12, మార్చి 2025, బుధవారం

గురువు అనకూడదు

 🙏శ్రీ గురుభ్యో నమః🙏

ప్రతి వ్యక్తిని గురువు అనకూడదు. అది ఎంతో పవిత్రం. ఈరోజు జనాలకు అపరిచిత వ్యక్తిని పరిహాసంగా గురూ అనో గురువుగారు అనో అంటున్నారు. సినిమాలో అయితే గురూ! గురూ! అంటూ పిచ్చి పాటలు వ్రాస్తున్నారు. గురు శబ్దాన్ని అపవిత్రం చేస్తున్నట్టు తెలుసుకోలేకపోతున్నారు. గురువు గురించి తెలియాలని ఈ వ్యాసం వ్రాస్తున్నాను 

భారతీయ సంప్రదాయంలో గురువు ఉపాధ్యాయుని కంటే ఎక్కువ. సాంప్రదాయకంగా, గురువు శిష్యుడికి లేదా విద్యార్థికి గౌరవప్రదమైన వ్యక్తి.

గురువు తప్ప మరొక గతి లేదు అనేది అర్థమై, ఆచరించ గలిగితే అసాధ్యం లేదు...

గురువు నీ చేతిని పట్టుకోవాలని అంటే ఆ అర్హతను నువ్వు సాధించుకోవాలి

గురువు ఎప్పుడూ పరమ ప్రేమ స్వరూపమే.

అందులో సందేహం లేదు. ఎల్లప్పుడూ శిష్యుని అభ్యున్నతిని కోరుతాడు గురువు. అందులోనూ సందేహం లేదు...

గురు గీత (17వ శ్లోకం)లో గురువును “చీకటిని పారద్రోలేవాడు” (గు, “చీకటి” మరియు రు, “తొలగించేవాడు”) అని సముచితంగా వర్ణించబడింది. నిజమైన, దివ్య జ్ఞానసంపన్నుడైన గురువు, తాను స్వీయ-నియంత్రణ సాధించడం వలన, సర్వవ్యాపకమైన పరమాత్మతో ఏకత్వము అనుభూతము చెందినవాడు. అటువంటి గురువు సాధకుని అంతర్ముఖ ప్రయాణంలో అతని లేదా ఆమెను పరిపూర్ణత వైపు నడిపించడానికి ప్రత్యేకమైన అర్హత కలవాడు అవుతాడు.


“గ్రుడ్డివాడు మరొక గుడ్డివాడిని నడిపించలేడు,” అన్నారు పరమహంసగారు. “భగవంతుణ్ణి తెలుసుకున్న గురువు మాత్రమే, పరమాత్ముని గురించి ఇతరులకు సరిగా బోధించగలడు. మన యొక్క దివ్యత్వాన్ని తిరిగి పొందడానికి అటువంటి ఉపదేశకుడు లేదా గురువు ఉండాలి. నిజమైన గురువును విశ్వాసముగా అనుసరించేవాడు అతనిలా అవుతాడు, ఎందుకంటే శిష్యుడిని తన స్వీయ సిద్ధి స్థాయికి పెంచడానికి గురువు సహాయం చేస్తాడు.”

మోక్ష మార్గాన్ని జగత్తుకు అందించటం చేత శంకరభగవత్సాదులవారు అనగా ఆది శంకరాచార్యులవారు జగత్‌ గురువు అని చిలకమర్తి తెలిపారు. కృష్ణం వందే జగద్గురుమ్‌ అని కృష్ణుడు భగవద్గీత బోధించడం ద్వారా శ్రీకృష్ణుడు కూడా జగద్గురువు అయ్యాడు అని చిలకమర్తి తెలిపారు. సనాతన ధర్మం ప్రకారం ప్రతీ మానవుడికి తన జీవితములో అష్టవిధ గురువులు (8 రకాల గురువులు) ఉంటారు 


అష్టవిధ గురువులలో కారణ గురువులను పొందడం, కారణ గురువును పట్టుకోవడం మరియు ఆయన ద్వారా విద్యను పొంది ప్రకృతి మాయా అనేటువంటి వాటిని తొలగించుకుని ముక్తి మార్గంలోకి ప్రవేశించి మోక్షమును పొందువాడు ధన్యుడు. అష్టవిధ గురువులు ఈవిధముగా ఉన్నారు.


1. బోధక గురువు : వేదాంత శాస్త్రముల యందలి శబ్దార్థములను మాత్రము చక్కగ బోధించు గురువు బోధక గురువు.


2. వేదక గురువు : వేదాంత శాస్త్రముల యందలి శబ్ధార్థములు చక్కగ బోధించు తత్త్వమును దర్శింపజేయువాడు వేదక గురువు.


3. నిషిద్ధ గురువు : వశ్యము, ఆకర్షణము మొదలగు మంత్రములచేత ఇహలోకమందును పరలోకమందును సుఖదుఃఖముల నిచ్చువాడు నిషిద్ధ గురువు.(గురువుగా స్వీకరించకూడదు )


4. కామ్యక గురువు : పుణ్యకర్మములను చేయుమని చెప్పి పుణ్యకర్మలు చేయించి తద్వారా ఇహలోక పరలోక సుఖములనిచ్చువాడు కామ్యక గురువు.


5. సూచక గురువు : వేదాంత శాస్త్రముల అంతరార్థమును తెలుపుచు జ్ఞానమును కలుగజేసి తద్వారా శమ, దమ, ఉపరతి, తితీక్ష్మ శ్రద్ధ సమాధానము అను షడ్గుణములను కలుగజేసి ఆత్మావలోకన చేయుటకు సూచించువాడు సూచక గురువు.


6. వాచక గురువు : జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనోబుద్ధి గోచరా చిత్తాహంకారంబులనెడి అంతరింద్రియముల యొక్కయు విషయములగు శబ్ద స్వర్ణ రూప రస గంధంబులు, వచన దాన గమనాగమన విసర్జన ఆనందములు, సంకల్ప వికల్ప నిశ్చయ చంచల కర్తృత్వములయందు వైరాగ్యము గలిగించి శిష్యుని అంతఃకరణ నిర్విషయమగునట్లు చేయు మహానుభావుడు వాచక గురువు.


7. కారణ గురువు : అహంబ్రహ్మాస్మి యను మొదలుగా గల వాక్యములను బోధించి జీవేశ్వరైక్యమును తేటతెల్లముగ తెలిపి జీవన్ముక్తి యనుభవమును కలుగజేసిన పరమపురుషుడు కారణ గురువు.


8. విహిత గురువు : శిష్యునికి గల సకల సంశయములను నివృత్తి చేసి ఆ సచ్చిష్యుని యేమాత్రము సందేహము లేనివానిగా జేసి తద్వారా విదేహమూర్తి కైవల్యము నిచ్చునట్టివాడు విహిత గురువు. వానినే సాక్షాత్తు పరమశివుడనియు చెప్పనగును. అట్టివాని వర్ణించుట కాదిశేషునికైన నలవిగాదు. కాబట్టి బ్రహ్మవిద్యా ప్రవీణులయొద్ద తేరి రహస్యములను తెలిసికొనవలెను. కుమ్మరవాడు ఎంతటి తెలివిగలవాడయినను సాధనములైన దండము, చక్రము, మృత్తికయు లేక కుండలు చేయలేనట్లు ఎంత సూక్ష్మబుద్ధి గలవానికిని సాధన చతుష్టయ సంపత్తి లేక బ్రహ్మజ్ఞానము కలుగనేరదు


అయితే గురువు ప్రసరించే ప్రేమ శక్తిని అందుకునే స్థాయి శిష్యునికి వుండాలి. అదెలా వస్తుంది?

గురువు మాత్రమే తనను ఉద్ధరించ గలడు అనే పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి వుండటమే ఆ స్థాయిని అందిస్తుంది. కానీ మనం ఏమి చేస్తున్నాం????


ఏదో ఒక సమస్య పరిష్కారానికి గురువును ఆశ్రయంచి ఉంటున్నాం. ఆ సమస్య తీరితే ఆ గురువు గొప్పవాడు. తీరకపోతే మరో గురువు...

ఇలా కొట్టుకు పోతున్నాం.

గురువు నీ సమస్యని ఖచ్చితంగా పరిష్కరిస్తారు. ఆ శక్తి గురువులో వుందని నువ్వు మనసా, వాచా, కర్మణా నమ్మాలి. అప్పుడే అది సాధ్యం అవుతుంది.

సేవాభావం వల్లనూ మరియూ సర్వస్వ శరణాగతి వల్లనూ గురువు ప్రసన్నుడు అవుతాడు...


కనుక నువ్వు ఎప్పుడు గురువే సర్వస్వం అని నమ్ము అప్పుడే నీ గురువు నీ చేతిని పట్టుకుని నడిపిస్తాడు.

నమ్మకం అచంచలంగా వుందా నీలో? ఆ ప్రశ్నకి ఎవరికి వారే సమాధానం చెప్పుకోవాలి...


గురువు మార్గాన్ని చూపిస్తాడు…ఆ మార్గంలో నడవటం నీ పని. గురువు జ్ఞానాన్ని అందిస్తాడు…ఆ జ్ఞానాన్ని జీవితంలో భాగం చేసుకోవటం నీ పని. గురువు ప్రేమని ప్రసరిస్తాడు…ఆ ప్రేమని నీలో నింపుకోవడం నీ పని.

గురువు దగ్గరకి వెళ్ళేటప్పుడు నీ బుద్ధిని, నీ తెలివితేటలను పక్కనపెట్టి వెళ్ళాలి. గురువుతో వాదన పనికిరాదు.


గురువు చెప్పే మాటలను చెవులతో కాదు…మనసుతో వినాలి. గురువును నమ్మినప్పుడు కళ్ళు మూసుకొని, ఇతర చింతనలు లేకుండా నమ్మాలి...


గురువుకు నిన్ను నువ్వు సమర్పించుకోవడం అంటే నీ హృదయాన్ని పూర్తిగా తెరచి సమర్పించాలి. గురువు ఉపదేశాన్ని వినేటప్పుడు నోరు మూసుకొని వినాలి. గురువును ఏదైనా కోరేటప్పుడు కొంగు చాచి అడగాలి.


ఇవన్నీ చేయగలిగితే గురువు నీవాడు అవుతాడు.

గురుకృప ఏ వ్యక్తినైనా కూడా గురు స్థానంలో నిలుపుతుంది. అయితే ఆ వ్యక్తి తనకు గురుత్వ స్థాయిని కోరుకొని చేశాడా? కానే కాదు. తన ఆత్మోన్నతి కోసమే చేస్తాడు. అది సఫలం అయినప్పుడు గురువే ఆ వ్యక్తిని తన పరికరంగా ఆయుధంగా లోకానికి సమర్పించి ..


ఆ వ్యక్తిని గురువుగా నిలుపుతాడు. తన పరికరంగా , తన బాధ్యతలను ఆ వ్యక్తి ద్వారా నెరవేరుస్తారు. 


నువ్వు లౌకికంగా అత్యున్నత విద్యావంతుడివి కావచ్చు. కానీ గురువు ముందు అనుక్షణమూ నీకు అక్షరాభ్యాసమే

నువ్వు సమాజంలో గురువు కన్నా ఉన్నత స్థాయిలో వుండవచ్చు. కానీ గురువు ముందు నువ్వు కేవలం ఒక సేవకుడివే...


నువ్వు గురువు కన్నా అత్యధిక ధనవంతుడివి కావచ్చు. కానీ గురువు ముందు నిరుపేదవే. నువ్వు గురువు కన్నా అధిక లౌకిక జ్ఞానం కలవాడివి కావచ్చు. కానీ గురువు ముందు పరమ అజ్ఞానివే.

నీ లౌకిక విద్య గురువు ముందు నిరక్షరాస్యత గా మిగులుతుంది. సమాజంలో నీ స్థాయి గురువు ముందు నిష్ప్రయోజనం గా మిగులుతుంది.

నీ ధన సంపద అంతా గురు చరణ ధూళిని కూడా తాకలేదు. నీ లౌకిక జ్ఞానం సమస్తం గురువు అలౌకిక జ్ఞానం ముందు గుడ్డి గవ్వకు కూడా పనికిరాదు

ఈ విషయాన్ని మనస్సులో స్థిరంగా నిలుపుకో గలిగితే గురువు నీ వాడు అవుతాడు....

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

కామెంట్‌లు లేవు: