*ప్రియ బాంధవా మేలుకో 7*
సభ్యులకు నమస్కారములు.
ప్రాంతమేదైనా, దేశమేదైనా జనులను నాలుగు భాగాలుగా వర్గీకరించవచ్చును. జీవితం పట్ల 1) హ్రస్వ దృష్టి మరియు 2) దూరదృష్టి కల్గి ఉండేవారు. 3) చెడు పట్ల మక్కువ, మంచి పట్ల తిరస్కార ధోరణి *(దోష గ్రాహి గుణ త్యాగి = జల్లెడ)* మరియు 4) మంచిని గ్రహించి చెడును వదులు వారు *(గుణ గ్రాహి దోష త్యాగి = చాట)*.
1) *హ్రస్వ దృషి* అంటే కురుచ చూపు అని సభ్యులందరికి విదితమే. నివురు గప్పిన నిప్పులా ఉన్న సమాజంలో పెద్ద పెద్ద ప్రమాదాలకు (సాంఘికంగా) దారితీసే అకృత్యాలు దిన దినము పెరుగుతూ ఉన్నా, ఇప్పుడేమయ్యిందని తేలికగా చూడడం, నేను నా చుట్టూ ఉన్న సమాజం బాగానే ఉంది కదా. సమాజంలో మరియు దేశంలో జరుగుచున్న నేరాలను, ఘోరాలను రక్షక భట శాఖ కనిపెడుతూనే ఉంది కదా..అని, దిగజారుతున్న సమాజ మరియు దేశ సాంఘిక భద్రతల పట్ల నిమ్మకు నీరెత్తినట్లు ఉండే అధిక శాతం ప్రజలే *హ్రస్వ దృష్టి గలవారు*. వీరి వలన సమాజానికి గాని దేశానికి గాని ఏమి ఉపయోగం ఉండదు. ఆయుష్షు ఉన్నంతకాలం సమాజ సహకారం పొందుతూ జీవిస్తారు. *వీరి ఉనికి....వీరి జీవిత కాలం మాత్రమే*.
2) *దూర దృష్టి*. జీవితం పట్ల సామాన్యుల ముందు చూపు దూర దృష్టి యని సాధారణ భావన. కాని మాన్యుల మరియు అనుభవజ్ఞుల విషయంలో ఈ *దూర దృష్టియే* సమాజ మరియు దేశ కాల పరిస్థితుల *అధ్యయనంగా* మారుతుంది. విజ్ఞుల దూర దృష్టి పరిసరాలపై *అవగాహన మరియు పరిశీలనగా మారుతుంది*. వీరు భవిష్యత్తులో రాబోవు మేలు, కీడు మరియు సమాజ భవితవ్యాన్ని అంచనా వేయగల్గుతారు. ఇందుకు వివేకం, జ్ఞానం వీటితో బాటు దేశంలో సంభవిస్తున్న ఆకృత్యాలపై అంతర్దృష్టి అవసరము. *వీరే నిజమైన సంఘజీవులు మరియు దేశభక్తులు. వీరి కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది.*
3) *దోష గ్రాహి గుణ త్యాగి* వీరు తాత్కాలిక ప్రయోజనాలకై అయోగ్యులను ఆశ్రయిస్తారు, ఆరాధిస్తారు. కనిష్ట లాభాలనాశించి దీర్ఘకాలిక ప్రయోజనాలను పణంగా పెడ్తారు. అప్రయత్నంగా స్ఫురణకు వచ్చే ఉదాహరణ మన ఎన్నికల రంగము. ఈ మనః ప్రవృత్తి గల అధిక శాతం ప్రజలు చిన్న చిన్న తాయిలలకు ప్రలోభపడి ఆయోగ్యులను ఎన్నుకుంటారు. తద్వారా దీర్ఘకాలిక సమాజ నిర్మాణానికి, సమాజ సంక్షేమ కార్యక్రమాలను, పథకాలను కోల్పోతారు.
సమాజ నైతికత మరియు సమాజ క్రమశిక్షణకై పాటుపడాలన్న ఆలోచన, తపన ఉన్నా.....ఇదెలా...అదెలా... అను సందేహాలు వెన్నంటియే ఉంటాయి. *అయినా అవకాశాలను అందిపుచ్చుకోవాలి*. అవుతే, అవకాశాల వెనుక అడ్డంకులు ఉండవచ్చును. కాని, ప్రజలు మరువరానిది...ప్రతి అడ్డంకి వెనుక గూడా అవకాశాలు ఉంటాయి. *మనం దేన్నీ చూస్తున్నాము అనేదే ముఖ్యము*
ధన్యవాదములు.
*(సశేషం)*.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి