*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*ద్రోణ పర్వము తృతీయాశ్వాసము*
*314 వ రోజు*
*ద్రోణాచార్యుని ఎదుర్కొనుట*
కృష్ణుడు చెప్పగా అర్జునుడు ద్రోణాచార్యునికి చేతులెత్తి నమస్కరించి " భూసురోత్తమా ! నాకు అన్న ధర్మరాజు బావ కృష్ణుడు ఎలాగో మీరు అలాగే. మీరు నా శ్రేయోభిలాషులు. మీరు మీ కుమారుడు అశ్వత్థామను ఆదరించినట్లే నన్ను ఆదరించారు. నేను వ్యూహంలో ప్రవేశించి సైంధవుని చంపడానికి దయచేసి దారి ఇచ్చి నా ప్రతిజ్ఞ నెరవేర్చండి " అని ప్రార్థించాడు. ద్రోణుడు " అర్జునా! నేను ఇక్కడ ఉండగా నీవు సైంధవుని ఎలా చంపగలవు " అని అర్జునుడిపై శరములు గుప్పించాడు. ముందు గురువుగారు బాణములు వెయ్యగానే అర్జునుడు విజృంభించి ద్రోణుని తొమ్మిది బాణములతో కొట్టాడు. ద్రోణుడు వాటిని మధ్యలోనే త్రుంచి కృష్ణార్జునులపై బాణవర్షం కురిపించి వింటి త్రాటిని త్రుంచి అర్జునుడి రథాన్ని బాణములతో కప్పాడు. అర్జునుడు తన వింటి నారిని బిగించి ద్రోణుని వదిలి అతడి సైన్యాలను ఎదుర్కొన్నాడు. అర్జునుడి గాండీవం నుండి వెలువడుతున్న బాణములు కురుసైన్యాలను తుత్తునియలు చేతున్నాయి. ద్రోణుడు ఆ బాణములను ఎదుర్కొని సైన్యములను రక్షిస్తూ అర్జునుడి రథమును బాణములతో కప్పాడు. అర్జునుడు ద్రోణుని దాటి ఒక్క అడుగు ముందుకు వేయ లేక పోయాడు. కృష్ణుడు అర్జునుడితో " అర్జునా! ద్రోణుని మీద కోపం ఎందుకు అతడిని వదిలి శకట వ్యూహములో ప్రవేశించు " అన్నాడు. అర్జునుడు " అలాగే కృష్ణా ! మన రధమును చక్ర వ్యూహంలోనికి పోనిమ్ము " అన్నాడు. తనను తప్పించుకు వెళుతున్న అర్జునుడితో " అదేమిటయ్యా ! అర్జునా! యుద్ధం చేస్తున్న వాడిని వదిలి పక్కకు వెళుతున్నావు. శత్రువును చంపవా! అన్నాడు " అని అన్నాడు. అర్జునుడు " ఆచార్యా ! మీరి నా గురువుగారు శత్రువు కాదు. అయినా! మిమ్మలిని జయించడం ఈశ్వరుడికే సాధ్యం కాదు నేనెంత " అన్నాడు. అర్జునుడితో అతడి చక్రరక్షకులు యుధామన్యుడు, ఉత్తమౌజుడు వ్యూహంలోకి ప్రవేశించారు.
*అర్జునుడితో కౌరవ వీరులు పోరుట*
ముందుగా కృతవర్మ, కాంభోజరాజు, శ్రుతాయువు అర్జునుడిని చూసారు. కృతవర్మ కృష్ణార్జునుల మీద ఇరవై అయిదు బాణములు వేసాడు. అర్జునుడు కృతవర్మ ధనస్సును విరిచి కృతవర్మ మీద ఇరవై అయిదు బాణాలు వేసాడు. కృతవర్మ మరొక విల్లు తీసుకుని అర్జునుడి గుండెలకు గురిపెట్టి పది బాణములు వేసాడు. కృష్ణుడు అర్జునుడితో " అర్జునా ! కృతవర్మ మీద జాలి చూపకు అతడిని చంపు " అన్నాడు. వెంటనే అర్జునుడు కృతవర్మను మూర్చిల్లజేసి ముందుకు పోతున్నాడు. ఇంతలో కృతవర్మ లేచి అర్జునుడి చక్రరక్షకులను అడ్డుకున్నాడు. వారు కృతవర్మ విల్లును విరిచారు. కృతవర్మ మరొక విల్లు తీసుకుని ఉత్తమౌజుడు, యుధామన్యుల విల్లు త్రుంచాడు. వారు కృతవర్మ వేయు బాణములను అడ్డుకున్నారు. కృతవర్మ అర్జునుడిని వెంబడించ లేక పోయారు. ముందుకు పోతున్న అర్జునుడిని శ్రుతాయువు అడ్డుకుని అర్జునుడి పతాకము త్రుంచి కృష్ణార్ఝునులపై తొంభై బాణములు వేసాడు. అర్జునుడు కోపించి శ్రుతాయువు విల్లు త్రుంచి గుండెలకు గురిపెట్టి ఏడు బాణములు వేసాడు. శ్రుతాయువు మరొక విల్లు తీసుకుని అర్జుడి గుండెలకు గురిపెట్టి తొమ్మిది బాణములు వేసాడు. అర్జునుడు శ్రుతాయువు సారథిని చంపి, రథాశ్వములను చంపి, శరీరం అంతా తూట్లు పడేలా కొట్టాడు. శ్రుతాయువు వరుణుడి కుమారుడు. ఆ గద అతడికి వరణుడు ఇచ్చాడు. ఆ గద ధరించిన వాడు అజేయుడు దానిని ఎవరి మీద ప్రయోగించినా వాడిని తప్పక చంపుతుంది. ఆ గద నిరాయుధుని మీద యుద్ధానికి సిద్ధంగా లేని వాడి మీద ప్రయోగిస్తే అది ప్రయోగించిన వాడినే చంపుతుంది. శ్రుతాయువుకు ఆవేశంలో ఆ విషయం గుర్తుకు రాక దానిని శ్రీకృష్ణుడిపై ప్రయోగించాడు. కేవలం సారథిగా ఉన్న శ్రీకృష్ణుని ఆ గద ఏమి చేయలేక తిరిగి వచ్చి ప్రయోగించిన శ్రుతాయువును వధించింది. అది చూసి అతడి సైన్యం పారిపోయింది. ఆ సమయంలో అక్కడ ఉన్న కాంభోజరాజు అర్జునుడిని ఎదుర్కొన్నాడు. ఇరువురు ఒకరిపై ఒకరు శరప్రయోగం చేసుకున్నారు. అర్జునుడు అతడి కేతనమును విరిచి, విల్లును త్రుంచి, సారథిని చంపి, హయములను చంపి పదునైన నారాచములు వేసి అతడి గుండెలు పగులగుట్టాడు. ఆ దెబ్బకు కాంభోజరాజు మరణించాడు. తరువాత శిబి, వసాతి, మొదలగు మహారాజులు అర్జునుడిని చుట్టుముట్టారు. అర్జునుడు తన బాణఘాతములతో వారినందరిని యమసదననానికి పంపాడు. తరువాత శ్రుతాయువు, అయుతాతువు అర్జునుడిని ఎదొర్కొన్నారు. అర్జునుడుఇంద్రాస్త్రం ప్రయోగించి వారిని వధించాడు. అది చూసి సుయోధనుడు కళింగులు, దక్షిణాత్యులు, ఆటవికులు కలిసి వారి గజబలముతో అర్జునుడిని ఎదుర్కొన్నారు. అర్జునుడు ఆ గజసేనలను చీల్చిచెండాడాడు. తెగిన తొండములు, కాళ్ళు, క్రిందపడిన మావటీలతో ఆ ప్రదేశం బీభత్సమైంది. తరువాత యవనులు, పారదులు, శకులు అర్జునుడిని ఎదుర్కొన్నారు. అర్జునుడు వారినందరిని తన బాణపరంపరతో అంతమొందించాడు. అంబష్ట దేశపు రాజు శ్రుతాయువు అర్జునుడిని ఎదుర్కొన్నాడు. అర్జునుడు అతడి వింటిని విరిచి, హయములను చంపాడు. శ్రుతాయువు గదతో శ్రీకృష్ణుని కొట్టాడు. అర్జునుడు ఆ గదను విరుగ కొట్టి వేరొక శరముతో శ్రుతాయువు తల నరికాడు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి