*గరుడ పురాణం_*5వ భాగం*
_*గరుడ పురాణంలో ప్రతిపాదించబడిన విషయాలు...*_
_“శౌనక మునీంద్రా! సాక్షాత్తు మహావిష్ణువు నుండి శివ, బ్రహ్మ దేవాది దేవులు, బ్రహ్మ ద్వారా మా గురువుగారు వ్యాసమహర్షి, ఆయన అవ్యాజానుగ్రహం వల్ల నేను వినగలిగిన గరుడ పురాణాన్ని నా భాగ్యంగా భావించి ఈ పవిత్ర నైమిషారణ్యంలో మీకు వినిపిస్తున్నాను._
_*ఇందులోని వివిధ అంశాలేవనగా సర్గ వర్ణనం, దేవార్చనం, తీర్థమాహాత్మ్యం, భువన వృత్తాంతము, మన్వంతరం, వర్ణ ధర్మాలు, ఆశ్రమధర్మాలు, దానధర్మం, రాజధర్మం, వ్యవహారము, వంశానుచరితము, వ్రతం, నిదానపూర్వక అష్టాంగ ఆయుర్వేదం, ప్రళయం, ధర్మం, కర్మం, కామం, అర్థము, ఉత్తమజ్ఞానం, ముఖ్యంగా విష్ణుభగవానుని మాయామయ, సహజలీలల విస్తార వర్ణనం.*_
_వాసుదేవుని కరుణచే గరుత్మంతుడు ఈ గరుడ మహాపురాణోపదేష్టగా అత్యంత సామర్థ్యాన్ని చూపించాడు. విష్ణు వాహనంగా ఈ సృష్టి, స్థితి, ప్రళయకార్యాలలో కూడా పాలుపంచుకొంటున్నాడు. దేవతలను జయించి, అమృతాన్ని తెచ్చి యిచ్చి తన తల్లి దాస్య విముక్తి కార్యాన్ని కూడా సఫలం చేసుకోగలిగాడు._
_*విష్ణు భగవానుని ఉదరంలోనే అన్ని భువనాలూ ఉంటాయి. అయినా ఆయనకు ఆకలి వేస్తే గరుడుడే దానిని తీర్చాలి. హరి శివాదులకూ, హరిరూపుడైన గరుడుడు కశ్యప మహర్షీకీ చెప్పిన ఈ పవిత్ర పురాణం తనను ఆదరంగా చదివే వారికి అన్నిటినీ ప్రసాదించగలదు. వ్యాసదేవునికి మరొక్కమారు నమస్కరించి పురాణాన్ని ప్రారంభిస్తున్నాను.*_
_(3వ అధ్యాయం సమాప్తం)_
_________
_*4వ అధ్యాయం*_
_*సృష్టి - వర్ణనం*_
_*'హే జనార్ధనా! సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర, వంశానుచరితములన్నిటినీ విస్తారపూర్వకంగా వర్ణించండి' అని పరమేశ్వరుడు ప్రార్థించాడు.*_
_*ఖగవాహనుడు కాల కంఠాదుల కిలా చెప్పసాగాడు :*_
_'పరమేశ్వరా! *సర్గాదులతో బాటు సర్వపాపాలనూ నశింపజేయు సృష్టి, స్థితి, ప్రళయ స్వరూపమైన విష్ణు భగవానుని సనాతన క్రీడను కూడా వర్ణిస్తాను, వినండి._
_*( * సర్గయనగా సృష్టిలో నొక దశ. ఒక మెట్టు.)*_
_నారాయణ రూపంలో ఉపాసింపబడుతున్న ఆ వాసుదేవుడే ప్రకాశస్వరూపుడైన, అనగా కనబడుతున్న, పరమాత్మ, పరబ్రహ్మ, దేవాధిదేవుడు. సృష్టి స్థితిలయాలకు కర్త ఆయనే. ఈ దృష్టాదృష్టమైన జగత్తంతా ఆయన వ్యక్తావ్యక్తమైన స్వరూపమే. ఆయనే కాలరూపుడు, పురుషుడు. బాలురు బొమ్మలతో క్రీడించినట్లాయన లోకంతో క్రీడిస్తాడు. ఆ లీలలను వర్ణిస్తాను వినండి._
_*అంటే ఇవన్నీ నా లీలలే... జగత్తుని ధరించే పురుషోత్తమునికి జగత్తుకున్న ఆద్యంతాలు లేవు. ఆయన నుండి ముందుగా అవ్యక్తమైనవి జనించగా వాటి 1ఆత్మ' ఉత్పత్తి అవుతుంది. అవ్యక్త ప్రకృతి నుండి బుద్ధి, బుద్ధి నుండి మనస్సు, మనస్సు నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి తేజం, తేజం నుండి జలం, జలం నుండి పృథ్వి పుట్టాయి.*_
_పరమేశ్వరా! దీని తరువాత నొక బంగారు గుడ్డు పుట్టింది. పరమాత్మ స్వయంగా అందులో ప్రవేశించి సర్వ ప్రథమంగా తానొక శరీరాన్ని ధరిస్తాడు. 2 ఆయనే చతుర్ముఖ బ్రహ్మరూపాన్ని ధరించి రజోగుణ ప్రధానమైన ప్రవృత్తితో బయటికి వచ్చి ఈ చరాచర విశ్వాన్ని సృష్టిచేశాడు._
_*దేవ, అసుర, మనుష్య సహితమైన ఈ సంపూర్ణ జగత్తు ఆ అండంలోనే వుంటుంది. ఆ పరమాత్మయే స్వయం స్రష్టయగు బ్రహ్మరూపంలో ప్రపంచాన్ని సృష్టిస్తాడు, విష్ణు రూపంలో దాని ఆలనా, పాలనా చూసుకుంటాడు. కల్పాంత కాలంలో రుద్ర రూపంలో దానిని సంపూర్ణంగా లయింపజేస్తాడు. సృష్టి సమయంలో ఆ పరమాత్మయే వరాహరూపాన్ని ధరించి జలమగ్నయైన భూమిని తన కొమ్ముతో చిల్చి ఉద్ధరిస్తాడు. శంకరదేవా! ఇక దేవాదుల సృష్టి యొక్క వర్ణనను సంక్షిప్తంగా తెలియజేస్తాను.*_
_అన్నిటికన్న ముందు ఆ పరమాత్మ నుండి మహత్తత్త్వం సృష్టింపబడుతుంది. రెండవ సర్గలో పంచతన్మాత్రల అనగా - రూప, రస, గంధ, స్పర్శ, శబ్దముల - ఉత్పత్తి జరుగుతుంది. దీన్నే భూతసర్గ అంటారు. వీటి ద్వారానే పంచ మహా భూతములైన నేల, నీరు, *నిప్పు, గాలి, నింగి సృష్టింపబడతాయి. మూడవది వైకారిక సర్గ. కర్మేంద్రియాలూ, జ్ఞానేంద్రియాలూ ఈ దశలోనే పుడతాయి కాబట్టి దీనిని ఐంద్రిక సర్గయని, బుద్ధి దశ కూడా ఇదే అవుతుంది. కాబట్టి దీన్ని ప్రాకృత సర్గయని కూడా అంటారు. నాలుగవది_
_*(1'తరువాత ఆయన నుండియే, . 2'ధరించాడు. *నిప్పులో అగ్ని, తేజస్సు అంతర్భాగాలు, మండించేదీ కాంతినిచ్చేదీ కూడా నిప్పే.)*_
_నాలుగవది ముఖ్య సర్గ పర్వతాలూ, వృక్షాలూ మానవ జీవనంలో ముఖ్య పాత్రను పోషించాలి. అవి సృష్టింపబడే సర్గ కాబట్టి దీనికాపేరు వచ్చింది._
_అయిదవది *తిర్యక్ సర్గ పశుపక్ష్యాదులు ఈ సర్గలో పుడతాయి. తరువాత ఆరవ సర్గలో దేవతలూ, ఏడవ సర్గలో మానవులూ సృష్టింపబడతారు. వీటిని క్రమముగా ఊర్ధ్వ ప్రోతా, అర్వాక్ ప్రోతా సర్గలంటారు. దేవతల కడుపులో పడిన ఆహారం పైకీ, మానవులది క్రిందికీ చరిస్తాయి. ఏడవ సర్గ మానుష సర్గ. ఎనిమిదవది అనుగ్రహ నామకమైన సర్గ. ఇది సాత్త్విక తామసిక గుణ సంయుక్తం. ఈ యెనిమిది సర్గలలో అయిదు వైకృతాలనీ, మూడు ప్రాకృత సర్గలనీ చెప్పబడుతున్నాయి.
అయితే, తొమ్మిదవదైన కౌమారనామక సర్గలో ప్రాకృత, వైకృత సృష్టులు రెండూ చేయబడతాయి.
*గరుడ పురాణం_*6వ భాగం*
"గరుడ పురాణం "
_*శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః*_
_*శ్రీ గురుభ్యోనమః*_
_*6వ భాగం:-*_
_రుద్రాది దేవతలారా! దేవతల నుండి స్థావరాల వఱకూ నాలుగు ప్రకారాల సృష్టి జరుగుతుంది. సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ నుండి ముందుగా మానసపుత్రులు ఉత్పన్నులయ్యారు. తరువాత దేవ, అసుర, పితృ, మనుష్య సర్గచతుష్టయం వచ్చింది._
_*అపుడు పరమాత్మ జలసృష్టి కార్యంలో సంలగ్నుడైనాడు. సృష్టి కర్మలో మునిగియున్న ప్రజాపతి బ్రహ్మ నుండి తమోగుణం పుట్టుకొచ్చింది. కాబట్టి ఆయన జంఘలనుండి రాక్షసులు పుట్టుకొచ్చారు.*_
_శంకరా! అప్పుడాయన తమోగుణ యుక్తమైన శరీరాన్ని విడచిపెట్టగా ఆ తమోగుణపు ముద్ద రాత్రిగా మారి నిలబడిపోయింది. యక్షులకీ రాక్షసులకీ అందుకే రాత్రి అంటే చాల ప్రీతి._
_*తరువాత బ్రహ్మయొక్క సత్త్వగుణ మాత్రవల్ల ఆయన ముఖం నుండి దేవతలుద్భ వించారు. తరువాత ఆయన సత్త్వగుణ యుక్తమైన శరీరాన్ని కూడా విడనాడగా దానినుండి పగలు పుట్టింది. దేవతలకు పగలు ప్రీతి పాత్రం. తరువాత బ్రహ్మయొక్క సాత్త్విక శరీరం నుండి పితృ గణాలుద్భవించాయి. బ్రహ్మ ఆ సాత్త్విక శరీరాన్ని వదలిపోయినపుడు అది సంధ్యగా మారింది. ఈ సంధ్య పగటికీ రాత్రికీ మధ్య వచ్చే సమయం. తదనంతరం బ్రహ్మ యొక్క రజోమయ శరీరం నుండి మానవులు పుట్టారు. ఆయన ఆ శరీరాన్ని పరిత్యజించినపుడది జ్యోత్స్న అనగా ప్రభాత కాలంగా మారింది. అదే ఉదయ సంధ్య. ఈ రకంగా జ్యోత్స్న, పగలు, సంధ్య, రాత్రి అనేవి బ్రహ్మ శరీర సంభూతాలు.*_
_( ఐదవ భాగంలో -*తిర్యక్ అంటే వక్రత. ఏ జీవుల ఆహార సంచారాలు వక్రంగా వుంటాయో అవి తిర్యక్కులు. ఇవి తిని తాగే అన్న జలాలు వీటి కడుపులో వంకరగా తిరుగుతాయి.)_
_*తరువాత బ్రహ్మ రజోగుణమయ శరీరం నుండి క్షుధ, క్రోధం జనించాయి. పిమ్మట బ్రహ్మ నుండియే ఆకలి దప్పులు అతిగా కలవారు, రక్త మాంస సేవనులు నగు రాక్షసులు, యక్షులు పుట్టుకొచ్చారు. ఎవరి నుండి సామాన్య జీవునికి రక్షణ అవసరమో వారు రాక్షసులు. యక్షశబ్దానికి తినుటయని అర్థము. యక్షులు ధనదేవతలు. ధనం కోసం వీరిని పూజిస్తారు. ఈ పూజలో భక్షణ కూడా ఒక భాగం. ఈ భక్షణ వల్ల వీరిని యక్షు లంటారు. అటుపిమ్మట బ్రహ్మకేశాల నుండి సర్పాలు, క్రోధం నుండి భూతాలు పుట్టినవి. చురుకైన కదలికను సర్పణమంటారు. అది కలవి సర్పాలు. తరువాత బ్రహ్మలో కలిగిన క్రోధ గుణవాసనపాములకూ తగిలింది. అందుకే వాటికి క్రోధ మెక్కువ. తరువాత బ్రహ్మనుండి పాటపాడుతూ, నాట్యమాడుతూ కొన్ని ప్రాణులు నిర్గమించాయి. పాడే వారు గంధర్వులు కాగా ఆడేవారు అచ్చరలయ్యారు.*_
_తరువాత ప్రజాపతియైన బ్రహ్మవక్షస్థలం నుండి స్వర్గము, ద్యులోకము పుట్టాయి. ఆయన ముఖము నుండి అజము (మేక), ఉదరము నుండి గోవు, పార్శ్వాలనుండి ఏనుగు, గుఱ్ఱము, మహిషము, ఒంటె, తోడేలు జాతులు పుట్టినవి. ఆయన రోమాల నుండి ఫల, పుష్ప, ఔషధ జాతి వృక్షాలుద్భవించాయి. తరువాత ఏడు రకాల జంతువులు పుట్టాయి. అవి క్రమంగా పులివంటి హింస్రకాలు, పశువులు (ఇది ఒకదశ), రెండు గోళ్ళ (గిట్టల) జంతువులు, నీటిక్షీరదాలు, కోతి జాతి, పక్షులు, ఉభయచరాలు, సరీసృపాలు._
_*బ్రహ్మయొక్క పూర్వాది నాల్గు ముఖాల నుండి క్రమంగా ఋగ్యజుస్సామాథర్వ వేదాలు జనించాయి. ఆయన ముఖం నుండి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, ఊరువుల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులూ ఉత్పన్నులైనారు. వెంటనే బ్రహ్మవారిలో ఉత్తములైన బ్రాహ్మణులకు బ్రహ్మలోకాన్నీ, క్షత్రియులకు ఇంద్రలోకాన్ని, వైశ్యులకు వాయులోకాన్నీ శూద్రులకు గంధర్వలోకాన్నీ నివాసాలుగా నిర్ధారణ చేశాడు. ఆయనే బ్రహ్మచారులకు బ్రహ్మలోకాన్నీ, స్వధర్మనిరతులై గృహస్థాశ్రమాన్ని నిర్వహించిన వారికి ప్రాజాపత్యలోకాన్నీ, వానప్రస్థులకు సప్తర్షిలోకాన్నీ, సన్యాసులకూ పరమతపో నిధులకూ అక్షయలోకాన్నీ ప్రాప్త్యలోకాలుగా నిర్ధారణ చేశాడు.*_
_(4వ అధ్యాయం సమాప్తం)_
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి