8, అక్టోబర్ 2024, మంగళవారం

కంబరామాయణం 97

 కంబరామాయణం 97

( శరభంగ మహర్షి )

...

దట్టమైన దండకారణ్యంలో నడకసాగిస్తున్నారు సీతారామలక్ష్మణులు .చాలా దూరం నడచిన తరువాత ఒక మనోహరమైన ప్రదేశం కనుపించింది వారికి .అందమైన చెట్లతోపులు ,సుందరజలపాతాలు కనువిందుచేసే పక్షితతులు నాట్యమాడే మయూరాంగనలు మధురంగా వినిపించే కోకిలమ్మపాటలు ! ప్రకృతి అంతా రసరమ్యంగా ఉన్నది !

...

ఎందుకు ఉండదూ ! అది మహాతపఃసంపన్నుడైన శరభంగమహర్షి ఆశ్రమమున్న తావు !

...

ఆశ్రమప్రాంగణంలోకి అడుగుపెడుతుండగా వారొక దివ్యపురుషుడిని చూశారు ! ఆయన శరభంగ మహర్షి ఆశ్రమంలోనికి వెళ్ళాడు ! త్రిమూర్తులకు తప్ప ఎవరికీ తలవంచని దేవేంద్రుడాయన !

..

బ్రహ్మదేవుడు పంపగా శరభంగమహర్షి వద్దకు వచ్చాడు దేవేంద్రుడు !

...

మహర్షికి వినయంగా నమస్కరించాడాయన ! తమ రాకకు కారణమేమిటి అని అడిగారు మహర్షి !

...

వేలసంవత్సరాల కఠోరమైన నీ తపస్సు తానుకూడా చేయలేనని భావించిన బ్రహ్మదేవుడు మిమ్ములను తన లోకానికి ఆహ్వానించారు మహర్షీ ! అని పలికాడు దేవేంద్రుడు !

...

దేవేంద్రా ! క్షణకాలంలో మాసిపోయి చిరిగిపోయే చిత్రాలవంటివి ఈ లోకాలు అనేవి ! నేనేమి చేసుకుంటాను వాటితో  ! బ్రహ్మలోక ప్రాప్తి కలిగినా ఒకటే నాకు కలుగకపోయినా ఒకటే ! ఎందుకు అన్ని లోకాలు ?నా తపస్సు ఎన్నోయుగాలనుండీ నడుస్తున్నది !

...

కాలానికి అతీతమైన ,మార్పులేనటువంటి , అనంతమైన ఒక దివ్యలోకం ప్రాప్తించాలని నా తపస్సు ! అని దేవేంద్రుడికి బదులిచ్చాడు మహర్షి

...

సీతారామలక్ష్మణులు అప్పుడే ఆశ్రమముఖద్వారం చేరుకున్నారు . వారికి లోపలనుండి ఎవరో మాటాడుకుంటున్న ధ్వని వినిపించింది !

...

రాముడొక్కడే లోనికి ప్రవేశించాడు ! సీతమ్మ ,లక్ష్మణస్వామి ఇరువురూ బయటనే నిలుచున్నారు .

...

వూటుకూరు జానకిరామారావు

కామెంట్‌లు లేవు: