*తిరుమల సర్వస్వం 175-*
*శ్రీ హాథీరామ్ బావాజీ 7*
కుడ్యశిల్పం*
**హాథీరామ్ జీవన గమనానికి సంబంధించి తిరుమలలో దర్శించుకో దగ్గ మరో ముఖ్య విశేషం ఈ కుడ్యశిల్పం. సంపంగి ప్రదక్షిణ మార్గంలో, ధ్వజస్తంభానికి ఎదురుగా, 'నడిమిపడి కావలి' లేదా 'వెండివాకిలి' ప్రవేశ మార్గంలో, దక్షిణం వైపున ఉన్న కుడ్యంపై; భక్తి పారవశ్యంలో మైమరచి ఉన్న హాథీరామ్ బాబాజీ, శ్రీవేంకటేశ్వరునితో పాచికలాడుతుండగా, అప్పటి చంద్రగిరి రాజైన గిరిధరదాసు వారి సమీపంలో నిలబడి ఆ వినోద క్రీడను ఆసక్తిగా తిలకిస్తున్నట్టున్న ఘట్టం జీవకళ ఉట్టిపడేట్లు చెక్కబడి ఉంది. ఈ శిల్పాన్ని రాజుగారే ప్రతిష్ఠించి ఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం. దీనికి వెండి తాపడం గావించి, అద్దాల అరలో భద్రపరిచారు. వెండి వాకిలి లోనికి ప్రవేశిస్తున్నప్పుడు ఈ శిల్పాన్ని మనకు ఎడమప్రక్కగా, అతి సమీపంలో నుండి దర్శించుకోవచ్చు.**
2 ఈసారి స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ విగ్రహానికి నమస్కరించు కుందాం!
*హథీరాం బావాజీ సజీవ సమాధి*
బాబాజీకి సంబంధించిన మరో ముఖ్యవిశేషం వారి 'జీవసమాధి'. సుదీర్ఘకాలంపాటు శ్రీవారిని సేవించి తరించిన బాబాజీ తన అవసాన దశలో, ఆలయానికి ఉత్తరదిశగా మూడు మైళ్ల దూరంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు. గోగర్భం ఆనకట్ట దాటిన తరువాత, ఆకాశగంగ తీర్థానికి ముందుగా, రహదారికి దాదాపు పావు మైలు దూరంలో ఈ ఆశ్రమం ఉంది. బాబాజీ ఈ ఆశ్రమంలో ఏకాంతంగా ఉంటూ, తపోదీక్షలో శేషజీవితాన్ని గడుపుతూ ఉండేవారు. రోజుల తరబడి నిరాహార దీక్షలో ఉండే బాబాజీ అప్పుడప్పుడు ఆశ్రమానికి సమీపంలో ఉన్న 'రామపత్ర వృక్షం' యొక్క ఆకులను మాత్రం భుజించి ప్రాణాలు నిలుపుకునేవారు. తీయని రుచి గల ఆకులతో ఉండే ఈ వృక్షాన్ని, ఆ ఆశ్రమ ప్రాంతంలో నేడు కూడా చూడవచ్చు. సమాధిని దర్శించుకోవడం కోసం వచ్చే భక్తులకు ఈ పత్రాలను ప్రసాదంగా ఇచ్చే సాంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.
బాబాజీ ఆశ్రమానికి అతి సమీపంలోనే శ్రీవేణుగోపాలస్వామి ఆలయాన్ని నిర్మించి, అందులో నిత్యపూజలు నిర్వహించేవారు. అలా త్రేతాయుగపు శ్రీరామచంద్రుణ్ణి సేవించడంతో మొదలైన బాబాజీ ప్రస్థానం, శ్రీమహావిష్ణువు కలియుగ అవతారమైన శ్రీవేంకటేశ్వరుణ్ణి కొలుచుకుంటూ, అంత్యదశలో, ద్వాపరయుగపు అవతారమైన శ్రీకృష్ణుని చరణాల చెంత ముగిసింది. బాబాజీ అక్కడే ఒక అఖండజ్యోతిని వెలిగించి, ప్రతి నిత్యము తన తపస్సును ప్రారంభించేవారు. వయోభారం మీదపడటంతో జనసంచారానికి దూరంగా ఉన్న ఆ ఆశ్రమంలో మౌనంగా శ్రీనివాసుణ్ణి స్మరించుకుంటూ కొన్ని సంవత్సరాలు గడిపిన బాబాజీ అదే ప్రదేశంలో సజీవసమాధి అయ్యారు. ప్రస్తుతం ఆ సమాధి మహంతుల సంరక్షణలో ఉంది. వేణుగోపాల స్వామి ఆలయాన్ని ఈ మధ్యనే ఆధునీకరించారు. ఉత్తర భారతదేశస్తులు, ముఖ్యంగా లంబాడి గిరిజన తెగకు చెందిన భక్తులు, ఈ సమాధిని అధికంగా దర్శించుకుంటారు.
ప్రతి ఏడాది బాబాజీ సజీవసమాధి లోకి ప్రవేశించిన రోజును పురస్కరించుకుని నరకచతుర్దశి నాడు 'హాథీరామ్ బావాజీ సమాధి వార్షికోత్సవం' అత్యంత వైభవంగా జరుగుతుంది.
[ రేపటి భాగంలో... *మహంతుల నిర్వహణలో తిరుమల ఆలయం* గురించి తెలుసుకుందాం]
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి