావున రామయ్యను విశ్రమించమని చెప్పి వారివారి కుటీరాలకు వెళ్ళిపోయారు మునులంతా !
...
రాత్రిగడచి బాలభానుడి కిరణాలు పుడమిని తాకు సమయానికి స్నానసంధ్యాదులు పూర్తిచేసుకున్నారు రామలక్ష్మణులు !
మునులంతా వచ్చి వారి చుట్టూ కూర్చున్నారు ..
...
రామచంద్రుడు వారినుద్దేశించి మాటాడుతూ ,ఆర్యులారా నేను చేయవలసిన కర్తవ్యాన్ని నాకు ఆదేశించండి అని పలికాడు.
...
జగద్రక్షకా రామచంద్రా ! ధర్మదూరులైన రాక్షసుల వలన మేము పొందే కష్టాలు అన్నీ ఇన్నీ కాదు ! మమ్ములను మా తపస్సుకు దూరం చేసి అణచివేస్తున్నారు !పులల గుంపు మధ్యలో పడిపోయిన జింకలవలె అయినది మా పరిస్థితి ! ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియకుండా ఉన్నది ! మా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని క్షణమొక యుగములాగ జీవిస్తున్నాము !
...
యజ్ఞములు లేవు ,వేదాధ్యయనము లేదు అన్నింటినీ ఆపివేసుకొని జీవచ్ఛవాలవలె నివసిస్తున్నాము ,చివరకు దేవేంద్రుడు సైతము వారి ఆజ్ఞకు లోబడి ప్రవర్తిస్తున్నాడు !
..
నీవుదప్ప మాకు వేరొండు దిక్కులేదు రామా! రక్షకా! మమ్ములను కాపాడు తండ్రీ అంటూ మొరవెట్టుకున్నారు మునులంతా !
....
వూటుకూరు జానకిరామారావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి