కంబరామాయణం 101
(అగస్త్యభగవానునిచే అస్త్రప్రదానము )
...
రామయ్యను చూడగనే అగస్త్యభగవానుడి ఆనందం అవధులు దాటింది !
ఆయన సామాన్యుడు కాడు ! సముద్రంలో దాక్కున్న అసురుల ఆచూకీ తెలియడం కోసం సముద్రాన్నే పుక్కిటపట్టిన అమిత తపఃసంపన్నుడు..వింధ్యపర్వత గర్వాన్ని అణచివేసినవాడు ! శివమహాదేవుడివలన ఉత్తరధృవము బరువై భూమి ఒరిగిపోతే తాను దక్షిణాన నిలుచుండి భూమియొక్క సంతులనాన్ని కాపాడినవాడు !
...
ఒక్కమాటలో చెప్పాలంటే మహావృక్షము దాగి ఉన్న మర్రివిత్తనము వంటివాడు అగస్త్యభగవానుడు !
...
అందరి అంతరంగాలలో కొలువైఉండి అంతటానిండి ఉండే సర్వవ్యాపకుడైన మహావిష్ణువు అవతారమైన రామచంద్రుడి కోసం ఆతురతతో ఎదురుచూస్తున్నాడాయన !
...
ప్రపంచాన్ని పీడించే రాక్షసులనే విషానికి విరుగుడు రామచంద్రుడు ! ఆయనను సేవించిన మునులు ఆ విషము బాధనుండి విముక్తులైనారు !
...
తామరాకులనుండి నీటిబిందువులు జలజలరాలినట్లుగా రామచంద్రుని దర్శించగనే తన కమండలములో కావేరిని దాచుకున్న అగస్త్యులవారి కనుకొలకులనుండి ఆనందబాష్పాలు అప్రయత్నంగా జాలువారాయి !
...
రామచంద్రుడు సీతాలక్ష్మి తో కూడి అగస్త్యులవారి పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు !
...
ఆశ్రమం వేదఘోషతో ప్రతిధ్వనించింది !
..
దండకారణ్యంలో నివసించే నీవు నా వద్దకు వస్తావని ఎదురు చూస్తున్నానయ్యా రామా !
...
ఇదుగో ! నీకోసము ఈ ధనువు ! దీనిని స్వీకరించు !
ఇది విష్ణుభగవానుడి ధనుస్సు ! ఇదుగో అక్షయతూణీరము ! ఇదుగో ఎదురులేని అజేయ ఖడ్గము !
నీకు పాశుపతాన్ని కూడా ఇస్తున్నాను !
రామా ! ఎదురులేని ఈ అస్త్ర సంపద రాక్షస సంహారానికి నీకు ఉపయోగపడుతుంది అని అపురూపమైన అస్త్రసంపదను రామునికిచ్చారు మహర్షి !
...
వూటుకూరు జానకిరామారావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి