: కంబరామాయణం 104
(పంచవటికి పయనం )
తాపసివేషంలో ఎందుకు సంచరిస్తున్నావు ? నీవు రాజ్యమును ఏలవలసినవాడవు కదా !! నీకు హాని చేసినవారు ఎవరు ? సుర,గరుడ,యక్ష,కిన్నర ,పన్నగ ,రాక్షసజాతులలోని వారెవరైనా సరే వారిని పట్టి పరిమార్చి నీ రాజ్యము నీకు దక్కేలా చేస్తాను అని పలికాడు జటాయువు !
...
రాముడు లక్ష్మణుని వైపు చూశాడు ! లక్ష్మణుడు జటాయువు ను చూసి జరిగిన వృత్తాంతము యావత్తూ పూసగ్రుచ్చినట్లు వివరించాడు !
...
ఆహా ! సవతితల్లికోరికదీర్ప తండ్రిమాట మీద అడవులకొచ్చావా ! నా తండ్రీ! నీవంటివాడు ముల్లోకాలలో లేడు అని పుత్రవాత్సల్యంతో రాముడి శిరస్సు చుంబించాడు జటాయువు !
...
రామా నీవలన నీతండ్రి ధన్యుడయ్యాడు ! నీ తండ్రి నా స్నేహితుడగుట చేత నేను ధన్యుడనయ్యాను !
...
నాయనా నీ వివాహమెలా జరిగింది అని ప్రశ్నించాడు జటాయువు !
..
తాటకవధ నుంచి శివధనుర్భంగము దాకా ఆ కధ చెప్పాడు లక్ష్మణుడు !
...
అందుకు జటాయువు సంతసించి నాయనా నీవు ఈ అరణ్యములో ఇక్కడే నివాసమేర్పరచుకో ! గడువు ముగిసిన వెంటనే ఇక్కడనుండే నీవు అయోథ్య కు వెళ్ళవచ్చు అంతవరకు నీవు నా రక్షణలో ఉందువుగాని ! అని చెప్పాడు !
...
అప్పుడు రాముడు ," అగస్త్యభగవానుడు గోదావరి ఒడ్డున గల ఒక అందమైన ప్రదేశములో నివాసమేర్పరచుకొమ్మని సూచించారు " వారి సూచన ప్రకారము అక్కడికే వెళతాము అని బదులిచ్చాడు !
...
అవును అది ఎంతో సుందరమైన ప్రదేశము! అది పంచవటి ! నాతో రండి ! ఆ తావు నేను మీకు చూపుతాను ! అని మెల్లగా విశాలమైన రెక్కలు విప్పి వాటినీడ వారిపై పడేటట్లుగా ఆకాశంలో నిలుచుని దారి చూపసాగాడు !
..
ఆ పక్షిరాజు విశాలమైన రెక్కల నీడలో పంచవటి వైపు నడక సాగించారు సీతారామలక్ష్మణులు
...
వూటుకూరు జానకిరామారావు
: కంబరామాయణం 105
( పంచవటీతట సుస్థిత రాముడు )
...
పంచవటికి వారిని చేర్చాడు జటాయువు .
ఇక ఈరోజునుండి వీరి సంరక్షణ బాధ్యతనాది అని మనసులో దృఢపరచుకొని అటనుండి తన తావుకు వెళ్ళిపోయాడు జటాయువు ! ఆయనకు తెలుసు అది క్రూరరాక్షసులు మెసిలే చోటు అని !
...
గోదావరీ నది శీతలజలాలపైనుంచి వీచేగాలి వారి శరీరాలకు సుఖస్పర్శనందిస్తోంది !
..
గొప్ప కవుల కలం నుండి జాలువారే మహాకావ్యంలా ఉన్నది గోదావరి ప్రవాహం !
..
తన జలాల నిండా విరిసిన కమలాలతో ఆ నదీమతల్లి వళ్ళంత కనులు చేసుకొని వీరినే చూస్తున్నట్లుగా ఉన్నది.
...
గోదావరి మాత వైకుంఠవాసుని అర్చన చేస్తున్నప్పుడు సమర్పించిన పూలవలె కొన్ని తామరలు గాలికి ఎగిరివచ్చి సీతారాముల పాదాలు తాకుతున్నాయి .
..
గోదావరినదిలోని కమలాలమీద సయ్యాటలాడే చక్రవాకాలు సీతమ్మకు చూపి చిలిపిగానవ్వాడు రామయ్య !
..
నదిలో పైకి ఉబికిన ఇసుకదిబ్బలను రామయ్య భుజస్కంధాలను మాటిమాటికి మార్చిమార్చి చూసింది సీతమ్మ !
...
ఇసుకతిన్నెల మీద నడయాడే రాయంచలనడకలను, సీతమ్మ నడకలను పోల్చిచూసి మధురోహలతో మురిసి తడిసిపోయాడు రామయ్య !
...
నల్లకలువలను నీటిలో చూసి రామయ్య దేహాన్ని ఒకసారి చూసింది సీతమ్మ !
...
సుందరము మనోహరము అయిన ఆ ప్రాంతం వారినెంతో ఆకట్టుకున్నది !
...
ఎత్తైన ఒక ప్రాంతంలో పర్ణశాల నిర్మించాడు లక్ష్మణస్వామి !
...
వూటుకూరు జానకిరామారావు
: కంబరామాయణం 106
(శూర్పణఖ మనోవికారము)
ఆమె శూర్పణఖ ! నీలివజ్రపుదేహకాంతికల రాక్షసరాజు రావణాసురుడి చెల్లెలు !
..
రాక్షసజాతిఅనే మహావృక్షాన్ని అంతమొందించటానికి పుట్టిన పెనుచీడ !
...
కామజ్వరంతో సెగలుపుట్టే శరీరంతో , గాలిలో తేలియాడే రాగిరంగు కురులతో అది ఆ ప్రాంతంలో సంచరిస్తుంటుంది !
..
స్వైరవిహారిణి ఆ స్త్రీ !
..
దాని కాలి అందెల ధ్వనులు తాపసులకు మృత్యుఘంటానాదాలు !
...
స్వేచ్ఛగా తిరుగుతూ తిరుగుతూ రామచంద్రుని పర్ణశాలను సమీపించింది !
...
ఆ క్షణంలో దానికి తెలియదు రాక్షసజాతి అంతానికి తానే నాంది పలుకబోతుందని !
...
రాముడిని చూసింది ! ఆయనే యోగనిద్రనుంచి మేల్కొని లోకాలను ఆవరించిన రాక్షసజాతి అనే తమస్సును పారద్రోలటానికి ఇనకులేశుడుగా ప్రభవించిన శ్రీమహావిష్ణువని ఎరుగదు అది !
...
మరలమరల రాముడినే చూస్తూ ," ఆహా ! మనుషుల మనసులలో తప్ప ఇతరత్రా ఆకారమే లేని మన్మథుడు తపస్సు చేసి ఈ రూపం ధరియించినాడా యేమి ?" అని అనుకొన్నది
...
ఏమి భుజములవి !! పుడమిని చుట్టివేయగల ఏనుగు తొండముల వలె ఎంత బలిష్ఠముగా ఉన్నవో !
.
అబ్బ ! సుందరమైన ఈ మానిసి వక్షస్థలమును చూతమన్న నా రెండుకనులు సరిపోవుటలేదు కదా !
...
ఈయన ముఖసౌందర్యమును వాడిపోయే పద్మముతో ,వృద్ధిక్షయములున్న చంద్రుడితో పోల్చటము సరికాదు !
తనివితీరా ఆ సౌందర్యమును చూసి అనుభవించవలసినదేగానీ లోకములో దానికి సరితూగు వస్తువేదీ లేదు కదా !
..
ఈ భూమి ఎంత అదృష్టము చేసుకున్నదో ఈ పురుషుడు తన మీద నడవడానికి ! బహుశా ఈయన నడకల వలననే ఇక్కడి పుడమికి పులకలు వచ్చి గడ్డిమొలచినట్లుగా ఉన్నది !
...
ఈతని దేహకాంతులు భరించలేక సూర్యుడు పైపైకి పోతున్నాడు !
...
ప్రాణములేని పగడములతో ఈతని అధర సౌందర్యము పోల్చటమెంతవరకు సబబు ?
...
అంబుధికన్నా లోతుగా ఆకాశముకన్నా ఎత్తుగా పెరుగుతున్న కామభావనలలో కప్పెట్టబడిపోయి చిత్తరువులా నిలుచుండిపోయింది శూర్పణఖ !
...
వూటుకూరు జానకిరామారావు
: కంబరామాయణం 107
(శూర్పణఖ హొయలు )
...
అరవిందాక్షుడైన ఈ సుందరపురుషుడి బాహువులలో ఒదగని బ్రతుకెందుకు ?
మనసు తొందరపెడుతున్నది శూర్పణఖకు !
...
మరి ! ఈ రూపంలో తన వద్దకువెడితే కసిరివిసిరికొడతాడా పురుషపుంగవుడు ! వికారమైన ఈ రూపాన్ని చూసి ఏ మగవాడు మోహిస్తాడు ? అందుకే రూపం మార్చుకుంటాను !అని తనలో తను అనుకుని అపురూప లావణ్యంతో మిడిసిపడే ఒక స్త్రీరూపాన్ని ధరించింది !
..
మధురంగాపాడే పక్షిలాగ, విరబూసిన కల్పవృక్షంలాగ దానిమ్మపండురంగు పెదవులతో, నెమలిరంగుతో వయ్యారిభామలాగ ఆయన ముందుకు వెడతాను !
..
ఉండీ ఉండనట్లున్న నడుముతో పద్మములవంటి పాదములతో రాయంచనడకలు ,నెమలిహొయలు సంతరించుకుని వెన్నెలవెలుగులు వెదజల్లే తెల్లని విషకుంభము లాగ బయలుదేరింది !
..
దివినుంచి దిగివచ్చిన దేవకాంతవలె ఉన్నది శూర్పణఖ !
..
కరకంకణ నిక్వణాలు ,పదనూపుర నిస్వనాలు మధురమధురంగా వినవచ్చేటట్లుగా నడక సాగిస్తున్నది శూర్పణఖ !
...
రామచంద్రుడి దృష్టి శబ్దం వినవచ్చిన దిక్కుగా మరలింది !
...
ఫలభారంతో వంగిన తరువులాగ వక్షోభారంతో వంగిన లేలేతనడుముగల ఒక స్త్రీ పాదమంజీరాల ధ్వని అది !
...
ఎవరీ లేమ ? ఈమె తనువంతా సౌందర్యసీమ ! ఎక్కడి స్త్రీ ఈవిడ ! దేవకన్యా? నాగకన్యా ? గంధర్వకన్యా ? ఎవరై ఉంటుంది ఈవిడ ? ఈ ఘోరారణ్యములో సంచరించే స్త్రీ ఎవరై ఉంటుంది ఇక్కడేమి పని ఈవిడకి ?
అని ఆలోచనలో పడ్డాడు రామచంద్రుడు !
..
నెమ్మదిగా రాముడిని సమీపించింది శూర్పణఖ ! చురకత్తులవంటి చూపులు విసిరి బెదిరే జింకవలె వచ్చి రామచంద్రుని ప్రక్కన నిలుచున్నది !
...
అమ్మా ! శుభాంగీ ఎవరు నీవు ? నీవెచటిదానవు ?నీవారెవ్వరు ? ఏ పనిమీద ఇచటకు వచ్చినావు అని గౌరవభావంతో ప్రశ్నించాడు రామచంద్రుడు !
...
మూర్ఖురాలైన శూర్పణఖ రామచంద్రుడి సౌందర్యాన్ని కనులతోనే జుర్రుకుంటూ ఇలా సమాధానమిచ్చింది !
....
వూటుకూరు జానకిరామారావు
: కంబరామాయణం 108
(శూర్పణఖ కోరిక )
...
నేను త్రిలోకాధీశుడైన రావణుని చెల్లెలిని ! బ్రహ్మదేవుని మనుమడి కూతురుని ,కుబేరుడు నాకు అన్న ! నా పేరు "కామవల్లి" ! ....చెప్పింది శూర్పణఖ
...
నీవు రావణాసురుడి చెల్లెలు అయినచో రాక్షసస్త్రీవి ! మరి ఇంత దివ్యసౌందర్యము నీకెందువలన వచ్చినది ? నిజాయితీగా చెప్పు ! ప్రశ్నించాడు రామచంద్రుడు !
...
క్రూరుడు ,దుష్టుడు అయిన రావణుని చెంత జీవితం గడపడం ఇష్టం లేక ధర్మమార్గములో బ్రతకాలని నిశ్చయించుకుని ఇక్కడి మునులు ,ఋషుల సేవ చేసుకుంటూ మిగిలిన సమయంలో తపస్సు చేసుకుంటూ జీవిస్తున్నాను .. సాధుజనుల సేవ ,సజ్జన సాంగత్యము నా రూపు ను మార్చి వేశాయి ! అందుకే నాకు ఈ సుందరరూపము ! బదులు పలికింది శూర్పణఖ !
...
మరి ఒంటరిగా సంచరిస్తున్నావెందుకు ?
...
రాక్షసులతో కలవనప్పుడు ఒంటరితనమే కదా మిగిలేది !!!
...
నావలన నీకు ఏమి మేలు ఒనగూడాలో చెప్పు !!! ...రాముడు ప్రశ్నించాడు
...
రాముడి సమక్షములో రాముడినే చూస్తూ నిలుచున్న శూర్పణఖమీద మన్మథుడి శరముల తాకిడి హెచ్చింది !
..
కనులు విప్పారుస్తూ ఒకసారి చికిలిస్తూ మరొకసారి , ఆహ్వానిస్తున్నట్లుగా చేతులను కదులుస్తూ మరొకసారి, పైట జారుస్తూ పెదవి నొక్కుతూ వికారపు చేష్టలు ప్రదర్శిస్తున్నది శూర్పణఖ !
...
సిగ్గు లజ్జ లేని స్వైరిణి ఈ స్త్రీ అని రాముడు నిర్ధారించుకుని నిశ్శబ్దంగా కూర్చున్నాడు .
..
రాముడి మౌనం చూసి శూర్పణఖ హృదయం వేగంగా కొట్టుకోవడం మొదలైంది ! తను వచ్చినపని సఫలమవుతుందో లేదో అనే అనుమనం హెచ్చింది !
..
నీలాంటి ఒకడు పుడమిమీద పుడతాడని నాకు ముందే తెలిసి ఉంటే నా యవ్వనం వృథా అయ్యేది కాదు నిరుపమానమైన నీ సౌందర్యం నన్ను నిలవనీయడం లేదు నీకైదండ నా తలగడగా అమర్చుకోవాలని నా కోరిక ! అని మదిలోని మాట బయటపెట్టింది శూర్పణఖ !
..
నీతినియమాలు ధర్మవర్తనము లేని స్త్రీ గా గ్రహించాడు రాఘవుడు ! ...ఓ పడతీ ! నీవు పుట్టిన వంశమునకు, నీ పూర్వీకుల చరిత్రకు అనుగుణముగా లేదు నీ మాటతీరు ! అయినా నీవు బ్రాహ్మణస్త్రీవి నేనో క్షత్రియుడను ! మానవులు రాక్షసులను వివాహమాడరాదు ....అని బదులిచ్చాడు రామచంద్రుడు !
....
వూటుకూరు జానకిరామారావు
: కంబరామాయణం 110
( తిరస్కారం )
ఈ ఆడుది ఒక మోసగత్తె ! మాయలమారిది బహుశా ఒక రాక్షసి అయిఉండవచ్చును.
..
కామరూపధారిణి కాకపోయిన ఎడల సృష్టిలో మునుపెన్నడూ నేనుగాంచని ఇంత అపురూపసౌందర్యంతో ఈ పడతి ఉండుట అసంభవం !
..
కేవలం ఇచ్ఛారూపధారిణులయిన స్త్రీలు మాత్రమే ఇంతటి గొప్ప రూపం ధరించగలరు !
..
నాకు ఈవిడ వాలకము చూస్తే భయము కలుగుతున్నది కావున ఈవిడను ఇక్కడనుంచి పంపివేయుము ....అని శూర్పణఖ సీతమ్మను చూపుతూ రామచంద్రునితో పలికింది !
...
అలా పలుకుతూ సీతమ్మను చూసి ఓసిరాక్షసీ నీకిక్కడేమి పని నీ తావుకు నీవు వెళ్ళిపో అని పెద్దపెట్టున అరుస్తూ మీదమీదకు రాసాగింది !
..
శూర్పణఖ ను చూసి భయకంపిత అయిన సీతమ్మ పరుగున వచ్చి రాముడి బాహువులు ఆలంబనగా చేసుకొని నిలబడింది ! నల్లటివర్షమేఘమునకుమెరుపుఅంటినట్లుగా ఉన్నారు ఇరువురూ
...
రాక్షసుల ఎడ కించిత్ పరిహాసము కూడా పనికిరాదని అర్ధమయిన రామయ్య దృఢస్వరముతో ఆ రాక్షసిని హెచ్చరించాడు ...దుశ్చేష్టలు మాని వచ్చినదారిన మరలిపో నా సోదరుడు నిన్నిక్కడ చూడకమునుపే తిరిగివెళ్ళు లేని పక్షమున అతడు నీకు తీవ్రమైన దండన విధించగలడు !
...
నేనా ? మరలిపోవాలా ? నా సౌందర్యమును గాంచి ముల్లోకములలో మూర్ఛపోని వాడుండడు ! ఆ మాయావి కన్నా నేనెందులో తక్కువ ?
..
రా ! నా చెంతచేరు దానిని విడిచిపెట్టు అని రాముని బ్రతిమిలిలాడుతూ సీతమ్మ ను బెదిరిస్తూ వస్తున్న శూర్పణఖ ను చూసి సీతారాములు దానిని పట్టించుకోకుండా తమ పర్ణశాలలోనికి వెళ్ళిపోయినారు .
..
ఆ నిర్లక్ష్యాన్ని భరించలేకపోయింది శూర్పణఖ !అవయవాలు పట్టుదప్పి ప్రాణం పోతున్నట్లుగా అయిపోయింది ! శ్వాస ఆడటం లేదు అక్కడే రాయిలా నిలుచుండి పోయింది చాలాసేపటివరకు !
...
ఈ కరిమబ్బువర్ణపు సుందరుడు వఠ్ఠి పనికిరానివాడు ! నీలకుంతల అంటే ఆ నీలమేఘశ్యాముడికి ఎందుకంత వలపో !
..
ఇక అక్కడ ఎక్కువ సేపు నిలబడలేక తన నివాసానికి మరలింది శూర్పణఖ !
...
వూటుకూరు జానకిరామారావు
: కంబరామాయణం 109
(రాముడి పరిహాసం )
...
రాముడిలో కాస్త పరిహాసం తొంగిచూసింది !
అవునూ ! నేను రాజవంశీకుడిని నీవు బ్రాహ్మణ వనితవు మనిద్దరికి పొత్తుకుదరదుకదా !! ఎట్లా ?
..
లేదు లేదు ! మా తండ్రి వేదవేదాంగవేత్త అయిన బ్రాహ్మణుడే కానీ నా తల్లి మాత్రం రాజయిన సాలకటంకటుడి కూతురు అరుంధతీదేవి అంతటి పవిత్రమైనది !
..
రాముడప్పుడు కాస్త పరాచకమాడినాడు !
పెద్ద చిక్కే వచ్చిపడినది కదా ! మానవులు రాక్షసకాంతలని వివాహమాడరాదని పెద్దలు చెప్పగా విన్నాను నేను !
...
శూర్పణఖ తనలో తాను అనుకొన్నది ! అయ్యో ! రావణుని చెల్లెలను అని అనవసరంగా తొందరపడి చెప్పినానే !
ఎదురుగా ఉన్నవాడు శ్రీమహావిష్ణువంత అందంగా ఉన్నవాడు ! అతని పొందుదొరకని బ్రతుకూ ఒక బ్రతుకేనా అని మథన పడింది !అయినా ప్రయత్నం మానలేదు ! ....నేను నిన్ను పెళ్ళి చేసుకుంటే మా అన్నలు సగౌరవంగా ఆశీర్వదిస్తారు ! వారికి ఏ విధమైన అభ్యంతరము ఉండదు !
..
ఓహో బాగున్నది ! నీతో వివాహం నాకు లాభదాయకమంటావు ! ఒక ప్రక్క త్రిలోక విజేత రావణుడి అభయము మరొక ప్రక్క విశ్వంలోని అతిపెద్ద ఐశ్వర్యవంతుడు కుబేరుడి అండ లభిస్తుందంటావు!!! ...మరికొంత పరిహాసం తొంగి చూసింది రామయ్య మాటల్లో !
...
ఇంతలో సన్నజాజితీవలాంటి నారీశిరోమణి !ఒక సౌందర్యవతి మెరుపులీనే మేనితో పర్ణశాలలోపలినుండి వచ్చి రామయ్య చెంత నిలుచున్నది ! సొగసైన ఆ జంటను బ్రహ్మదేవుడు కూడా కనులు విప్పార్చి చూస్తాడు !
...
ఆమె సౌందర్యాన్ని సంభ్రమాశ్చర్యాలతో చూసింది శూర్పణఖ !
...
ఓ ! ఈతడు తన భార్యతోటి ఉన్నాడన్నమాట ! ఎంత అందంగా ఉన్నది ఈ పడతి ! పద్మాన్ని విడిచి ఈ పురుషుడితో జీవించవచ్చిన పద్మగంధి ఈవిడ ! సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మి కాదు కదా !
..
బహుశా బ్రహ్మదేవుడు తన సృష్టిలో ఇంతకు మించిన అందమైన జంటను వీరికి ముందు వీరితరువాత పుట్టించి ఉండడు గాక ఉండడు ! ఈ జంటయే మొదటిది చివరిది !
..
ఒక ఆడుదానిని అయి ఉండి ఈమె సౌందర్యాన్ని చూస్తూ నేనే చూపు త్రిప్పుకోలేక పోతున్నాను ! ఆ అందానిని వర్ణించడానికి నాకు భాష రాదు ! అంత భాష ఎవరివద్దనూ ఉండదు !
...
అయినా ! ఈమె అతని భార్య ఎందుకయి ఉండాలి ? నాలాగా ఈ సుందరాకారుని మోహించి వచ్చిన మరియొక స్త్రీ అయి ఉండవచ్చు కదా .....ఊహలలోకి వెళ్ళిపోయింది శూర్పణఖ
....
వూటుకూరు జానకిరామారావు
: కంబరామాయణం 112
(ముక్కు చెవులు కోయుట )
సీతమ్మ వైపు అడుగులువేస్తూ ఆవిడను పట్టుకోవాలని చేతులు చాచి గబగబ వెళుతున్న శూర్పణఖని చూశాడు లక్ష్మణుడు !
..
తను చేస్తున్న పనిని వదిలి పెట్టి ఏయ్ ఆగాగు అని గద్దిస్తూ ముందుకు ఉరికి వస్తున్నాడు !
వస్తూనే దాని జుట్టుబట్టుకొని లాగి ఒక్కతన్నతన్నాడు ! లక్ష్మణుడిని చంకలో ఇరికించుకొని పైకి ఎగరాలని చూసింది శూర్పణఖ ! దాని ఆలోచన గ్రహించి క్రింద పడద్రోసి కాలితో అదిమిపట్టాడు లక్ష్మణుడు .
...
సర్రున కత్తిదూసి మెడనరకబోయి ఆగాడు ! స్త్రీ ని చంపటం పాపమని భావించి దాని ముక్కు, చెవులు ,స్తనాగ్రాలను కోసి వేశాడు .
...
బాధతో ఆ రాక్షసి వేసిన కేకలు ఆకాశానికి తాకాయి .ఆ రాక్షసి ముక్కునుండి రక్తం ఏరులై పారింది .
...
రావణుడి తల ఎగురకొట్టడానికి నాందిగా శూర్పణఖ ముక్కు చెవులు తెగగొట్టబడినాయి !
...
భయమంటే ఏమిటో తెలియని రాక్షసజాతిలో పుట్టిన స్త్రీ కి వెన్నులో చలి పుట్టించాడు ఇనవంశోద్భవుడు !
...
ఒక గుడ్డతో ముక్కును అదిమిపట్టింది ,తన వికారరూపాన్ని చూసుకున్నది !పడుతూలేస్తూ పరుగులు పెట్టసాగింది !
..
గాయాల తిమ్మిరితో తన బంధువర్గంలోని రాక్షసవీరులందరినీ పేరుపేరునా పిలుస్తూ గావుకేకలు వేయసాగింది .
...
ఏ రావణుని బాణపు దెబ్బకు భయపడి దేవేంద్రుడు పారిపోయినాడో
ఏ రావణుని వలన కైలాసం ఎత్తబడెనో
ఏ రావణుని కి శివుడు తన చంద్రహాసఖడ్గాన్ని బహుకరించినాడో
ఏ రావణునికి దడిసి ముల్లోకాలలోని మునులు దేవతలు ముక్కుమూసుకొని కూర్చున్నారో
...
నేడు ఆ రావణుని చెల్లెలుకు ఈ దీన స్థితి ప్రాప్తించుటయా ?
..
ఓ ఖరా ! హరుని కూడా యుద్ధములో ఎదిరించినావే
ఎక్కడున్నావు నీవు ! రా ! వచ్చి చూడు ఈ శూర్పణఖ దీనస్థితి !
.
అని బిగ్గరగా కేకలు వేస్తూ రాముడి పర్ణశాల చుట్టూ పరుగులు పెడుతున్నది శూర్పణఖ
....
వూటుకూరు జానకిరామారావు
: కంబరామాయణం 111
( విరహం )
...
తన తావుకు వెళ్ళిందన్నమాటేగాని తన తనువునిండా ఎగసిపడుతున్న కామజ్వాలలను అదుపు చేయలేక పడుకొని అటు ఇటుదొర్లుతున్నది శూర్పణఖ !
..
కాలనాగు కాటేయగా ఆ విషము తలను చేరి బాధభరించలేక సతమతమవుతున్నవానిలాగ నేలమీద చుట్టలు చుట్టుకొని దొర్లుతున్నది !
..
మన్మథుడిని నమిలివేయాలని చందురుడిని చిదిమివేయాలని పళ్ళుపటపట కొరుకుతున్నది ! కానీ ఇప్పుడు అశక్తురాలు ! వంట్లోని బలము ఉత్సాహము ఆతని తిరస్కారము చేత అడుగంటిపోయినాయి !
..
శూర్పణఖ వంటినుండి వెలువడే వేడివేడి సెగలను ఆర్పడానికి మంచుగడ్డలు తెచ్చి మీద ఉంచారు సేవకులు. కానీ అవి కాలే పెనంమీద వేసిన వెన్నముద్దవలే కరిగిపోతున్నాయి !
...
ఆడుసర్పము లాగ బుసలుకొడుతున్నది శూర్పణఖ ,తిరస్కారం భరించలేకపోతున్నది !
..
మలయపవనాలు ,శీతలోపచారాలు ,చల్లనిగంధపుమైపూతలు శూర్పణఖ శరీరపు వేడిని ఏమాత్రం తగ్గించలేక పోయాయి.
...
తన చలువరాతిభవనములో, స్ఫటిక మందిరములో కాలుగాలిన పిల్లిలా తిరుగాడుతూ నీలపు రంగులో కనపడిన ప్రతి స్తంభాన్ని రాముడనుకొని గాఢంగా కౌగలించుకుంటున్నది . దీనాతిదీనంగా బ్రతిమిలాడుకుంటున్నది
...
ప్రళయాగ్ని జ్వాలలు చుట్టుముట్టి దిక్కతోచక తిరుగాడే దానివలె అటునిటు వేగముగా పరుగులు పెడుతున్నది శూర్పణఖ !
...
పోతేపోనీ వెధవప్రాణం! ఆ రాముడి పొందులేని బ్రతుకెందుకు అని కలవరిస్తూ కలతనిదురలోనే ఆ రాత్రి గడిచిపోయింది శూర్పణఖకు !
...
తెలతెలవారింది ! ఒకటే లక్ష్యం రాముడి పొందు ! అందుకు అడ్డం ఆ సౌందర్యరాశి ! ఈ రోజే ఆవిడను అంతం చేయాలని నిశ్చయించుకుని బయలుదేరింది
...
రామచంద్రుడు సంధ్యావందనమాచరిస్తున్నాడు.
లక్ష్మణుడు ఎక్కడా కానరాలేదు !
సీతమ్మ రాముడికి కొంచెం దవ్వులో ఉన్నది !
...
ఇదే సమయమనుకొని సీతమ్మకు వెనుకవైపు చేరి గబగబ సీతమ్మ వైపు దుష్టపు ఆలోచనలతో అడుగులు వేసింది .
..
దూరంగా చెట్లతోపులో పండ్లు సేకరిస్తున్న లక్ష్మణస్వామి ఇది గమనించాడు...
...
వూటుకూరు జానకిరామారావు
...: కంబరామాయణం 114
(శూర్పణఖ బెదిరింపులు)
లక్ష్మణుడి మాటలు పూర్తిగాకముందే తాను మాట్లాడటం మొదలుపెట్టింది శూర్పణఖ !
...రాముడినుద్దేశించి ఓరాజా !
ఏ స్త్రీకయినా తాను వలచినవాడికోసం ఇంకొక స్త్రీ పోటీపడితే గుండెమండిపోతుంది .పోటీకి వచ్చిన స్త్రీ అడ్డు తొలగించుకోవాలని అనుకోవడం సహజం ! నేను అదే పని చేశాను .
...
అంత రాముడు శాంతగంభీరంగా ..ఓ వనితా ! మా రాకకు, మేమిచ్చట నివసించడానికి గల కారణం చెపుతాను విను . ఇచ్చట స్వేచ్ఛగా సంచరిస్తూ తాపసులను నానాక్షోభలకు గురిచేసే దుష్టరాక్షససంహారం మా లక్ష్యం కావున అనవసరపు మాటలు ,పనికిరాని చేష్టలు మాని నీవిచ్చటనుండి దూరంగా వెళ్ళిపో ! నీకు నీవారికి మేలు చేసినదానివవుతావు .
..
రాముని మాటలాలకించిన శూర్పణఖ ...ఓ! అంతటి మగధీరులా మీరు ! సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు సైతం తలవంచి గౌరవించే రావణుడికి సవాలు విసరగల మగటిమి గలవారా ? ఏమనుకుంటున్నారు మీరు రావణుని గురించి ! ఆయన త్రిలోక విజేత . ఆయన చెల్లెలికి అపకారం చేసిన మిమ్ములను ఊరికే వదిలిపెడతాడనుకున్నారా ? చిత్రవధచేసి చంపుతాడు .ఆయన క్రోధాగ్ని జ్వాలలలోపడి
నీవు నీవంశము సమూలంగా నాశనమవుతాయి
..
రా ! నాతో సుఖించు, భోగించు ,తనివితీరా అనుభవించు ! రావణుని అభయహస్తం నీకు లభించేటట్లు నేను చేస్తాను .తద్విరుద్ధముగా జరిగినదా ? ముల్లోకములలో కూడా నీ మొర ఆలకించువాడొక్కండునూ ఉండడు .
...
శీలవతులైన పడతులు తమ గొప్పతనాన్ని తాము చెప్పుకోరు ,కానీ నీమీద గల ప్రేమతో నేను చెపుతున్నాను విను . నీ తమ్ముడికి కూడా చెప్పు దేవతలు సైతం ఊడిగం చేసే అత్యంత శక్తివంతుడైన ప్రభువు రావణబ్రహ్మ ! ఆతని చెల్లెలును నేను !
..
స్వర్గములో క్రీడించాలని ఉన్నదా? రా ! తీసుకువెడతాను ! పుడమి మీద కల సర్వశ్రేష్ఠమైన మధురఫలాలు భక్షించాలని ఉన్నదా ? అయితే నీ కోరిక నేను తీరుస్తాను !
వేయి మాటలేల ! నాతో ఉంటే ఇది ఉన్నది అది లేదు అనేది ఉండనే ఉండదు .
.
ముల్లోకాలలో నా వంటి స్త్రీ నీకు దొరకదు .గొప్పవంశము ,అరుదైన అందము,అమితమైనబుద్ధి ,అంతులేనిశక్తి ,నిత్యయవ్వనము ఇన్నిటిని ఒక్కదగ్గరచేరిస్తే "నేను ".
.
ఇప్పుడు నా ముక్కు చెవులు పోయి వికారరూపిణిని అయినానంటావా ? వాటిని తిరిగి తెచ్చుకోవడం నాకు చిటికెలోని పని .
..
వచ్చిన అవకాశం చేజార్చుకోకు ఇక నేను మన్మథుని శరాలకు తాళలేను రా ! సుందరా రా ! మూర్ఖుడివి కాబోకు అని వదరుతున్న శూర్పణఖ ను చూసి రామచంద్రుడిలా అన్నాడు
..
దుష్టాత్మురాలా ! వెళ్ళు ఇక్కడనుండి ! వేయిఏనుగుల బలంతో మదించి తిరుగాడే తాటక గుండెలు బ్రద్దలుకొట్టిన బాణాలు ఇంకా నాతోనే ఉన్నాయి వాటి ములుకులకు అంటిన రక్తపు తడి ఇంకా ఆరలేదు వాటికి నీవు బలికావద్దు ,వెళ్ళిపో ! పాపపు ఆలోచనలు మాని వెళ్ళిపో !...
.
ఇక్ష్వాకుల ధీశక్తి ,భుజశక్తి ,తపోశక్తి నిన్ను దహించకమునుపే వెళ్ళిపో ! అని పలికాడు రాఘవుడు !
...
వూటుకూరు జానకిరామారావు
: కంబరామాయణం 113
(శూర్పణఖ విలాపము )
...
పిచ్చిపట్టినదానిలా పర్ణశాల చుట్టూ తిరుగుతున్నది ! గాయాలబాధకు పెద్దపెద్దగా కేకలు వేస్తూ రాక్షసవీరులను తన రక్షణకొరకు పిలుస్తూ పరుగులుపెడుతున్నది .
.
ఖరదూషణులను శాపనార్ధాలు పెడుతూ తనను కాపాడమని ఎలుగెత్తి అరుస్తూ పర్ణశాల మెట్లమీద జుట్టువిరబోసుకొని అడ్డముగా కూర్చున్నది శూర్పణఖ !
...
రాత్రి అంధకారాన్ని కూడా చీల్చివేయగల తళత్తళల కత్తులు ఉన్నది మీమీ ఒరలలో ఉంచుకోవడానికి కాదు , రండి ఈ నరాధములను కత్తికొక కండగా చీల్చివేయండి ఓ రాక్షస యోధులారా !అంటూ గావు కేకలు పెడుతున్నది .
...
గోదావరి నదికి వెళ్ళి స్నాన సంధ్యావందనాదులు పూర్తిచేసుకొని రామచంద్రుడు పర్ణశాలకు తిరిగి వచ్చాడు .
...
ఒక కంట రాముడి రాకను గమనించి తన స్వరాన్ని పెంచి పెద్దగా ఏడుస్తూ ....శృంగారవీరా వచ్చావా ! నా ప్రేమవ్యాధికి పెను ఔషధమా వచ్చావా ! ఇదుగో చూడు భుజబలగర్వంతో నీ తమ్ముడు చేసిన పని చూడు ! అంటూ వలవల ఏడుస్తూ రాముడికి మొరపెట్టుకున్నది !
...
వికారరూపముతో తన ముందు నిల్చిన స్త్రీ ఎవరో రాముడు గుర్తు పట్టలేదు !
...
ఎవరు నీవు ? అని అడిగాడు !
...
నన్ను గుర్తుపట్టలేదా నీవు ! నిన్ననే వచ్చి నీ పట్ల నాకు గల ప్రేమను వ్యక్తపరచినాను కదా ! అప్పుడే మరచిపోయినావా ! అని పలికింది శూర్పణఖ !
..
ఓహ్ నీవా ! ఆ విలాసినివి నీవేనా ?అప్సరసలను సైతం తలదన్నే ఆ సౌందర్య మేది ?ఈ వికారరూపమెటుల ప్రాప్తించినది నీకు ! ...అని అడిగిన రామచంద్రుని వైపు కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ చూసి ...ఇదుగో నీ తమ్ముడు నా ముక్కు చెవులు కోసివేసినాడు ! ఇంకెక్కడి సౌందర్యము ! ఇదుగోచూడు అంటూ రక్తమోడుతున్న వక్షోభాగాన్ని కూడా చూపింది శూర్పణఖ !
...
రామచంద్రుడు ప్రశాంతంగా తమ్ముని వైపు చూసి ,లక్ష్మణా ! ఈ స్త్రీ చేసిన నేరమేమిటి ? ఈ శిక్ష విధించావు !! అని అడిగాడు !
..
అన్నా ! ఈ స్త్రీ ఇచటికి ఆహారాన్వేషణకు వచ్చినదో లేక ఎవరైనా దురాత్ములచేత ప్రేరేపింపబడి వచ్చినదో తెలియదుగానీ వచ్చీ రావడమే వదినగారికి హానికలిగించు ఉద్దేశంతో ఆవిడ వెనుకగా వెళ్ళి ఆవిడను పట్టుకొని వెళ్ళడానికి ఉద్యుక్తురాలైనది! నేనది చూసి వారిస్తున్నా వినకుండా కదిలింది.....అంటూ చెపుతున్న లక్ష్మణస్వామి మాటలకు అడ్డం వచ్చింది శూర్పణఖ !
....
వూటుకూరు జానకిరామారావు
: కంబరామాయణం 115
(శూర్పణఖ నిష్క్రమణం )
...
రాముడు గద్దిస్తున్నా వినకుండా అలాగే నిలబడి ఓ రామా ! నీకు నన్ను పెళ్ళిచేసుకోవడం కుదరకపోతే నీ తమ్ముడినైనా చేసుకొమ్మని చెప్పు !
...
ఓహ్ ! ముక్కు చెవులు లేనిదానితో ఎలా కాపురం చేస్తాడని సందేహించకు ! నడుములేని దానితో నీవెలా కాపురం చేస్తున్నావో అలాగే చేస్తాడతడు ! లేదంటావా ? మా రాక్షసుల చేతిలో మీకు చావు తప్పదు అని హెచ్చరించింది
..
నిర్భయంగా, నిర్లజ్జగా బెదిరిస్తూ మాట్లాడుతున్న శూర్పణఖను చూసి రాముడు ...." ఎంతమందిని వెంటబెట్టుకొని వస్తావో రా ! నీ కనులముందే వారిని యమపురికి సాగనంపుతాను....అని అన్నాడు.
..
రాముడి హెచ్చరికలను లక్ష్యపెట్టక తన కామవికారాన్ని ,సీతమ్మను భయపెట్టడమూ కొనసాగిస్తూనే ఉన్నది శూర్పణఖ !
...
దాని వైఖరికి విసుగూ కోపము కలగలిసిపోగా అన్నను చూసి లక్ష్మణుడు ," అన్నా అనుమతి ఇవ్వు ! ఈ రాక్షసికి మరణదండనే సరి అయినది ,ఇప్పుడే దీని కుత్తుక తెగనరుకుతాను . దీనిని చంపకుండా వదిలిపెడితే ఇది మనకు కలిగించే హాని ఊహించలేము" అని పలికాడు
..
ఆ మాటలకు రాముడి ముఖం వైపు చూసింది శూర్పణఖ ! అన్నదమ్ములిద్దరూ తన పట్ల ఇక ఏ మాత్రమూ కనికరము ప్రదర్శించరని దానికి అర్ధమయ్యింది ,వెనువెంటనే క్షణాలలో అక్కడనుంచి మాయమయిపోయింది !
...
వెళ్ళటము వెళ్ళటమే తన వికారరూపముతో ఖరుడిపాదాలవద్ద పెనుమేఘంలాగా రాలిపోయింది .కన్నీటితో ఖరుడి పాదాలను కడిగివేసింది .
గుండెలనే పెద్ద డోలుగా చేసి బాదుకుంటూ ఏడుస్తుంటే ప్రళయవేళలో నరసంహారానికి బయలుదేరిన యముడి భటులు చేసే శబ్దంలా దశదిశలా వ్యాపించింది !
కార్చిచ్చును తప్పించుకోలేక దొర్లుతున్న పెద్ద కొండచిలువలాగ అటుఇటూ నేలమీద పడి దొర్లింది శూర్పణఖ !
...
శూర్పణఖ వేదనను రోదనను వికారరూపాన్ని చూసిన ఖరుడు ," ఎవరు ఒడిగట్టారీ దుస్సాహసానికి " అని ప్రశ్నించాడు !
...
వారు మునివేషంలో ఉన్న మహావీరులు ! ఇద్దరు అన్నదమ్ములు మన్మథాకారులు ! వారితోటి ఒక స్త్రీ ! ఆమె సౌందర్యము ఇంత అని వర్ణించలేనంత ! ఆమె రాక్షససార్వభౌముడి వద్ద మాత్రమే ఉండటానికి అర్హురాలని తలచి నేనామెను ఎత్తుకొని తీసుకు రావడానికి ప్రయత్నించగా ఆ అన్నదమ్ములు నాకీ దుస్థితి ప్రాప్తింపజేశారు .....నేను ఖరుడి చెల్లెలిని ,త్రిలోకవిజేత రావణుడు మా అన్న అని చెప్పినా వారు లక్ష్యపెట్టలేదు !
...
వారు దశరథకుమారులు...
...
అని ఖరునికి తెలిపింది శూర్పణఖ !
....
వూటుకూరు జానకిరామారావు
: కంబరామాయణం 116
( మొదలైన సంహారం )
...
రక్తమోడుతూ భయంకరంగా ఉన్న శూర్పణఖ ముఖం చూశాడు ఖరుడు .కనులనుండి క్రోధంతో రక్తాశృకణాలు జలజలరాలాయి.
..
నాకా నరాధములను చూపు ఇప్పుడే కత్తికొక కండగా నరికి కాకులకు గద్దలకు ఆహారంగా వేస్తాను .నడువు అంటూ బయలుదేరాడు ఖరుడు.
...
ఖరుడి యుద్ధోత్సాహము చూసిన పదునాల్గుమంది అనుచరులు వెనువెంటనే అతని వద్దకు వచ్చి ,ప్రభూ ! నీవెందుకు వెళ్ళటము ! వారేమైనా దేవతలా లేక గంధర్వులా ? ఇద్దరు మానవమాత్రులను మట్టుపెట్టడానికి నీ అంతటివాడు పూనుకోవాలా !
..
రెప్పపాటుకాలం లో ఆ అన్నదమ్ములిరువురినీ వారి కుత్తుకలు తెగగోసి చంపి వేడివేడి రక్తము త్రాగి ఆ సుందరాంగిని తెచ్చి మీ ముందుంచుతాము అని పలికి శూర్పణఖ వెంటరాగా రాముడి పర్ణశాల వైపుగా కదిలారు.
...
వారి చేతులలో గద ,చక్రము వంటి ఆయుధాలు బరువైన విల్లమ్ములు ఉన్నాయి . ఒక్కొక్కడు ఒక మేరుపర్వతమంత ! పర్వతశిఖరాలనుకొని మేఘాలు వారి శిరస్సులపై కిరీటాల వలె నిలుచున్నాయి .
...
పర్ణశాలముందు ప్రశాంతంగా పద్మాసనంలో కూర్చున్న పద్మదళాయతాక్షుడిని చూపి అదుగో అతనే రాముడు ! ఇంచుమించుగా అతనిలాగనే ఉన్న ఆ స్వర్ణదేహుడు లక్ష్మణుడు ! అని తనతో వచ్చిన యోధులకు చూపింది శూర్పణఖ !
...
వారంతా పెద్దపెట్టున అరుస్తూ రామలక్ష్మణులను మండలాకారంలో చుట్టుముట్టారు.
...
వదినగారిని జాగ్రత్తగా సంరక్షించమని లక్ష్మణస్వామి కి చెప్పి తాను పర్ణశాల బయటకు కదిలాడు రాముడు !
...
పర్వతమంత ధనుస్సు, అక్షయతూణీరముతో సింహంలా కదిలివస్తున్న రాముడిని చూసి రణోత్సాహంతో పెడబొబ్బలు పెట్టారు వారంతా !
...
ఒక మైదానప్రాంతంలో నిలుచున్నాడు రాముడు, ఆయనను చుట్టుముట్టి పదునలుగురు మహాకాయులైన యోధులు !
...
ఆయుధాలు చేతబూని పైకెత్తి రాముడివైపుగా కదలివస్తున్న ఆ వీరులు ఒక్కసారిగా ఉలికిపడ్డారు . తమతమ చేతులు రెండరెండుగా ఇరవైఎనిమిది చేతులు తమతమ దేహాలనుంచి వేరుచేయబడి భూమిమీద పడి ఉన్నాయి ! అవి ఎప్పుడు తెగి అవతల పడినాయో వారే గుర్తించలేనంత వేగంగా పడిపోయాయవి ...
...
తమ బాహువులు తెగగొట్టబడినా లెక్కచేయక తమ దేహాల క్రింద రాముడిని నలిపివేయాలనే ఊహతో కదిలి క్రమ్ముకంటూ వస్తున్న వారిని చూసిన రాముడు తన ధనుస్సునుండి ఒకేసారి పదునాలుగు బాణాలు సంధించి వదిలిపెట్టాడు.
గాలిని కోసుకుంటూ వచ్చిన ఆ నిశితశరాలు వారి శిరస్సులను వారివారి మొండెములనుండి వేరు చేశాయి.
...
రాముడి రణకర్కశత్వాన్ని కనులారాగాంచిన శూర్పణఖ మగ ఏనుగులను సింహం వేటాడగా చూసి భయవిహ్వలయైన ఆడుఏనుగు పరుగెత్తినట్లుగా పరుగులుపెట్టి ఖరుడిముందు నిలుచుంది !
...
వూటుకూరు జానకిరామారావు
: కంబరామాయణం 118
( రణకర్కశ రామ్ రామ్ )
..
రాక్షససైన్యం చుట్టుముట్టగానే చటుక్కున ధనుస్సువంచి చిటికెలో శరసంధానం గావించాడు రామచంద్రుడు.
వందలు వేలు పుంఖానుపుంఖాలుగా బయల్వెడలుతున్నాయి రాముడి ధనుస్సు నుంచి పదునైన బాణాలు .
.
వాడిగా ఉన్నబాణపు దెబ్బలకు వేడివేడి రక్తం చిమ్మించి కొడుతున్నది ఖరుడి సైనికుల శరీరాలనుండి .
..
పరుగులుతీస్తున్న గుర్రాలు నేలమీద కూలాయి ,అసంఖ్యాకమైన ఏనుగులు పెద్దపెద్ద కొండలవలె భూమిపై పడిపోయాయి .
..
క్షణకాలంలో అందరి చేతులలోని ఆయుధాలు నేలపై రాలిపడిపోయాయి . ఇరుసులు విరిగిన రథములు ,కాళ్ళు విరిగిన గుర్రాలు ,తలలు తెగి నాట్యమాడే సైనికుల మొండెములు రణరంగంలో ఒక భయానక దృశ్యం నెలకొన్నది !
..
ధనుస్సు ఎటువంచుతున్నాడో, బాణములెప్పుడు తీస్తున్నాడో, వాటిని ఎప్పుడు సంధిస్తున్నాడో ,ఎప్పుడు వదులుతున్నాడో ఎవరికీ తెలియడం లేదు .రాముడి చేతిలో కవ్వంలాగ గిర్రున తిరిగే ధనుస్సును కూడా చూడటం సాధ్యపడటం లేదు ఎవరికీ .
..
సర్రున దూసుకొచ్చే బాణాలు, గిర్రున తిరిగే ధనుస్సు మధ్యలో కాంతిపుంజము ! ఇంతే ఇదే కనపడుతున్నది చూపరులకు !
..
రాముడి శరసంధాననైపుణ్యము చెప్పటానికి పోల్చతగినదేదీ లేదు .మెరుపుకంటే వేగంగా పిడుగులు రాలుతున్నట్లు శత్రుసైన్యం మీద బాణపు వర్షం కురియగా వారి రక్తం ఏరులై పారింది.
..
అంతటి విధ్వంసాన్ని ఎప్పుడూ రుచిచూసి ఎరుగని రాక్షసవీరులు ఒకరిచేయి మరొకరుపట్టుకొని ఒకదండలాగ రాముని చుట్టుముట్టగా వారిని మట్టుపెట్టడానికి రాముడికి అరనిముషం పట్టలేదు !
..
నదిగా పారుతున్న రక్తంలో ఏనుగుల మొండెములు తేలతూ వెళ్ళిపోతున్నాయి .కాకులు గుంపులు గుంపులగా వచ్చి చనిపోయిన రాక్షసుల కనుగుడ్లను అత్యంత ఇష్టంగా తినసాగాయి.
..
ఆయుధాలన్నీ ఎగిరిపోగా రాక్షసవీరులు కొండలలోని పెద్దపెద్ద బండరాళ్ళను పెకిలించి ఒక్కసారిగా రాముడిమీద విసిరితే అవి ఆకాశాన్ని కప్పివేసి ఆ ప్రాంతాన్ని చీకటిమయం చేశాయి.
...
సూర్యకిరణాలస్పర్శకు ఎగిరిపోయిన చీకట్లవలె రామధనుర్విముక్తశరాలు ఆ బండరాళ్ళను ఎగురగొట్టి గాలిలోనే పిండిచేశాయి.
..
రాముడి బాణపు వేగం ఎంతగా ఉన్నదంటే ...రాక్షసుల దేహాలనుండి నుండి ఎగురగొట్టబడిన తలలు ఆకాశంలోకి లేచి పైనుండి తమతమ మొండెములు చేసే నృత్యాన్ని తమ కనులతో వీక్షిస్తున్నాయి.
..
సంహారం ఇంకా సాగుతున్నది !
...
వూటుకూరు జానకిరామారావు
: #కంబరామాయణం 117
( కదిలిన ఖరుడి సైన్యం )
నిర్దాక్షిణ్యంగా జరిగిన రాక్షస సంహారం గురించి ఖరుడికి తెలిపింది శూర్పణఖ.
.
రాముడు వారిని ఎలా చంపాడో తెలుసుకున్న ఖరుడు ఒక్కసారిగా లేచి నిలుచుని పెద్దపెట్టున సింహనాదం చేశాడు .వాడి గర్జనలకు గుహలలోని సింహాలుకూడా బెదిరిపోయాయి.
.
తన రథాన్ని వెనువెంటనే సిద్ధం చేయమని సేవకులను ఆజ్ఞాపించాడు.
...
కదిలాడు ఖరుడు!
అతనివెనుక అపారసేనావాహిని కదిలింది.!
.
ఆ సేన పెద్ద మేఘముల సముదాయము వలె
పులుల గుంపులవలె
ఏనుగులమందలవలె కనపడుతున్నది
..
కొన్ని రథాలను సింహాలు
కొన్ని రథాలను ఎనుములు
మరికొన్నిటిని ఏనుగులు
ఇంకొన్నింటిని పులులు లాగుతున్నాయి .
యమకింకరులవలె కదిలారు ఖరుడి సైనికలు
..
కత్తులు,గొడ్డళ్ళు ,కొడవళ్ళు,బరిశెలు,శూలాలు,ఖడ్గాలు,తోమరాలు,గదలు ,విల్లమ్ములు,పరిఘలు ఇలా సమస్త ఆయుధాలు ధరించి నడిచారు వారంతా !
...
పదునల్గురు సేనానాయకులు
ఒక్కొక్కరి నాయకత్వాన లెక్కలేనంత సైన్యం !
...
క్రూరత్వానికి పరాకాష్ఠ అయిన ఆ సైనికులు ఒక్కొక్కడు ఒక్కొక్క పర్వతమంత ప్రమాణంలో ఉన్నాడు.
..
దేవాసురసంగ్రామాలలో పాల్గొన్న వారి వక్షస్థలాలన్నీ మానిన గాయాల గుర్తులతో వారి వారి వీరత్వానికి చిహ్నాలుగా నిలిచి ఉన్నాయి.
...
నల్లటి కాటుకకొండలాగ ఉన్న ఆ సైనికపటాలం ముందు కాలకూటవిషముకూడా తెల్లగా తేలిపోతున్నది.
..
పెద్దపెద్దగా వినిపిస్తున్న జ్యాటంకార ధ్వనులు ,రణన్నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగిపోతున్నది.
..
ఆ కోలాహలానికి భయపడిన పక్షులు గుంపులుగుంపులుగా లేచి రాముడి పర్ణశాల వెనుక వచ్చివాలాయి .
ఆయనే తమ రక్షకుడని తెలిసినట్లుగా !
...
పద్నాలుగు మంది రాక్షసులను మట్టుబెట్టి ఉప్పొంగే రణోత్సాహంతో "ఎవడొస్తాడో రండిరా " అని పిలుస్తున్నట్లుగా నిలుచున్న రాముడిని చుట్టుముట్టిందా సైన్యం !
..
వెనువెంటనే కవచం ధరించాడు రాముడు , అన్నా యుద్ధము నేను చేస్తాను అని ముందుకురుకుతున్న లక్ష్మణుడిని వారించి సీతాదేవి రక్షణబాధ్యతలు అప్పచెప్పి జూలువిదిలించిన సింహంలా కదిలాడు రఘువీరుడు
...
చేత వైష్ణవధనువు ,మూపున అక్షయతూణీరము నడుమున ఖడ్గము తో వీరమూర్తియై కదిలాడు రామచంద్రుడు.
..
అడుగో ! అతడే రాముడు ! చూపింది శూర్పణఖ !
...
అతడా! అతడిని చంపడానికి ఇంత సైన్యము అవసరము లేదు నేనొక్కడినే చాలు అంటూ ముందుకు కదులుతున్న ఖరుడిని చూసి అకంపనుడు అనే రాక్షసుడు వద్దని వారించాడు .
..
అదుగో మేఘాలు రక్తాన్ని వర్షిస్తున్నట్లుగా ఎర్రగా మారాయి ,సూర్యుడిచుట్టూ కాంతిహీనమైన వలయాలు అలుముకున్నాయి ఇవి రాబోయే విపత్తుకు సూచన ! కావున నీవొక్కడివే కదలవద్దు అని హితవు పలికాడు .
...
అతని మాటలు విని హేళనగా నవ్వాడు ఖరుడు ! భుజాలు చరిచి రొమ్ములు చూపి బలప్రదర్శన చేశాడు.
..
రణసింగము రాముడిని రాక్షసులనే ఏనుగుల గుంపు చుట్టుముట్టింది !
...
వూటుకూరు జానకిరామారావు
: కంబరామాయణం 119
(దూషణ ,త్రిశిర సంహారం)
...
రాముడి బాణపు దెబ్బలకు తాళలేక పారిపోయే రాక్షసులను కూడగట్టుకొని బయలుదేరారు త్రిశిర,దూషణులు !
...
దేవతలతో సంగ్రామంలో కూడా మీరిలా పారిపోలేదే ? నేడెందుకిలా చేస్తున్నారు ! రండి రండి ఇతడు కేవలం మానవమాత్రుడు ! మీముందు నిలువలేనివాడు ఇతడు ! ఒక్కుమ్మడిగా ముట్టడించండి ఒక నిముషం పట్టదు అతనిని మట్టుపెట్టడం , అని ఎలుగెత్తి చెపుతూ వారిని ఉత్సాహ పరుస్తూ ముందుకు దూసుకు వచ్చాడు త్రిశిరుడు !
..
తన మీదమీదకు వస్తున్న త్రిశిరుడి రథచక్రాలు ధ్వంసం చేశాడు రాముడు .ఆ వెంటనే గాలిలోకి లేచిన వాడి కాళ్ళు రెండు బాణాలతో విరగగొట్టాడు .కాళ్ళు తెగి నేలమీద పడిపోతూ వాడు రాముడి మీద పడి ఆయనను నలిపివేయాలని చూడగా మూడు వాడిబాణాలతో వాడి మూడు శిరస్సులూ ఎగురగొట్టాడు రామచంద్రుడు !
..
త్రిశిరుడి సంహారాన్ని కనులారా గాంచిన ఖరుడి సోదరుడైన దూషణుడు కోపంతో కనులెర్రచేసి సైనికులను ఉత్సాహపరుస్తూ రాముడిమీద దాడికి దిగాడు .
క్షణాలలో వాడి సైన్యాన్ని బూడిదకుప్పగా మార్చివేశాడు శ్రీరాముడు.
..
దూషణుడు పర్వతాకారుడు ! వాడి రధానికి ఇరవైఅయిదు గుర్రాలు పూన్చి ఉన్నాయి . మహావేగంతో వస్తూ వాడు రాముడి నుదురు లక్ష్యంగా అత్యంతవేగంగా బాణాలు సంధించి వదిలాడు .
..
వాటిని మార్గమధ్యంలో తుత్తునియలు చేసి క్షణమాలస్యం చేయకుండా నాలుగునిశిత శరాలు వరుసగా వదిలాడు రాముడు .
..
మొదటిబాణం దూషణుడి రధచక్రాలను ధ్వంసం చేసింది ,రెండవది రధానికి కట్టిన ఇరవయిఅయిదు గుర్రాలను వరుసగా శిరస్సులను ఖండిస్తూ దూసుకుపోయింది ,మూడవది దూషణుడి ధనుస్సును విరగగొట్టగా నాల్గవది వాడి కవచాన్ని బదాబదలు చేసింది .
..
అద్భుతమైన రాముడి ధనుర్విద్యావిన్యాసాన్ని కనులప్పగించి చూస్తున్న దూషణుడి శిరస్సును ఆ వెంటనే వచ్చిన అయిదవ బాణం ఖండించివేసింది .
...
ఇక మిగిలినవాడు ఖరుడొక్కడే !
...
వూటుకూరు జానకిరామారావు
: కంబరామాయణం 120
( ఖరసంహారం )
...
రాముడి శరములు దూషణుడిని చంపటము కన్నులారా చూసిన ఖరుడు పట్టరాని కోపముతో రాముని ముట్టడించాడు ..
...
రథములు ,ఏనుగులు, గుర్రాలు నేల ఈనినట్లుగా వచ్చి రాముడిని చుట్టుముట్టాయి .
...
భూమ్యాకాశాలను బ్రద్దలు చేయగల రాముడి బాణాలకు ఎదురుగా ఉన్న సైన్యం పెద్దలెక్కలోనిది కాదు .
..
కనులుమూసి తెరిచేటంతలో తన సైన్యం మొత్తం శ్రీరామబాణాగ్నికి ఆహుతవ్వడం చూశాడు ఖరుడు .. కనులు నిప్పు కణాలు కురిపిస్తుండగా అతివేగంగా రామచంద్రుడిని బాణ వర్షంతో కప్పివేశాడు .
...
ఖరుడు ధనుర్విద్యలో మహాపండితుడు రావణుడికి కుడిభుజము వంటివాడు ...
...
ఖర సంహారానికి తన చేతిలోని మామూలు ధనుస్సు సరిపోదని గ్రహించిన రాముడు వరుణుని స్మరించాడు .మరుక్షణం ఆయన కుడి చేతిలోనికి వైష్ణవధనుస్సు వచ్చి చేరింది ..
...
ఆ ధనుస్సునుండి వెలువడిన మొదటిబాణం అతివేగంగా వెళ్ళి ఖరుడి కుడి భుజాన్ని నరికి వేసింది . విజయసూచకంగా ధనుష్టంకారం చేసి నిలుచున్నాడు రామచంద్రుడు .
..
కుడిచేయిపోయినా ఏమాత్రం జంకకుండా ఎడమచేతిలో పొడవాటి రాయిని ఎత్తి రాముడిమీద విసిరాడు ఖరుడు ! రాముడి బాణపు దెబ్బకు అది మార్గమధ్యంలోనే తుత్తునియలయి నేలరాలింది .
...
ఇక ఆలస్యం చేయదలుచుకోలేదు రాముడు , యుద్ధాన్ని అక్కడితో ముగించాలని నిశ్చయించుకొన్నాడు.
..
కోరలుపీకినప్పటికీ కోపంతో బుసలుకొట్టే కాలనాగువలె నిలుచున్న ఖరుడి తలను ఒక నిశిత శరంతో ఎగురగొట్టాడు శ్రీరాముడు ...
...
ఉత్సుకతతో యుద్ధాన్ని తిలకిస్తున్న దేవతల ఆనందానికి హద్దేలేకపోయింది . ఎడతెగకుండా రాముడిపై పుష్పవృష్టి కురిపించారు .
...
తమ తపోదీక్షను భగ్నం చేసి తమను హింసించే క్రూరుడు ఖరుడు అంతమవ్వటంతో మునుల సంతోషం పరవళ్ళతొక్కింది .. రామచంద్రుడి చుట్టూ చేరి అభినందనలు, ఆశీస్సులు కురిపించారు ...
...
అప్పటివరకు సమీపంలోని కొండగుహలో లక్ష్మణుడి సంరక్షణలో ఊపిరిబిగబట్టి యుద్ధాన్ని చూస్తున్న సీతమ్మ పరుగుపరుగున వచ్చి రామచంద్రుడి శరీరానికి అంటిన రక్తపుమరకలను తనకొంగుతో తుడిచి ప్రేమపెల్లుబకగా తదేకంగా రాముడినే చూస్తూ ఉండిపోయింది .. లక్షణస్వామి అన్నగారి వళ్ళంతా శుభ్రంగా నీటితో తుడిచి వేశాడు ...
...
ఊహించని విధ్వంసాన్ని కనులారాగాంచిన శూర్పణఖ లంకలోని రాక్షసజాతిని అంతచేయడానికి కంకణం కట్టుకున్నదానిలా సుడిగాలివేగంతో లంకకు వెళ్ళింది ...
...
వూటుకూరు జానకిరామారావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి